వేమన – నిశ్చలతత్వానికి స్ఫూర్తి..!!

వేమన అనే బాలుడు, ఏకైక లక్ష్యంతో సాధన చేయడం ద్వారా గొప్ప యోగిగా ఎలా పరిణామం చెందారో  సద్గురు వివరిస్తున్నారు. ‘నిశ్చలతత్త్వే జీవన్ముక్తి’ అన్న ఆదిశంకరుల వాక్యానికి ఈ కథను నిదర్శనంగా చెప్పారు.
 

ఆంధ్రదేశంలో వేమన అనే గొప్ప సాధువు ఉండేవాడు. తెలుగు నాట వేమన శతకం లేని ఇల్లంటూ ఉండదు. ఆయన పేరేమిటో తెలియదు కాని అందరూ వేమన అంటారు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు అందరూ వట్టి మూర్ఖుడనుకునేవాళ్లు. ఒక గురువుగారు వేమనకు అక్షరాలు నేర్పాలని ప్రయత్నించారు. పదిహేనేళ్లు పైబడ్డా తెలివి తక్కువ పిల్లవాడుగా పేరుబడ్డ వేమన అక్షరాలు కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు.

తెలుగు నాట వేమన శతకం లేని ఇల్లంటూ ఉండదు

ఒకరోజు గురువుగారు ఏదో ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్లవలసి వచ్చింది. ఆయన నదిలో స్నానానికి వెళ్తూ వేమనకిలా చెప్పారు, “నేను స్నానం పూర్తి చేసి వచ్చేదాకా ఈ బట్టలు ఇట్లాగే పట్టుకొని ఉండు. జాగ్రత్త. వాటిని కింద పెట్టి మట్టి అంటనీయకు.” స్నానం పూర్తయిన తర్వాత ఆయన వేమనను కేకవేశారు. బట్టలు వదిలేసి వేమన గురువు గారి దగ్గరకు పరిగెత్తాడు.

గురువుగారి సహనం నశించింది, కాని ఈ పిల్లవాడు ఆయన వంక అలాగే తెల్ల మొహం వేసుకొని చూస్తూ ఉన్నాడు. గురువుగారు విసుగు చెంది, వేమనకు ఒక సుద్దముక్క ఇచ్చి, “ఈ బండ మీద కూర్చుని నేను తిరిగి వచ్చేవరకు ‘రామ, రామ, రామ’ అని రాస్తూ ఉండు. దానివల్ల ఏమైనా ఫలితముంటుందేమో చూద్దాం.” అని చెప్పి తన పనిమీద వెళ్లిపోయారు.

తన కోసం గురువుగారు పడుతున్న శ్రమ అంతా వృథా కావడం చూసి పిల్లవాడు చాలా బాధపడ్డాడు. అతనక్కడ కూర్చుని రామ , రామ, రామ అని రాస్తూ ఉండిపోయాడు. సుద్దముక్క పూర్తిగా అరిగిపోయింది. అయినా అతను తన వేలితో రాస్తూనే ఉన్నాడు. వేలు పుండై రక్తం కారసాగింది, అయినా రాస్తూనే ఉన్నాడు. సాయంత్రం గురువుగారు వచ్చారు. పిల్లవాడు ఇంకా వేలితో రామ, రామ రాస్తూనే ఉన్నాడు. వేలంతా అరిగిపోయింది. ఆయన మనస్సు కరిగిపోయింది. పిల్లవాణ్ణి గుండెలకు హత్తుకున్నాడు, “ఏం చేశానురా నీకు” అంటూ ఏడ్చాడు.

ఆ నాటి తర్వాత ఆ పిల్లవాడు అద్భుతమైన కవి అయ్యాడు, ఆత్మజ్ఞాని అయ్యాడు. వందలాది పద్యాలు రాశాడు. ఏ వ్యక్తికైనా ఇటువంటి పట్టుదల ఉంటే, ఇలా ఒక్క దిశలో దృష్టి కేంద్రీకరించ గలిగితే ఆ వ్యక్తి సాధించలేనిది, పొందలేనిది ఎదీ లేదు.

మీ లక్ష్యం అచంచలమైతే, అది ఏదైనా కానీ, మీరు  ముక్తి పొందుతారు.

‘నిశ్చలతత్త్వే జీవన్ముక్తి’ అని ఆదిశంకరులు అనటంలో తాత్పర్యమిదే. అంటే మీ లక్ష్యం అచంచలమైతే, అది ఏదైనా కానీయండి, మీరు  ముక్తి పొందుతారు. నిశ్చలతత్త్వం లేకపోతే ముక్తిలేదు; కేవలం గందరగోళమే ఉంటుంది. నిశ్చలతత్త్వం అవసరం. లేకపోతే మీరు పరిమితుల్నీ, అడ్డంకుల్నీ అధిగమించలేరు. ప్రతి అడ్డంకీ దాటలేని ఒక మహాపర్వతమై నిలుస్తుంది.

ఒక లక్ష్యం నిర్దేశిస్తే, దానికి మరో మార్గం లేకపోతే, అదొక్కటే గమ్యమైతే ప్రజలు దేన్నీ అసాధ్యంగా భావించరు. ఆ సంభావ్యం కోసం వాళ్లెప్పుడూ శ్రమిస్తారు. ఆధ్యాత్మిక సాధకుడు చేయవలసిన పని అది. మీరు మొట్టమొదట చేయవలసిన పని అది – ఒక లక్ష్యం నిర్దేశించుకోండి, అది ఎప్పటికీ మార్చరానిదని నిశ్చయించుకోండి. ఈ విషయంలో మీరెన్నడూ రాజీ పడకపోతే జీవితం మీ వెనుకే వ్యవస్థీకృతమై నడుస్తుంది. అది మీ ముందు అవరోధంగా నిలబడదు. జీవితం మీ వెనుకే వ్యవస్థీకృతమై ఉండి ఎల్లప్పుడూ మీకు తోడ్పడుతూ ఉంటుంది. మీలో నిశ్చలతత్త్వం ఉంటే మీ ఇంద్రియాలు, మీ శక్తులు, మొత్తం ప్రపంచమంతా మీ వెన్నంటే నిలుస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు