శ్వేతకేతు - నిజమైన బ్రాహ్మణుడు

Radhe Krishna
 

“శ్వేతకేతు” అనే పేరుతో ఓ పిల్లవాడు ఉండేవాడు. శ్వేతకేతు అంటే తెల్లని తెగ అని అర్ధం. ‘శ్వేత’ అంటే ‘తెలుపు’, ‘కేతు’ అంటే ఒక ‘తెగ’. శ్వేతకేతు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈ రోజున బ్రాహ్మణ కుటుంబాలు అంటే కేవలం ఒక కులంగా మిగిలిపోయాయి. కానీ బ్రాహ్మణుడు అంటే - బ్రాహ్మన్ అంటే బ్రహ్మ, బ్రాహ్మణుడు అంటే ‘బ్రహ్మ జ్ఞానం’ కలగినవాడు. ఈ రోజున పుట్టుకరీత్యా ఒకరు బ్రాహ్మణుడు అంటే దానికేమి అర్ధం లేదు, కానీ మీరు మీ చైతన్యం వల్ల బ్రాహ్మణుడుగా ఉండాలి. అసలు కావాల్సిందంతా  అదే. ఇక్కడ, ఈ కుటుంబం కేవలం జన్మరీత్యా బ్రాహ్మణులు కాదు. వీళ్ళు నిజంగా బ్రాహ్మణులుగానే జీవిస్తున్నారు. ఈ పిల్లవాడికి పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికే అతన్ని విద్యాభ్యాసం కోసం ఒక గురువు గారి దగ్గరకు పంపించారు.

ఇతను పన్నెండేళ్ళు విద్యాభ్యాసం చేసాడు. ఎంతో తెలివిగల పిల్లవాడై ఉండడంతో ఇతను అన్నీ ఎంతో వేగంగా గ్రహించాడు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. ఇవి మానవుడి గురించి ఏం చెప్పచ్చో వాటన్నిటి గురించి చెప్పాయి. మానవుడి గురించి, దాన్ని మించిన దాని గురించి వీటిల్లో అన్నీ ఉంటాయి. పన్నెండేళ్ల విద్యాభ్యాసంలో ఇతను మొత్తం అన్నీ నేర్చుకున్నాడు. ఎంతో తెలివిగలవాడు అవ్వడం చేత అన్నీ గ్రహించాడు. పన్నెండేళ్ల తరువాత ఆ గురువుగారు, “నువ్వు  నేర్చుకోడానికి ఇంకేమి మిగిలిలేదు, ఏదైతే నేర్చుకోడానికి ఉందో అదంతా నువ్వు నేర్చుకున్నావు. ఇంక నువ్వు ఇంటికి  వెళ్ళచ్చు” అని చెప్పాడు.

నీకు ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఏదైతే తెలుసుకుంటోందో దాని గురించి నీకేమి తెలియదు. అందుకని నువ్వెంతో అజ్ఞానివి.

ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళాడు. అతను ఇంట్లోకి వెళ్లబోతుంటే, అక్కడ కూర్చుని ఉన్న తండ్రి అతన్ని చూసి, “నువ్వు ఒక అజ్ఞానిగా తిరిగి వచ్చావు” అన్నాడు. “లేదు, నేను వేదాలు, ఉపనిషత్తులు అన్నీ నేర్చుకున్నాను, కావాలంటే నేను వాటిని  వెనుక నుంచి ముందుకు కూడా వల్లే వేయగలను” అని చెప్పాడు. “నాకు తెలుసు. ఏదైతే నేర్చుకోవచ్చో నువ్వు అదంతా నేర్చుకున్నావు, కానీ ఏదైతే నేర్చుకుంటోందో, ఏదైతే తెలుసుకుంటోందో దాని గురించి నువ్వు ఏమీ తెలుసుకోలేదు. నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి నీకు ఎన్నో విషయాలు తెలుసునని నాకు తెలుసు. నీకు ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఏదైతే తెలుసుకుంటోందో దాని గురించి నీకేమి తెలియదు. అందుకని నువ్వెంతో అజ్ఞానివి. మేము స్వచ్ఛమైన బ్రాహ్మణులం, అంతేకాని పుట్టుకరీత్యా బ్రాహ్మణులం కాదు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే, నువ్వు ఏదైతే తెలుసుకుంటోందో దాన్ని తెలుసుకోవాలి, అంతే కానీ ఏదైతే తెలుసుకోవచ్చో దాన్ని కాదు. నువ్వు మీ గురువుగారి దగ్గరకి తిరిగి వెళ్ళు” అన్నాడు.

ఆ పిల్లవాడు, పన్నెండేళ్ళు చదువుకోడానికి గురుకులానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. అన్నీ నేర్చుకుని  వచ్చిన తరువాత సామాన్యంగా ఐతే మనం ఓ పెద్ద పార్టీ ఇస్తాం, కానీ ఇక్కడ ఈ తండ్రి అతన్ని ఇంట్లో నుంచి పంపించేశాడు. ఆ పిల్లవాడు గురువుగారి దగ్గరకి వెళ్లి, “నా తండ్రి నేను అఙ్ఞానిని  అని చెప్పాడు. నాకు వేదాలు, ఉపనిషత్తులు మీరు నాకు నేర్పించినవన్నీ నేను ఎంతో క్రమశిక్షణతో నేర్చుకున్నాను. కానీ మా నాన్నగారు నాకు ఏది తెలుసుకుంటోందో దాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు” అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు “ఓ, నీకు తెలుసుకునే దాన్ని తెలుసుకోవాలని ఉందా? ఈ పన్నెండు సంవత్సరాలు ఏది తెలుసుకోవచ్చో దాని మీదే నువ్వు ఆసక్తి చూపించావు, అందుకని నీకు ఏదైతే తెలుసుకోవచ్చో అవన్నీ కూడా నేర్పించాం, అదంతా నువ్వు నేర్చేసుకున్నావు  కాబట్టి నేను నిన్ను తిరిగి పంపించేసాను. ఇప్పుడు నువ్వు ఏది తెలుసుకుంటోందో అది తెలుసుకోవాలని అనుకుంటున్నావు? ఒక పనిచేయి, ఇక్కడ ఈ గోవులున్నాయి కదా! ఈ గోవుల్ని నువ్వు తీసుకుని వెళ్ళు” అన్నాడు. ఆశ్రమంలో కొన్ని గోవులున్నాయి. అక్కడ నాలుగు వందల ఆవులున్నాయి. “వీటిని తీసుకుని నువ్వు అడవిలోకి వెళ్ళు. అడవిలోకి వెళ్లి వాటితో పాటు ఉండు. అవి ఎప్పుడైతే వెయ్యి ఆవులు అవుతాయో అప్పుడు నువ్వు తిరిగి రా” అని చెప్పాడు.

నాలుగు వందల ఆవులు వెయ్యి ఆవులు అవ్వాలంటే ఎంత సమయం పడుతుంతో మీకు తెలుసా ? “ఎంత సమయం పట్టినా సరే అవి వెయ్యి ఆవులు అయినప్పుడు నువ్వు తిరిగి రా “అని గురువుగారు చెప్పాడు. శ్వేతకేతు ఇది నమ్మలేకపోయాడు. ఇతను విద్యాభ్యాసం మొత్తం పూర్తిచేసాడు. ఇది  ఎలాంటిదంటే, మీరు చదువుకోడానికి ఒక యూనివర్సిటీకి వెళ్లి, అక్కడ పి. హెచ్. డి వరకు పూర్తి చేసిన తరువాత అప్పుడు మిమ్మల్ని ఒక గొడ్ల కాపరిగా ఉండమన్నట్టు. అతను వెళ్ళాడు. మొట్టమొదట అతను ఎంతో బాధపడ్డాడు, “ఏవిటిది నన్ను అందరు ఎందుకు ఇలా తిరస్కరించారు? ఇప్పుడు మా గురువుగారు నాకు ఇటువంటి పని చెప్పారు” అనుకున్నారు. కొన్ని వారాలు, నెలలు ఇలా అతని మనసు పని చేసింది. మీ మనసు పని చేస్తూ ఉండాలంటే దానికి బయట నుంచి ఏదో ఒక విషయం అందిస్తూ ఉండాలి. మీరు దానికి  విషయాలు అనే  ఆహారం ఇవ్వకుండా అది నడవదు. ఇప్పుడు ఇతను అడవిలోకి వెళ్ళాడు. అక్కడ కేవలం పశువులు మాత్రమే ఉన్నాయి.

అతను ఆవుతో ఉంటే ఒక ఆవులాగా మారిపోతాడు, ఒక చెట్టును  ముట్టుకుంటే ఒక చెట్టులా అయిపోతాడు.

మెల్లిగా ఆశ్రమంలో ఏం జరుగుతోంది.. ఇంట్లో ఏం జరుగుతోంది.. ఇవన్నీ మర్చిపోయాడు. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మీరు చెప్పేది వినడానికి ఎవరైనా ఉన్నప్పుడే, వాటన్నిటికీ శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ ఆవులున్నాయి, ఆవులు వేదాలను వినవు, అవి ఊరికే అలా మేత మేస్తూ ఉంటాయి అంతే. మెల్లిగా ఈ మేత మేస్తున్న ఆవులను చూస్తూ, అవి అతని మనసులో నిలిచిపోయాయి. ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు పన్నెండు సంవత్సరాలు ఇవన్నీ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా సమయంతో పాటు, మరుగున పడిపోవడం మొదలు పెట్టాయి,. ఇతను కూడా ఒక ఆవులాగా తయారైపోయాడు. అతనికి ఆకలి వేస్తే తింటాడు, లేదా అలా ఊరికే కూర్చుని ఉంటాడు.

అతని కళ్ళ ఆకారం మారిపోయిందని చెపుతారు. అతను ఒక ఆవులాగా తయారైపోయాడు. ఇంక ఇతను, ఇతని మనసుకి బానిస ఏ మాత్రం కాదు. అతను అలా కూర్చుంటే, అలా సంపూర్ణంగా కూర్చుంటాడు అంతే. అతను ఆవుతో ఉంటే ఒక ఆవులాగా మారిపోతాడు, ఒక చెట్టును  ముట్టుకుంటే ఒక చెట్టులా అయిపోతాడు. భూమి మీద కూర్చుంటే తాను కూడా ఓ భూమిలా మారిపోతాడు. అతను పూర్తి సాన్నిధ్యంగా మారిపోయాడు. ఎందుకంటే మనసుకి బయట నుంచి ఎటువంటి ఆహారం ఇవ్వటం లేదు కాబట్టి. కొన్నాళ్ళకి అతను భాష కూడా మర్చి పోయాడు. తరువాత  అంకెలను కూడా మర్చిపోయాడు. ఇప్పుడు వెయ్యో, పదివేలో అతనికే తెలీదు. అతను ఊరికే అక్కడ అలా ఉన్నాడు.

వెయ్యి కాదు, వెయ్యినోక్కటి..!!

ఒక రోజున ఆ ఆవులు అతని దగ్గరికి వచ్చి “ఇప్పుడు మేము వెయ్యి ఆవులం, మనం గురువుగారి దగరికి వెళ్దాము” అని చెప్పాయి. అతను ఆ ఆవులతో, ఆశ్రమానికి గురువుగారి దగ్గరకి వెళ్ళాడు.  ఆవులన్నీ కూడా ఆశ్రమానికి వచ్చి అక్కడ నించున్నాయి. ఈ ఆశ్రమం ఎంతో పెద్దదైపోయింది. అక్కడ ఉన్న శిష్యుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. కానీ అతను ఆ ఆవులతో అలా నిల్చుని ఉన్నాడు. ఆ శిష్యులందరూ కూడా ఎంతో  ఉత్సాహంతో “శ్వేతకేతు వెనక్కి  వచ్చాడు, మనం ఎన్ని ఆవులు ఉన్నాయో లెక్కపెడదాం, వెయ్యి ఉండి ఉండకపోవచ్చు” అని అన్నారు. వాళ్ళు లెక్కపెట్టారు. లెక్కపెట్టేసరికే అవి సరిగ్గా వెయ్యి ఆవులు ఉన్నాయి. వాళ్ళు గురువుగారితో “అవి వెయ్యి ఆవులు ఉన్నాయి, శ్వేతకేతు తిరిగి వచ్చాడు” అని చెప్పారు. ఆ గురువుగారు అవి వెయ్యి కాదు, అవి వెయ్యినొక్కటి అని చెప్పారు. ఎందుకంటే శ్వేతకేతు పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు. అతను కేవలం ఒక సాన్నిధ్యంగా  మిగిలాడు.

ప్రతీదాన్ని పోగుచేసుకోవాలనుకోకండి. మీరు ఈ గ్రహం మీద తగినంత పోగుచేసారు, మీరు ఇంకా, ఇంకా పోగుచేసుకుంటూ ఉంటే, మీరు ఎంత పోగుచేసుకున్నా సరే, మీకు తెలుసుకోవాల్సిన పరమోన్నతమైనది తెలియదు. మీరు పోగుచేసుకున్నదంతా వదిలేసినప్పుడు, ఏవి లేకుండా ఇక్కడ ఉండగలిగినప్పుడే మీకది తెలుస్తుంది. అంటే దేన్నో వదిలించేసుకోవడం అని అర్ధం కాదు. జ్ఞానం రూపంలోనో, మరో రూపంలోనో మీలో ఉన్న ఈ ముద్రల్ని పక్కకి పెట్టేస్తే - ఏదైతే అన్నిటిని తెలుసుకుంటోందో దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. తెలుసుకోవడానికి ఏది మూలమో దాన్ని మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీ సాన్నిధ్యం ఎంతో గొప్పగా ఉంటుంది. నిజానికి  గొప్ప అనడం సరికాదు, ఎందుకంటే అది ‘సంపూర్ణమైనది, అనంతమైనది’.

ప్రేమాశిస్సులతో,
సద్గురు