పిల్లలకు క్రమశిక్షణ నేర్పే విధానం ఏది..??

 

మీరు క్రమశిక్షణతో ఉన్నారని అంటే మీరు నేర్చుకోవటానికి సంసిద్ధంగా ఉన్నారనే. మీరు ఎక్కడో ఆగిపోయి లేరు. క్రమశిక్షణ దేన్నైనా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేయటం మాత్రమే కాదు, మీరు నిరంతరం అన్నీ ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో నేర్చుకోవాలని సుముఖంగా ఉండడమే.

ఏదైనా బలవంతాన నేర్చుకోనేలా చేయలేరు కాని మీరు ఎవరినైనా ఏదైనా పని చేయమని బలవంతపెట్టగలరు. కాని మీరు ఒక సారి వారిని బలవంతపెట్టటం మొదలు పెడితే అది తక్కువ కాలం వరకు అయితే పర్వాలేదు కాని అదే దీర్ఘకాలం వరకూ సాగాలంటే మీ ప్రాణం పోతుంది, వాళ్ళ ప్రాణం కూడా పోతుంది. దాన్నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ ప్రాణం పోతుంది.
నా చిన్నతనంలో నా కుటుంబం నాతో ఏది బలవంతాన చేయించాలని చూసినా అది ఎప్పుడూ పని చేసేది కాదు. కాని ఏదైతే ఒక కుటుంబ సంప్రదాయంగా అలవాటు చేసారో అది మాత్రం పనిచేసేది, అది నాకు ఎంతో గొప్ప విధానంగా ప్రయోజనాన్ని చేకూర్చింది. అవి అన్నీ సాధారణమైన విషయాలే. ఉదాహరణకు, మేము ఎక్కడ ఉన్నా కూడా మధ్యానం, రాత్రి భోజనానికి ఎప్పుడూ ఇంటికి వెళ్ళే వాళ్ళము. అది ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు వీలయ్యేది కాదు ఎందుకంటే కుటుంబసభ్యులు వేరే వేరే సమయాల్లో బయల్దేరి వెళ్ళేవాళ్ళు. కాని లంచ్ మరియు డిన్నర్ మాత్రం కుటుంబం మొత్తం కలిసి చేసేవాళ్ళము. ఒక్క వ్యక్తి రాకపోయినా మొత్తం కుటుంబం ఎదురు చూస్తూ ఉండేది. కనుక ఆ సమయానికి వెళ్ళకుండా ఉండలేక పోయేవాళ్లము. ఇది బలవంతాన జరగలేదు. మీరు అందులో భాగంగా మారేలాంటి ఒక వాతావరణం సృష్టించబడింది.
ఏది చేయాలో అది ఒక ప్రత్యేకమైన విధానంలో చేయటమే ముఖ్యమైనది. మీ జీవిత నాణ్యత ఒక నిర్దిష్ట స్తాయిలో ఉండాలంటే మీకు శుభ్రమైన వాతావరణం కావలి. మీరు ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలంటే కొన్ని పనులు చేయాలి. మీరు కిందకి వంగి ఇది చేయటం ఇష్టపడకపోతే అప్పుడు మీరు శుభ్రంగా లేని చోటే ఉంటారు. కనుక ముందు మీ ప్రాధాన్యతలు సరిగ్గా ఉంచుకోండి. ఒక పని ఎందుకు చేయాలనేది మీరు వారికి అర్ధం అయ్యేలా చేస్తే వివేకం ఉన్న ప్రతీ మనిషి అలా చేయటానికి సుముఖంగానే ఉంటారు. మీరు తెలివైన వారైతే అయితే ఏది ఉత్తమమైనదో అర్ధం చేసుకుని, మీరు అదే చేస్తారు. మీకు ఏదీ అర్ధం కాకపోతే మీరు ఒక గాడిదలాంటి వారే. గాడిదను గాడిదలాగానే చూస్తారు మరి. ఇతరులు మిమల్ని ఒక గాడిదలాగా చూడకపోయినా మీరు ఒక గాడిదలాగానే బ్రతుకుతారు.

నాగరికత పాఠ్యపుస్తకాలు, ప్రబోధకుల ద్వారా విస్తరించటం లేదు. అది ప్రధానంగా మీ కుటుంబ జీవన విధానమే.

మా ఇంట్లో పని మనిషి వచ్చిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా మా అమ్మ రెండు సార్లు ఇల్లు ఊడ్చేవాళ్ళు, ఒకసారి ఉదయాన్నే, మరొకసారి సాయంత్రానికి. ఒకసారి ఇల్లు తుడిచేవాళ్ళు. ఇల్లు ఊడ్చి తుడిచే వరకు ఆమె స్నానం, భోజనం చేసే వారు కాదు. మీ అమ్మే మొత్తం పని చేస్తుంటే మీరెలా చూస్తూ ఊరుకుంటారు? అందరూ ఎవరు చేయగలిగింది వాళ్ళు చేసేవారు. అది కేవలం పని మనిషి మాత్రమే చేస్తుంటే, ఆమె రానప్పుడు మా అమ్మ చేయకపోతే అది మేము చేయాలని ఎప్పుడూ అనుకునే వాళ్ళము కాదు, ఎందుకంటే అది పని మనిషి చేయాల్సిన పని అని అనుకునేవాళ్ళం. కాని ఆమె ఎప్పుడు రాకపోయినా మా అమ్మ మొహమాటం లేకుండా ఆ పని చేసే వారు కనుక ఆ పని చేయకపోవటం అనే ప్రశ్నే లేదు. అందుకే అందరూ చేసేవాళ్ళు.
ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఎంతో ఎక్కువ తేడాను తెస్తాయి. మీరు ఉదయాన నిద్ర లేచినప్పుడు మీ పరుపును ఎలా వదిలేస్తారు అన్నదగ్గర నుంచి మీ కాఫీ కప్పు ఎక్కడ పెడతారు అనేలాంటివి – ఇలాంటి విషయాలలో చాలా కుటుంబాలలో దురదృష్టవశాత్తూ సరైన అలవాట్లు లేవు. మేము అవి చేయకపోతే మా మీద ఎవరూ కేకలు వేసేవారు కాదు. మా అమ్మే కూర్చుని అవన్నీ చేసేవారు. ఆమె చేయటం చూడగానే మేము కూడా ఒక చేయి వేసి ఆ పని మేమే చేసేవల్లము.
నాగరికత పాఠ్యపుస్తకాలు, ప్రబోధకుల ద్వారా విస్తరించటం లేదు. అది ప్రధానంగా మీ కుటుంబ జీవన విధానమే. అన్నీ కూడా, మీ బాత్ రూమ్ నుంచి డైనింగ్ టేబుల్ వరకూ, మీరు వాటిని ఎలా సర్దుకుంటారు అనేవన్నీ కూడా నిర్ణయించబడి ఉన్నాయి, మరి వాటిని అలాగే చేసేవారు. మీరు దాంట్లో పాల్గొంటున్నారా లేదా అని ఎవరూ అడిగే వాళ్ళు కాదు కాని అలా వదిలేసి మీరు ఎంత కాలం ఉంటారు? మీరు అలా ఉండలేరు కదా. అందరూ చేస్తుంటే మీరు కూడా దానిలో పాల్గొంటారు, ఆ పని చేస్తారు.

మీ పిల్లల జీవితంలో యోగ సాధనను చేరిస్తే వాళ్ళు క్రమశిక్షణగా ఉండకుండా ఉండే దారే లేదు. యోగ సాధన చేయటం మీ జీవితంలో క్రమశిక్షణను తెస్తుంది ఎందుకంటే మీరు కొన్ని పనులను ఒక ప్రత్యేకమైన విధానంలో చేస్తారు. అలా చేయకపొతే అవి పని చేయవు. యోగాను ఎంత క్షుణ్ణంగా నేర్పిస్తారంటే మీరు అంత క్షుణ్ణంగా చేయటం మొదలు పెట్టగానే మీరు క్రమశిక్షణ లేకుండా ఉండే దారే లేదు.

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1