మహాభారత సిరీస్ లోని తృతీయ భాగంలో, మహాభారత కధను మన జీవితాలకు ఉపకరించేలా  అందుకోవడానికి తగిన విధానం సద్గురు సూచిస్తున్నారు .

గ్రంధ కర్త, లేఖకులు

మొట్ట మొదటి సారిగా గణపతి స్వయంగా రాసిన మహాభారతం 200,000 శ్లోకాలతో ఉంది. ఈ కధను ఎవరు గ్రంధస్తం చేస్తారా అని వ్యాసుడు వెదుకగా, గణపతి కన్నా గొప్ప లేఖకులు ఎవరు కనిపించలేదు. కానీ గణపతికి ఇటువంటి పాండిత్య పరమైన వ్యాపకాలంటే విసుగు. “ఒకసారి నేను రాయడం మొదలు పెట్టిన తరువాత మీరు ఒక్క క్షణం కూడా ఖాళీ ఇవ్వకూడదు, నేను ఒక పదం రాస్తూ ఉన్నప్పుడే రెండవది మీరు చెపుతూ ఉండాలి, మీరు తటపటాయిస్తూ ఉంటే నేను రాయడం వదిలి వెళ్ళిపోతాను. మీరు కధను ఆపకుండా, నాకు విశ్రాంతి లేకుండా చెప్పగలరా?” అని సవాలు చేసాడు గణపతి. వ్యాసుడు "ఈ కధ నేను కల్పించి చెప్పేది కాదు. ఇది నాలో సజీవంగా ఉంది, ఇది దానంతట అదే వ్యక్తీకరించ బడుతుంది. మీరు  మాత్రం  మీకు అర్ధం కాకుండా ఒక్క పదం కూడా రాయకూడదు" అని షరతు పెట్టాడు.

ఇద్దరి మధ్యా ఎంతో తెలివైన ఒప్పందం కుదిరిన తరువాత వ్యాసుడు కధా వ్యాఖ్యానం మొదలు పెట్టాడు - 200,000 పద్యాలలో వందల పాత్రలని చిత్రీకరిస్తాడు, వారిలో ఎవరూ ఒకసారి వచ్చిపోయే చిన్నఅతిథి పాత్రధారులు కాదు. ప్రతి వారి జీవితం గురించిన పూర్తి చిత్రీకరణ జరిగింది. వారి పుట్టుక, బాల్యం, వివాహం, వైరాగ్యం, సాధన, వారి విజయాలు, సంతోషాలు, బాధలు, మరణం, ఇందులో అన్నీ ఉన్నాయి. ఎంతోమందికి వారి పూర్వ జన్మతో పాటు భవిష్యత్ జన్మను కూడా వివరించారు. పూర్తి కధను విశదీకరించడానికి ఖచ్చితంగా మనకు కుదరదు,  ప్రస్తుతం మనకు యుక్తమైనంత వరకూ మనం చూద్దాం.

నిర్ధారణలు చేయవద్దు – మీరే కధలో జీవించండి

మీరు ఈ కధను వినేటప్పుడు, మీరు ఇందులో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ, 21వ శతాబ్దంలో కూర్చుని 5000 సంవత్సరాల పూర్వం నివసించిన వ్యక్తుల గురించి ఎటువంటి అభిప్రాయాలూ, తీర్మానాలు  చేయకండి - అది ఎంతో అన్యాయం. వారే తిరిగి ఈ రోజు జీవించి మిమ్మల్ని, మీరున్న విధానం చూస్తే, మీ గురించి భయంకరమైన తీర్పులు ఇవ్వవచ్చు. ఇది అసలు మంచి, చెడు గురించి కాదు, తప్పు ఒప్పు గురించి కూడా కాదు. మానవ స్వభావం గురించి ఇంకెక్కడా చేయనట్టి అన్వేషణ ఇది. ఇది కేవలం అన్వేషణ మాత్రమే, నిర్ధారణలు చేయకండి. మొట్టమొదటిగా ఈ కధ చెప్పిన వ్యాసుడు ఈ కధ సజీవంగా ఉండాలని, ఇది  ఒక సవాలుగా తీసుకున్నాడు. అప్పటినుండి ఎంతోమంది కొద్ది అనుసరణలతో తమ తమ మహాభారతాన్ని రచించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, తెగలకు అనుకూలంగా అనుసరణలున్నాయి. ప్రతి కధారచయితా తమ ముందున్న ప్రేక్షకులకి అనుకూలంగా అనుసరణలు చేసారు. అయినా ఈ కధ కలుషితం కాలేదు, వారి ద్వారా పరిపుష్టి చెందుతూనే ఉంది. 5వేల సంవత్సరాలలో ఎవరూ ఎప్పుడూ దీనికి న్యాయనిర్ణయాలు చేసి కలుషితం చేసే ప్రయత్నం చేయలేదు. మీరు కూడా అటువంటి పని చేయకండి. ఎవరు మంచి, ఎవరు చెడ్డ అన్న అలోచనలు వద్దు ఇది అటువంటిది కాదు. వీరు కేవలం వ్యక్తులు.

ఇది ఒక విధానం, దీనిని మీరు గ్రహిస్తే మిమ్మల్ని సత్యానికి చేరువ చేస్తుంది. ఈ కధలో జీవించగలిగితే, ఇది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ.

ఈ కధ ధర్మాధర్మాలు, తప్పు- ఒప్పుల గురించి, మంచి - చెడుల గురించి కాదు. ఇది మహారాజులు, మతాచార్యులు, పౌరులు పాటించవలసిన ప్రవర్తనా నియమావళి కాదు. ఇది ఒక విధానం, దీనిని మీరు గ్రహిస్తే మిమ్మల్ని సత్యానికి చేరువ చేస్తుంది. ఈ కధలో జీవించగలిగితే, ఇది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ కధ గురించి అందులోని పాత్రల గురించి నిర్ధారణలు చేస్తే  అది మీ జీవితంలో గందర గోళానికి కారణం కావచ్చు, ఆ తరువాత మీకు ఏది మంచి, ఏది చెడు తెలియదు. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, కుటుంబంలో ఒకడిగా ఉండటమా లేక అడవులకి వెళ్ళడమా, యుద్ధానికి వెళ్ళడమా, లేదా అన్నది కూడా తెలియదు. మీరు ఈ కధలో జీవిస్తే, జీవన ప్రక్రియలో ‘ధర్మం’ దివ్యత్వానికి సోపానం వేస్తుందని  తెలుసుకుంటారు. అందుకు విరుద్ధంగా జరిగితే జీవన ప్రక్రియ నరకానికి దారితీస్తుంది - ఎంతోమంది వ్యక్తులు ఇలాగే చేస్తున్నారు.

బాహ్యంగా, అంతరంగంగా స్వర్ణ యుగం

కాలం, మన వ్యవస్థపై దాని ప్రభావం ఎంతో ముఖ్యమైనవి. ఇప్పుడు అర్ధరాత్రి సంధ్యా కాలం. తమ దైనందిన సాధనకై - రాత్రి నుంచి పగలుకి, పగలునించీ రాత్రికీ, ప్రొద్దున నుంచీ మధ్యాన్నానికీ, ఇంకా అర్ధరాత్రి సంధ్యలు - ఉపయోగించుకునే వారికి సంధ్యా కాలాల ప్రాముఖ్యం తెలుసు. ఇప్పుడు మనం రెండు యుగాల మధ్య సంధ్యని చూడబోతున్నాము. మానవ వ్యవస్థ - శరీరం, మనస్సు, శక్తి - పై కాలం గొప్ప ప్రభావం చూపుతుంది. మానవ- శరీరంలోని పూర్తి విద్యుత్ వ్యవస్థకీ, మనం నివసించే సృష్టిలోని విద్యుత్ వ్యవస్థకీ గొప్ప అనుసంధానం ఉంది. ఈ సంబంధం ఉన్నతమైన అవకాశాలను మనకు సాధ్యం చేయగలదు. దీనితో మీరు సమన్వయంతో ఉంటే ఒకలా ఉంటారు దీనిని విరోధిస్తే ఇంకొకలా ఉంటారు.

మీరు సరైన సాధనం ఐతే వోల్టేజీ పెరుగుతున్న కొద్దీ మీరు దివ్యంగా ప్రకాశిస్తారు, లేకపోతే విఫలమైపోతారు. అదేవిధంగా ఏ కాలమైనా ఏ యుగమైనా, గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా ప్రతి వ్యక్తీ, వీటిని దాటి ఉన్నతికి చేరగలడు. ప్రతి వ్యక్తీ బంగారు యుగంలో జీవించగలడు. అతి క్లిష్ఠమైన సమయంలో కూడా ప్రతి వ్యక్తికీ దానిని జయించే సంభావన ఉంది.

అందుకునే సరైన తీరు, వాతావరణం

మీలో - సమయంలో కరిగిపోవాలని ప్రయత్నించేవారు, సమయాన్ని జయించి పైకి ఎదగాలనుకునేవారు - ఈ కధను అందుకునే విధానాలు వేరు వేరుగా ఉంటాయి. మీరు ఎలాంటి విధమైనప్పటికీ మీరు ఈ కధతో ప్రయాణం చేసి, ఇది మీ కధగా దీనిని అనుభూతి చెంది, దీనిలో జీవించాలని నా అభిలాష. మీకు తెలిసిన కధనంతా వదిలిపెట్టండి. జీవితంలో ఉన్న సౌందర్యాన్ని వెదకాలంటే ఫలితం గురించి అలోచించకుండా కధలోని సౌందర్యాన్ని వెదకాలి. మహాయుద్ధం చేసి కూడా ఒక్క చిన్న గాయం కూడా పడకుండా బయట పడటానికి, కధ ఒక బ్రహ్మాండమైన అవకాశం. తమ ఆలోచనలపై, భావాలపై మానవ అనుభూతి ఎంతో ఆధారపడి ఉండటం వల్ల ఈ కధతో ప్రయాణం ఎంతో ముఖ్యం.

ఎవరు తన దగ్గరికి వచ్చి, ఏదడిగినా వారికది ఇచ్చారు. వరాలడిగిన వారికి వరాలిచ్చారు.  మరునాడు వారి శత్రువులు వెళ్ళి  వరాలడిగితే వారికీ ఇచ్చారు.

ఈథర్  గోళానికి ఎంత అందుబాటులో ఉంటే,  శక్తి పూరిత స్థలంలో ఎంత ఎక్కువగా ఉంటే, వెలుపలి వాతావరణం సున్నితంగా దీనితో అనుబంధంలో ఉండటంవల్ల, వ్యక్తి తన అనుభవాలను తనకనుగుణంగా మలచుకోగలిగే అవకాశం ఎక్కువౌతుంది. ఆదియోగి (కార్యక్రమం జరిగిన ఆదియోగి ఆలయంలోని ఆదియోగి లింగము) ఇక్కడ పూర్తి స్పందనతో ఉన్నారు. ఇంతకన్నా మెరుగైన ప్రదేశం లేదు. ఆయన జోక్యం కూడా కలిగించుకోరు. మహాభారతంలో కూడా అయన అలా ఉండిపోయారు. ఎవరు తన దగ్గరికి వచ్చి, ఏదడిగినా వారికది ఇచ్చారు. వరాలడిగిన వారికి వరాలిచ్చారు.  మరునాడు వారి శత్రువులు వెళ్ళి  వరాలడిగితే వారికీ ఇచ్చారు. ‘వీరేనా నా దైవం?’ అని మీకు ఆశ్చర్యం కలుగవచ్చు, నా దైవమైతే నా శత్రువులకెందుకు సహాయం చేస్తున్నారు? అనుకోవచ్చు, మరి ఆయన అంతే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన మిమ్మల్ని స్నేహితుడిగా చూడరు, ఇంకొకరిని శత్రువుగానూ చూడరు. ఆయన రెండు కళ్ళూ మూసుకుని ఉన్నారు, ఒక్కటే కన్ను తెరిచి ఉంది - మూడో కన్ను. ఎవరు ఎవరో అని భేదం చూపరు. తనని స్వీకరించే భావంతో దగ్గరికి వచ్చిన వారందిరికీ వారికి కావలసింది సొంతమవుతుంది. దానికి తగిన వాతావరణాన్ని మేము సృష్టిస్తాము, సరైన గ్రహణశీలతతో మీరు ఇక్కడ ఉండండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు