ఒక వ్యక్తి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్నో మార్గాలున్నాయి. భవిష్యత్తు అనే దానికి అస్తిత్వం లేదు; అది మన అనుభవంలో లేనిదే కాని ఒక సంభావ్యంగా ఉన్నది. కొంతమంది తమ నిర్బంధనల ప్రకారం భవిష్యత్తును సృజించుకుంటారు. కొంతమంది తమ భవిష్యత్తును చైతన్యపూర్వకమైన తమ ఇచ్ఛప్రకారం మలచుకుంటారు. కొంతమంది గుడ్డిగా తమ భవిష్యత్తును అనుసరిస్తారు. తన జీవితంతో తానేమి చేయాలనేది స్పృహతో ఇచ్ఛాపూర్వకంగా ఎంచుకోవాలనుకోవడం చాలా ముఖ్యం. మీరు చైతన్యపూర్వకంగా ఎంపిక చేసుకున్నది ఎప్పుడూ ఫలితాలనిస్తుంది. మీరేం ఎంపిక చేసుకుంటారన్నది ముఖ్యం కాదు; మీరేమి ఎంచుకున్నా దాని వెనుక మీ ప్రయత్నమంతా ఉండాలి, మీ సర్వస్వాన్నీ దానికోసం ధారపోయాలి. అది ముఖ్యం.

ఒక విధంగా అస్తిత్వంలోలేని భవిష్యత్తుకు ఒక నిశ్చితత్వాన్ని, ఏర్పరచడానికి ఒక ప్రణాళికతో మీరు ప్రయత్నం చేస్తున్నారన్నమాట. జార్జి డబ్ల్యు.బుష్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఆయన్ని ఒక ఇరాన్ దేశీయుడు కలుసుకున్నాడు. ‘స్టార్ టెక్ సినిమాలో అన్నిరకాల మనుషులూ ఉన్నారు – చెకోవ్ రష్యన్, సులు చైనీస్, స్కాటీ స్కాటిష్ – కాని ఒక్క ఇరానియన్ కూడా లేకపోవడం నా ఎనిమిదేళ్ల కుమారునికి చాలా నిరాశ కలిగించింది రాష్ట్రపతిగారూ!’ అన్నాడా ఇరానీయుడు. బుష్ అతనివైపు చూసి, ‘ఎందుకంటే ఈ కథ భవిష్యత్తులో జరుగుతుంది’ అన్నాడు.

మీకు మంచి యోగ్యతలుండవచ్చు, సామర్థ్యం ఉండవచ్చు కాని మీకు సమతుల్యత లేకపోతే, మీరు అస్థిరంగా ఉంటే ఎలా అయినా మీరు ఒక ఘోరవిపత్తు కాకతప్పదు.
మనం ఒక విత్తనం నాటి భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఎదురుచూడవచ్చు; ఇది ఒక పద్ధతి. మీరు మీ భవిష్యత్తును నిర్మించుకోవడం మరొక పద్ధతి. లేదా ఇంకొక పద్ధతి ఏమిటంటే గాలి మనకు అనుకూలంగా వీస్తున్నప్పుడు పడవ ఎక్కడం, అది ఎలా వెళితే అలా వెళ్లడం; ఎలాగైనా అది వెళ్లవలసిన చోటికే వెళుతుంది. ఇంకా రానిదాన్ని నిర్వహించే ప్రయత్నం మీరు చేస్తున్నారని అర్థం చేసుకోండి. జీవితపు రీతి అది – తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి ఆ శిశువును నిరంతరం పోషించాలి, కాని శిశువుకు ఆమె ముఖం తెలియదు, ఆమెకు శిశువు ముఖం తెలియదు. వాళ్లు ఒకరిలో ఒకరున్నప్పటికీ పూర్తిగా అపరిచితులు. అదే విధంగా మీరు ఈ సృష్టిలో ఉన్నారు, దానికి వెలుపల వేరు.

ఎలా చూసినా మీరు సృష్టి ఒడిలోనో, సృష్టికర్త గర్భంలోనో ఉన్నారు. అయినా మీరు మీ బుడగలోంచి బయటకు రావాలి, మీరు సృష్టి ఒడిలోనో, సృష్టికర్త గర్భంలోనో ఉన్నారు. మీకా సృష్టికర్త ముఖం తెలియదు, ఆ సృష్టికర్తకు మీ ముఖం తెలియదు. మాతృగర్భం అద్భుతమైన స్థలం, కాని సమస్య ఏమిటంటే లోపల చీకటిగా ఉంటుంది, మీ కళ్లు మూసుకొని ఉంటాయి, మీరేమీ చూడలేరు. మీరు కళ్లు తెరచి, టార్చి వేసి చూస్తే జీవి నిర్మాణం ఎలా జరుగుతుందో మీకు తెలుస్తుంది. జీవితానికి మూలస్రోతస్సు ఏమిటో తెలుస్తుంది; మీకంతా తెలిసిపోయేది. కాని సమస్య ఏమిటంటే అక్కడ చీకటి, పైగా మీ కళ్లు మూసుకొని ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు బావిలో పడ్డారు. ఒకడన్నాడు, ‘ఇక్కడ చాలా చీకటిగా ఉంది కదూ!’ రెండోవాడన్నాడు, ‘నాకు తెలియదు, నాకసలేమీ కనపడడం లేదు’ అని.

అందువల్ల భవిష్యత్తు – మీరు మీ అరచేతిలోని గీతలను ఎన్నిసార్లు చూసినప్పటికీ, ఆకాశంలో నక్షత్రాల స్థానాలను ఎంతగా పరిశీలించినప్పటికీ, మీ జాతకాన్ని ఎన్నిసార్లు అధ్యయనం చేసినప్పటికీ, మీరెంతమంది జ్యోతిష్యులను సంప్రదించినప్పటికీ, మీరింకా చీకటి బావిలోనే ఉంటారు. మరుక్షణం ఏమిటో మీకు తెలియదు. అంధకారం లేదా చీకటి గురించి నేను చెడుగా మాట్లాడడం లేదు. దీపం చాలా చిన్నది, అది కాలి అంతమైపోతుంది. చీకటి అల్పమైనది కాదు. అది కొలవలేనిది, అనంతం. ఎందుకంటే చీకటి అన్నది వెలుగులాగా అస్తిత్వంకాదు, చీకటి అస్తిత్వం లేనిది – అంటే ఏమిటో మీరే ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఉన్నదానితో మీరు చేయగలిగింది చాలా స్వల్పం. శూన్యంలో మీరేమి చేయదలచుకుంటే అది చేయవచ్చు. కాని మీ ఇష్టం వచ్చింది దానితో చేయాలంటే మీకు అవసరమైన స్థిరత్వం, సమతౌల్యం కావాలి.

మీరు తెలివైనవారు కావచ్చు, మీకు మంచి యోగ్యతలుండవచ్చు, సామర్థ్యం ఉండవచ్చు కాని మీకు సమతుల్యత లేకపోతే, మీరు అస్థిరంగా ఉంటే ఎలా అయినా మీరు ఒక ఘోరవిపత్తు కాకతప్పదు. మీరు చాలా తెలివైనవారై, ఊగిసలాడుతూ ఉంటే అది మరింత ఘోరవిపత్తు. మీరు కాస్త తెలివితక్కువ వారైతే కొంత తక్కువ విపత్తు. ఎందుకంటే మీరు చేయదలచుకున్న దానివైపు మీ గమనాన్ని మీ తెలివి వేగవంతం చేస్తుంది. మనకు వేగంగా ప్రయాణించే వాహనమే కావాలి, కాని అది దేన్నైనా ఢీకొంటే భారీగా దెబ్బతింటుంది. మీకు తెలుసు, మీరెంత ఎత్తుకుపోతే పడిపోవడం అన్నది కూడా అంత గట్టిగానే ఉంటుంది.

‘స్థిరం, సుఖం, ఆసనం” అన్నాడు పతంజలి

తెలివి, యోగ్యత, సామర్థ్యం, అర్హతలు ఇవన్నీ విపత్తును ఆపలేవు; విపత్తునుంచి రక్షణ నివ్వగలిగింది సమతుల్యత. పతంజలిని యోగలో మూడో అంగాన్ని వర్ణించమన్నప్పుడు ఆయన ఆసనమనే ఈ అంగాన్ని ‘స్థిరం, సుఖం, ఆసనం’ అని వర్ణించాడు.  స్థిరత్వం, సుఖం ఈ రెండూ ఉంటే మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలరు. మీకు తెలివి, అర్హతలు, సామర్థ్యం ఉన్నప్పటికీ మీజీవితంలో సంపూర్ణ సార్థక్యతను పొందలేవు – మీతో మీరు సౌకర్యంగా, హాయిగా ఉండాలంటే మీరు స్థిరంగానూ, సమతుల్యతతోనూ ఉండాలి. లేనిదానితో, లేదా భవిష్యత్తుతో వ్యవహరించడంలో మనం స్థిరత్వాన్నీ, సౌకర్యాన్నీ సాధించినట్లయితే – తక్కినది సాదాసీదాగా జరిగిపోతుంది. మీరెప్పుడూ సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, జరగవలసింది మీ సామర్థ్యం ప్రకారం, పరిస్థితుల ప్రకారం జరిగిపోతుంది. ఎన్నో హేతువులుంటాయి, కాని అవన్నీ మీకు ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఈ రెండూ మీవద్ద లేకపోయినట్లయితే – అంటే మీరు స్థిరంగానూ, సౌకర్యంగానూ లేకపోతే – చూడండి, మీరొక రోజు చాలా పైకి వెళతారు, మరుసటి రోజే కింద కూలబడిపోతారు. అందువల్ల భవిష్యత్తుతో వ్యవహరించేముందే వర్తమానంలోకి మీరు సౌకర్యాన్నీ, స్థిరత్వాన్నీ తెచ్చుకోవాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు