మీరు "సద్గురు" కావడానికి ఏమి చెయ్యాలి.....???

 

వ్యక్తి : సద్గురూ, ఇది చాలా అసంబద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా ఇది నేను చెప్పదలచుకున్నాను. నేను మీరు కాదలచుకున్నాను. అలాంటి అవకాశం నాకుందంటారా?


నాలాగ గెడ్డం పెంచండి. నిన్న ఇలాంటి ప్రశ్నను మరొకరు మరొక విధంగా అడిగారు. నేను వారికో విషయం గుర్తు చేసాను-జీవితంలో ఒక  అద్భుతం జరుగుతుందని. భౌతిక రూపంలో ఉండే ఆ అసాధారణ విషయాన్ని తెలుసుకోవలసి   ఉంటుందని. భౌతిక శాస్త్రం గురించి మీకు కొద్దిగా అవగాహన ఉన్నట్లయితే - ఉదాహరణకు, మీరు ఈ లోహపు ముక్కను తీసుకుని, కాంతి వేగంతో దీన్ని విసరండి. ఇప్పుడున్నట్లుగా అది ముద్దగా ఉండదు. అది కాంతిగా మారుతుంది. ఈ విషయం మీకు తెలుసా?

ఇప్పుడున్నదేదయినా, అది కాంతి వేగంతో ప్రయాణించినట్లయితే, అది కాంతిగా మారుతుంది. కాబట్టి ఇప్పుడున్న దేనినయినా కాంతిగా మార్చవచ్చు. ఈ చేతిని నేను కాంతి వేగంతో కదిలించినట్లయితే, ఈ చెయ్యి ఇకపై చెయ్యిగా ఉండబోదు, అది కాంతిగా మారిపోతుంది. శాస్త్ర పరంగా ఇది వాస్తవం.

ఎలక్ట్రిక్‍ సాకెట్‍లోకి లైటు బల్బు మాదిరిగా మీరు వేళ్ళు పెట్టినట్లయితే అది మీకు మరొకటేదో చేస్తుంది! మీరు కాంతిగా మారరు. కాబట్టి ఈ క్షణంలో మీరు సద్గురు కావడానికి ఏమి చెయ్యాలనుకుంటున్నారో, నా గురించి మీరెలా అనుకుంటున్నారో నాకు తెలియదు, అది కూడా ప్రశ్నార్థకమే - కారణం ఏదయినప్పటికీ, మీరు నాలాగ మారాలన్న కోరిక మీలో తలెత్తినప్పుడు, మీరు కూడా నా వేగాన్ని అందుకోవలసి ఉంటుంది.

ఈ విషయమై ఆది శంకరాచార్యులవారిని చక్కటి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆది శంకరులు కాలి నడకతోనే ఎంత దూరమైనా ప్రయాణం చేసేవారు. ఆయన పాదచారి అన్న విషయం మీకు తెలుసా? ఆయన ముప్పయ్‍ రెండేళ్ళ వయసులో మరణించారు. ఆ సమయానికి ఆయన భారత దేశమంతా ఆసేతు హిమాచలం మూడు సార్లు పర్యటించారు. ఈ నడక ఎంత విస్తృతమైనదో, ఎంతటి ప్రయాసతో కూడుకున్నదో వేరే చెప్పనవసరంలేదు. ముప్పయ్‍ రెండేళ్ళ వయసుకు అంతటి నడక సామాన్యమైన విషయం కాదు. అయితే ఆయన నడక మూలంగా మరణించలేదన్న విషయం గమనించాలి.

ఆయన నడుస్తున్న సమయంలో ఆయన శిష్యులు ఆయన వెనక నడిచేవారు. అయితే ఆయన ఒక నియమాన్ని పాటించేవారు. శిష్యులు కూడా తనతో సమాన వేగంతో నడవాలని ఆజ్ఞాపించారు. కొన్ని సమయాలలో ఆయన చాలా వేగంగాను, కొన్నిసార్లు నెమ్మదిగాను, మరికొన్నిసార్లు మధ్యస్త వేగంతోను నడిచేవారు. ఆయన ఏవిధంగా నడిచినప్పటికీ, అందరూ అదే వేగంతో నడవవలసిందే. అలా నడవని వాళ్ళని మందలించేవారు. ఆయన గంటకు పదిమైళ్ళు నడిచినట్లయితే, ప్రతివారు గంటకు పది మైళ్ళు నడవవలసిందే. ఆయన గంటకు ఒక మైలు దూరం మాత్రమే నడిస్తే శిష్యులు కూడా గంటకు మైలు దూరమే నడవాలి. ఆయన గంటకు మూడు మైళ్ళ వేగంతో నడిస్తే, మిగతావారు కూడా గంటకు మూడుమైళ్ళ వేగంతోనే నడవాలి. ఆయన ఒక నిర్దిష్ట వేగంతో నడుస్తారు. ఆ తర్వాత ఆయన  వేగాన్ని మారుస్తారు. ప్రతివారు తమ వేగాన్ని మార్చుకోవాలి. తన శిష్యుల్ని తనలా మార్చడానికి అది శంకరులు అనుసరించిన సూక్ష్మమైన శిక్షణా విధానమిది. ఇది చాలా భౌతికమైన సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించడంవల్ల, ఆయన తన వెనక నడిచే జనాన్ని మార్చగలిగారు.

కాబట్టి నాలాగ మారాలన్న కోరిక మీలో కలిగినట్లయితే, మీకు తెలిసిన చివరి భాగంనుంచి మీరు ప్రారంభించవలసి  ఉంటుంది. మీకు తెలియని చివరి భాగంనుండి మాత్రం మీరు ప్రారంభించలేరు. ఈ రోజు ఉదయం మన సమావేశాన్ని పన్నెండు గంటలకు ప్రారంభించిన విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు రాత్రి పది గంటలయ్యింది. అంటే పది గంటలపాటు ఇది కొనసాగుతూనే ఉంది. దీనికి ముందు రెండు మూడు గంటలపాటు మనకు టెలిఫోన్‍ సమావేశాలయ్యాయి. ఈ సమావేశం రాత్రంతా కొనసాగుతూ రేపు ఉదయం వరకు జరగవచ్చు. నేను ఇక్కడే కూర్చుని అవసరమైన కార్యకలాపాలన్నీ పర్యవేక్షిస్తుంటాను. చర్చిస్తుంటాను. ఈ రాత్రంతా ఇక్కడే కూర్చుంటాను. నేను చేసుకోవలసిన పనులన్నింటినీ చక్క బెట్టుకుంటాను; ఎలాంటి అలసట లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా నేను చేయవలసిందేమయినా పూర్తిగా నిమగ్నమై చేసుకుంటాను.

కాబట్టి ఈ చివరనుండి ప్రారంభించండి. ఒక దినాన్ని సజావుగా నిర్వహించడం నేర్చుకోండి-ఆరోజు నాణ్యత ఎలాంటిదయినాసరే, మీరు కలుసుకునే మనషులు ఎలాంటి వారయినా సరే, మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటివైనా సరే-చిన్న విషయాలైనా, లేదా పెద్ద విషయాలైనా అదే నిమగ్నతతో, అదే అంకిత భావంతో నిర్వహించుకోవాలి. ప్రతి విషయాన్ని అదే శ్రద్ధతో, అదే శక్తితో చెయ్యవలసి ఉంటుంది. ఒక దానికి తక్కువ శ్రద్ధ, మరొక దానికి ఎక్కువ శ్రద్ధ ప్రదర్శించకూడదు. ప్రతి విషయంపట్ల సంపూర్ణ సావధానతతో వ్యవహరించాలి. ఈ చివరి నుంచి ప్రారంభించండి. అది జరిగి తీరుతుంది. మీరు అలా చెయ్యండి. అంతే.

నేను ఒక వ్యక్తి పట్ల తక్కువ శ్రద్ధ, మరొక వ్యక్తి పట్ల ఎక్కువ శ్రద్ధ ప్రదర్శించడాన్ని మీ రెప్పుడయినా చూసారా? లేదా ఒక అంశంకంటే ఎక్కువ శ్రద్ధను, మరొక దానిపట్ల తక్కువ శ్రద్ధను నేను ప్రదర్శించడం ఎప్పుడైనా చూసారా? మీరు చూడలేదు. పరిస్థితులు ఎలాంటివైనా, లేదా జనాలు ఎలాంటివారైనా - నేను ఆగ్రహం చెందడాన్ని గాని లేదా ఆందోళన పడడాన్ని గాని మీరు చూడలేదు. అందుకే ఆ చివరి నుంచి ప్రారంభించండి.

కాంతి వేగంతో ప్రయాణం చెయ్యండి, మీరు కాంతిగా మారతారు. నా కదలికకు అనుగుణంగా పయనించండి, మీరు నాలాగ మారతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు