శివుడు అందరినీ ఆకర్షించటానికి 5 కారణాలు

పిల్లలు, పెద్దలూ, యువకులూ, యతీంద్రులూ - అందరూ శివుడి అభిమానులే! శివుడిలో అలా అందరినీ ఆకట్టుకొనే ప్రత్యేకతలేమిటి? ఇవిగో, ఈ 5 కారణాలు చూడండి!
 

#1. ఆయన అందరినీ తనలో కలుపుకోగలడు. ఆయన ఎవరితోనైనా ఆనందమయమైన సంబంధం ఏర్పరుచుకోగలడు.

శివుడిని పూజించేది దేవుళ్లూ దేవతలూ మాత్రమే కాదు. రాక్షసులేమిటి, భూతాలేమిటి, అన్ని రకాల జీవులూ ఆయనను ఆరాధిస్తాయి. దయ్యాలూ, భూతాలూ, ప్రేతాలూ, పిశాచాలూ, అసురులూ ఇలాంటివారిని అందరూ తిరస్కారించి దూరంగా పెట్టేస్తే, శివుడు మాత్రం వాళ్ళను స్వీకరించాడు.

ఆయన పెళ్లి జరిగినప్పుడు ఈ లోకంలో ఎంతో కొంత ప్రాముఖ్యత గల ప్రసిద్ధులందరూ ఆ పెళ్ళికి వెళ్లారు. ఏ ప్రాముఖ్యతా లేని అనామకులు కూడా వెళ్లారు. ఈ రెండు తరగతుల మధ్యలో ఉండేవారూ వెళ్లారు. అందరు దేవుళ్లూ, దేవతలూ, అసురులూ, దానవులూ, ఉన్మాదులు, దయ్యాలు, పిశాచాలూ - ప్రతివారూ వెళ్లారు. మామూలుగా వీళ్ళందరికీ ఒకళ్లతో ఒకళ్లకు సరిపడదు. కానీ శివుడి పెళ్లి అంటే మాత్రం అందరూ వెళ్లారు. ఆయన 'పశుపతి' - పాశవిక తత్త్వానికి ప్రభువు కనుక పశువులన్నీ వచ్చాయి. ఇక ఆయన పెళ్ళికి పాములు రాకుండా ఉండవు కదా! పక్షులూ కీటకాలూ కూడా మేమూ రావాల్సిందే అంటూ అతిథుల గుంపులో చేరిపోయాయి. జీవంగల ప్రతి ప్రాణీ శివుడి పెళ్ళికి వెళ్లింది.

ఈ కథ వల్ల మనకు తెలిసి వచ్చేదేమిటంటే, శివుడు అనే వ్యక్త రూపం గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పేది ఒక అతి నాగరికుడైన 'పెద్దమనిషి' గురించి కాదు. ఒక ప్రాథమికమైన ఆదిమమైన శక్తి గురించి. జీవ చైతన్య స్రవంతితో సంపూర్ణమైన ఏకత్వం సాధించిన ఒకానొక మూర్తి గురించి. ఆయన శుద్ధ చైతన్య మూర్తి, ఏ భేషజాలూ ఎరగడు. ఆయన నిత్య నూతనుడు, నిత్య స్వతస్సిద్ధుడు, కల్పనాశక్తి గలవాడు, విరామమెరగని సృజనాత్మకత ఆయనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవ చైతన్యానికే వ్యక్తీకరణ.

#2. ఆయన పురుషత్వానికి పరాకాష్ఠ, కానీ స్త్రీత్వానికీ సన్నిహితుడే

సద్గురు: సాధారణంగా, శివుడంటే, ఉత్కృష్టమైన పురుషత్వానికి ప్రతీక. కానీ ఆయనను అర్ధనారీశ్వరుడిగా చూసినప్పుడు, ఆయనలో అర్ధభాగం ఒక సంపూర్ణమైన స్త్రీ రూపం. జరిగిన కథ ఏమిటో చెప్తాను వినండి. శివుడు పరమానంద పారవశ్య స్థితిలో ఉండేవాడు. ఆ స్థితిలో ఆయనను చూసి పార్వతి ఆయన పట్ల ఆకర్షితురాలైంది. ఆయన ప్రేమను పొందేందుకు ఎంతో కష్టపడింది, ఎంతో సహాయం కోసం ఎదురు చూసింది. చివరకు వాళ్ళు పెళ్లిచేసుకొన్నారు. పెళ్లయిన తరవాత, సహజంగానే శివుడు, తన అనుభవాలన్నీ ఆమెతో పంచుకోవాలనుకొన్నాడు. 'మీలో మీరు రమిస్తూ, నిత్యం అనుభవించే ఈ ఆనంద పారవశ్య స్థితి నాకూ అనుభవించాలని ఉంది. అందుకు నేనేం చేయాలో చెప్పండి. దానికోసం ఎలాటి తపస్సు చేయటానికైనా నేను సిద్ధమే' అన్నది పార్వతి. శివుడు చిరునవ్వు నవ్వి, 'నువ్వు గొప్ప తపస్సేమీ చెయ్యక్కర్లేదు. ఊరికే వచ్చి నా ఒడి లో కూర్చో, చాలు!' అన్నాడు. పార్వతి వచ్చి నిస్సంకోచంగా ఆయన ఒడిలో ఎడమపక్క కూర్చొంది. ఆమె అలా వెంటనే ఇష్టపూర్వకంగా వచ్చి, తనను తాను అలా నిస్సంకోచంగా సమర్పించుకోవటంతో, శివుడు ఆమెను తన లోకి లాక్కొని తన శరీరంలో అర్ధ భాగంగా మార్చుకొన్నాడు.

ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆమెను తన శరీరంలో అర్ధభాగంగా చేసుకోవాలంటే, శివుడు, తన శరీరంలో సగాన్ని త్యాగం చేయాలి కదా? ఆయన అలా తన శరీరంలో సగ భాగం వదిలివేసుకొని, ఆమెకు తనలో చోటు కల్పించాడు. అర్ధ నారీశ్వరుడి కథ ఇది. పురుషత్వమూ, స్త్రీత్వమూ రెండూ సమ భాగాలుగా నీలోనే దాగి ఉంటాయని చూపే కథ ఇది. ఆమెను తనలో చేర్చుకొన్న తరవాత శివుడు మళ్ళీ పరమానంద పరవశుడయ్యాడు. చెప్పేదేమిటంటే, అంతర్గతంగా పురుషత్వ, స్త్రీత్వాలు రెండూ కలిస్తే, మీరు నిరంతర పరమానంద పారవశ్యంలో ఉండిపోతారు. ఇది బాహ్యంగా చేయాలని ప్రయత్నిస్తే మాత్రం, అది ఎక్కువ కాలం నిలవదు. దాంతో వచ్చే సమస్యలన్నీ ఒక అంతులేని నాటకం.

#3. ఆయన తాండవం చేస్తే, నేల బద్దలు కావాల్సిందే!

సద్గురు: 'నటరాజు', 'నటేశుడు' అంటే తాండవానికి ప్రభువైన పరమశివుడు. ఈ నటరాజ రూపం శివుడికున్న రూపాలన్నిటిలో అతి విశిష్టమైంది. నేను స్విట్జర్లాండ్లో CERN అనే అణుధార్మిక పరిశోధన సంస్థకు వెళ్లినప్పుడు, అక్కడ ప్రధాన ద్వారం ముందే ఉంచిన నటరాజ విగ్రహం చూశాను. అక్కడ ఆ విగ్రహం ఉంచటానికి కారణం, ఆ సంస్థ వారు చేస్తున్న పరిశోధనలకు అంతకంటే సన్నిహితమైన ప్రతీక మానవ సంస్కృతిలోనే మరొకటి కనిపించక పోవటమట! నటరాజ విగ్రహం సృష్టి మహోన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది. శాశ్వత నిశ్చలత్వం నుంచి స్వయంసిద్ధంగా అవతరించిన సృష్టి నృత్య రూపం.

#4 ఆయన ఎప్పుడూ ఆనంద పారవశ్యంలోనే ఉంటాడు

సద్గురు: శివుడిని ఎప్పుడూ ఎవరు చిత్రించినా ఒక తాగుబోతుగానూ, సన్యాసి గానూ చూపిస్తారు. ఆయన ఒక యోగి. ఆయన ధ్యానంలో కూర్చుంటే నిశ్చలంగా ఉండిపోతాడు. కానీ ఆయన మత్తులో సోలిపోతూ తిరుగుతూ ఉంటాడు కూడా. అంటే ఆయన ఏ 'బార్' కో వెళ్ళి మద్యపానం చేసి వస్తాడని కాదు! ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూనే, ఎప్పుడూ పరమానంద స్థితిలో ఉండగల మార్గాన్ని యోగ శాస్త్రం మీకు చూపుతుంది. యోగులు సుఖాలకు విరుద్ధులు కారు. అయితే, మరీ చిన్న చిన్న సుఖాలతో వాళ్ళు తృప్తిపడరు. వాళ్ళకు ఆశ ఎక్కువ. మీరు ఒక్క గ్లాసు 'వైన్' పుచ్చుకొంటే, అది కాస్సేపు మాత్రమే మీకు మత్తెక్కిస్తుందనీ, మర్నాడు ఉదయం మళ్ళీ తలనొప్పి తప్పదనీ వాళ్ళకు తెలుసు. మత్తులో పారవశ్యాన్ని నిజంగా అనుభవించాలంటే, మీరు పూర్తి మత్తులో ఉండి కూడా, నూటికి నూరు పాళ్లూ నిశ్చలంగా, ఎరుకతో ఉండగలగాలి. ప్రకృతి మీకు అలాంటి అవకాశాన్ని కల్పించింది.

ఇజ్రాయిల్ దేశానికి చెందిన శాస్త్రజ్ఞుడు ఒకాయన మనుషుల మెదడు పనిచేసే తీరు గురించి చాలా సంవత్సరాలు పరిశోధనలు చేశాడు. మనిషి మెదడులో గంజాయి మత్తును గ్రహించగలిగే జీవ కణాలు లక్షల సంఖ్యలో ఉన్నాయని ఆయన కనుక్కొన్నాడు. ఆ తరవాత శాస్త్రజ్ఞులు మనిషి శరీరంలో ఒక రసాయనం తయారవుతుందనీ, అది మెదడులోని జీవ కణాలను గంజాయిలాగే తృప్తిపరచగలదనీ కనుక్కొన్నారు. ఈ రసాయనానికి తగిన పేరు పెట్టేందుకు ఆ శాస్త్రజ్ఞుడు ఎన్నో మత గ్రంథాలలో వెతికాడు. పరమానంద పారవశ్య స్థితిని గురించి మాట్లాడేది ఒక్క భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలేనని గమనించి చివరికి ఆ రసాయనానికి ఆయన 'ఆనందమైడ్' అని పేరు పెట్టాడు!

అంటే మీరందరూ చేయాల్సిందల్లా కొంచెం “ఆనందమైడ్” ని సృష్టించుకోవాలి, ఎందుకంటే మనలో ఒక గంజాయి తోటే ఉంది కదా! మీరు దీనిని సరిగా పండించి ఉంచగలిగితే, మీరు ప్రతీక్షణం మత్తులో ఉండొచ్చు.

#5. నియమోల్లంఘనలో అందరికంటే ఘనుడు శివుడు

మీరు శివుడి గురించి మాట్లాడుతున్నారంటే, అదేదో మతసంబంధమైన విషయం కాదు. ఈ రోజు ప్రపంచమంతా 'మీరు ఏ మతానికి చెందిన వారు?' అన్న విషయమే ఆధారంగా విడిపోయి ఉంది. అందువల్ల మీరు ఏది మాట్లాడినా, మీరేదో మతానికి చెందిన వారిగానే అనిపిస్తుంది. కానీ, మనం మాట్లాడుతున్నది మతం కాదు. ఇది జీవుల అంతర్గతమైన పరిణామానికి సంబంధించిన సైన్సు. ఇది ముక్తికీ, భౌతికాతీత విషయాలకూ సంబంధించింది. మీలో ఎలాంటి జన్యువులున్నా పరవాలేదు. మీ తండ్రి ఎవరయినా పరవాలేదు. మీరు జన్మతః ఎలాంటి పరిమితులతో పుట్టినా, ఏ పరిమితులు మీకు ఆ తరవాత అబ్బినా, పరవాలేదు. మీరు నిజంగా దానికి సన్నద్ధులై శ్రమిస్తే, వీటన్నిటికీ అతీతులు కావచ్చు.

ప్రకృతి ఏర్పరచిన కొన్ని జీవన సూత్రాల పరిమితులకు లోబడి మనుషులు ఉండాలి. ఈ భౌతిక నియమావళిని భంగం చేస్తూ వెళ్ళటమే ఆధ్యాత్మిక సాధన. ఈ దృష్ట్యా చూస్తే, మనందరమూ నియమ ఉల్లంఘనులమయితే, శివుడు అతిపెద్ద ఉల్లంఘనుడు. కనుక మీరు ఆయనను పూజించలేరు కానీ ఆయన బృందంలో చేరగలరు, అంతే.

ఈ మహాశివరాత్రి మీకందరికీ కేవలం జాగరణ చేసే రాత్రి మాత్రమే కాకూడదు. ఇది మీలో అత్యంత చైతన్యంనూ, జాగరూకతనూ పెంపొందించే రాత్రి కూడా కావాలి. ఈ రోజు ప్రకృతి మనకు అందిస్తున్న ఈ కానుకను మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నా కోరిక ఇంకా ఆశీస్సులు! ఈ సంరంభోత్సాహాల తరంగాల మీద మీరందరూ పయనిస్తూ, మనం 'శివుడు' అని ప్రస్తావించుకొనే తత్త్వంలోని సౌందర్యాన్నీ, తన్మయత్వాన్నీ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1