రాబోతున్న ఆర్థిక విప్లవానికి వ్యవసాయరంగమే సారథి అవుతుంది!

ఈనాడు భారత దేశంలో అమలులో ఉన్న వ్యవసాయ పద్ధతులను సద్గురు సమీక్షిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రగతిలో మలిదశకు చేర్చగల సామర్థ్యం ఉన్న వ్యవసాయ రంగానికి 'ఊపు' ఎలా ఇవ్వవచ్చో వివరిస్తున్నారు.
 

 

శాస్త్ర పరిశోధనలో మనదేశం గర్వించదగిన ఘన కార్యాలనూ సాఫల్యాలనూ ఎన్నింటినో సాధించింది. మన శాస్త్రజ్ఞులు మంగల్ యాన్ ద్వారా కుజ గ్రహం చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాన్ని ఏర్పరచగలిగారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో ఎన్నో సంస్థలనూ, వ్యవస్థలనూ మనం ఏర్పరుచుకోగలిగాం. కానీ మనం సాధించిన ఘనకార్యాలన్నింటిలోనూ ప్రముఖంగా చెప్పుకోదగినది ఒకటి ఉంది. ఈ దేశపు కర్షకులు - ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గానీ, మౌలిక సదుపాయాల బృహద్వ్యవస్థలు గానీ లేకుండానే - కేవలం సాంప్రదాయికమైన పరిజ్ఞానం తోనే 130 కోట్ల జనాభాకు ఆహారం అందజేయగలుగుతున్నారు.

 

దురదృష్టవశాత్తూ, మనకు అన్నదాత అయిన మన కర్షకుడి సంతానం మాత్రం ఆకలితో అలమటిస్తూ ఉండాల్సి వస్తున్నది. రైతులు ఆత్మహత్యల మార్గం పడుతున్నారు. గత పది సంవత్సరాలలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. మన దేశం పోరాడిన నాలుగు యుద్ధాలలో మరణించిన వారి సంఖ్య కూడా ఇంత ఉండదు. ఈ విషయంలో నేను సిగ్గుతో తల దించుకొంటాను.

ప్రపంచానికే అన్నదాత

మన దేశానికి ప్రపంచానికంతటికీ అన్నదాత అయ్యేందుకు సరిపడే ప్రాకృతికమైన వనరులు ఉన్నాయి. అక్షాంశ తులాంశాల విస్తృతి వల్ల రక రకాల భౌగోళిక స్థితులూ, వాతావరణ పరిస్థితులూ, నేలలలో వైవిధ్యతలూ మనదేశంలో కనిపిస్తాయి. అన్నిటినీ మించి, మట్టిని అన్నంగా మార్చగల ఇంద్రజాలం జన్మసిద్ధంగా అబ్బిన కర్షక జన సంపద అపారంగా ఉంది. ఇన్ని వరాలున్న దేశం మన దేశం ఒక్కటే. అయినప్పటికీ, మనం మన వ్యవసాయరంగాన్ని లాభ సాటి రంగంగా తీర్చి దిద్దుకోలేకపోతే, రాబోయే తరాల వాళ్ళెవరూ వ్యవసాయం వృత్తిగా చేపట్టే ఆశే లేదు. ఆర్థిక పరివర్తన వస్తేనే, మన గ్రామాలకు మనుగడ. రాబోయే కొద్ది సంవత్సరాలలో వ్యవసాయ ఆదాయాలు ద్విగుణీకృతం, బహుగుణీకృతం అయితే తప్ప, దేశంలో గ్రామాల ఆధునికీకరణ సాకారం గాని స్వప్నంగానే మిగిలిపోతుంది.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నాలకు అన్నిటికంటే పెద్ద ఆటంకం ఉత్పత్తుల పరిమాణం. మన రైతులు సాగుచేసే వ్యవసాయ క్షేత్రాలు మరీ చిన్న చిన్నవి. వేలాది సంవత్సరాలుగా దేశంలో వ్యవసాయం జరుగుతూ వస్తూ ఉండటం వల్లా, తరాలు మారినప్పుడు పంటపొలాలను విభజించుకొంటూ వెళ్ళటం వల్లా ఇప్పుడు దేశంలో ఒక్కొక్క వ్యవసాయదారు సాగు చేసే పొలం సగటున తలకు ఒకే ఒక్క హెక్టారు స్థాయికి పడిపోయింది. ఒక్క హెక్టారు పొలం సాగు చేయటానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టినా అది లాభదాయకం కాదు. మన రైతులను బలహీనపరచి, వాళ్ళను దుర్భర దారిద్ర్యం, ఆత్మహత్యల దిశగా నెట్టి వేస్తున్నముఖ్య సమస్యలు రెండు. నీటిపారుదల పెట్టుబడులు లోపించటం, ఉత్పత్తులు అమ్మే విపణిలో బేరాలాడి ధరల స్థాయిని అదుపు చేసే శక్తి (negotiating power ) లేకపోవటం. రైతులు ఉత్పత్తి చేసే పరిమాణం మరీ చిన్నదైనప్పుడు, ఈ రెండు సమస్యలకూ పరిష్కారం ఉండదు.

వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణాలు పెంచటం

అందుకే మనం ఇప్పుడు ఈ పరిస్థితి మార్చి, రైతులను సంఘటితం చేసి, కనీసం పది వేల ఎకరాలు సాగు చేసే రైతు- ఉత్పత్తిదారు సంస్థ లుగా(Farmer – Producer Organisations) వ్యవస్థీకరించటం మీద దృష్టిపెడుతున్నాం. ఇలాంటి వ్యవస్థ వల్ల రైతుల పొలాలు పరాధీనమైపోయే ప్రమాదం లేకుండా ఉండేందుకు అవసరమయ్యే న్యాయపరమైన చర్యలన్నీ అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులు ఎవరి పొలం వారే సాగు చేసుకొంటారు, కానీ మైక్రో- ఇరిగేషన్ పథకాలూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ఏర్పాట్ల వంటివి మాత్రం కలసికట్టుగా తగిన సమర్థత గల కంపెనీలుగా ఏర్పడి నిర్వహించుకోవచ్చు.

ప్రైవేట్ రంగంలో సంస్థలు, మన కర్షకులు సంఘాలుగా ఏర్పడి, ఉమ్మడిగా మైక్రో-ఇరిగేషన్ వసతులు ఏర్పారచుకొని, అద్దె చెల్లింపు పద్ధతిలో సాగు నీటి సరఫరా ఏర్పాట్లు చేసుకొనేందుకు సాయం చేయగలిగితే, రైతులు ఎవరికి వారు పెద్ద మొత్తాలు పెట్టుబడులు పెట్ట వలసిన అవసరం ఉండదు.

ఇప్పుడున్న పద్ధతిలో ప్రతి రైతుకూ తన సొంత పంపు సెట్టూ, తన సొంత బోరు బావీ, తన సొంత విద్యుత్తు సరఫరా ఏర్పాటూ కావాలి. వీటన్నిటికీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాలి. కనక అప్పులు చేయక తప్పదు. ఋణ బాధనుండి విముక్తి పొందాలంటే, రైతు తన పోలమే అమ్మేసుకోవాలి, లేదంటే ఊరు వదిలి పారిపోవాలి, అదీ గాకుంటే ఏ చెట్టుకో ఉరిపోసుకోవాలి, అంతే! పోనీ ఇంత పెట్టుబడీ పెట్టుకొన్నా, చివరికి పండించుకొన్న ఉత్పత్తులు అమ్ముకొనేందుకు రవాణా సౌకర్యాలు ఉండవు. నిలవ గిడ్డంగుల సదుపాయాలు ఉండవు. అమ్మకాలూ, కొనుగోళ్ల మార్కెట్ కూడా అందుబాటులో ఉండదు. పంట పండించటం ఒక ఎత్తు. తరవాత దాన్ని మార్కెట్ కు తరలించటమంటే రైతుకు తల ప్రాణం తోకకు వస్తుంది.

అందుకే ప్రైవేట్ రంగంలో సంస్థలు, మన కర్షకులు సంఘాలుగా ఏర్పడి, ఉమ్మడిగా మైక్రో-ఇరిగేషన్ వసతులు ఏర్పరచుకొని, అద్దె చెల్లింపు పద్ధతిలో సాగు నీటి సరఫరా ఏర్పాట్లు చేసుకొనేందుకు సాయం చేయగలిగితే, రైతులు ఎవరికి వారు పెద్ద మొత్తాలు పెట్టుబడులు పెట్ట వలసిన అవసరం ఉండదు. సంఘాలకు రావలసిన చెల్లింపులు సక్రమంగా వసూలు చేసుకొనేందుకు తగిన న్యాయ పరమైన ఏర్పాట్లు మాత్రం ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. పది వేల మంది రైతులతో ఒక ' రైతు- ఉత్పత్తిదారు సంస్థ' (FPO) ఏర్పరుచుకొంటే, ఆ సంస్థ ఈ పదివేల మంది సభ్యులు పండించిన ఉత్పత్తులను ఏకత్రితం చేసి, మార్కెట్లో సమర్థంగా బేరసారాలు నిర్వహించి ఉత్పత్తులకు రావలసిన న్యాయమైన ధరలు రాబట్టవచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనం సభ్యులైన రైతులందరూ పంచుకోగలుగుతారు. ఇలాంటి మద్దతును మనం మన రైతులకు అందించగలిగితే, వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా సేద్యపు పనుల మీదే కేంద్రీకరించ గలుగుతారు. భారత దేశం ప్రపంచానికంతటికీ ధాన్య భాండాగారం కాగలుగుతుంది.

నేలలను సారవంతం చేయాలి

మన రైతులకు ధాన్య సంపదను పండించటంలో అపారమైన అనుభవం ఉంది. వాళ్ళు నిరక్షరాస్యులుగా కనిపించటం వల్ల , మనం దాన్ని తక్కువగా అంచనా వేస్తాం. కానీ, వ్యవసాయ వృత్తి చాలా క్లిష్టమైనది. ఎంతో శ్రద్ధగా క్రమబద్ధంగా నిర్వహించుకోవాలి. మన రైతులు ఇది తరతరాలుగా చేస్తూ వస్తున్న పని కనక, వాళ్ళకు ఇందులో తగినంత సామర్థ్యం అబ్బింది.

దురదృష్ట వశాత్తూ, దక్షిణ భారత దేశంలో రైతులకు 12000 సంవత్సరాల నుంచి పద్ధతి ప్రకారం పంటలు సాగు చేస్తున్న అపారమైన అనుభవం ఉన్నా, ఈ రోజులలో మనం పొలాలలో వేస్తున్న రసాయనిక పదార్థాల వల్ల, ఒక్క తరంలోనే, పొలాలలో చాలా భాగం పనికి రాకుండా పోతున్నాయి. మన రైతులకు దిగుబడులు పెరిగి , వ్యవసాయం లాభసాటి అయిన ఉపాధి కావాలంటే, మనకు రసాయనిక పదార్థాల కంటే, సేంద్రియ (organic) పదార్థాల వాడకం ఎక్కువ అవసరం. పొలాలు సారవంతంగా ఉండాలంటే, వాటిలో చెట్లూ, పశువులూ ఉండటం చాలా అవసరం. చెట్టు చేమల వల్ల లభించే ఎండుటాకులూ, పశువుల వల్ల లభించే సేంద్రియ వ్యర్థ పదార్థాలూ పొలాలను సారవంతం చేస్తాయి.

భారతదేశంలో ఇలాంటి వృక్షాధారిత సేంద్రియ వ్యవసాయం గురించి, చిన్న స్థాయిలో ప్రదర్శనలు (demonstrations) జరిగాయి. వీటి వలన రైతుల ఆదాయాలు మూడు నుంచి ఎనిమిది రెట్లవరకూ పెంచవచ్చునని చూపించటం జరిగింది. సేంద్రియ వ్యవసాయం వల్ల సాగుదల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. వియత్నాం లాంటి కొన్ని దేశాలు దీన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో మేము వియత్నాం నిపుణులతో చర్చలు జరిపినప్పుడు, వాళ్ళు సేంద్రియ వ్యవసాయం వల్ల తమ దేశంలో రైతుల ఆదాయాలు ఇరవయి రెట్ల దాకా పెరిగాయని చెప్పారు.

ఈ ఆదాయానికి మీరు 'విలువ పెంచిన వ్యవసాయోత్పత్తు'లనూ(value- added products) , పాడి పరిశ్రమా, మత్స్య పరిశ్రమా, హస్తకళలూ వగైరాల ద్వారా లభించే ఆదాయం కలుపుకొంటే, గ్రామీణ భారతం పురోభివృద్ధికి ఎంతో దోహదం చేసే అద్భుతమైన వ్యూహం ఒకటి రూపు దిద్దుకొంటుంది. వ్యాపార సంస్థలూ, కంపెనీలు ఈ సువర్ణావకాశం అందిపుచ్చుకొని దీని వల్ల ఎంతో ప్రయోజనం పొందచ్చు. వృక్షాధారిత ఉత్పత్తులు కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ అంతా అభివృద్ధి సాధించవచ్చు. ఉదాహరణకు, కలప, పళ్ళు, పర్యాటన - ఈ మూడు రంగాలలో అంతర్జాతీయంగా జరిగే వ్యాపారం సాలీనా లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.

మురుగు నుంచి సిరులు

కార్పొరేట్ సంస్థలు పోషించ దగ్గ పాత్ర మరొకటి గూడా ఉంది. మురుగు కుప్పలను సిరుల రాసులుగా మార్చటం. ప్రస్తుతం మన పట్టణాలలో, నగరాలలో పోగుపడే మురుగు అంతా నదులలోకీ, సముద్రాలలోకీ నెట్టేస్తున్నారు. దీని వల్ల విపరీతమైన కాలుష్యపు ముప్పు మాత్రమే కాక, అపారమైన ఆర్థిక నష్టం గూడా. ఇలాంటి మురుగునూ చెత్తనూ సంపదగా మార్చగల సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. మురికి నీటిని తాగే నీరు గా మార్చే పథకాల ద్వారా సింగపూరు నగరం దీన్ని నిరూపించి చూపింది. భారతదేశం లోని పట్టణాలూ, నగరాలలో విడుదలయ్యే 36 బిలియన్ లీటర్ల మురుగు నీటితో 60-90 లక్షల హెక్టార్ల సస్య క్షేత్రాలకు జల వసతి అందించవచ్చు.

వీటన్నిటికీ కావలసిన ఆర్థిక వనరులను సక్రమంగా, సకాలంలో అందించ గలగటం ప్రభుత్వాలవల్ల అయ్యే పని కాదు. ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని కాలాతీతం కాకుండా అందించటం కష్ట సాధ్యం. ముఖ్యంగా వృక్షాధారిత వ్యవసాయంలో, చెట్లు నాటటం లాంటి కార్యక్రమాలు సరయిన సమయాలలో జరగ వలసి ఉంటుంది. కనక అటువంటి కార్యక్రమాలకు తోడుపడి, కర్షకులకు సహాయం అందజేసే చురుకుతనం, వేగం కార్పొరేట్ రంగం మాత్రమే చూపగలదు.

ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించేటప్పుడు, మనం స్టాక్ మార్కెట్ గురింఛీ, అలాంటి ఇతర విషయాలు కొన్నింటి గురించీ మాత్రమే ఆలోచిస్తాం. కానీ మన జనాభాలో 65 శాతం గ్రామీణ ప్రాంతాలలో ఉంది. వాళ్ళ ఆదాయాన్ని కనీసం రెట్టింపు చేయగలిగితే, మన ఆర్థిక ప్రగతికి హద్దే ఉండదు.

లక్ష హెక్టారుల భూమిని సాగు చేసే ఏ పాతిక వేల మంది రైతులనో మన కార్పొరేట్ రంగం తగిన పెట్టుబడితో సంఘటితం చేసి, ఉమ్మడి మైక్రో- ఇరిగేషన్, మార్కెటింగ్ వసతులు ఏర్పరచి, ఒక పెద్ద స్థాయి నమూనాను చూపగలిగితే, దాని ద్వారా ఎంత ఘనమైన ఆర్థిక సాఫల్యాన్ని పొందవచ్చో అందరూ తెలుసుకోగలుగుతారు. ఆ తరవాత ఇక దాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజలే దాన్ని దేశమంతటా వ్యాపింపజేస్తారు.

ఆర్థిక సంపన్నతా, సౌభాగ్యం ఇప్పుడు భారత దేశానికి అతి చేరువలో ఉన్నాయి. వచ్చే పదేళ్ళలో మనం సరయిన చర్యల మీద దృష్టి పెడితే, ఈ అపారమైన జన సముద్రం జీవన ప్రమాణాలను ఇప్పటికంటే ఎంతో ఉన్నత స్థాయికి చేర్చవచ్చు. తమ నైపుణ్యం, సామర్థ్యం ఉపయోగించి ఈ పరివర్తనను సాకారం చేసే సువర్ణావకాశమూ, బాధ్యతా మన కార్పొరేట్ రంగం ముందు ఉన్నాయి. ఇది దయా దాక్షిణ్యాల వ్యవహారం కాదు. ఇది పెట్టుబడి. మంచి లాభాలు ఆర్జించి పెట్టే పెట్టుబడి. వ్యాపార పరమైన లాభాలే కాదు, కోట్లాది సాటి మనుషులకు ఆర్థిక సమృద్ధినీ , గౌరవ ప్రదమైన జీవన విధానాన్నీ సమకూర్చటం అనే మహత్తరమైన అదనపు ప్రయోజనం కూడా!

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1