ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చడానికి పరిష్కారం ఉంది
ప్రపంచంలో ఇంత మంది ఆకలితో అలమటిస్తూ ఉండడానికి కారణం, ఆహార కొరత కాదని సద్గురు చెబుతున్నారు. మరి ఈ సమస్య తీరాలంటే ఎటువంటి మార్పు జరగాలో వివరిస్తున్నారు.
 
 

మేము చేస్తున్న పనిలో 70 శాతం పని పల్లెల్లోనే జరుగుతోంది. మా కార్యక్రమాలన్నీ వారిననుసరించే ఉంటాయి. కడుపునిండా తిండి లేని ప్రదేశానికి వెళ్లి ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞ్యానం గురించి మాట్లాడలేం. సరిగా ఎలా తినాలో చెప్పాలి. మా పనిలో యాభై శాతం అదే ఉంటుంది; కానీ ప్రపంచంలో సగం జనాభా తగినంతగా ఎందుకు తినలేకపోతున్నారు? అది ఆలోచించాలి మనం. ఒక పల్లెటూరిలో కంప్యూటర్ సెంటర్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించారు. అది ఒక చిన్న పల్లెటూరే.. అయినా అక్కడడికి చుట్టుపక్కల గ్రామాలవారు కూడా వచ్చారు. వాళ్ళకొక బాలికల స్కూల్ కూడా ఉంది. అక్కడ దాదాపుగా ఏడొందల మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు.

నిజానికి అంతమంది ఆడపిల్లలు స్కూల్ కి వెళ్ళటమే చాలా అద్భుతమైన విషయం. సరే, మేమక్కడికి వెళ్ళాం, కంప్యూటర్ సెంటర్ ప్రారంభించాం, అవన్నీ చేశాం. వాళ్ళందరికీ వాళ్ళ జీవితంలో ఇదొక ముఖ్యమైన రోజు , పైగా నేనొస్తున్నానని చెప్పారు, చాలా ఏర్పాట్లు చేశారు. వాళ్ళంతా వాళ్ళకున్నటువంటి మంచి యునిఫారం చక్కగా ఇస్త్రీ చేస్కుని వేసుకొచ్చారు. వాళ్ళకి ఇది చాల పెద్ద విషయం.

పద్దేన్నిమిది బిలియన్ల ప్రజలకు సరిపడా ఆహారం ఉంది ఈ భూమి మీద. అయినప్పటికీ సగం జనాభా కూడా సరైన ఆహారం తీసుకోవట్లేదు.

అక్కడ నేనొక విషయం గమనించాను, పదవ తరగతి చదివే ఆడపిల్లలందరూ, అంటే పద్నాలుగు పదిహేనేళ్ళ ఆడపిల్లలందరూ చిన్నప్పటినుండీ సరిగ్గా తినలేదు అని. ఇవాళ వాళ్ళందరూ నాకోసం ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని చక్కగా నిలబడి ఉన్నారు కానీ తరచి వారి ముఖాల్లోకి చూస్తే, వారు వారి జీవితంలో ఏనాడూ సరిగ్గా తినలేదని తెలిసింది నాకు. వాళ్ళంతా ఎదగవల్సినంత ఎదగకపోవటానికి వారు తిన్న అరకొర తిండే కారణం. మీరు ఇంతవరకూ గ్రామాల్లోకి వెళ్లి ఉండకపోతే, ఒకసారి అక్కడ నడిచి చూడండి. మీకు కనిపించే వారిలో అరవైశాతం మందికున్న అస్థిపంజరాలు, ఎదగవలసినంత ఎదిగి ఉండవు. వారి శరీరాలు సరిగా ఎదగకపోతే బుద్ధి కూడా పూర్తిగా వికసించదు. ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఈ విధంగా బుద్ధి - శరీరం సరిగ్గా వికసితంకాని ఒక తరాన్నే సృష్టించబోతున్నాం. మన దేశంలో ఇది నిశ్సబ్దంగా జరిగిపోతోంది. అందరూ సునామి, ఇది అది అంటూ మాట్లాడుతున్నారు.

నిశ్శబ్దoగా ఈ ఉపద్రవం ముంచుకొస్తోందని మీకు తెలుసా? ఇది ప్రపంచంలో ఆహారం లేకపోవటంవల్ల జరగటం లేదు. ఆహారం సమృద్ధిగా ఉంది. మనo ఇప్పుడు సమిష్టిగా దాదాపు 7 బిలియన్ల మంది ఉన్నాం. పద్దేన్నిమిది బిలియన్ల ప్రజలకు సరిపడా ఆహారం ఉంది ఈ భూమి మీద. అయినప్పటికీ సగం జనాభా కూడా సరైన ఆహారం తీసుకోవట్లేదు. ఇది ఎందుకు జరుగుతోందో మనం ఆలోచించాలి. ఆహారం లేకపోతే అది పూర్తిగా వేరే విషయం. కానీ అవసరమైనంత ఆహారం ఉండి కూడా సగానికి సగం జనాభా ఎందుకు సరైన భోజనం చేయ్యట్లేదో మనందరం ఆలోచించాలి. అసలు పంచుకోవటానికే ఏమీ లేని వాళ్ళు పంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ పంచుకోవటానికి ఇంతో అంతో ఉన్నవాళ్ళు మాత్రం పంచుకోవటానికి ఇష్టపడట్లేదు. ప్రపంచపు తొంభై శాతం సంపద కేవలం మూడు నించీ ఐదు శాతం వ్యక్తుల చేతుల్లో ఉంది. ఇదీ వాస్తవం. కాబట్టీ ఆధ్యాత్మికత అనే అంశంలో మేము ఎక్కువగా బాగా ఉన్నవారికి అందిస్తున్నాం. ఆధ్యాత్మికత వారొక్కరికే పరిమితం అని కాదు, ఎందుకంటే వారిలో పరివర్తన వల్ల మాత్రమే ప్రపంచంలో నిజమైన పరిణామం త్వరగా సాధ్యపడుతుందని. చైనీయుల విప్లవం, రష్యన్ల విప్లవం - లేనివారు ఉన్నత వర్గాలమీద విసుగు చెంది వారి మీద భయంకర చర్యలు చేశారు. ఒక మార్పు అంత బాధాకరంగా రానక్కర్లేదు. పరపతి కలిగిన ధనవంతుల జీవన దృక్కోణంలో, ఆలోచనల్లో మార్పు తీసుకురావటం వల్ల ఈ మార్పు ఎంతో సున్నితంగా జరిగిపోతుంది కదా!!

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1