ఒకటే శక్తి - రూపాలు అనేకం

 

Sadhguruమీరు, మీలోని శక్తులపై కనీసం కొంతైనా ప్రావీణ్యం సంపాదిస్తే, అప్పుడు అసాధ్యమనుకున్న పనులన్నీ సులభంగా, సునాయాసంగా చేయగలగడం గమనిస్తారు. ‘’యోగా’’ అంటే ఆసనాలు లేదా శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు అని మీలో చాలామంది అనుకుంటారు. కాని యోగా అంటే ఇది మాత్రమే కాదు. యోగా అంటే సమస్థితిలో (సమన్వయం) ఉండడం అని అర్థం. మీ శరీరం, మనస్సు, ఆత్మ, ఈ ఉనికితో, సంపూర్ణంగా అనుసంధానం అవ్వడమే యోగా.

మిమ్మల్ని మీరు ఆ స్థాయిలో తీర్చిదిద్దుకున్న తర్వాత ఇక మీలో ప్రతిదీ, సుమనోహరంగా మారిపోతుంది. అప్పుడు మీలోని అత్యుత్తమ గుణాలు సహజంగానే పొంగి పొర్లుతాయి. సంతోషంగా ఉన్నప్పుడు మీ ప్రాణశక్తి బాగా పనిచేయడం మీరు గమనించారా? సంతోషంగా ఉన్నప్పుడు, మీకు అంతులేని శక్తి వస్తుంది. మీరు ఏమీ తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు అలా పని చేస్తూనే ఉంటారు. ఇది మీరు గమనించే ఉంటారు. అంటే, కొద్దిపాటి సంతోషమే మీ శక్తిసామర్థ్యాలను పెంచుతోంది.

యోగ సాధన వల్ల మీ శరీరం, మనస్సుల సామర్థ్యం పెరిగి అవి ఉన్నతస్థాయిలో పనిచేస్తాయి.

మీ అంతర్గత శక్తులను ఉద్దీపింప చేసే శాస్త్రమే యోగా. దీని సాయంతో మీ శరీరం, బుద్ధి, మనోభావాలు అత్యుత్తమస్థాయిలో పనిచేస్తాయి. ఎప్పుడైతే మీ శరీరం, మనసు ఆహ్లాద స్థితిలో ఉంటూ పరమానందస్థాయిని చేరుకుంటాయో, అప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న అనేక విషయాలు, మీకు ఓ సమస్యే కాదు. ఉదాహరణకు మీరు ఆఫీస్‌లో ఉండగా మీకు తలనొప్పి వచ్చిందనుకోండి.., తలనొప్పి పెద్ద జబ్బేమీ కాదు.., కాని ఆ రోజు మిమ్మల్ని అది ఏమాత్రం పనిచేయనివ్వదు. ఆ చిన్న నొప్పి, ఆ రోజంతా పాడుచేస్తుంది. యోగ సాధన వల్ల మీ శరీరం, మనస్సుల సామర్థ్యం పెరిగి అవి ఉన్నతస్థాయిలో పనిచేస్తాయి. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు.

శక్తి ఒకటే - రూపాలు వేరు

యోగానికి అనేక ఇతరకోణాలు కూడా ఉన్నాయి. మీ శక్తులను ఉద్దీపింప చేసుకున్నప్పుడు, మీరొక విభిన్నపద్ధతిలో పనిచేయగలరు. ఉదాహరణకు, ప్రస్తుతం మిమ్మల్ని మీరు ఒక వ్యక్తి అనే అనుకుంటారు; అనేకమైన వాటితో మిమ్మల్ని మీరు ఆపాదించుకుంటారు. కాని ‘’నేను’’ అని మీరు పిలుచుకుంటున్నది కొంత నిర్దిష్ట శక్తిని మాత్రమే. ఈ సృష్టి అంతా ఒకే శక్తి అని, ఆ శక్తే పలురకాలుగా వ్యక్తమవుతోందని నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా చెబుతోంది. అంటే మీరు కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పనిచేసే ఒక చిన్న శక్తి అన్నమాట. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినంత వరకూ, ‘’నేను’’ అని మీరు పిలుచుకునేది ఒక శక్తిని. అదే శక్తి ఇక్కడ ఒక రాయి రూపంలో, అక్కడ మట్టిరూపంలో పడి ఉంది, ఆ చెట్టు రూపంలో నిలిచి ఉంది, ఒక కుక్క రూపంలో మొరుగుతోంది, లేదా మీ రూపంలో కూర్చొని ఉంది. ఈ విశ్వమంతా వ్యాపించినది ఒక శక్తే. కాకపోతే అది వేర్వేరు స్థాయుల్లో పనిచేస్తూ ఉంటుంది. అంతే తేడా.

ఈ శక్తే, ఒక మొక్కలో గులాబీ పూలను వికసింపచేసే పనిచేస్తుంది. మరొక మొక్కలో మల్లెపూలను సృష్టించేలాగా పనిచేస్తుంది.

మానవులలో కూడా మనమంతా ఒకే శక్తితో తయారయినా, అందరి సామర్థ్యం ఒకేలా లేదు. మీ సామర్థ్యం, ప్రతిభ, తెలివితేటలు, బాహ్యప్రపంచంలో పనులు చక్కబెట్టుకొచ్చే మీ సమర్ధత, సృజనాత్మకత - ఇలా అన్నీ మీ శక్తి పనిచేసే విధానాలు మాత్రమే. ఈ శక్తే, ఒక మొక్కలో గులాబీ పూలను వికసింపచేసే పనిచేస్తుంది. మరొక మొక్కలో మల్లెపూలను సృష్టించేలాగా పనిచేస్తుంది. ఇలా ఒకే శక్తి పలురూపాల్లో వ్యక్తమవుతోంది. మీరు, మీలోని శక్తిపై కనీసం కొంతైనా ప్రావీణ్యం సంపాదిస్తే, అప్పుడు అసాధ్యమనుకున్న పనులన్నీ సులభంగా, సునాయాసంగా చేయగలగడం గమనిస్తారు. ఇది యోగసాధనలను చేయడం మొదలుపెట్టిన ఎంతో మంది అనుభవం. మీకు కావలసిన పద్ధతిలో పరిస్థితులను సృష్టించుకొనే, ఆంతరంగిక సాంకేతిక విద్యే యోగా.

మనం ఇప్పుడు ఏ మట్టితో  పెద్ద భవంతులను నిర్మిస్తున్నామో, అదే మట్టితో మొదట్లో మనుషులు చిన్న గుడిసెలు మాత్రమే కట్టుకునేవారు. మట్టితో చేయగలిగేది ఇంతేనని వారు అనుకున్నారు. కాని అదే మట్టితో, మనం ఇప్పుడు కంప్యూటర్‌లను తయారుచేస్తున్నాం. మనం కంప్యూటర్‌ అని పిలిచేది, ఈ భూమిలోని ఒక అంశమే కదా? ఎలాగంటే కంప్యూటర్ల తయారీలో వాడే ముడి ఖనిజాలన్నీ భూమిలోంచి త్రవ్వి తీసినవే. ఒకప్పుడు నేలను త్రవ్వి ఆ మట్టితో కుండలు, ఇటుకలు మాత్రమే తయారుచేయగలం అని మన పూర్వికులు అనుకున్నారు. కాని మనం నేలను త్రవ్వి, కంప్యూటర్లను, కార్లను, అంతరిక్ష నౌకలను కూడా తయారుచేస్తున్నాం.

మీ జీవితంలో సర్వోత్తమ దశకు మీరు చేరుకోవడానికి యోగం ఒక సాధనం.

శక్తి ఒకటే కాని మనం దానిని గొప్ప గొప్ప పనుల కోసం ఉపయోగించటం మొదలుపెట్టాము. మన అంతర్గతశక్తులు కూడా సరిగ్గా అలాంటివే. ఈ శక్తిని అత్యున్నత విషయాలకు వినియోగించుకోవడం కోసం ఒక సాంకేతిక విద్య ఉంది. ప్రతిమనిషీ దానిని శోధించాలి, తెలుసుకోవాలి, లేకపోతే, మీరు మీకు అందుబాటులో ఉన్నవి మాత్రమే చేస్తూ ఉండిపోతారు. అప్పుడు మీ జీవితం చాలా పరిమితంగా, యాదృచ్ఛికంగా మారిపోతుంది. మీ అంతర్గతశక్తులను ఉత్తేజపరుచుకోవడం మొదలు పెట్టగానే, మీ సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. విభిన్నరీతిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. మీ జీవితంలో సర్వోత్తమ దశకు మీరు చేరుకోవడానికి యోగం ఒక సాధనం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1