ప్రశ్న: ఒక ప్రొఫెషనల్‌ గా నేను సాధు స్వభావంతో పనులు చేయించుకోవాలంటే జరగే పని కాదు. మరి నాకు కోపమొక్కటే మార్గమా?

సద్గురు: ఒక వ్యక్తి ఎటువంటి భావోద్వేగమూ లేకుండా, అవసరానికి తగినట్లు పనిచేసినప్పుడు మనం ఆ వ్యక్తి చాలా ‘ఫ్రొఫెషనల్’గా పని చేశాడంటాం. మనిషి తను చేసే పనిలో తగిన శిక్షణ పొందినప్పుడు కోపం లాంటి వాటి అవసరమెందుకు వస్తుంది? ‘‘అతని దృక్పధం ప్రొఫెషన్‌గా ఉంది’’ అంటే దానికి అర్థం, చేయవలసింది చేయడం తప్ప అందులో ఆ వ్యక్తికి భావావేశాలు లేవని అర్ధం.

మీరు చేయవలసిన పనిని ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా చేసేటట్లయితే జీవితం ఎంతో అందంగా ఉంటుంది.

నిజానికి, ఒక ప్రొఫెషనల్‌ లా కాక ఒక ఔత్సాహికుని (amateur) గా పనిచేయడం మంచిది. ఔత్సాహికుడు అంటే ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియని ప్రారంభ దశలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడం లేదు. ఒక పనిని ఆసక్తితో ఉత్సాహంతో, ప్రేమతో చేసే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. అతన్ని అమెచ్యూర్, ఔత్సాహికుడు అంటున్నాను. అతనికి తాను చేయదలచుకున్నది అర్థవంతంగా కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌కి ఆ పని అర్థవంతంగా అనిపించవలసిన అవసరం లేదు. ‘ఈ పనిచేయడం వల్ల ఇది జరుగుతుంది’, అంతే ప్రొఫెషనల్‌కి తెలియవలసింది. అటువంటి వారి జీవితం బీడుభూమి లాంటిది. చేసేపనిలో మీరు మమేకం కాకపోతే, అది మీకెంతో ఇష్టమైనది కాకపోతే, అది మీకు ఎంతో కావలసింది కాకపోతే మీరు చేసే పని మీకూ పనికి రాదు, ఇతరులకూ పనికి రాదు. అది చేయడంలో కాలం వృథా, జీవితం వృథా. మీరేవో చేయడం వల్ల నిమగ్నత రాదు. మీకు నిమగ్నత ఉంటే, మీచేత  కొన్ని పనులు చేయబడతాయి. ఇది సుందరంగా జీవించే విధానం. మీరు నిమగ్నత లేకుండా అవే పనులు చేస్తే జీవితం వికారంగా తయారవుతుంది.

స్వచ్ఛందంగా చేసే విధానం అద్భుతం

అంటే మీరు ప్రొఫెషనల్‌గా పనిచేస్తే మీ జీవితం వికారంగా ఉంటుంది. మీరు ఔత్సాహికులు అయితే అది మంచిదే; ఇంకా మీరు ఈ లోకంలో స్వచ్ఛందంగా పనిచేసే వారయితే అది మరీ అద్భుతం. మీరు చేయవలసిన పనిని ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా చేసేటట్లయితే జీవితం ఎంతో అందంగా ఉంటుంది. తుది ఫలితం ఏమిటి? అందుకు అడ్డం ఎవరు? మిమ్మల్నెవరు సమర్థిస్తున్నారు, ఎవరు సమర్థించడం లేదు - మొదలైనవన్నీ మీకు అసలు పట్టని విషయాలు. మీరు చేసే ఏ పని అయినా పూర్తి నిమగ్నతతో మమేకమై చేసినప్పుడు మీరు చేసేది ఎంతో అందంగా ఉంటుంది. మీరు ప్రొఫెషనల్ కావడం ఒక సమస్య. మీ కోపం మరో సమస్య. కోపానికి ఒక ముఖ్య భూమిక ఉందని మీరెందుకనుకుంటున్నారు. మీరేదన్నా చెబితే మనుషులు పట్టించుకోరు, అవునా? మీకు ఉండవలసింది నిమగ్నత. మీరెంతో నిమగ్నతతో పనిచేస్తున్నప్పుడు, మీ చుట్టూ ఉన్నవాళ్లు ప్రభావితం కాకుండా ఎలా ఉంటారు? మీరు ఉత్సాహంతో, నిమగ్నతతో పనిచేస్తే మీ చుట్టూ ఉన్నవారందరి హృదయాలూ కదులుతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు