యోగా అభ్యాసం చేయడానికి సరైన సమయం ఏది?
 
 

యోగా అభ్యాసం చేయడానికి సరైన సమయం గురించి అలాగే బ్రహ్మముహూర్తం ఇంకా సంధ్యాకాలాల గురించి సద్గురు ఇక్కడ వివరిస్తున్నారు..

ప్రశ్న: సద్గురు, కొన్ని అభ్యాసాలు సూర్యోదయానికి పూర్వం, కొన్నిటిని సూర్యాస్తమయం తర్వాత చేయడంలోని ప్రాముఖ్యం ఏమిటి?

సద్గురు: రాత్రింబగళ్ల మధ్య సమయంలో అంటే సంధ్యా సమయంలో సూర్య నమస్కారాలు, శివ నమస్కారాలు చేస్తాం. సంధ్యాకాలాలలో అంటే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ప్రతిదీ సంధి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో యోగాభ్యాసం చేస్తే, పరిమితులను అధిగమించగల సామర్థ్యం మీలో మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే మీ జీవశక్తులు ఆ సమయంలో సంధి స్థితిలో ఉంటాయి. అదొక అంశం.

ఉష్ణోత్పత్తి

మరో అంశం ఏమిటంటే ఈ అభ్యాసాలన్నీ కొంత ఉష్ణాన్ని పుట్టిస్తాయి. శీతల, పిత్త, ఉష్ణాలు మనిషి శరీర వ్యవస్థలో వివిధ విధులను నియంత్రిస్తాయి. మీలో ఉష్ణం అధికంగా ఉంటే, మరోవిధంగా చెప్పాలంటే మీ సమత్ ప్రాణం అధికంగా ఉండి మీరు మీ శరీరం వేడిగా ఉన్నట్లు భావిస్తారు. కాని, మీ శరీర ఉష్ణోగ్రత చూసుకుంటే అది ఉండవలసినంతే ఉంటుంది. ఉష్ణం  అంటే జ్వరం ఉండడం కాదు, అది అనుభవాత్మకమైన వేడి.

సమత్ ప్రాణం లేదా సమాన వాయువు శరీరపు వెచ్చదనాన్ని నిర్వహించే బాధ్యత కలిగి ఉంటుంది. ఒక యోగి ఎప్పుడూ తన శరీరాన్ని మామూలుకంటే కొంచెం వేడిగా ఉంచుకోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే వేడి - తీవ్రతను, చలన శక్తిని సూచిస్తుంది. శరీరం ఒక స్థాయికంటే చల్లబడిపోతే అది వ్యవస్థలో జడత్వాన్ని కలిగిస్తుంది. దాదాపు అన్ని అభ్యాసాలూ మిమ్మల్ని సాధారణ స్థాయిలో జీవించే పరిస్థితుల నుండి కొంత ఉన్నత పార్శ్వాలకు తీసికొని వెళతాయి. ఉన్నత పార్శ్వాలకు తీసికొని వెళ్లడమంటే ఉన్నత స్థాయి జీవ ప్రక్రియ (మెటబాలిజం) ఉంటుందని కాదు. జీవ ప్రక్రియ ఎక్కువయితే మీరు శారీరికంగా అలసిపోతారు.

మీ శక్తి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మీ జీవ ప్రక్రియ జరిగేటట్లు చూడడానికి మీ శరీరం ఎక్కువ వేగంగా నడవాలి, ఇలా అయితే మీ వ్యవస్థ క్షీణిస్తుంది.

మీ శక్తి ఉన్నత స్థాయిలో ఉంటే మీ శరీరం తేలికగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని మూడు నుండి ఆరు వారాల్లో మీకు నిరూపించగలం – మీరు కొన్ని అభ్యాసాలు చేసి, మీ శక్తులను నిర్దిష్ట స్థాయికి తీసికొని వెళ్లగలిగితే మీ శారీరక అంశాలు కుదుటపడి, సులభంగా నడుస్తాయి. మీ శక్తి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మీ జీవ ప్రక్రియ జరిగేటట్లు చూడడానికి మీ శరీరం ఎక్కువ వేగంగా నడవాలి, ఇలా అయితే మీ వ్యవస్థ క్షీణిస్తుంది. ఇలా మీ శరీర విధులు ఎక్కువ వేగంతో జరిగినప్పుడు మీ మనస్సు సమతుల్యం కోల్పోతుంది, పైగా మీ ఆయుఃప్రమాణాన్ని కూడా తగ్గిస్తుంది.

యోగాభ్యాసాలు చేయడం వ్యవస్థలో ఉష్ణాన్ని పెంచుతుందని మనకు తెలుసు. వెలుపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, ఉష్ణం ఒక స్థాయిని మించి పెరిగినప్పుడు అది జీవకణాలకు నష్టం కలిగిస్తుంది. అందుకే యోగాభ్యాసాలను ఎల్లప్పుడూ రోజులో చల్లగా ఉన్న సమయాలలోనే చేస్తాం. సంధ్యా సమయంలో మన వ్యవస్థలో ఘర్షణ తక్కువగా ఉంటుంది. అందువల్ల యోగాభ్యాసాలు తక్కువ ఉష్ణాన్ని పుట్టిస్తాయి. ఎందుకంటే యోగా భారతదేశంలోని ఉష్ణ మండల వాతావరణంలో సృజింపబడింది కాబట్టి మేము ఎల్లప్పుడూ యోగాభ్యాసాలు ఉదయం 8.30 గం॥లకు ముందు, సాయంత్రం 4.00, 4.30 గంటల తర్వాత చేయాలని చెప్తాం.

మిమ్మల్ని మీరు మళ్లీ మలచుకోవాలి

యోగాభ్యాసాలలో మీరు మిమ్మల్ని మళ్లీ మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు మీ తల్లిదండ్రులపై ఎంతో గౌరవం, మర్యాద ఉండవచ్చు, కాని వాళ్లు మిమ్మల్ని తయారుచేసిన విధంగానే మీ జీవితం ముగియాలని మీరనుకోరు, లేకపోతే కేవలం వారున్నట్లుగానే మీరుండాలనుకోరు. కాని మీరు కేవలం శారీరికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా మాత్రమే కొత్తరూపం ఇచ్చుకోవాలనుకుంటే మీ జీవితంలో ఎక్కడో ఒకచోట మళ్లీ వెనక్కు వెళ్లిపోతారు. చాలామంది పద్ధెనిమిదేళ్ల వయస్సులో “ఒప్పుకోను” అని తల్లిదండ్రులపై తిరగబడ్డ వారు, వారికి నలభై అయిదేళ్లు వచ్చేసరికి తమ తల్లిదండ్రుల లాగే నడవడం, కూర్చోవడం, మాట్లాడడం, ప్రవర్తించడం మనం చూస్తాం. ఎందుకంటే మానసిక పరివర్తనలు అంతకంటే దూరం పోలేవు.

వైఖరుల్లో మార్పులు ఎక్కువకాలం నిలవవు. కొంత సమయం తర్వాత జీవన సందర్భాలు మారి మీ చైతన్యస్థాయి తగ్గి వెనకబడిపోతారు. మీరు మీలాగే ఉండడానికి కారణం మీ తండ్రి వల్లో, అది మీ జీవ కణాల్లో ఉంది కాబట్టి అనో మీరు చెప్పినట్లయితే మీరు మిమ్మల్ని గతకాలపు మనిషిగా చెప్పుకున్నట్లే. మీరు భవిష్యత్తుకు చెందిన మనుషులయితే మీరెవరు అన్న ప్రాథమికాంశాన్ని మళ్లీ రూపొందించుకోవాలి. యోగాభ్యాసాలలో మేము చేయదలచుకున్నదదే – మనం మనల్ని పూర్తిగా భిన్నమైన వారిగా మలచుకోదలచుకున్నాం.

ఇది చేయడానికి మంచి సమయం సంధ్యా సమయం. అప్పుడు భూమి కొన్ని మార్పులు పొందుతూ ఉంటుంది, వ్యవస్థలో ఘర్షణ తక్కువగా ఉండడం వల్ల మనల్ని మనం మళ్లీ రూపొందించుకోవడం తేలికవుతుంది. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయికాని యోగా ఉదయం, సాయంత్రం చేయడానికి ప్రధానమైన రెండు కారణాలివి.

బ్రహ్మముహూర్తం - మేలుకొలుపు

మీరు మీ ఆధ్యాత్మిక ప్రగతి అతి వేగంగా జరగాలని కోరుకుంటే మీరు తెల్లవారకముందే యోగాభ్యాసాలు చేయాలి. సాధారణంగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3.40 గం॥లకే అభ్యాసాలు ప్రారంభించాలి. మీరు మీ అభ్యాసాలను ఒక పద్ధతిలో చేసినట్లయితే మీరు సహజంగానే చైతన్యవంతులయ్యే ప్రక్రియ ఒకటి  సమయంలో ఉంటుంది. మీరు యోగాసనాలు చేస్తున్నట్లయితే, మీ జీవ లక్షణం, భూమి జీవ లక్షణంతో తననుతాను సర్దుబాటు చేసుకుంటుంది. మీరు ప్రతి ఉదయం 3.20 – 3.40 గం॥ల మధ్య మేల్కొంటారు.

ఇదేదో నేరం ఒప్పుకోవడం కాదు గాని, ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం – నా చిన్నతనంలో, కొంచెం పెద్దయిన తర్వాత కూడా, ఏది ఏమైనా పొద్దున మేల్కొనేవాణ్ణి కాదు. నన్ను నిద్రలేపడానికి మా కుటుంబసభ్యులందరికీ దాదాపు ఒక గంట పట్టేది. కొంతకాలం తర్వాత నేనెట్లాగూ లేవను కాబట్టి వాళ్లు పిలవడం మానుకున్నారు. నన్ను ఊపేవాళ్లు, అది కూడా పనిచేయలేదు. తరువాత ఎత్తి కూర్చోబెట్టేవాళ్లు – అట్లా కూర్చుని మళ్లీ నిద్రలోకి జారుకునేవాణ్ణి.

మీరు మీ వ్యవస్థతో కొన్ని పనులు చేసిన తర్వాత మీ జీవతత్త్వం భూమి జీవతత్త్వంతో అనుసంధానం అవుతుంది.

తర్వాత నన్ను పడక మీది నుండి కిందికి లాగేవాళ్లు. మా అమ్మ బ్రష్షుమీద టూత్‌పేస్ట్ పెట్టి ఇచ్చేది. బ్రష్షు నోట్లో పెట్టుకొని నిద్రలోకి జారుకునేవాణ్ణి. ఎలాగో పళ్లు తోముకున్నాక ‘వెళ్లి స్నానం చేసి స్కూలుకు వెళ్లు’ అని చెప్పేది అమ్మ. స్నానాల గదిలోకి వెళ్లి కూర్చుని మళ్లీ నిద్ర పోయేవాడిని. ఒకసారి మేల్కొన్న తర్వాత ఇక నన్నెవరూ ఆపలేరు. కాని లేవడమే కష్టం. ఎవరూ లేపకపోతే మధ్యాహ్నం దాకా నిద్రపోయేవాణ్ణి. బాగా ఆకలి అయినప్పుడు మెలకువ వచ్చేది – లేకపోతే ఇక నన్ను లేపగలిగేదేదీ లేదు.

పదకొండేళ్ల వయస్సులో యోగాభ్యాసం ప్రారంభించాను. 12, 18 నెలలు గడిచాక నాలో మార్పు వచ్చింది. ఇక ఉదయం నాకు మెలకువ వచ్చి టైం చూసుకుంటే అదెప్పుడూ 3.40 కి ముందే ఉండేది. నేనెప్పుడు పడక చేరాను అన్నదానిపై ఆధారపడి నేనెప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అని నేను నిర్ణయించుకున్నప్పటికీ, నేను ఏ టైంజోన్‌లో ఉన్నా కనీసం ఒక్కక్షణం కోసమైనా ఆసమయంలో మేల్కొంటాను. మీరు మీ వ్యవస్థతో కొన్ని పనులు చేసిన తర్వాత మీ జీవతత్త్వం భూమి జీవతత్త్వంతో అనుసంధానం అవుతుంది. 3.40 గంటలన్నది ఎవరో కల్పించింది కాదు – మానవ వ్యవస్థలోనే భూమండలంతో అనుసంధానం చేసేదేదో ఉంది, అది మీరు మేల్కొనేటట్లు చేస్తుంది.

మీ శారీరిక స్వభావాన్ని పరివర్తనం చేసుకోవాలంటే, మనం ఆధ్యాత్మికత అని పిలిచేదాని తత్త్వం తెలుసుకోవాలంటే మీరు యోగాభ్యాసాలు చేయడానికి తగిన సమయం బ్రహ్మముహూర్తమే. కాని మీరు కేవలం శరీరారోగ్యం కోసమే చూస్తున్నట్లయితే సూర్యోదయవేళ, సంధ్యాసమయం అత్యుత్తమం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సంపాదకుడి మాట: అతి సులువైన ఇంకా శక్తివంతమైన యోగ ప్రక్రియలు: ఈశా క్రియా ఇంకా ఉప యోగా ప్రక్రియలను ఆన్ లైన్ లో ఉచితంగా నేర్చుకోండి.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1