ప్రశ్న:  “మీరు మీ సాధనను నిరంతరం చేసినట్లయితే, అది మీ గురువుని చేరుకోవడానికి మార్గం” అన్నారు. ఇది నిజమేనా సద్గురు..?

సద్గురు: అది ఎవరో చెప్పినాసరే, ఎవరో చెప్పింది మీరు విన్నాసరే లేదా మీరు దానిని ఊహించుకుని ఉన్నా సరే, అది ఏ విధంగా ఉన్నప్పటికీ, అది ఉపయోగకరమైనది కాబట్టి, ఇక్కడ మనం దానిని గురించి మాట్లాడుకుందాం. మీరు, సాధన చెయ్యడం ద్వారా మీ గురువుని చేరుకోవచ్చా..? మీరు నేర్చుకున్న ఈ సరళమైన సాధనలో ఒక విషయం ఏమిటంటే, ఇది మిమ్మల్ని మరింత గ్రాహ్యశీలురుగా మరింత సుముఖంగా ఉండేలా చేస్తుంది. మీ శక్తి కనుక గ్రాహ్యతకు అనుకూలంగా, సుముఖంగా లేనట్లయితే, మిమ్మల్ని ఎవరూ చేరుకోలేరు. కేవలం మీ గురువు మాత్రమే కాదు, జీవితం కూడా మిమ్మల్ని చేరుకోలేదు.

మీరు, ప్రతిదానినీ మిస్ అయిపోతారు. మీ శక్తి అంతా ఒకచోట చిక్కుకుపోయి, ఒక వలయంగా తిరుగుతున్నట్లయితే - ఇది కొన్ని కర్మ కారణాలవల్ల జరుగుతూ ఉండి ఉండవచ్చు. ఇలానే ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకని, ఎవరైనా మిమ్మల్ని చేరుకోవాలంటే, అందుకు ముఖ్యమైన విషయం - మీరు శారీరికంగా, మానసికంగా అందుకు తగినంత సుముఖంగా ఉండాలి. మీ శరీరం, మనస్సూ సుముఖంగా ఉండాలి. మీ శక్తి, ఒక స్థాయిలో సంసిద్ధమై సుముఖంగా ఉండాలి.

మీలోని శక్తి ఇందుకు సుముఖంగా కనుక ఉన్నట్లయితే, మీ గురువే కాదు శివుడు కూడా మిమ్మల్ని చేరుకోవలసిందే..!
అందుకని, సాధన అన్నది మిమ్మల్ని మరింత గ్రహణశీలురుగా చేస్తుంది. ఇది ఎలాంటిదంటే, ఉదాహరణకు మీ సెల్ ఫోన్ లాంటిది. ఒకవేళ అందులో ఛార్జింగ్ లేదనుకోండి.. నేను మీకు ఫోన్ చెయ్యాలనుకుంటున్నాను.. కానీ, నేను ఎన్నిసార్లు డయల్ చేసినప్పటికీ; ఆ కాల్ మీకు రాదు. అప్పుడు ఏమి చెయ్యాలీ..? అందుకే మీరు సెల్ ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టుకుని ఉంచుకోవడం మంచిది.

అదే విధంగా, మీ వ్యవస్థ కూడా..! దానిని చార్జింగ్ లో పెట్టి, సుముఖంగా ఉంచుకోండి. అప్పుడు మిమ్మల్ని చేరుకోవడం, తేలిక అవుతుంది. ఇది, మీరు ఎంచుకున్న మార్గం పట్ల మీ అంకితభావాన్ని చూపించేందుకు, ఒక విధానం కూడానూ..! అదేకనుక లేకపోయినట్లయితే, మీ దృష్టి ఒక దానిపట్ల కేంద్రీకరించి లేకపోయినట్లయితే, మీలో గ్రహణ శక్తి ఉండదు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు దేనిమీదనైనా నిజంగా కేంద్రీకృతమై ఉన్నప్పుడే అంటే శక్తిపరంగా, మానసికంగా, శారీరికంగా ఏకాగ్రత ఉన్నప్పుడే, మీరు కోరిన దిశగా మీ జీవితం కదులుతుంది. అందుకని, సాధన చెయ్యడం, మీ శక్తిని ఉన్నత సంభావ్యతల కోసం సిద్ధం చేసుకోవడానికి ఒక మార్గం. మీలోని శక్తి ఇందుకు సుముఖంగా కనుక ఉన్నట్లయితే, మీ గురువే కాదు శివుడు కూడా మిమ్మల్ని చేరుకోవలసిందే..!

దానిని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే మీలోని శక్తి, దివ్యత్వానికి ఒక ఆహ్వానంగా మారినప్పుడు, దైవం కూడా మిమ్మల్ని కాదనడం అసాధ్యం. మీ గురువుకి మిమ్మల్ని చేరుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ మీలోని శక్తి కనుక ఇలా ఆహ్వానం పలుకుతున్నట్లయితే, ఆయన దాన్ని ఆపలేరు. అందుకని మీరు చేస్తున్న మీ సాధనంతా కూడా, ఒక కోణంలో మీకు ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని కలిగిస్తూ ఉంటుంది. కానీ, మీరు దివ్యత్వానికి ఒక ఆహ్వానంగా మారాలి. అవును.. అందుకని, ఇది నిజమే..! మీ సాధన ఎలా జరుగుతోంది అన్నదానికీ, మీరు ఎంత సుముఖంగా ఉన్నారూ అన్నదానికీ సంబంధం ఉంది. 

ప్రేమాశీస్సులతో,
సద్గురు