పురాణాల్లో తన తపస్సు యొక్క కఠోరత గురించి గర్వితుడై ఉన్న ఒక యోగి వృత్తాంతం ఉంది. ఒకరోజున, తన పాకకి పైన రెల్లుకప్పు వేసే ఉద్దేశ్యంతో అతను గడ్డి కోస్తూ ఉండగా, పొరబాటున అతని వేలు తెగిపోయింది. హఠాత్తుగా అతనికి తన వేలు నుంచి ఆశ్చర్యం కలిగించేలా పసరు కారుతూ కనిపించింది. తన తపస్సు వల్ల ఇంతటి మహత్తరమైన అద్భుతం జరిగిందని అతనికి గర్వం కలిగింది. తాను పరమోన్నత స్థితిని చేరుకున్నాడని అతనికి నమ్మకం కలిగింది. అతని అహంకారం బయటికొచ్చింది. సాధించాల్సింది ఇంకేమీ లేదని అతను నమ్మడం మొదలుపెట్టాడు. నిజానికి అతని ఆధ్యాత్మిక యాత్ర గమ్యానికింకా చాలా దూరంలో ఉంది. ఆ విషయాన్ని అతనికి తెలియజేయాల్సిన సమయం వచ్చిందనుకున్నాడు ఆదియోగి. ఒక యాచకుడి రూపంలో అతన్ని పలకరించాడు.

‘నువ్వు సర్వోన్నత గమ్యాన్ని చేరానని నమ్ముతున్నావు, కానీ ఇది అది కాదు’ అన్నాడు ఆదియోగి. ‘ఏమిటి నీ ఉద్దేశ్యం? కనబడడం లేదా? నేనెంత స్వచ్ఛమైపోయానంటే నాలోంచి పసరు స్రవిస్తోంది. నా వేలు చూడు!’ ఆదియోగి నవ్వాడు. ఇందులో గర్వించేదేమీ లేదు. జంతువులు ఆకులూ దుంపలూ తిని, వాటి నుంచి రక్తమూ మాంసమూ తయారు చేసుకుంటాయి. అంటే మొక్కగా ఉన్నది జంతువుగా మారుతోందన్నమాట. పసరు రక్తంగా మారుతోందన్నమాట. మొక్కైనా, జంతువైనా, మనిషైనా - చివరికన్నీ బూడిదే అవుతాయి.’

తనలోని మిథ్య అంతటినీ భస్మీపటలం చేయడంలోనే ఒక యోగిగా రూపొందడం ఉంది
యోగిని చూస్తూండమని చెప్పి, అతను తన వేలు కోసుకున్నాడు. అతనలా చేస్తుండగా అతని వేలు నుంచి బూడిద రాలింది. అపుడు యోగి గమనించాడు, బూడిద ఆదియోగి చర్మ రంధ్రాలన్నిటినుంచి కూడా రాలుతోందని. నివ్వెరపోయిన అతను, నిజంగా జ్ఞాని అయిన వ్యక్తి జీవించడం, మరణించడం రెండిటినీ ఏకకాలంలో, అనుక్షణం చేస్తూ ఉంటాడని గ్రహించాడు. ఎవరైతే నశ్వరమైన, అశాశ్వతమైన తన అస్థిత్వ స్వభావం గురించి నిరంతరమైన ఎరుకతో ఉంటాడో, తనలో ఉన్న రక్త మాంసాలు ఒక బూడిద కుప్పకి మించినవి కావని తెలుసుకుంటాడో, అతనే ఆత్మజ్ఞాని. తనలోని మిథ్య అంతటినీ భస్మీపటలం చేయడంలోనే ఒక యోగిగా రూపొందడం ఉంది. ఇదే ఆదియోగి రూపంలోని పరమోన్నత సత్యం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు