మీకు గాఢమైన అనుబంధం మీ సంపద మీదా, మీ ఇంటి మీదా కాదు. మీ భార్య పట్ల, మీ భర్త పట్ల, మీ సంతానం పట్ల కూడా కాదు. మీకు ఎక్కువ అనుబంధం మీ స్వంత ఆలోచనల పట్ల, మీ స్వంత భావాల పట్ల మాత్రమే. అది ఎప్పటికీ అంతే. "అదేం కాదు! నా భార్య అంటే నాకు చాల ఇష్టం, నా పిల్లవాడు అంటే ఇష్టం!’’ అని మీరు అనవచ్చు. ఒకవేళ ఎపుడైనా మీ భార్యగానీ, మీ పిల్లవాడుగానీ లేక మీ చుట్టూ పరిస్థితులు గానీ మీకు వ్యతిరేకంగా మారిపోయాయనుకోండి. మీరు అనుకున్నట్లుగా, మీరు ఆలోచించినట్లుగా లేవనుకోండి. ఇక వారందరూ ఎడమైపోతారు, దూరమైపోతారు. మీ స్వంత ఆలోచనలు, భావనలు మాత్రమే మీతో నిలుస్తాయి.

అసలు మీరు నిజంగా కూడబెట్టుకున్నవి మీ ఆలోచనా విధానాలు, మీ భావనలు, మీ ఉద్దేశాలు, మీ సిద్ధాంతాలు, మీ విశ్వాసాలు - ఇవే.

అసలు మీరు నిజంగా కూడబెట్టుకున్నవి మీ ఆలోచనా విధానాలు, మీ భావనలు, మీ ఉద్దేశాలు, మీ సిద్ధాంతాలు, మీ విశ్వాసాలు - ఇవే. ఇవే మీ చుట్టూ అనేక విధాలుగా విస్తరిస్తాయి. అందువల్ల, మీరు వదిలిపెట్టవలసినది వీటినే. మీ ఇంటిని, మీ బ్యాంక్ బాలన్సుని కాదు. మీ ఆలోచనా విధానం, మీ భావనలు, మీ సిద్ధాంతాలు,  మీ వ్యక్తిత్వం, ఇవే మీరు వాస్తవంగా కూడబెట్టుకున్నది. మీరు పారవేయాల్సింది వీటినే. మీ భార్యనో, మీ పిల్లవాడినో, మరొక దాన్నో కాదు.

‘‘నాకొక అభిప్రాయం ఉంది’’ అని మీరు అంటే అర్థం ఏమిటి? అది ఒక వాస్తవవెూ, జ్ఞానవెూ అని కాదు. మీకు ఒక విధమైన ఆలోచన, ఒక విధమైన ఊహ ఉంది అని దాని అర్థం. సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక క్రమబద్ధం చేయబడిన అలోచన. దాని వలన ఏమౌతుంది? ఈ ఆలోచనే, ఈ ఊహే మిమ్మల్ని వాస్తవానికి దూరంగా తీసుకుపోతుంది.

 ప్రస్తుతం మీరిక్కడ కూర్చుని ఇక్కడ లేని ఏ విషయం గురించో ఊహించుకోవటం మొదలు పెడితే, అపుడు ఆ ఊహ మీ చుట్టూ ఉన్న ప్రస్తుత వాస్తవం నుంచి మిమ్మల్ని విడదీస్తుంది.

 ప్రస్తుతం మీరిక్కడ కూర్చుని ఇక్కడ లేని ఏ విషయం గురించో ఊహించుకోవటం మొదలు పెడితే, అపుడు ఆ ఊహ మీ చుట్టూ ఉన్న ప్రస్తుత వాస్తవం నుంచి మిమ్మల్ని విడదీస్తుంది. ఇక ఆ ఊహ బాగా క్రమబద్ధం అయితే, అప్పుడు అది ఇక మిమ్మల్ని వాస్తవం నుంచి పూర్తిగా వేరుచేస్తుంది. అపుడు వాస్తవికతతో మీకు సంబంధమే లేకుండా పోతుంది. ఊహతో ఉన్న బంధం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కల్పన చాలా ఆకర్షవంతంగా ఉంటుంది. అది పూర్తిగా క్రమబద్ధం అయినపుడు, మరింత ఆకర్షవంతం అవుతుంది. ఒకసారి దానితో మీరు మమేకం అయిపోయారంటే చాలు. అది వాస్తవికత నుండి మిమ్మల్ని పూర్తిగా వేరుచేస్తుంది. వాస్తవం నుండి అలా మీరు విడిపోయినపుడు, మీరు నిజంగా అర్థవంతమైన జీవితం జీవించగలుగుతారా? మీరు నిజంగా జీవితాన్నిఅనుభవించగలుగుతారా?

జీవితాన్ని తెలుసుకునే ఒకే ఒక్క మార్గం జీవితం ఎలా ఉందో అలాగే చూడటం, అలాగే అవగతం చేసుకోవటం. కాని, ఉదాహరణకు ఏదో ఒక సిద్ధాంతంతో మీ మనసు వక్రమైపోయిందనుకోండి. అపుడిక మీరు చూసేదంతా మీ సిద్ధాంతపు దృష్టికి లోబడే ఉంటుంది. అంతేకాని, వాస్తవానికి దానితో ఏ సంబంధమూ ఉండదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు