సత్యాన్ని తెలుసుకోవడం ఎలా??

సత్యం అనేది ఎక్కడుంది, సత్యాన్వేషణ ఎలా చేయాలి? ఇప్పుడున్న శరీరం, మనస్సుతో దానిని తెలుసుకోవచ్చా లేక గురువుని సంప్రదించాలా? ఈ ప్రశ్నలకి సమాధానాన్ని సద్గురు ఈ వ్యాసంలో ఇస్తున్నారు, చదివి తెలుసుకోండి.
 

సత్యం అంటే అదేదో మీరు వెళ్ళే ప్రదేశం కాదు, అదొక గమ్యం కాదు, అది ప్రత్యక్షానుభూతి. మీరు సత్యానికి చేరుకోలేరు, మీరు సత్యాన్ని అందుకోలేరు, కాని మీరే సత్యం కాగలరు. మీరు మీ చెత్తనంతా విడిచిపెడితే, మీరే సత్యం. మీరు మీ పరిమితులను వదిలేస్తే, మీరే సత్యం. మీరే అది, అంతేకాని దానిని మీరు చేరుకోలేరు. అదొక నిర్ధారణ కాదు, అదొక ప్రయాణం. అదొక చేరవలసిన గమ్యం కాదు, అది మీరు కాగలిగినది. ప్రాధమికంగా మీరు ఒక జీవం, మీరు జీవం అయితే, ఈ జీవానికి మూలమైంది, మీకు అందుబాటులోనే ఉండాలి, అవునా? అది ఇక్కడే ఉందో, ఆకాశంలో ఉందో, మరెక్కడో ఉందో, ఎక్కడున్నా మీరు దానికి అనుసంధానమై ఉండాలి, అవునా? దానితో కనెక్టై ఉండాలి. అంటే, మీ అసలు స్థితికి మూలం సత్యం. అది ఎప్పుడూ ఉన్నదే, కాని మీరు ప్రోగు చేసుకున్న మీ శరీరం, మనస్సు అనే వాటి క్రింద పడి ప్రస్తుతం అది మూసుకుపోయింది. ఈ రెండు ప్రోగులు మిమ్మల్ని కప్పి ఉంచాయి. పరమోన్నతమైనదానిని అందుకోవడం సులువే, కాని చాలామంది, దురదృష్టవశాత్తు చాలా క్లిష్టమైన, అసాధ్యమైన ప్రక్రియగా అనుభూతి చెందుతున్నారు. ఇది ఎందుకు సరళమంటే, మీరు వెతుకుతున్నది, మీలోనే ఉన్నది.

పిల్లల్ని కనకూడదని ఎంపిక చేసుకోవడం వల్ల, మీరు ప్రపంచానికి గొప్ప సేవ చేస్తున్నట్లు.
మీ పంచేంద్రియాలు ఎప్పుడూ బయటకే చూస్తున్నాయి. మీరు బయట ఉన్నది చూడగలరు, లోపల ఉన్నది మీరు చూడలేరు. మీరు బయట ఉన్నది వినగలరు, లోపల ఉన్నది మీరు వినలేరు. మీరు బయట ఉన్నది స్పృశించ గలరు, లోపల ఉన్నది మీరు స్పృశించ లేరు. అంటే అన్నీ బయట వైపుకు తిరిగే ఉన్నాయి. మీ మనస్సు సంగతి కూడా అంతే, మీ మనస్సు బయటకు పోవడానికే సన్నద్ధమైవుంది, అది లోపలికి పోలేదు. మనసును లోపలికి తిప్పడం గురించి ప్రజలు మాట్లాడుతున్నారు, అటువంటిదేమీ సాధ్యం కాదు. మనసును లోనికి తిప్పలేము. మనసుని లోపలికి తిప్పే ప్రయత్నంలో దానిని విసిగించవచ్చు, కాని దానిని మాత్రం లోపలికి తిప్పలేరు. ఎందువల్లనంటే దాని లక్షణమే బయటకు చూడడం, అది బయటకే వెళ్ళగలదు. మీరు దేవుని గురించి ఆలోచించినా, ఆత్మ గురించి ఆలోచించినా, సత్యం గురించి ఆలోచించినా, అంతా మీరు బయిటికే చూస్తున్నారు, అవునా?  మీ ఉద్దేశంలో దేవుడు అంటే పైకి, ఎప్పుడూ అంతే కదా? చాలా సంస్కృతులలో దేవుడు అంటే పైకి, కొన్నింటిలో క్రిందకి, అవి వేరు. మీలో తెలుసుకోవాలన్న ఈ ఆకాంక్ష ఉదయిస్తే, అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు. ఇటువంటి ఆకాంక్షలు, మీలో వస్తూ ఉంటాయి మళ్లి దైనందిన  రంగులరాట్నం లో పడి తిరుగుతూనే ఉంటారు.

 

తెలుసుకోవాలన్న తపన ఉంటేనే తెలుసుకోగలం

మీ మనసు, శరీర స్వభావాలు ఎలా ఉంటాయంటే, చాలా చిన్న, చిన్న జీవన ప్రక్రియలు కూడా ఎంతో చిక్కుల్లో పెట్టేసేవిగా ఉంటాయి. ఉదయం లేవడం, కిటికీ తలుపులు తీయడం, పళ్ళుతోముకోవడం, టాయిలెట్ కు వెళ్ళడం, తినడం, ఆఫీసుకు వెళ్ళడం ఇలాంటి వన్నీ చిక్కుల్లో పెట్టేసేవిగా ఉంటాయి. ఏమీ జరగలేదు, ఏ ప్రమాదాలూ జరగలేదు. మీరింకా మీ బాస్ ను కలవలేదు. మీరు మీ భార్యనో, భర్తనో, పిల్లల్నో చూశారు అంతే. వాళ్ళు చేసే ట్రిక్కులు మీకు తెలుసు. కదా? మీరు వారితో కొన్ని ఏళ్ళతరబడి జీవించారు. వారు చేసేవేమీ మీకు ఆశ్చర్యం కలిగించవు. అవునా? వారితో జీవనం మొదలు పెట్టిన కొన్ని నెలల్లోనో, సంవత్సరంలోనో వారు ఆడే ఆటలన్నీ మీకు తెలిసిపోయి ఉంటాయి. అయినా, టిఫిన్ చేసేందుకు  టేబుల్ దగ్గరకు వచ్చేటప్పటికే, ఎంతో మంది తీవ్రమైన ఆదుర్దాతో  ఉంటారు. నిజానికి ఆరోజు ఏమీ జరగలేదు. దీనికంతటికీ కారణం మనస్సు స్వభావం అలా ఉండడమే. మీరు దానికి మీమీద అధికారమిస్తే, అది అలానే పనిచేస్తుంది, మరోదారి లేదు.

మీ జీవిత పరిస్థితులు సరిగా ఉన్నాయా లేవా అన్నదానితో దానికి సంబంధంలేదు. మీ మనసు స్వభావం ఇలా ఉంటే, మీరు ఆలస్యం చేయకుండా మీ జీవితాన్ని మరింత లోతుగా చూడాలి. చాలామంది ఆ సమయం ఆసన్నమైంది అనుకోరు, వాళ్ళు వచ్చే ఏడు చేద్దాం అనుకుంటుంటారు, రెండేళ్ళ తరువాత చూద్దామనుకుంటారు, అటువంటిదేమీ లేదు. మీ జీవితానికి మీరు విలువనిస్తే, చూసుకోవలసిన సమయం ఆసన్నమైంది. మీ జీవితానికి మీరు విలువనవ్వక పోతేనే, ఇంకా ఆ సమయం ఆసన్నం కాలేదు. మీలో తెలుసుకోవాలన్న తపన పెరిగితే, నిజంగా మీరు తపిస్తే, మీ హృదయం తెలుసుకోవాలని నిజంగా పరితపిస్తే, మీకు అజ్ఞానపు బాధ తెలిస్తే, అప్పుడు ఒక గురువు ఉదయిస్తారు. ఆయన కోసం మీరేమీ వెతకన్కరలేదు, తెలుసుకోవాలన్న తపన తీవ్రత మీలో ఎక్కువైతే, అజ్ఞానపు వేదన బాగా, బాగా ఎక్కువైతే, ఆయన మీకెలాగూ తారసపడతాడు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు