భారతదేశంలో, ఆత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులకు, గురువులకు పాదాభివందనం చేయడమనేది ఒక ఆచారం. దీనికున్న ప్రాముఖ్యత  ఏమిటి?

సద్గురు : యోగాలో ‘పాద శాస్త్రం’ అనేదోకటుంది. పాదంలో ముఖ్యంగా అరిపాదాలలో, మీలో ఉన్నవాటిన్నింటికీ స్విచ్ లున్నాయి. ఎలా ఆన్ చెయ్యాలో తెలిస్తే, మీరు వీటిని ఆన్ చెయ్యగలుగుతారు.

మీ చేతులు శక్తివంతమైన పరికరాలు. మీలో ఒక రకమయిన   సున్నితత్వముంటే, మీ చేతులతో దేన్ని తాకితే, మీరు వెంటనే అదేమిటో తెలుసుకోగలుగుతారు. మీరు దాన్ని మీ భుజాలతోనో, వీపుతోనో లేక తలతోనో తాకితే, అది ఏమిటో తెలుసుకోలేరు, కాని దాన్ని మీరు చేతులతో తాకితే, అది ఏమిటో మీరు వెంటనే తెలుసుకుంటారు, ఇది కేవలం అనుభూతి, సున్నితత్వం మాత్రమే కాదు - మీ చేతులకు మరెంతో గాఢమైన గ్రాహ్యతుంది.

మీ పాదాలతో ఎలా వ్యవహరించాలో మీకు తెలిస్తే, మొత్తం వ్యవస్థకు సంబంధించిన అనేక పనులు మీరు చెయ్యగలరు.

కాని, మీరు మీ శక్తిని ఎవరికైనా ప్రసరింపదలిస్తే, పాదాలు చాలా శక్తిమంతమైన పరికరాలు. ఇంతకు ముందు ఒకరిసారి - విశ్రాంతి కలిగించేందుకు, ఆనందం కలిగించేందుకు, ప్రేమి కలిగించేందుకు , ఇలా వివిధ అనుభూతి స్థాయిలను సృష్టించడం కోసం - పాదాలను నేర్పుతో ఎలా వత్తాలో మేము అందరికీ బోధించే వాళ్లం. శరీరంలోని మొత్తం ఏడు చక్రాలూ మీ పాదాల్లో వ్యక్తమవుతాయి. మీ పాదాలతో ఎలా వ్యవహరించాలో మీకు తెలిస్తే, మొత్తం వ్యవస్థకు సంబంధించిన అనేక పనులు మీరు చెయ్యగలరు. ఇవాళ దీన్ని రిఫ్లెక్సోలజీ అంటున్నారు, కాని అందులో వారు కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కాని మనకు జీవితం అంటే ఆసక్తి కాబట్టి, మనం అనుభూతుల పరంగా చెబుతున్నాము.

ఇక పాదాభివందనం విషయానికి వస్తే, ముందుగా అసలు మీరు ఎవరి పాదాలనైతే తాకుతున్నారో వారి వద్ద మీకు ఇచ్చేందుకు ఏమైనా ఉండాలి; వారి శక్తి ఒక నిర్ణీత స్థాయిలో ఉండాలి. మీరొక బిచ్చగాడిని అప్పు అడిగితే లాభంలేదు కదా. మీకు అప్పు కావాలనుకుంటే ఎవరివద్ద ఇచ్చేందుకు డబ్బు ఉంటుందో వారినే అడగాలి. దివాళా తీసినవారినో లేక లోభినో మీరు అప్పుdad అడిగితే, ఉపయోగం లేదు. మీరు సమృద్ధిగా ఉన్నవారిని, అది ఇచ్చే గుణం ఉన్నవారిని మాత్రమే అడుగుతారు.

దివాళా తీసిన వారి వద్దకు వెళ్లి మీరు కాళ్ళు పట్టుకోరు. ఒకరు శక్తులతో ఉప్పొంగుతుంటే, పంచేందుకు సుముఖంగా ఉంటే ఇది సాధ్యం. ఇది ఒక ప్లగ్ పాయింట్ వంటిది. ప్లగ్ పాయింట్ లు చాలా రకాలు ఉంటాయి. అందుకని మీరు ఒకరకమైన ప్లగ్ పాయింటును  ఉపయోగించుకోవాలనుకుంటే, మీకలాంటి ప్లగ్గే కావాలి.

చాలా ఇళ్ళలో పెద్దల పాదాలు తాకే ఆచారం ఉంది. బహుశా దక్షిణ భారతంలో అది అంతరించిపోతున్నా, ఉత్తర భారతంలో వేద సంప్రదాయం వల్ల ఇంకా అలాగే ఉంది. వాళ్ళు తమ తల్లితండ్రులో, అత్తమామలో లేక ఎవరైనా తమకంటే పెద్ద వారిని చూస్తే, వారు చేసే మొదటి పని, వాళ్ళ పాదాలు తాకటం. అది కేవలం వారిపట్ల మీ గౌరవాన్ని వ్యక్తపరచడం మాత్రమే. అంతే కాని, మీరు వారి శక్తిని తీసుకునేందుకు కాదు! మీరొక విగ్రహానికి వందనం చేసే పధ్ధతి వేరే ఉంది. మీరొక శక్తిమంతమైన వారికి, అంటే ఆధ్యాత్మిక పరిణతిలో కాకపోయినా తమ సొంత రీతిలో శక్తిమంతులైన వారికి నమస్కారం లేక వందనం చేసేందుకు వేరే పధ్ధతి ఉంది. మీ గురువుకు మీరు తలవంచి వందనం చేసేటప్పుడు, అది చేసేందుకు వేరొక మార్గం ఉంది. నేను వీటి సాంకేతికతలలోకి వెళ్ళదలచుకోలేదు. నేను మిగతా మూడింటినీ మీకు చెప్పగలను, కాని గురువుకు ఎలా మోకరిల్లాలో, మీకు చెప్పదల్చుకోలేదు. మీకు ఏ విధంగా చేయాలనిపిస్తే, ఆ విధంగానే చేయండి, ఎందుకంటే మీరు ఎప్పుడూ నా కాళ్ళు లాగడం నాకు ఇష్టం లేదు...!

మీరు ఏళ్ళ తరబడి సాధనతో పొందలేనిది, ఒక్క క్షణంలోనే పొందుతారు. ఆ ఆశతోనే ప్రతి ఒక్కరూ పాదాలకోసం ఎల్లప్పుడూ దూకుతున్నారు

మీ చేతుల్లో గ్రాహ్యత ఉంటే, మీరు తాకిన పాదాలకు ఇచ్చే స్వభావం ఉంటే - ఒకవేళ ఈ రెండూ అనుసంధానించబడి ఉంటే - మీరు ఏళ్ళ తరబడి సాధనతో పొందలేనిది, ఒక్క క్షణంలోనే పొందుతారు. ఆ ఆశతోనే ప్రతి ఒక్కరూ పాదాలకోసం ఎల్లప్పుడూ దూకుతున్నారు - ఎక్కడైనా ఈ అనుసంధానం జరుగుతుందేమో అన్న ఆశతో. బహుశా పశ్చిమ సంఘాల్లోని వారు ఎవరో ఒకరి పాదాలపై పడటాన్ని, ఒక రకమైన లోబడటంగానో లేక బానిసత్వంగా అర్థంచేసుకుంటారేమో. కాని యోగ సంప్రదాయంలో మేము, పాదాలను చేతులకంటే తక్కువైనవని ఎప్పుడూ అనుకోలేదు. శరీరంలోని ఒక భాగాన్ని మరొక భాగం కంటే తక్కువగా ఎప్పుడూ చూడలేదు. ఎలా పని సానుకూలమౌతే అలాగే చేస్తాం.

కొన్ని సంప్రదాయాలకు చెందిన వారు నా వద్దకు వచ్చినప్పుడు(పాదాభివందనం చేసినప్పుడు) , వీరికి బాల్యంనుంచే ఈ విషయాలన్నీ నేర్పబడ్డాయా? అని నేను ఆశ్చర్యపోతుంటాను; సరిగ్గా పాదాభివందనం ఎలా చెయ్యాలో వారికి తెలుసు. మిగతా వారంతా కేవలం దాన్నిభావోద్వేగంతో చేస్తుంటారు. కొన్నిసార్లు, వారు దాన్ని సరిగ్గానే చేస్తారు. కొంతమంది కేవలం తాము తప్పు చెయ్యకుండా ఉండేందుకు, అన్ని భాగాలూ పట్టుకుంటారు! వారికి ఈ పద్ధతి తెలియని విషయం, వారికే  తెలుసు. వారు ఎలాగైనా అనుసంధానం కావాలనుకుంటారు. వాళ్ళు తమ చేతులను ఆయన పాదాల పైన పెడతారు, క్రింద పెడతారు, గురువుగారు కింద పడి తల పగలగొట్టుకున్నా వాళ్లకు పర్వాలేదు - అది(శక్తి) ఎక్కడ ఉన్నా, వాళ్ళు దాన్ని పొందాలి. అదొక గుప్తనిధి వేటలాంటిది.


అందుకే, ఎప్పుడైనా సమూహాలు పెరిగినప్పుడు, గురువులు శక్తి రూపాల్ని సృష్టించి, ‘‘వెళ్లి దానికి మోకరిల్లండి!’’ అని అనేవారు. ఇది ఆయన పాదాలు రక్షించుకునేందుకే..! మీరు మోకరిల్లి, శక్తి పొందగల ఒక రూపాన్ని మేము సృష్టించగలం, అదే మంచిది. ఈ నడిచే పాదాలు దూరంగా వెళ్ళిపోవచ్చు, కాని శక్తిరూపాలు మీ నుంచి దూరంగా వెళ్ళలేవు కదా..! మీరు రోజుకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మోకరిల్లవచ్చు, అవి వద్దనవు, అదే ఉత్తమం.

ప్రేమాశిస్సులతో ,
సద్గురు.