ఎంతో మంది గురువులమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నిజమైన గురువును తెలుసుకోవడం ఎలా..అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. గురువు సాంత్వనని ఇచ్చే వారు కాదని, ఆయన ఉన్నది మిమ్మల్ని మేలుకోల్పడానికి అని సద్గురు చెబుతున్నారు..

సాధకుడు: సద్గురూ.. ప్రస్తుత కాలంలో, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు పుట్టుకొస్తున్నారు. నేను ఒక సత్యాన్వేషకుడిగా, నా గురువుని ఎలా గుర్తు పట్టగలను..?

సద్గురు: ఈ రోజుల్లో ఎవరైతే భగవద్గీతలోని రెండు అధ్యాయాలు చదువుతారో వారు గురువైపోతున్నారు. లేకపోతే ఎవరికైతే బైబిల్ ఒక చాప్టర్ తెలుసో, వారు కూడా గురువే. ఎవరైనా సరే ఒక పుస్తకంలో సగం చదివితే.. వాళ్ళు గురువు అయిపోవచ్చు. ఎవరైతే మీకు ఏదైనా నమ్మకాన్ని కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారో, ” ఈ ప్రపంచంలో అన్నీ నేను చూసుకుంటాను..” అని చెప్తారో, వాళ్ళని కూడా మీరు గురువు అనేస్తున్నారు. ఇలాంటి వారు, ఎంతోమంది ఈ భూమ్మీద ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో..!! ఎన్నో తరాల నుంచి వాళ్ళు “మీరు దేని గురించీ చింతించకండి.. నేనిక్కడున్నాను కదా..? అంతా సవ్యంగానే జరుగుతుంది..” అని చెప్తున్నారు. కానీ ప్రజలు వారి రోజువారీ జీవితంతో ఎప్పటిలాగే కష్టపడుతున్నారు.

ఎవరైతే మీకు సాంత్వనని అందిస్తారో, కావాలంటే మీరు వారిని సాధువులు అని అనవచ్చు.. వారి దగ్గర కొంత ప్రశాంతత ఉంటుంది. ఆహ్లాదంగా ఉండే మానవులు. వాళ్ళు సాధారణమైన మానవుల కంటే, మరింత ప్రసన్నంగా ఉంటారు. వీరికి ఉద్దేశ్యాలు కూడా మంచిగా ఉంటాయి. కావాలంటే మనం, ఇలాంటి వ్యక్తిని ఒక  పవిత్రమైన వ్యక్తి అనో, ఒక సాధువు అనో పిలవవచ్చు.  ఒక గురువు ప్రసన్నంగా ఉండవలసిన పని లేదు. చూడండి నేనలా లేను కదా..? ఖచ్చితంగా ఒక గురువు ప్రసన్నంగా ఉండనక్ఖర్లేదు. అది ఆయన ఉద్దేశ్యం కాదు. ఆయన ఉద్దేశ్యం మిమ్మల్ని మేల్కొలపడం. అంతేకానీ, మిమ్మల్ని నిద్రపుచ్చడం కాదు.

ఈయన మీకు సాంత్వనని అందించరు. ఈయన ముక్తి పొందేందుకు మీకు సహకరిస్తారు.

మీలో మౌలికమైన అంశాలను మార్చేవారే గురువు. మీరు ఎన్నో రకాల నిర్ధారణలు చేసుకున్నారు. మీరు ఎన్ని రకాల నిర్ధారణలకి వచ్చారో, వాటన్నింటినీ ఆయన కుదిపేస్తారు. మిమ్మల్ని ఆయన నిద్రపోనివ్వరు. ఈయన మీకు సాంత్వనని అందించరు. ఈయన ముక్తి పొందేందుకు మీకు సహకరిస్తారు. ఇప్పుడు మీరు సాంత్వన గురించి మాట్లాడితే, అది ఈ గ్రహం మీద ఎలాగో ఒకలాగా మనుగడ సాగించడానికే కదూ..? మానసికమైన సాంత్వన కేవలం మీ మానసికమైన మనుగడ కోసం. మీరు కేవలం మనుగడనే కోరుకున్నట్లైతే; మీరు గురువు కోసం చూడకూడదు. మీకు ఎవరైతే సాంత్వనని ఇస్తారో, అటువంటి వారికోసం చూడండి.

కానీ మీరు ఒకసారి గురువు కావాలనుకున్న తరువాత, మీరు గురువు కోసం ఎప్పుడు చూడాలంటే.. మీరు మేల్కొనడానికి సుముఖంగా ఉండి ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు మలచుకోవడానికి సుముఖంగా ఉన్నప్పుడు, మీరు మీ పరిమితులను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, జీవితంలో మరో కోణానికి వెళ్లాలనుకున్నప్పుడు. ఇటువంటి ఆకాంక్ష కనుక మీకు ఇంకా కలగకపోతే, దయచేసి గురువులను బాధ పెట్టకండి. మీరెక్కడ ఉన్నారో మీరు అక్కడే ఉండండి. ఒక సినిమా కి వెళ్ళండి. మంచి ఆహారం తీసుకోండి. అలా బీచ్ లో నడచి రండి. ఇవన్నీ మీకు ఉపకరిస్తాయి.

వీరే గురువని ఎలా తెలుసుకోవడం??

ఇప్పుడు నేను నా గురువుని ఎలా గుర్తు పట్టగలను..? అనేది మీ ప్రశ్న. మీరు, గురువు కోసం చూడక్ఖర్లేదు. మీలో ఆకాంక్షను బలపరచుకోండి. మీకు - “నాకు తెలియదు” అన్న బాధ నిజంగా తెలిసినప్పుడు, మీ అజ్ఞానంవల్ల కలిగే బాధ, మీకు తెలిసినప్పుడు, గురువు మీకు లభిస్తాడు. మీరు గురువు కోసం చూడక్కరలేదు. మీరు ఆయనని ఎలా గుర్తు పడతారు..? మీరు ఆయనతో కూర్చున్నట్లైతే, ప్రతీదీ కూడా ఒక బెదిరింపుకి లోనైనట్లుగా మీకు అనిపించాలి. మీకు అక్కడినుంచి పారిపోవాలనిపించాలి. అయినప్పటికీ ఆయనలోని దేదో ఆయన వైపుకి లాగుతూ ఉండాలి. మీకు అక్కడ ఉండాలనిపించ కూడదు. కానీ ఏదో బలంగా ఆ వైపుగా, ఆ దిశగా మిమ్మల్ని లాగుతూ ఉండాలి. అలాంటివారు; మీ గురువు అని మీరు అనుకోవచ్చు.

మీకు  ఆయన మిమ్మల్ని బెదిరిస్తున్నట్లుగా అనిపించకపోతే.. మీకు, ఆయనతో ఎంతో సౌకర్యంగా ఉన్నట్లైతే ఆయన మీ గురువు కాదు. ఆయన మీ స్నేహితుడు అవ్వచ్చు. ఆయన మంచి వ్యక్తి అవ్వచ్చు. మీరు ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకోవచ్చు. కానీ ఆయన మీ గురువు కాదు. మీరు కనుక, ఎంపిక చేసుకుంటే, మీరు ఏమి ఎంపిక చేసుకుంటారు..? మీకు నచ్చిన దానినే ఎంపిక చేసుకుంటారు. మీకు ఎప్పుడూ ఏది నచ్చుతుంది..? ఏదైతే మీ అహంకారానికి ఉపకరిస్తుందో, సహకరిస్తుందో  అది మీకు నచ్చుతుంది. ఏదైతే మీ అహంకారాన్ని బద్దలు చేస్తుందో  అది మీకు నచ్చదు. ఏదైతే మీ అహంకారాన్ని బద్దలు చేస్తుందో  అది మీకు నచ్చదు. ఎవరైతే;  మీ అహంకారానికి సహకరిస్తారో.. వారు మీ స్నేహితులు. ఎవరైతే మీ అహంకారాన్ని అణచివేస్తారో.. వారు మీ శత్రువు.

అందుకని  మీకు మీ గురువు కూడా మీ అహంకారానికి సహకరించాలి అనుకుంటే, ఆయన గురువుగా ఉపయోగపడరు. మీరు ఆయనతో కూర్చుంటే, మీరు ఒకరకమైన బెదిరింపుకి లోనవ్వాలి. ఇంకా,  మీరు ఆయనపట్ల ఆకర్షితులవ్వాలి. అటువంటి వారే మీ గురువు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు