వృక్షాలు.... మన అతిసమీప బంధువులు..!!

 

పర్యావరణ మేలుకోసం చేసే సేవలకు గాను, మనదేశంలో బహూకరించే అత్యుత్తమ పౌర పురస్కారం, ఇందిరా గాంధీ పర్యావరణ పురస్కారం, స్వీకరించిన సందర్భంలో సద్గురు చేసిన అంగీకార ప్రసంగంలోని భాగాలనుండి ఈ ఆర్టికల్ సంగ్రహించబడింది. 

చెట్లు మన జీవనక్రియకి దోహదం చేస్తాయి. అవి మనకి 'బయటఉండే ఊపిరితిత్తులు' అనవచ్చు.  మీరు బ్రతకాలంటే, మీ శరీరాన్ని అశ్రద్ధ చెయ్యలేరు; ఈ భూతలం కూడా అందుకు భిన్నం కాదు. మీరు "నా శరీరం" అంటున్నది కేవలం ఈ భూమిలో ఒక లవలేశము. అది తెలుసుకోవడమే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ అంతరార్థం.

మీరూ, మీ గురించి మీరనుకుంటున్నదీ ఈ రెండూ మిగతా అన్నిటిలో అంతర్భాగమే.

మనం "ఆధ్యాత్మికత" అనగానే, మనం కిందకో, పైకో చూడడం గురించి చెప్పడం లేదు. మనదృష్టి మనలోకి ప్రసరించి (అంతర్ముఖులమై),  ఈ శరీరం, దాని సహజ ధర్మం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడమే. ఈ అంతర్ముఖుత్వపు మొట్టమొదటి లక్ష్యం మీరు మీ చుట్టూ ఉన్న పరిసరాలలో ఒక అంతర్భాగమే అని చూడగలగడం. ఆ చైతన్యం లేనపుడు ఏ ఆధ్యాత్మిక ప్రక్రియా లేనట్టే. అది ఆధ్యాత్మికత అంతిమ లక్ష్యం కాదు, ప్రప్రథమ లక్ష్యం: మీరూ, మీ గురించి మీరనుకుంటున్నదీ ఈ రెండూ మిగతా అన్నిటిలో అంతర్భాగమే.

“ఈ రోజు ఆధునిక భౌతిక శాస్త్రం ఈ సృష్టి అంతా ఒకే శక్తి యొక్క భిన్న రూపాలని చెబుతోంది.  శాస్త్రీయమైన ఋజువులు మీ శరీరంలోని ప్రతి అణువూ ఈ విశ్వం అంతటితోనూ అనుక్షణం సంభాషణలో ఉందని నిర్థారిస్తున్నాయి. మన దృక్పథాన్ని విశాలం చేసి, దీన్ని మన అనుభవంలోకి తీసుకురావడమే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఏ రకంగా చూసినా, మన ఆలోచనలని గిలకొట్టడం తప్ప, ఎవరి జీవితాలని మార్చలేని శుష్క వైజ్ఞానిక సత్యం వలన ప్రయోజనం ఏమిటి? దానికి బదులు, అదే ఒక జీవితానుభవం అయితే, మీతోపాటు మీ పరిసరాలపై కూడా శ్రద్ధపెట్టడం మీకు సహజమైన ప్రక్రియ అవుతుంది.

చెట్టు మీలోని భాగమే, కాకపోతేశరీరానికి బయట ఉంది.

చెట్టు మీకు ఒక యోజన కాదు; అది మీ ప్రాణం. చెట్టు మీలోని భాగమే, కాకపోతే శరీరానికి బయట ఉంది.  అది మీకోసం ప్రతిరోజూ శ్వాసిస్తుంది.  అది మీ ఊపిరితిత్తులకంటే గొప్పది. చెట్లు లేకుండా మీ ఊపిరితిత్తులు ఏమీ చెయ్యలేవు. ఈ విషయం అందరూ అర్థం చేసుకునేలా సరళమైన మార్గాల్లో చెప్పాము. గ్రామీణులు నిబద్ధతతో దీనివెనక నిలబడిన తీరూ,  ఏకాగ్రత, ఉత్సాహంతో  వాళ్ళు పని చేసిన విధానమూ అసాధారణం.

నేను పల్లెలకు వెళ్లి, పాపం ఏపూట భోజనానికి ఆ పూట కష్టపడే వాళ్ళని చూసినపుడు, వాళ్ళు పని మానుకుని మరీ ఈ పని ఉత్సాహంతో చెయ్యడం చూసినపుడు నాకు కళ్ళవెంబడి నీళ్ళు వచ్చాయి. కారణం వాళ్లకి వాతావరణంలో మార్పులు  అంటే ఏమిటో తెలియదు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఈ ప్రపంచంలో అతితక్కువలో తక్కువ ఉన్నవారు. ఈ భూమి మీద అతి తక్కువ కర్బనోద్గారములు(carbon) విడిచిపెట్టే వారు, అసలు అటువంటిది అంటూ ఏమైనా ఉంటే. వీళ్ళతో పోల్చినపుడు ఒక పావురం వీళ్ళకంటే ఎక్కువ కర్బనోద్గారాలు విడిచిపెడుతుంది; కారణం వీళ్లు కేవలం నేలని మాత్రమే నమ్ముకుని బ్రతకేవారు.  వాళ్ళ ఇళ్ళకి విద్యుత్తు లేదు; వాళ్ళు దేన్నీ కాల్చడంలేదు; పర్యావరణంతో అత్యంత స్నేహపూర్వకంగా మెసలే ప్రాణులు వారు. కానీ, వాళ్ళని ఈ పని చెయ్యమని అడిగాము. దానికి వాళ్ల ప్రతిస్పందన, కనబరిచిన ఉత్సాహమూ సాటిలేనివి. ఈ సామాన్యుల సాహసమూ, సమస్యపట్ల ఆందోళనతో ఊహించశక్యంగాని సంఖ్యలో చెట్లునాటిన వైనమూ ప్రపంచంలో నలుచోట్లా ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను...

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1