ప్రత్యర్థి లేని క్రికెట్ ఆట

 

Sadhguruప్రత్యర్థి జట్టుని అంగీకరించడం చాలా ముఖ్యం. ఈ అంగీకారం సంపూర్ణమైనప్పుడు ఇక ప్రత్యర్థులే ఉండరు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఆటలంటే ఆనందం కాబట్టి ఆడాము. కాని మెల్ల మెల్లగా ఆ ఆటలే ఇప్పుడు పెట్టుబడులకు అవకాశ మార్గాలయ్యాయి. క్రికెట్‌ ప్రపంచకప్పు విషయాన్నే ఉదాహరణగా తీసుకుందాం. విచారకరమైన విషయం ఏమిటంటే, క్రికెట్‌ ఆటకన్నా ఛాంపియన్‌ కప్పుపై మక్కువ చూపి ఆటగాళ్ళు ఆటకు దూరమైపోతున్నారు. నిజానికి ఆట వారికి ఒక పనిగా మారింది. అలాకాకుండా, ఆటగాళ్లు ఆటను ఆనందించ గలిగినప్పుడే బాగా ఆడగలుగుతారు.

భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే కోట్లాదిమంది ప్రజల ఆశలను సాకారం చెయ్యడమే, అది అంత సులభం కాదు. ఆటగాళ్లు, ఇతరుల ఆశలకు అనుగుణంగా ఎప్పుడు ఆడడం ప్రారంభిస్తారో, అప్పుడు వారి మనోభావాలపై వొత్తిడి పెరిగి వారి శారీరక సామర్థ్యాలు పరిమితమైపోతాయి. మానవుడు ఎప్పుడైతే నిజంగా ఆనందంగా, స్వేచ్ఛగా ఉంటాడో, అప్పుడే అతను భౌతిక జీవితంలో ఎంతో గొప్ప పనులు చేయగలుగుతాడు. ఆలోచనలలో మునిగిపోకుండా, ఆ క్షణంలో ఏది చేయడం అవసరమో, అదే చేయడం అనేది ఆటలో ఉన్న విశిష్టత. దీన్ని యోగా గుర్తిస్తోంది. ఆలోచనలతో ఉన్నప్పుడు వాటి వెనక ఉండే ఉద్దేశాలు ప్రకటితమౌతాయి.

ఆటగాళ్లు బాగా అభ్యాసం చేస్తే మైదానంలో వారు చేయవలసినది వారి సహజ ప్రవృత్తిగా మారిపోతుంది.

ఇక్కడ ఆటలో మనిషి ముందుగా ఆలోచించడు, కేవలం స్పందిస్తాడు, ఆ క్షణంలో ఎలా అవసరమో అలాగే స్పందిస్తాడు. ఆటగాళ్లు బాగా అభ్యాసం చేస్తే మైదానంలో వారు చేయవలసినది వారి సహజ ప్రవృత్తిగా మారిపోతుంది. ఆటకు అవసరమైనట్లు- వారి నుంచి స్పందన జాలువారుతుంది. ప్రత్యర్థులు విసిరినదానికి వారు తక్షణమే అతి లాఘవంగా స్పందించగలుగుతారు. సరైన యోగాభ్యాసంతో శరీరం, మనస్సులపై నియంత్రణ సాధించి, వారు ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండానే అవసరానికి తగ్గట్టు సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతారు.

ధ్యానమంటే సహజ స్వాభావిక మూల శక్తిలోకి మళ్లీ వెళ్లడమే. ఎవరైనా శ్వాసపై మనసును లగ్నం చేయగలిగితే వారికి భౌతిక గురుతులు తొలగుతాయి. ఒక ఛాంపియన్‌గా ధ్యానం చెయ్యడం అసాధ్యం. అలాగే ఆట ఆడేటప్పుడు, ఆటగాడు తనను తాను గుర్తించుకున్న వాటిని వదిలిపెట్టాలి, అప్పుడే బాగా ఆడగలుగుతాడు. ఎప్పుడు ఒక క్రికెటర్‌ తనను, తన స్థాయిని, మనసులో ఉంచుకుంటాడో, అప్పుడు ఆ ఆలోచనల వల్ల  అతనికి ఆట మోయలేని భారమౌతుంది. ఒక్కసారి వీటన్నిటినీ పక్కన పెడితే, ఇక అతను క్రికెట్‌ ఆడనక్కరలేదు. ఆట దానంతట అదే జరిగిపోతుంది.

మన క్రికెట్‌ క్రీడాకారులే గనుక వారి శక్తినీ, శరీరాన్ని, మనసునీ అనుసంధానం చేసుకోగలిగితే అప్పుడు వారు అద్భుతంగా ఆడగలుగుతారు.

అసలు గొప్ప  క్రీడాకారుడు ఎలా తయారవుతాడు? ప్రత్యర్థి జట్టు పేలవమైనది కావడం వల్ల మాత్రం కాదు కదా. గొప్ప క్రీడాకారునికి సమన్వయం అనే లక్షణం ఉన్నతంగా ఉంటుంది. జీవితంలో ఏం కావాలో అతనికి తెలుసు. తనకు కావలసిన వాటిమీద ఉన్న నిబద్ధతతో అవి అతనికి వాస్తవమౌతాయి. మన క్రికెట్‌ క్రీడాకారులే గనుక వారి శక్తినీ, శరీరాన్ని, మనసునీ అనుసంధానం చేసుకోగలిగితే అప్పుడు వారు అద్భుతంగా ఆడగలుగుతారు. క్రికెట్‌ అనేది ఆ క్రీడాకారుడు ఎంచుకున్న ఒక ఇష్టమైన పని మాత్రమే. ఆ ఆట అతను బాగా ఆడగలగాలంటే అతను శారీరకంగా, మానసికంగా, భావనాపరంగా, ఆధ్యాత్మికంగా పూర్తిగా చైతన్యవంతుడై ఉండాలి. అప్పుడే ఏ ఆటైనా బాగా ఆడగలుగుతాడు. క్రికెట్ ఆడేది మూర్ఖులైతే క్రికెట్ ఆటే మూర్ఖంగా కనిపిస్తుంది. అదే క్రికెట్ ఆడేది తెలివిగల వారైతే, ఆట గొప్పగా ఉంటుంది. అంటే ఆడేవారిని బట్టే ఆట ఉంటుంది.

ఆటగాళ్ళు తమను తాము తీర్చిదిద్దుకునే విధానం ఆటకన్నా ముఖ్యవిషయం. తమలో ఒక విశిష్టలక్షణాన్ని తెచ్చుకోలేకపోతే వారు ఆటలో నాణ్యతను తీసుకురాలేరు. తమలో వినయాన్ని పెంచుకుంటే వారు ఊహించలేని ఉన్నతశిఖరాలను అధిరోహించ గలుగుతారు. వినయమంటే ఉన్నది ఉన్నట్లు అంగీకరించడమే. ఈ అంగీకారంతోనే వారు తమ తెలివితేటలను బాగా వినియోగించుకొని బాగా స్పందించగలరు. ఒక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, తెలివిగా పరిష్కరించుకోవడానికి ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే లక్షణమే చాలా ముఖ్యమైనది. ప్రత్యర్థి జట్టుని అంగీకరించడం చాలా ముఖ్యం. ఈ అంగీకారం సంపూర్ణమైనప్పుడు ఇక ప్రత్యర్థి ఉండడు.

ఆ జట్టులో కూడా పదకొండు మంది ఆటగాళ్లు ఉంటేనే కదా క్రికెట్ ఆడగలిగేది- అప్పుడే పోటీ సాధ్యమౌతుంది. అంగీకారం ఉంటే ఒత్తిడి అనేదే ఉండదు. ప్రత్యర్థి జట్టు సామర్థ్యాలు, గెలుపులూ అన్నవి ఇక సమస్యే కావు. మీలో  పూర్తిగా అంగీకారం ఉన్నప్పుడు, వాటి ప్రభవం కృశిస్తుంది. ఆట ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా. మనలో ఆంగీకారం పరిపూర్ణమైనప్పుడు ఈ ఉనికే మనలో భాగమౌతుంది. ఇదే ప్రకృతి తీరు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1