బాధకి మూల కారణం జ్ఞాన సముపార్జన కాదు. మీరు పోగుచేసుకున్న వాటితో మీరు మమేకమవ్వడమే అసలు సమస్య అని, మీరు పోగుచేసుకున్నది మీది కావచ్చునేమో కాని "మీరు" కాలేరు అని సద్గురు మనకు గుర్తుచేస్తున్నారు.

ఇప్పుడు మీ ఆలోచనలు మీ నియంత్రణలో లేవు. అవి, అలా అనంతంగా జరుగుతూనే ఉంటాయి. మీరు కనుక వాటిని నియంత్రించగలిగితే, మీ మనస్సుని ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీకు కావలసినట్లుగా ప్రవర్తించేలాగా చేసుకోగలిగినట్లైతే, మనసు ఎంతో అద్భుతమైన సాధనం. కానీ ఇప్పుడు మీకు అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి.  అందులో మీకు ఎటువంటి ఎంపికా లేదు. మీరు వాటిని పట్టించుకోకుండానూ ఉండలేరు.. అవి అలా జరుగుతూ.. జరుగుతూ .. ఉన్నాయి. అది మీలో ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది.

అందుకనే మనసు అనేది సమస్య కాదు. జ్ఞానం కూడా సమస్య కాదు. మీరు విషయాలను గ్రహించి పోగుచేసుకోవడం కూడా సమస్య కాదు. మీరు, దీనిని సంభాళించ లేకపోతున్నారు. అదీ సమస్య. .! మనసు లేకుండా మీరు ఇంతకంటే మెరుగ్గా జీవించగలరా..? ఖచ్చితంగా కాదు. మీరు, ఇంతకంటే మెరుగ్గా, జ్ఞానం లేకుండా జీవించగలరా..? ఖచ్చితంగా కాదు. మీ జీవితాన్ని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోకుండా మీరు, మెరుగ్గా జీవించగలరా..? అది కూడా నిజం కాదు. కేవలం మీరు, వాటిని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోయారు. ఇదే అసలైన సమస్య.

మీరు పొగుజేసుకున్నది ఎప్పటికీ "మీరు" కాదు

మీరు ఈ సామర్థ్యాన్ని ఎందుకు కోల్పోయారంటే -   మీకూ, మీరు ప్రోగుచేసుకున్నదానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం లేదు కాబట్టి. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయారంటే, మీరు పొగుజేసుకున్నది కూడా మీరే అన్న అనుభూతిలో ఉన్నారు. ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరే అవన్నీ కూడా అయిపోయారు. మీరు పొగుజేసుకున్నవాటితో మమేకం అయిపోయారు -  అని అన్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు మీ శరీరం. మీరు పుట్టినప్పుడు ఎంత చిన్నగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎలా ఉంది..? ఇది ఎలా జరిగింది..? మీరు, ఏదైతే “నా శరీరం” అంటున్నారో, నిజానికి అది -  ఒక ఆహారపు గుట్ట.

మీరు దేనినైతే ఆహారం అంటున్నారో, అది ఈ భూమిలో ఒక చిన్న భాగం మాత్రమే..! కదా..? నేను ఈ భూమిలో ఒక చిన్న భాగం, అని అన్నప్పుడు, మన ముందర ఎంతో మంది పూర్వీకులు ఇక్కడ జీవించి, మరణించారు. వారందరూ కూడా ఏమైపోయారు..? కేవలం ఈ భూమిపై ఉపరితలం అయ్యారు. ఇప్పుడు ఈ శరీరం కూడా ఈ భూమిలో ఒక చిన్న భాగం మాత్రమే. మీ శరీరం అన్నది మీరు నెమ్మదిగా ప్రోగుచేసుకున్నది.

మీరు ఏదైతే పోగు చేసుకున్నారో అదే “మీరు“ అయిపోయింది. మీరు పోగుచేసుకున్నది నిజంగా మీరు అవ్వగలదా..?

మీ మనస్సు కూడా మీరు ప్రోగుచేసుకున్నదే. మీరు, ఏదైతే నా మనస్సు అని అంటున్నారో.. అది మీరు ప్రోగుచేసుకున్న ముద్రలు(జ్ఞాపకాలు). ఈ ఆహారపు గుట్టలో ఇంకా ఈ ఆలోచనల గుట్టలో మీరు ఎక్కడ ఉన్నారు..? ఇప్పుడు, ఈ రెండు గుట్టలనే ‘మీరు’ గా భావిస్తున్నారు అందుకని, ఇక మీ శరీరాన్ని వాడటం గానీ, మీ మనస్సుని వాడటం అన్న ప్రశ్నలే మీకు తలెత్తడం లేదు. శారీరికంగా ఇంత శరీరాన్ని పోగుజేయాలన్నా, లేదా ఇంత మనస్సుని పోగుజేయాలన్నా, ఈ రెండిటికంటే మౌలికమైనది ఏదో ఒకటి ఉండాలి. ఆ కోణం మీ అనుభూతిలో లేదు. మీ అనుభూతి అంతా కూడా మీరు ఏదైతే సముపార్జించారో దాని పట్లే ఉంది. మీరు ఏదైతే పోగు చేసుకున్నారో అదే “మీరు“ అయిపోయింది. మీరు పోగుచేసుకున్నది నిజంగా మీరు అవ్వగలదా..?

ఏదైనా ఒకటి పోగు చేసుకోవడమో, జమ చేసుకోవడమో జరిగితే, అది కొంత కాలం తరువాత మీరు వదిలేయాల్సిందే..! ఇప్పుడు మీరు ఒక 100 కేజీలు ఉన్నారనుకుందాం. రేపు పొద్దున మీరు లేచి కొంత శారీరిక శ్రమ చేశారనుకుందాం.. ఉదాహరణకి మీరు యోగా చేసిన తరువాత 65 కేజీలు అయ్యారనుకుందాం. మీరు 35 కేజీలను కోల్పోయారు. కానీ మీలో మీకు పరిపూర్ణంగానే అనిపిస్తోంది కదా..? మీ శరీరంలో 3వ వంతును కోల్పోయారు. అయినప్పటికీ, మీలోమీకు పరిపూర్ణంగానే అనిపిస్తుంది. అంటే మీరు దేనినైతే పోగు చేసుకున్నారో, అది “మీరు” కాలేరు.

చాలామందికి, వాళ్ళు ఎప్పుడైనా సంతోషం ఉన్నారంటే దానికి కారణం వారి చుట్టూ ఉన్న వారి వల్లనే. ఒక్కరుగా ఉన్నప్పుడు వారు ఎంతో విచారంతో ఉంటారు. ఈ ప్రపంచంలో విచారం అంతా కూడా ఎక్కడ తయారు చెయ్యబడుతోంది, మనసులోనే కదా..? మీకు కనుక విచారం అన్నది తెలిసినట్లైతే, అది కేవలం మీ శరీరం వల్ల లేదా మనస్సు వల్ల. మీకు మరే విధమైన బాధ అన్నది తెలుసా..? ఈ రెండు రకాల బాధలే కదా మీకు తెలిసింది.

పోగుచేసుకున్నవాటికితో దూరం ఏర్పరచుకోవడమే పరిష్కారం

ఇప్పుడు మౌలికంగా యోగా అంటే, మీరిక్కడ కూర్చున్నారనుకోండి - మీ శరీరం అక్కడ ఉంటుంది.  మీ మనస్సు అక్కడ ఉంటుంది. మీరు అన్నది ఎదైతే ఉందో, ఈ రెండిటినుంచి కొంచెం విడిపడి ఉంటుంది.  ఈ రెండిటి మధ్య -  మీకూ మీ శరీరానికీ, మీకూ మీ మనస్సుకూ మధ్య కొద్దిగా దూరం అన్నది ఏర్పడుతుంది. ఒకసారి ఈ దూరం అన్నది వచ్చిన తరువాత ఇక అదే అన్ని బాధలకు అంతం. ఇటువంటి మానవుడు బాధ అన్నది అనుభూతి చెందలేడు.  ఎందుకంటే,  అతనికి అతని శరీరానికి, అతని మనస్సుకి మధ్య కొంచెం దూరం ఏర్పడింది కాబట్టి. బాధ అన్నది ఇక అంతం అయిపోయినట్లే. ఒకసారి మనం బాధ పడతామేమో అన్న భయం పోయిన తరువాత, నాకేం జరుగుతుంది ? అన్న భయం లేకుంటే, మీరు జీవితాన్ని ఎంతో సులువుగా జీవిస్తారు.

ఇప్పుడు,  జీవితంలో మీరు తీసుకునే ప్రతీ అడుగు కూడా సంపూర్ణంగా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే, నాకేం జరుగుతుందో ?అన్న భయం మీకు ఉంది. ఈ ఒక్కటీ కనుక మీ జీవితంలో నుంచి మీరు తీసెయ్యగలిగితే, ఏం జరిగినా సరే మీరు ఈ విధంగానే ఉంటారు. మీ పూర్తి సామర్థ్యంతో, ఎటువంటి భయాలూ లేకుండా మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తారు. లేకపోతే, మీరు ఎల్లప్పుడూ చిన్న- చిన్న అడుగులు మాత్రమే వేస్తారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు