నా గురించి ఏమనుకుంటున్నారో ..??
 
 

ఎక్కువ శాతం ప్రజలు తమ జీవితాన్ని ఆలోచనలతోనే గడిపేస్తుంటారు. అందులో కూడా అధిక శాతం ప్రజలైతే, తమ గురించి ఎవరేమనుకుంటున్నారు అనుకుంటూ మానసిక బాధలకు లోనవుతుంటారు. దీని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోండి.

ప్రశ్న: నమస్కారం సద్గురూ! నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నది నేను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాను. దీని నుంచి బయట పడడమెలా?

సద్గురు: అసలు మీ వెనక ఏం జరుగుతుందో మీకు నిజంగా తెలుసా? లేదా ఇలా జరుగుతోందేమోనని మీరు ఊహించుకుంటున్నారా? మీరు ఇలాంటివన్నీ ఊహించుకోవడం మానేయండి. ఎవరైనా మీ గురించి  ఏమైనా అనుకుంటూ ఉంటే అది వాళ్ల సమస్య, మీ సమస్య కాదు. వాళ్ల ఆలోచనలు వాళ్ల సమస్య. వాళ్ల ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకోనీయండి.

మీరేం చేయదలచుకున్నారో దానిపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇతరుల్ని వాళ్లిష్టం వచ్చినట్లు ఆలోచించుకోనివ్వండి.

ప్రతి ఒక్కరూ నిరంతరం మీ గురించి ఆలోచించేటంత ఆసక్తికరమైన వారు మీరని అనుకుంటున్నారా? మీ గురించి ఎవరూ ఏమీ ఆలోచించకపోతే అంతకంటే స్వాతంత్ర్యమేముంటుంది. వాళ్లేం ఆలోచిస్తున్నారో, అనుకుంటున్నారోనని మీకెందుకాలోచన? అది మీకవసరమే లేదు. మీరేం చేయదలచుకున్నారో దానిపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇతరుల్ని వాళ్లిష్టం వచ్చినట్లు ఆలోచించుకోనివ్వండి. వాళ్లకు మరో ముఖ్యమైన పని ఏమీ ఉండి ఉండకపోవచ్చు. అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారన్న మాట. ఎవరో ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తున్నారనుకోవడం అన్నది చాలా వరకు మీ ఊహ మాత్రమే.

చాలామంది తమ సొంత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు. వాళ్లు మీ గురించి ఆలోచించ లేరు, ఇది మంచిదే. ఎవరో మన గురించి ఆలోచించడం వల్ల మనకేమీ నష్టం లేదు. ఇతరుల గురించి బాధ పడకండి. వాళ్ల ఆలోచనలను మీరు మార్చలేరు. అటువంటప్పుడు వాటి గురించి ఎందుకు పట్టించుకుంటారు.

మీరు చేయదలచుకున్న పనికి ప్రతి ఒక్కరి ఆమోదం మీకెన్నటికీ లభించదు. అందువల్ల దాన్ని పట్టించుకోవద్దు.

వాళ్ల మానసిక సమస్యల్ని వాళ్లకే వదిలేయండి. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకండి. వాళ్లు ఏ చెత్త అయినా ఆలోచించవచ్చు. మీ స్వభావంపై దాని  ప్రభావం ఎందుకు పడాలి? మీరు బాగున్నారని మీరనుకుంటే అది చాలు. మీరలా లేరని వాళ్లనుకుంటే అది వాళ్ల సమస్య మాత్రమే.

ఎవరో మీ గురించి ఏదో అనుకుంటున్నారన్న ఆలోచన మీకుంటే మీరిక జీవితంలో ఏమీ చేయలేరు. మీరు చేయదలచుకున్న పనికి ప్రతి ఒక్కరి ఆమోదం మీకెన్నటికీ లభించదు. అందువల్ల దాన్ని పట్టించుకోవద్దు. మీరేం చేయదలచుకున్నారో దానిపై మీ దృష్టిని కేంద్రీకరించండి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1