ఈశా అంటే అర్ధం ఏంటో, ఈశా ఫౌండేషన్ ఎందుకు స్థాపించవలసి వచ్చిందో దానికి గల కారణాలను ఈ వ్యాసంలో సద్గురు మనతో పంచుకుంటారు.

Sadhguruశా అంటే ఏదైతే అన్నిటిని పాలిస్తుందో అది అని అర్థం. ఏదైతే అన్నిటినీ పాలిస్తుందో, దానిని మీరు కావాలనుకుంటే శివ అని పిలవచ్చు. కావాలంటే మీరు దానిని అల్లా అని కూడా పిలవచ్చు. మీకెలా కావాలంటే అలా..మీరు దానిని రామా, కృష్ణా, భగవంతుడు లేదా దివ్యత్వం అనీ అనవచ్చు. అది ఒక శక్తి, ఒక స్వభావం. ఈ సృష్టిని ఏదైతే పాలిస్తోందో, దానిని మనం దివ్యత్వం అంటాం. అందుకని ఒక రూపం లేని దివ్యత్వాన్ని "ఈశ" అంటాం. మీరు దానికి రూపం కల్పిస్తే అది "ఈశ్వర" అవుతుంది. ఈశ్వర అంటే ఒక ప్రత్యేకమైన దేవుడు కాదు. మీరు ఎటువంటి రూపం అయినా సరే దివ్యత్వానికిస్తే, మీరు ఆ దివ్యత్వానికి ఏవో కొన్ని మీ అవగాహనకి అనుగుణంగా కొన్ని ప్రత్యేకతలను ఇస్తారు. రూపం ఎప్పుడూ కూడా ఒక సంస్కృతి పరంగా ఉంటుంది. మీరు, మీ చుట్టూరా ఉన్న ప్రపంచం ఎలాంటిది అన్నది పూర్తిగా ఒక సంస్కృతికి చెందినది. దివ్యత్వం అన్నది రూపం లేనిది. మీరు దానిని ఒక రూపం లేనటువంటి దానిగా చూసినప్పుడు, దానిని మనం ఈశ అంటాం. మీరు దానికొక రూపాన్ని కల్పిస్తే, దానిని ఈశ్వర అంటాం.

ఈశా ఫౌండేషన్ స్థాపన తప్పనిసరి

దీనిని స్థాపించడం నాకు తప్పనిసరి అయ్యింది. నాలో ఎంతో అద్భుతమైనది జరిగినప్పుడు.. నేను ప్రజల్ని చూసి, అందరూ కూడా దాని అంచుల్లో ఉన్నారని గుర్తించాను. మీరు ఒక్క సరైన అడుగు తీసుకుంటే చాలు. ఇది, మీ అందరికి కూడా జరుగుతుంది. కానీ మీరు ఆ ఒక్క సరైన అడుగు తీసుకోవడంలేదు. ఇంత పెద్ద ఆవశ్యకత కేవలం మీకు ఒక్క అడుగు దూరంలో ఉంది. కానీ, ఆ ఒక్క చిన్న అడుగు మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకని నేను ఏదో ఒక రకమైన మాయ చేసి వాళ్ళు, ఈ చిన్న అడుగు తీసుకునేలా చెయ్యాలనుకున్నాను. ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయనుకోండి. ఒక తెలివైన మనిషి, తాను చెయ్యడానికి సిద్ధంగా లేని పనిని నా మీద పెట్టారు. నా గురువు. ఈ ధ్యానలింగ ప్రాణప్రతిష్ఠ చెయ్యడం అన్న కార్యాన్ని ఈయన నాకు అప్పగించారు. ఇది ఆయనే చేసుకొని ఉండవచ్చు. కానీ ఆయన ఎంతో తెలివైన మనిషి. దీనిని నాకు అప్పగించారు. దీనిని నేను, నా రెండు జీవిత కాలాలపాటు.. ఇదే ఊపిరిగా, దీనిని పూర్తి చేయడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నాను.

ఏ క్షణాన్నైతే ధ్యానలింగం పూర్తవుతుందో, ఆ క్షణాన నేను వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను.

దీనిని సాధ్యం చెయ్యడానికి ప్రజల సహాయ సహకారాలు అవసరం. అందుకని, నేను లక్షల కొద్దీ ప్రజల్ని నా చుట్టూరా పోగుచేసుకోవాల్సి వచ్చింది. ఏ క్షణాన్నైతే ధ్యానలింగం పూర్తవుతుందో, ఆ క్షణాన నేను వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ప్రాణ ప్రతిష్ఠ పూర్తి అయ్యే సరికి, నా శరీరం పూర్తిగా పాడైపోయింది. నేను నా శరీరాన్నీ, నా శక్తినీ అంత విపరీతంగా వాడేశాను. మీరు నన్ను గనుక ఏడు సంవత్సరాల క్రిందట చూసినట్లైతే నేను ఎంతో అనారోగ్యంతో ఉన్నాను. నన్ను చూసిన వైద్యులందరూ కూడా కేవలం 2-3 నెలలు మాత్రమే నేను జీవించగలనని చెప్పారు. నాకు ఇక్కడ జీవించాలన్న ఉద్దేశ్యం కూడా లేదు. అందుకే నేను నా శరీరాన్ని ఆ విధంగా వాడాను. కానీ, నా చుట్టూరా ఉన్న ప్రజలు నాతో పూర్తిగా నిమగ్నమైపోయారు. నేను నిమగ్నం అని చెప్పినప్పుడు, ఇది మానసికమైనది కాదు.. ఇది ఒక శక్తి స్థాయి లోది. ఎంతవరకూ అంటే.. వారికి ఏది నేనో - ఏది వారో కూడా తెలీదు. మా ప్రాణశక్తులు అంతగా ఒక్కటై పోయాయి.

అందుకని, ఈ శరీరాన్ని కొంచెం బాగు చేసుకొందాం అని అనుకున్నాను. దీనితో పనులు చెయ్యడానికి వీలుగా ఉండేలాగా తయారు చేసుకోవడానికి, మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాలు  పట్టింది. నా వ్యవస్థ ఇంకా నూటికి నూరు శాతం సమంగా లేదు. నేను కొన్ని విషయాలను సరి చూసుకోకపోతే, రెండు మూడు నెలలలో ఇది మళ్ళీ బలహీనమైపోతుంది. వైద్యపరంగా నేను జీవించి ఉండకూడదు. ఎందుకంటే  కొన్ని విషయాలు పూర్తిగా పాడైపోయాయి. మేము కొన్ని పద్ధతులను వాడి, వాటిని పనిచేసేలా చేస్తున్నాము. నేను ఇప్పుడు ఏ స్థాయికి వచ్చానంటే, ఒక నెల రెండు నెలలు నా మీద నేను పని చేసుకున్నట్లైతే దీనిని నూటికి నూరు శాతం సరి చేసుకోగలను. ఇది మళ్ళీ పూర్తిగా మొత్తం శరీరాన్ని నిర్మించుకోవడం లాంటిది.

ప్రజలు నాకు పెద్ద ఆశయం ఉంది కాబట్టి చేస్తున్నానని అనుకోవచ్చు. కానీ, నిజానికి నేను నా చుట్టూరా ఎంతోమంది, నాకోసం తపించడం చూస్తున్నాను. అందుకని, వారికోసం మరికొంత కాలం ఇలా చేస్తున్నాను. ఒకవేళ ఆ తపన కనుక నేను చూడకపోతే, నేను ఏ క్షణాన్నైనా ఇవన్నీ వదిలేసి వెళ్లిపోవచ్చు. నాకు నా జీవితంలో ఎటువంటి పని చేయవలసిన అవసరం లేదు. నేను చనిపోయెవరకు అలా కళ్లు మూసుకుని కూర్చుని ఉండగలను. దానికి ఎంత కాలం పట్టినా ఫరవాలేదు. కానీ చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. నా చుట్టూరా ఇటువంటి తపన ఉంది. అందుకని మరి కొంత కాలం ఇలా పొడిగిస్తున్నాను. నాకు ఎటువంటి సంస్థా పెట్టాలన్న ఉద్దేశ్యమూ లేదు. కానీ ఎక్కువ స్థాయిలో ప్రజలని ఒక సంస్థ లేకుండా కలిసికట్టుగా అట్టిపెట్టడం కష్టం. దీనికి కొన్ని లీగల్ సమస్యలు, కొన్ని సామాజిక సమస్యలు ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకని, ఒక సంస్థ ఏర్పడాల్సి వచ్చింది. ఈశా ఫౌండేషన్ అలా పుట్టింది. ఇది తప్పనిసరై పుట్టింది. అంతేకానీ ఒక స్ఫూర్తి వల్ల కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు