శరీరం ఓ సాధనం ....!!

 

ఈ జీవన ప్రక్రియ ఓ మహాద్భుతం ! కేవలం రెండు కణాల కలయికతో మీరిలా రూపుదిద్దుకున్నారంటే , అదెంతటి అద్భుతం !

మీ శరీరాన్ని ఒక సాధనంలా ఎలా వాడాలో నేర్చుకోవడం యోగశాస్త్రంలో ఓ మౌలికమైన అంశం. మనలో చాలా మంది ఈ దేహంతో ఎంతలా మమేకమైపోయామంటే, మనమెప్పుడూ/మూడొంతులు 'నేనే ఈ దేహాన్ని' అన్న భ్రమలో ఉంటూ ఉంటాం. ఈ దేహమే నేనన్న అనుభూతిలో పాతుకుపోయి ఉంటాము. మన శరీర వ్యవస్థ పైకి కనిపించినంత సరళమైనదేమీ కాదు. మీరు దాంతో కొంచెం ప్రయోగాలు చేసి చూసారంటే, మీరెన్నడూ ఊహించని పనులను కూడా ఈ శరీరంతో చెయ్యగలరు. 'నేనూ ఈ దేహాన్ని, ఈ శరీరమే నేను ' అన్న భ్రమలో ఉన్నన్నాళ్ళూ మీ జీవితానుభవం ఈ దేహానికే పరిమితమైపోతుంది. మీరెంతసేపూ దీన్నిచూసి గర్వంతో మురిసిపోవడమో, సిగ్గుతో కృంగి పోవడమో, ఇలా ఈ రెంటి మధ్యా లోలకంలా ఊగిసలాడుతూ ఉంటారు. మీరిలా ఏదో ఓ భావంలో కూరుకుపోతుంటే, ఇక ఈ దేహాన్ని ఓ  పరికరంగా ఉపయోగించుకోలేరు.

ఈ దేహాన్నో సాధనంలా తయారుచేసుకొని, ఈ సృష్టికే దీన్ని అక్షంగా మలచుకొని జీవించే మార్గమొకటుంది.

ఈ దేహాన్నో సాధనంలా తయారుచేసుకొని, ఈ సృష్టికే దీన్ని అక్షంగా మలచుకొని జీవించే మార్గమొకటుంది. యోగాలో మన వెన్నెముకను ‘మేరుదండం’ అంటాము, అంటే ఈ సమస్త విశ్వానికి  ఇరుసు (అక్షం), అని అర్థం. 'అయ్యో అదేంటి , నా వెన్నెముక విశ్వానికి అక్షం ఎలా కాగలదు?’ అని మీరు అడగవచ్చు. మీ జీవితానుభూతి కొన్నిటికే  పరిమితమైపోయినప్పుడు మీ ఇంద్రియ పరిధుల్లోకి వచ్చినవాటిని మాత్రమే, మీరు 'నేను' గా గుర్తించగలరు .

మీరు, నిర్జీవమైన వస్తువేదైనా  తాకినప్పుడు, దాన్ని మీలో భాగంగా అనుభూతి చెందగలరా? ఉదాహరణకి, మీరు పట్టుకున్న కప్పులోని నీరు, మీరేనా? కాదు,  కాని అవి తాగితే ఏమౌతుంది? మీ అనుభూతిలో ఆ నీరు ‘మీరు’ గా మారుతుంది , ఔనా? మీరు దేన్నైనా మీ సూక్ష్మ శరీర పరిధుల్లోకి తీసుకుంటేనే , అది ‘నేను’ అన్న అనుభూతి కలుగుతోంది.

మన సూక్ష్మ శరీర సంస్పందనలు భౌతిక శరీరాన్నిదాటి దాని చుట్టూ వ్యాపించి ఉంటాయని వైజ్ఞానిక శాస్త్రం చెపుతోంది .

డాక్టర్లు ఒక మనిషి కాలు ఛేదించవలసి వచ్చినప్పుడు భౌతికంగా ఆ అవయవం (స్థూలమైన కాలు) పోయినా, వారిసూక్ష్మశరీరంలో కాలు ఇంకా అలాగే ఉంటుందని  వైద్యులు స్పష్టంగా చెప్తున్నారు. కాలు తీసేసినప్పటికీ వారికి, నొప్పి , స్పర్శ ఇంకా అనుభూతిలో ఉంటాయి, ఎందుకంటే, సూక్ష్మ శరీరానికి తనదైన ఓ నిర్దిష్టమైన అనుభూతి ఉంటుంది.

ఉదాహరణకు, మీరు అమితానందం, ప్రేమ, లేక తన్మయత్వంతో ఉన్నపుడు, ఈ సూక్ష్మ శరీరం విస్తరిస్తుంది.  మీరు మానసికంగా క్రుంగిపొయినప్పుదు ,తీవ్రమైన వేదనలో ఉన్నప్పుడు, మిమ్మల్నెవరైనా తాకితే, మీకలా స్పర్శ కూడా తెలియకపోవచ్చు.  మీరు విచారంగా ఉన్నప్పుడు మీ సూక్ష్మ శరీరం మామూలు  పరిమాణం కంటే తక్కువగా కుంచించుకు పోతుంది.

యోగ అంటే ఐక్యత. అంటే ఓ వ్యక్తి, విశ్వమూ ఒకటి  కావడం.

మీ వ్యవస్థ లో వోల్టేజి(voltage) ని  పెంచి, మీ సూక్ష్మ శరీరాన్ని విస్తరింపచేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక వేళ మీరు మీ సూక్ష్మ శరీరాన్ని విస్తరింపజేసుకుంటే, మీ చుట్టూ ఉన్నవాటన్నిటినీ మీలో భాగంగా అనుభూతి చెందగలరు. మీ చేతికున్న ఐదు వేళ్ళను, మీరెలా అయితే మీలో భాగంగా అనుభూతి చెందుతున్నారో అలాగే మీకు కావలసినవన్నీ కూడా, మీలో భాగంగా ఇముడ్చుకున్న అనుభూతిని చెందగలుగుతారు. కేవలం ఒక్క క్షణమైనా, మీ చుట్టూ ఉన్న అందరినీ మీలోని భాగంగా మీరు అనుభూతి చెందగలిగితే, ఆ తరువాత నేను మీతో  ‘ఈ వ్యక్తితో బాగా నడచుకో! అతనికే హానీ తలపెట్టొద్దు! ఇతన్ని చంపకు!’ అంటూ నైతిక బోధలు చేసే అవసరముందా? మీలో భాగంగా స్వీకరించిన వాటన్నిటితోనూ మీరు సామరస్యంగా, సౌమ్యంగా ఉంటారు. అప్పుడు వాటితో మీకు విభేదం ఉండదు, ఏ సమస్యా ఉండదు. అది వేరు, నేను వేరు’ అని మీరనుకున్నపుడే,  అసలు సమస్య మొదలౌతుంది. మీరు మీ సూక్ష్మ శరీరాన్ని, భౌతిక శరీర హద్దులు దాటి వ్యాప్తింప చేయగలరు. అంతేకాదు, మొత్తం విశ్వాన్నే మీలో పొందుపరచుకోగలుగుతారు. దీన్నే మనం ‘యోగ’ అంటున్నాము. యోగ అంటే ఐక్యత. అంటే ఓ వ్యక్తి, విశ్వమూ ఒకటి  కావడం. ఆ పరిస్థితిలో మీ ‘అనుభవంలో ఉన్నది మీరు ఒక్కరే’ అంటే ‘అన్నీ మీరే’. ఇది ఒక ఆలోచనగా, వేదాంతపరంగా కాక వాస్తవికంగా, 'ఈ విశ్వమంతా నేను మాత్రమే ’ అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం, ఇదే గనక మీకు జరిగితే ఇక మీరెలా ఉండాలో ఎవరూ మీకు చెప్పనక్కర్లేదు. మీకే అంతా తెలుస్తుంది, అంతే! మీ సూక్ష్మకాయం అనంతంగా వ్యాప్తించి యావత్ విశ్వాన్నే తనలో కలిపేసుకుంటుంది!

మీ సూక్ష్మ శరీరం కనక మొత్తం విశ్వమంతా వ్యాప్తి చెందితే, అప్పుడు విశ్వానిక్కూడా మీ వెన్నెముకే కేంద్రమౌతుంది. మీ అనుభూతులన్నిటికీ మీ వెన్నెముకే మూలం . అందులోని శక్తుల ప్రక్రియే  మీ జీవిత పార్శ్వాలన్నిటినీ నిర్దేశిస్తుంది. అందుకే ‘యోగ శాస్త్రం ’ మన వెన్నెముకకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది . దురదృష్టవశాత్తూ వైద్య శాస్త్రం మాత్రం దానికి అంత ప్రాముఖ్యతనివ్వడంలేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు