గంగా నది : అప్పుడు – ఇప్పుడు
 
 

ఈ వ్యాసంలో నది అంటే ఏమిటి, గంగా నది ప్రాముఖ్యత గురించి, ఇప్పుడున్న స్థితి గురించి మనతో సద్గురు పంచుకుంటున్నారు.

మన దేశంలో నదుల పట్ల మనం ఎంతో భక్తి భావం కలిగి ఉంటాము. మనలో చాలా మందికి గంగా అన్న పేరు వింటేనే కళ్ళల్లో ఆనందభాష్పాలు వస్తాయి. గంగా నదిలో ఒక్క మునక వెయ్యడానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ వెళ్తారు. వాళ్ళ ఇంట్లో కొద్దిగా గంగా జలాన్ని ఎన్నో సంవత్సరాలపాటు నిలవ ఉంచుకుంటారు, వారి అంతిమ దశలో గంగా తీర్థాన్ని పుచ్చుకోవాలనుకుంటారు. ఈ గంగా నది కథ చెబుతాను వినండి. నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారి హిమాలయాలకు ప్రయాణం చేశాను.

అప్పుడు సుందర్ లాల్ బహుగుణని కలవాలి అన్నది నాకో సంకల్పం. ఈయన అప్పట్లో చిప్కో ఉద్యమాన్ని మొదలు పెట్టారు. నాకు ఆయనని కలవడం కుదరలేదు గాని అంతే సాధ్వీమణి అయిన ఆయన భార్యను కలిశాను. వీళ్ళు హిమాలయాల్లోని చెట్లను నదులను సంరక్షిస్తూ ఉండేవారు. సుందర్ లాల్ బహుగుణ గారు ఎంతో అసంతృప్తితో చనిపోయారు. ఎందుకంటే, ఆయన ఏమి చేద్దాం అనుకున్నారో అది చెయ్యలేకపోయారు. మనం ఇప్పుడు ఏమి చేశామంటే, దాదాపుగా 5 కోట్ల చెట్లను హిమాలయా ప్రాంతాల నుంచి తొలగించి వేశాము. మనం వీటితో ఇండియన్ రైల్ వేస్ నిర్మించుకున్నాం. కానీ ఎంతో కాలం తరువాత మనం ఏమి తెలుసుకున్నామూ అంటే.. మనం వీటికి బదులుగా ఎంతో తేలికగా కాంక్రీటును వాడి ఉండవచ్చునన్న విషయం తెలుసుకున్నాం.

ఆ రోజుల్లో నేను గంగా ఎలా ఉండేదో చూసిన తరువాత ఈ రోజుల్లో మనం గంగను చూసినట్లైతే, ఎంతో విచారంగా అనిపిస్తుంది.

ఇది మనం మొదటిలోనే చేసే ఉండొచ్చు. కాకపోతే మొదట్లో తగినంత ఆలోచన మనం దానిలో పెట్టలేదు. సరే.. ఎలా అయితేనేం మనం ఆ చెట్లను వాడి  ఇండియన్ రైల్ వేస్ ని నిర్మించుకున్నాం. ఆ రైళ్లలో మనందరం ప్రయాణం చేశాం. కానీ కనీసం ఆ చెట్లను మళ్ళి నాటడం వంటి ప్రత్యామ్నాయ చర్యలు అయినా మనం చేసి ఉండవలసింది. ఇది చేయకపోవడం వల్ల ఏమి జరిగిందంటే, ఈ ప్రదేశంలో గంగా నదికి దాదాపుగా 800 ఉపనదులు ఉన్నాయి. ఇప్పుడు అందులో 470 ఉపనదులు కేవలం 3-4 నెలల పాటు మాత్రమే పారే నదులుగా మారిపోయాయి.

మన నదిని కాపాడుకోవడం మన బాధ్యత

గంగా నది, గంగా పరీవాహక ప్రాంతం మన భారత దేశంలో 25% ఉంటుంది. మన దేశంలో 33% వ్యవసాయం కూడా గంగా నది ఒడ్డునే జరుగుతుంది. గంగానదీ పరీవాహక ప్రాంతంలోనే జరుగుతుంది. ఇది దాదాపుగా 30 కోట్ల మందికి నివాస స్థానం. ఇది దాదాపుగా అమెరికాలో ఉన్నంత జనాభా. గడచిన 50 సంవత్సరాల్లో ఈ నది దాదాపుగా 44% క్షీణించిపోయింది. ఆ రోజుల్లో నేను గంగా ఎలా ఉండేదో చూసిన తరువాత ఈ రోజుల్లో మనం గంగను చూసినట్లైతే, ఎంతో విచారంగా అనిపిస్తుంది. అన్నిటికీ మించి కాలుష్యం, మురుగు అంతటా ప్రవహిస్తోంది. మనకి నదులపట్ల ఎంతో గొప్ప భావావేశాలు ఉంటాయి. మన ప్రజలు అక్కడ పూజ కూడా చేస్తారు. కానీ ఆ మరుక్షణమే వారే అక్కడ ఉమ్మేసి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు దీనిని మార్చవలసిన సమయం వచ్చింది.

కాలుష్యం అన్నదానిని అందరూ గమనిస్తూ ఉన్నారు. దీని గురించి అందరూ చర్చలు చేస్తూ ఉన్నారు. మనకి స్వచ్చ భారత్ అభియాన్ కూడా నడుస్తోంది. కానీ ఒక  విషయం ఏమిటంటే, మనకి రాజకీయ సహకారం ఉన్నట్లైతే కేవలం  మూడు సంవత్సరాల్లో మన నదులన్నీ స్వచ్ఛంగా పారేలాగా చేయవచ్చు. ఇందుకు ఒక స్పష్టమైన విధానం ఉంది. కాలుష్యం అన్నది సమస్యే..! కానీ మనం కనుక దానిమీద దృష్టి పెట్టి, పని చేస్తే 2-3 సంవత్సరాల్లో మన నదులన్నింటినీ కాలుష్యం లేకుండా చేయవచ్చు. మేమిప్పుడు ప్రభుత్వానికి అందించబోయే విధానం దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది. దీనికి కావలసిన సాంకేతిక విజ్ఞానం ఈ రోజున ప్రపంచంలో మనకి అందుబాటులో ఉంది. ఈ సమస్యను మనం పరిష్కరించవచ్చు.

కానీ నిజమైన సమస్య ఏమిటంటే, మన నదులు క్షీణించిపోతున్నాయి. నేను ఎంతో చిన్నతనం నుంచి నదులూ, పర్వతాలూ, అడవులతో ఎంతో సన్నిహితంగా ఉన్నాను. మీకు దీనిగురించి కొద్దిగా చెప్పాలంటే నాకు 8-9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకొక పది రూపాయలు దొరికాయంటే చాలు, నేను కొద్దిగా ఆహారాన్ని తీసుకొని అడవిలోకి మాయం అయిపోయేవాడిని. మా ఇంట్లోవాళ్లు ఎంతో కంగారు పడేవాళ్లు. కానీ నేను తీసుకువెళ్లిన ఆహారం అయిపోగానే, ఎప్పుడూ తిరిగి వచ్చేసేవాడిని. 3-4 రోజులపాటూ అడవిలో ఊరికే అలా తిరుగుతూ ఉండేవాడిని. నేను అప్పట్లో అడవుల్లో రాత్రి పూట అలా నడుస్తూ ఉండేవాడిని. ఒక విషయం ఏమిటంటే, అప్పట్లో టార్చిలు, ఎల్ ఈ డీ లు అవన్నీ ఏమీ లేవు. మా ఇంట్లో ఒక్కటే ఎవరెడీ టార్చ్ ఉండేది.

మీలాంటివారు, నాలాంటివారు వస్తారు పోతారు. కానీ ఈ నదులు ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్నాయి.

కేవలం మా నాన్నగారు మాత్రమే ఈ టార్ఛ్ ని వాడేవారు. ఈ టార్చ్ లో కూడా ఎప్పుడూ బ్యాటరీలు వేసి ఉండేవి కాదు. బ్యాటరీలు వేసేసి ఉంచితే అవి లీక్ అయిపోతాయి కాబట్టి బ్యాటరీలు బయటే ఉండేవి. ఏదైనా అత్యవసర పరిస్థితికి వాడాలంటే, మా నాన్నగారు మాత్రమే అందులో బ్యాటరీలు వేసి దానిని వాడేవారు. అందుకని టార్ఛ్ లైట్ అనేదే నాదగ్గర ఉండేది కాదు. నేను అడవిలోనికి వెళ్లినప్పుడు ఏమి గమనించానంటే, మిగతా జీవరాశులన్నీ కూడానూ ఎంతో తేలికగా అడవిలో సాగిపోతున్నాయి. నేనొక్కడినే కష్టపడుతున్నాను -  అని. వీటికి తెలిసిందీ నాకు తెలియనిదీ ఏమిటీ అని నేను వీటిపట్ల దృష్టి పెట్టడం మొదలు పెట్టాను. నేను డార్విన్ సిద్ధాంతం చదివి ఉండడం వల్ల మన న్యూరాలాజికల్ సిస్టమ్ అన్నిటికంటే గొప్పదని తెలుసుకున్నాను. కానీ ఈ జంతువులు వేటినైతే చూడగలుగుతున్నాయో వాటిని నేనెందుకు చూడలేకపోతున్నానూ..? అని అనుకున్నాను. అప్పుడు నేనొక సాధన చెయ్యడం మొదలు పెట్టాను.

ఒక అంగుళంన్నర ఉన్న ముల్లునొకదానిని తీసుకుని దాని ప్రతి కణమూ గమనించడం మొదలు పెట్టాను. ఎంత బాగా గమనించానంటే, నేను చీకట్లో దేనినైనా చూడగలిగేలాగా..! ఈ రోజుకి కూడా నేను ఇంట్లో ఎప్పుడూ లైట్లు వేసుకోను. నేను ఒక్కడినే ఉంటే లైట్లు వాడను. ఏదైనా చదవాలన్నప్పుడు మాత్రమే లైట్లు వేస్తాను. లేకపోతే లైట్లు వెయ్యవలసిన పనేలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానవ సామర్థ్యం ఎంతో అమోఘమైనది. కానీ, చాలామంది వారి సామర్థ్యాన్ని తెలుసుకోకుండానే ఉండిపోతున్నారు. దీనికీ నదులకీ సంబంధం ఏమిటీ..? నేను అడవుల్లోకి  వెళ్లినప్పుడు, నదుల దగ్గర ఉన్నప్పుడు నాకు అడవి అంటే ఏదో అందమైన ప్రదేశంలాగానూ, నది అంటే ఒక వనరు లాగానో అనిపించలేదు. ఇవి నాకంటే ఎంతో పెద్ద జీవాలుగా అనిపించేవి. నేను వీటిని ఆ విధంగా అనుభూతి చెందాను. మీలాంటివారు, నాలాంటివారు వస్తారు పోతారు. కానీ ఈ నదులు ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్నాయి. కానీ మనం నదులు అంతరించిపోయేలాగా చేస్తున్నాము.

ప్రేమాశీస్సులతో,
సద్గురు 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1