సాధకుడు : నమస్కారం! సద్గురూ! నేను శాంభవి మాహాముద్ర, శక్తి చలన క్రియ గత ఒకటిన్నర సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను. ఆరోగ్యపరంగా, భావోద్వేగపరంగా, భౌతికంగా నేను మునుపటిలానే ఉన్నాను. మరి, పరిమితులని పటాపంచలు చేసుకొని ముక్తి వైపు నేను ఎలా ప్రయాణం చేస్తున్నానంటారు?

సద్గురు: ప్రశ్నలో చివరి భాగమేంటి?

సాధకుడు: నా పరిమితులని పటాపంచలు చేసుకొని ముక్తి వైపు నేను ఎలా వెళుతున్నాను?

సద్గురు: ఓహ్ ! మరి, ఇది పనిచేస్తోందా? అదేగా ప్రశ్న?


సద్గురు: దీని గురించి సూటిగా మాట్లాడుకుందాం. ‘ప్రతీ రోజూ, నేను ఎంతో  సాధన చేస్తున్నాను. కానీ  శారీరికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా నేను అలానే ఉన్నాను, కాబట్టి ఇది అసలు పనిచేస్తోందా?’ నన్ను చెప్పనివ్వండి – ఇది పనిచేస్తుందో, లేదో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా అది నాకు అత్యద్భుతంగా పనిచేసింది. ఇంకా నాకు తెలిసిందేమిటంటే అది నాకు పనిచేసిందంటే, ఇంకెవరికైనా పనిచేస్తుంది. ఎందుకంటే నేను వరుసలో చివరనున్నాను.

ఖచ్చితంగా నేను ఎలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియ పట్ల ఆసక్తిలేని వాడిగా, పరమ సంశయాత్మకునిగా, అది పనిచేయకూడదని కోరుకునేవాడిని. అది పనిచేయదని నిరూపించడం నాకు ఎంతో ఇష్టం, కానీ అది అత్యద్భుతంగా పనిచేసింది.

మీరు చీకట్లో నిలుచున్నారు, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా. వెలుగులోకి రండి, మీకు తెలుసుగా, “తమసోమా జ్యోతిర్గమయా”.  కాబట్టి, ఒకటిన్నర సంవత్సరాల పాటు, మీరు శాంభవి, శక్తి చలన క్రియల కోసం సమయాన్ని  వెచ్చిస్తుంటే, రెండిటికీ కనీసం ఒక గంటపాటు, అది ఎలాంటి ఫలితమూ ఇవ్వనప్పుడు, ఏ మనిషి కూడా ఓ గంటపాటు ఏమి చేయకుండా కళ్ళు మూసుకొని ఊరికే కూర్చోలేడు. మీరు ధ్యానం పేరుతో కళ్ళు మూసుకొని కలల్లోకి వెళ్ళిపోతే తప్ప, మీరు అలా కూర్చోలేరు. కానీ నేను మీకు అలాంటి అవకాశం ఇవ్వను. ఎందుకంటే మీరు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయకుండా ఉండటంలో నేను మిమ్మల్ని 15 నిమిషాలకి మించి నమ్మను. నేను చెప్పేది సరైందేనా, కాదా?

కాబట్టి, ఈ ప్రపంచంలో ఎక్కువమంది మనుషులు, తమకు వెన్నునొప్పో, తలనొప్పో లేదా మరో సమస్యో ఉందని ఆధ్యాత్మిక ప్రక్రియ వైపుకి రావడం చాలా దురదృష్టకరం.

“కళ్ళు మూసుకుని, ఊరికే శివుడిపై మనుసు పెట్టి ధ్యానం చేయండి,” అని నేను అంటే - రెండు నిమిషాలు, మూడు నిమిషాలు , నాలుగు నిమిషాలు. మీరొక గొప్ప భక్తులైతే, ఏడు నిమిషాలు, శివుడక్కడ ఉంటాడు. ఆ తరువాత, ఎవరికి తెలుసు, మీ మనసులో ఎవరు పరిగెడుతుంటారనేది? మీ విషయంలో అది వాస్తవమేనా కాదా? ఊఁ? మీకది వాస్తవమా కాదా? అదే వాస్తవం. అందుకే చేయడానికి మేము మీకు కొంత క్లిష్టమైనది ఇస్తాం.  మీరు ఒకటి నుండి ఇరవై ఒకటి వరకూ లెక్కపెట్టాలి. మీ మనసు, శరీరంలో ఉన్న అన్ని దారులని లగ్నం చేసి, మరేదో జరిగేలా చేయడానికే ఇది. కాబట్టి, మీరు దీన్ని ప్రతీ రోజూ ఒక గంట పాటు చేస్తే, ఖచ్చితంగా ఎదో ఒకటి జరుగుతూ ఉంటుంది, లేదంటే మీరక్కడ కూర్చోలేరు. ఏం జరుగుతోంది? నేనొక మామిడి చెట్టుని, ఇంకా చెప్పాలంటే మామిడి విత్తనాన్ని నాటానని అనుకుందాం. ఆరు గంటలకి నేను విత్తనాన్ని నాటాను, ఆరు ఇరవైకి మామిడిపళ్ళు ఇంకా లేవు. ప్చ్! ఏడు గంటలైంది, మామిడిపళ్ళు లేవు. అలా ప్రతీ రోజూ నేనది చేస్తే, ఓ నెలా లేదా రెండు నెలలలో ఖచ్చితంగా నేను అన్ని ఆశలూ వదులుకుంటాను. ఈ పనికిరాని చెట్టు ఎలాంటి మామిడిపళ్ళూ కాయటం లేదు. ఖచ్చితంగా మీరు చూస్తున్న కాలవ్యవధిలో మాత్రం అవి కాయబోవటం లేదు.

కాబట్టి, ఈ ప్రపంచంలో ఎక్కువమంది మనుషులు, తమకు వెన్నునొప్పో, తలనొప్పో లేదా మరో సమస్యో ఉందని ఆధ్యాత్మిక ప్రక్రియ వైపుకి రావడం చాలా దురదృష్టకరం. వెన్ను నొప్పి, తలనొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి నుండి ఉపశమనం రావడం, కేవలం ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. అందరిలో ఆరోగ్యవంతులు, అత్యుత్తమమైనవారు; ఈ ప్రపంచంలో అత్యుత్తమ శరీరాలు, అత్యుత్తమ బుర్రలు ఉన్నవారు ఆధ్యాత్మిక ప్రక్రియని చేపట్టాలి, రోగులు, బలహీనమైనవాళ్ళు, పాక్కుంటూ వెళ్ళేవాళ్ళు కాదు. అవును, వాళ్ళకీ అది అవసరమే, అది వేరే విషయం. కానీ, అత్యుత్తమ శరీరం, మనసులు....అత్యుత్తమ శారీరిక, మానసిక స్థితి ఉన్నవాళ్ళు, అలాంటి మనుషులు దీన్ని చేపట్టాలి, ఎందుకంటే అలాంటి వారికి ఇది అత్యుత్తమ ఫలితాన్నిస్తుంది. కానీ, ఈ రోజున, ఏదైనా జరగాలన్నా, లేదా అది సత్యమవ్వాలన్నా, దాన్ని కొలవాలి.

ఎవరో ఒక శాస్త్రవేత్త దాన్ని కొలవాలి. ఎవరో ఒక వైద్యుడు దాన్ని కొలవాలి, లేదంటే అది లేనట్టే. మీరు బతికున్నారా లేక చనిపోయారా అని మీకు ఏ వైద్యుడైనా చెప్పారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, వాళ్ళు నేను చనిపోయినట్టుగా ధృవీకరించారు. మీకు తెలుసా? తెలియదా మీకిది? ఎవరో నేను “చనిపోయినట్టు”గా ధృవీకరించారు లేదా దానికే మరో పేరు పెట్టారు – “మెదడు మృతిచెందిన మనిషి”(బ్రెయిన్-డెడ్) అని. చనిపోవడం అదే అయితే లేదా కనీసం మెదడు మృతిచెందడం అదే అయితే నేను రెడీ; ఇది చాలా బాగుంది.

ఈశా యోగాను మూడు నెలలను మించి చేసిన ఎవరికైనా, మెదడులో నాడీకణాల పున:రుత్పత్తి సగటు కంటే రెండువందలా నలభై ఏడు శాతం ఎక్కువుందని చెప్తున్నారు.

కాబట్టి, మనం బాగున్నామా లేదా అని మనకు మరెవరో లేదా మరేదో చెప్పాల్సిన ఈ రకమైన అవసరం, ఆధారపడే లక్షణం వల్లే  ఓ పరికరం, మానవులు సృష్టించిన పరికరం  మనలో ఎదైనా జరుగుతోందా లేదా అన్నదాన్ని మనకు చెప్పాల్సి వస్తుంది. ఇలా ఆధారపడడం వల్ల, ఆధ్యాత్మిక ప్రక్రియకు చెందిన ఇతర అంశాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. “మీ గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతోందా, మీ రక్తపోటు తగ్గిపోతోందా, ఇది జరుగుతోందా...’ మనుషులు ఈ రకమైన చెత్తలో ఆసక్తి కనబరుస్తున్నారు. (కానీ) ఇది చిట్టచివరి విషయం. ఏది ఏమైనా మీకిప్పుడు ఓ శాస్త్రీయమైన సాక్ష్యాధారం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధక బృందం, అదే నాడీశాస్త్ర బృందం(న్యూరలాజికల్ టీం), వారొచ్చి అమెరికాలోని అనేక మంది ఈశా ధ్యానులపై విస్తృతమైన ప్రయోగాలు చేసారు. వాళ్ళిప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఈశా యోగాను మూడు నెలలను మించి చేసిన ఎవరికైనా, మెదడులో నాడీకణాల పున:రుత్పత్తి సగటు కంటే రెండువందలా నలభై ఏడు శాతం ఎక్కువుందని చెప్తున్నారు. అంటే మీ మెదడు పెరుగుతోంది. సామాన్యంగా మీకు వయసు పెరిగే కొద్దీ మీ మెదడు క్షీణిస్తూపోతుంది.

కాబట్టి, మీరు కేవలం సులువైన ఈశా యోగా చేస్తే, మీ మెదడు వాస్తవంగా పెరుగుతోంది, అది క్షీణించేదాని కంటే చాలా ఎక్కువ. కాబట్టి మీ పుర్రెలో కాస్త చోటు చేసుకోండి. మీరు చేయలేరా....క్షమించండి, మిమ్మల్ని కాదు. మీరు మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ ఆఫీసులో, మీరు పనిచేసిన చోట, మీరెక్కడ నివసించినా, ఈ మనుషులకి ఇంకాస్త బుర్ర ఉంటే /బుద్ధుంటే బాగుండేదని, “ఓరి దేవుడా!” అని మీరనుకోలేదా, మీరు ఆలోచించలేదా? హుమ్? కాబట్టి మీరు వాళ్ళతో ఈశా యోగాని పంచుకోవాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మనుషులు అది సాధన చేస్తే వారి మెదడు పెరుగుతుంది; ఇంకా కొంచెం వివేకవంతమైన వారితో ఉంటే బావుటుంది కదా. కాదంటారా?

‘ఈ ప్రపంచం మరింత ప్రేమమయం కావాలి, మరింత శాంతిమయం కావాలి’ అని మనుషులు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఇవ్వన్నీ విసుగు పుట్టించే విషయాలు. ఈ ప్రపంచంలో ఇంకొంచెం వివేకం ఉండి ఉంటే చాలు, మనం మెరుగ్గా జీవిస్తాం. అవునా, కాదా? నిజంగా చెప్పండి, అలాకాక తమ ప్రేమను మనుషులు మీ మీద కురిపిస్తే, అది దుర్భరమౌతుంది. అవునా, కాదా? అలాగే మీ చుట్టూ ఉన్న అందరూ శాంతియుతంగా ఉంటే, అస్సలు భరించలేం! మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వివేకవంతులైతే, ఏ సందర్భంలో ఏం చేయాలో వారికి తెలిస్తే, అదే మీకు కావాల్సింది. కాదంటారా?

చూడండి! మీరు ఈశా యోగా మొదలుపెట్టిన తరువాత, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీరు కాస్త వివేకంతో వ్యవహరిస్తున్నారని అనుకోవడం లేదా? వాళ్లు అలా అంటున్నారా, లేదా?. మిమ్మల్ని ఎవరైనా “నువ్వు ఇంతకు ముందుకంటే కొంచెం తెలివిగా ఉంటున్నావే” అని అంటున్నారా? లేదా? ప్చ్. సార్, మిమ్మల్నే! ఎవరైనా మీకలా చెప్పారా? ఎవరూ చెప్పలేదా? సరే. అయితే మిమ్మల్ని ఇప్పుడు బ్రైనోమీటర్ మీద పెట్టాలి.  మీరొక విషయాన్ని  తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. బహుశా మీ జీవితాన్ని వృధా చేయడానికి  నేను వెనకాడకపోవచ్చు, కానీ పనిచేయని విషయాన్ని ఒకదాన్ని పట్టుకొని నా జీవితం వృధా చేసుకునేవాడిలా నేను మీకు కనిపిస్తున్నానా? అది పనిచేస్తుంది. ఎలా? అది లక్ష రకాలుగా పనిచేస్తుంది. అది ఎంత అద్భుతంగా పనిచేసిందో చూడండి. మీరు ఎంతో మంది మధ్యలో నిలబడి “నాకేమీ కావటం లేదు” అని అన్నారు. మీరు ఇదివరకైతే ఇలా అనగలిగే వాళ్ళు కాదు. ముంబైలో ఒకరొచ్చి “ఇది పనిచేయటం లేదు” అని చెప్పడం చిన్న మార్పేమీ కాదు, కాదంటారా? అదేమీ చిన్న మార్పు కాదు, కాదంటారా? కాబట్టి అది ఎన్నో రకాలుగా పనిచేస్తుంది, మీ అవగాహనకు మించిన ఎన్నో మార్గాల్లో పని చేస్తుంది. దాన్నలా చేస్తూ ఉండండి, ఒకరోజు మామిడిపండ్లు మీ తలపై పడుతాయి. మీరు అలా నీళ్ళు పోస్తూ ఉండండి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

మీ దగ్గరలోని ఈశా యోగా (శాంభవి మహాముద్ర) కార్యక్రమం గురించి తెలుసుకోండి : Inner Engineering