కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటూ ఆధ్యాత్మికంగా ఉండడం సాధ్యమేనా??

 

కార్పొరేట్ ఆఫీస్ లో పని చేస్తూ ఆధ్యాత్మికంగా ఉండగలమా అన్న ప్రశ్నకు సమాధానమిస్తున్నారు. ఆధ్యత్మికతని నీతి బోధగా అర్ధం చేసుకోవడం వలెనే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయని చెబుతున్నారు.

ప్రశ్న: నేను కార్పొరేట్ ఆఫీస్ కి వెళ్ళి ఆధ్యాత్మిక ఎరుకతో ఉండగలనా..?

సద్గురు: ఎందుకు ఉండలేరు..? మీ సంఘర్షణ అంతా ఏమిటంటే మీకు పాత తరంలో ఆధ్యాత్మికతను బోధించారు. ఆధ్యాత్మికత అంటే అందరితో మంచిగా ఉండడం, సున్నితంగా ఉండడం, మీరు ప్రేమగా మాట్లాడడం, మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలి లాంటివన్నీ బోధించారు. ఇవి కేవలం,  నీతి బోధలు. ఇది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత మీ జీవితంలో లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా నీతి అనేదాన్ని తీసుకొనిరావచ్చు. నీతి అంటే, మీరు అంతా బాగానే ఉన్నట్లుగా ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తున్నట్లు..! ఏదీ సరిగా లేదు..కానీ,  మీరు అన్నీ బాగానే ఉన్నట్లు - నాటకం ఆడడం నేర్చుకున్నారు.

ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక రకమైన చర్య కాదు. చర్య అనేది బాహ్యమైన పరిస్థితులకి సంబంధించినది.

ఆధ్యాత్మికత అంటే,  మీరు ఈ నాటకాలన్నీ వదిలేయడం. మీలో ఒక విధమైన అంతఃపరివర్తన కలగడం. మీ అంతరంగాన్ని సజావుగా వుంచి, మీరు ఉన్న విధంగా ఉండడం. మీరు నీతులు అన్నటువంటి వాటిని మరిచిపోతారు. ఎందుకంటే నీతి సూత్రాల ద్వారా మీరు మీ జీవితం సాగించరు. కానీ, మీరు మీ మానవత్వంతోనే మీ జీవితాన్ని సాగిస్తారు. కనీసం మీరు దీనిని ఇలా మొదలు పెడతారు. మీరు ఇంకా లోతుగా వెళితే,  మీరు మీ దివ్యత్వంతో జీవిస్తారు. కానీ మీరు గనక మీ నీతి బోధలతోనే జీవిస్తే, మీ జీవితం అంతా కూడా ఒక పెద్ద నటనగా మారిపోతుంది.

ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక రకమైన చర్య కాదు. చర్య అనేది బాహ్యమైన పరిస్థితులకి సంబంధించినది. దానికి 'మీరు ఎవరు..?' అన్న దానితో సంబంధం లేదు. అది మీరు ఎవరూ..? అన్నదానిని బట్టి ఉండదు. మీ చర్య అన్నది బాహ్యమైన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. మీరు గనక ఏ పని  చేసినా సరే,  అది బాహ్యమైన పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే, దానిని మూర్ఖమైన పని అంటాం.. అవునా..? మీ పని లేదా మీ చర్య మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దానితో సానుకూలంగా లేకపోతే,  అది మూర్ఖమైన పనే..! అందుకని, చాలా వరకు ఆధ్యాత్మికత ముసుగులో ప్రజలు అన్ని రకాలైన మూర్ఖమైన పనులు చేస్తున్నారు.

చాలా మంది ఎంతో మూర్ఖమైన పనులను, ఎంతో విశ్వాసంతో చెయ్యడం చూసారు కదా..?

ఈ గ్రహం మీద ఎన్నో రకాల మూర్ఖులు ఉన్నారు. కానీ మతానికి సంబంధించిన, ఆధ్యాత్మికతకు సంబంధించిన మూర్ఖులు ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ ఉన్నారు. అవునా..? కాదా..? ఎవరైతే తాము మతపరమైన వాళ్ళమనీ, ఆధ్యాత్మికపరమైన వాళ్లమనీ చెప్పుకుంటున్నారో, ఎక్కువ మూర్ఖమైన విషయాలు వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. ఎందుకంటే వారి మూర్ఖత్వానికి భగవంతుడు అనే ముద్రను వేస్తున్నారు కాబట్టి..! ఈ రోజున మీరు ఏదైనా మూర్ఖపు పని చేశారనుకోండి, మీ మేధస్సు, మీ తెలివితేటలు మిమ్మల్ని బాధిస్తాయి –“నేను ఎందుకు ఇలా చేశానూ “ అని. అవునా..? మీ మేధస్సు తత్వం అలాంటిది. మీరు ఏదైనా మూర్ఖంగా చేస్తే రాత్రికి మీ తెలివీ, మీ మేధస్సూ..మీరు ఎందుకు ఇలా చేసారు? - అని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కానీ మీరు దాని మీద భగవంతుడు అని ముద్ర వేసినప్పుడు, మీరు ఇలాంటి మూర్ఖమైన పనులు ఎంతో విశ్వాసంతో చేసుకుంటూ పోతారు. చాలా మంది ఎంతో మూర్ఖమైన పనులను, ఎంతో విశ్వాసంతో చెయ్యడం చూసారు కదా..? ఎందుకంటే భగవంతుడు వారి వెనకాల  ఉన్నాడనుకుంటారు - కాబట్టి.  ప్రపంచంలో ప్రతీ రోజూ ఇలా జరగడం మీరు చూస్తున్నారు కదా..?

ప్రేమాశీస్సులతో,
సద్గురు