ప్రాణాయామం చేసేవారిపై మాంసాహార ప్రభావం ఏ విధంగా ఉంటుంది..??
ఆహారం విషయానికి వచ్చేసరికి ఇంకొకరి సలహా తీసుకోవడం కన్నా కూడా మీ శరీరాన్ని అడిగితే ఏది ఉత్తమమో తెలుపుతుంది అని సద్గురు చెబుతున్నారు.
 
 

సాధకుడు: మాంసాహారం తినటం వల్ల ప్రాణాయామం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? అంటే ప్రాణాయామం చేసే వారిపై మాంసాహార ప్రభావం ఎలా ఉంటుంది?

సద్గురు: చూడండి!! శాకాహార భోజనాన్నీ లేదా మాంసాహార భోజనాన్నీ మనం హింస-అహింస అనే కోణంలో చూడటం లేదు. మీరు అర్ధం చేసుకోవలసింది ఏంటంటే మనం ఏది తిన్నా అది హింసే. మీరు ఒక కారెట్ దుంప తిన్నా ఒక కోడిని కోసి తిన్నా అది హింసే. ఎందుకంటే రెంటిలోనూ ప్రాణం ఉంటుంది. అలాగని మీరు దేన్నీ తినక పోతే అది ఈ ప్రాణానికి హింసే అవుతుంది కదా!! కాబట్టీ మీరు ప్రతిరోజూ జీవించి ఉండటానికి ఎన్నో ప్రాణాల్ని తీయాల్సివస్తోంది. అది కాయగూరా? ఆకుకూరా? జంతువా? అనేది కాదు ప్రశ్న. మీరు జీవించి ఉండటానికి ప్రతి రోజు కూడా మీరు మరెన్నో ప్రాణాల్ని తియ్యాలన్నమాట. ఇది నిజమేనా?

సాధకుడు: “కాదు అయితే భగవంతుడే ఈ తభావతులన్నీ పెట్టాడు” అంటున్నాను.

సద్గురు: ఆయనేమీ చెయ్యలేదు. నేను మళ్ళీ చెబుతున్నా. ఆయన ఏమీ చెయ్యలేదు. “నేను జీవించి ఉండటానికి ప్రతిరోజూ ఇన్ని ప్రాణాలు బలి అవుతున్నాయి” అని మీకు తెలిసినప్పుడు మీరు ఎలా జీవించాలి? చెప్పండి ఎలా జీవించాలో? ఏమీ తెలియనట్టుగా ఉండగలమా? ఇప్పుడు “ప్రతి రోజూ నా జీవితాన్ని నిలబెట్టడానికి ఇన్ని జీవాలు ప్రాణాలు విడుస్తున్నాయి” అన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఎంత కృతజ్ఞతతో బ్రతకాలి. ఈ భూమి మీద మనం ఎంత సాత్వికతతో బ్రతకాలి? ఈ విషయం మీ ఎరుకలో ఉన్నట్లయితే మీరు తింటున్న ప్రతిసారీ, అది కారట్ అయినా కోడి అయినా కమలా పండు అయినా ఆపిల్ అయినా లేదా మరేదయినా సరే మీరు తింటున్నది మరో జీవాన్నే..కదూ..?

ఈ విషయం మీ ఎరుకలో ఉన్నప్పుడు మీరు అవసరమైనంత మేరకు మాత్రమే తిని, చాల వైవిధ్యమైన రీతిలో జీవిస్తారు. కాబట్టీ మీరు ఏమి తింటారు అనేది హింస-అహింస అనే ప్రాతిపదిక మీద చూడకుండా మీ శరీరానికి నప్పేదే తినాలి. మనం పులి తినే ఆహారం తినం. పులి, తన శరీరానికి తగిన ఆహారాన్ని తిన్నట్టే మనం కూడా మన శరీరానికి తగిన ఆహారాన్నే తినాలి. దీనికోసం మీరు ఒక ప్రయోగం చేసి చూడాలి. సరేనా? ఒకరోజు పూర్తిగా మాంసాహారమే తినండి. మీ శరీరం ఎలా స్పందిస్తుందో చూడండి. మరోరోజు కేవలం పళ్ళుతిని ఎలా ఉందో చూడండి. ఇంకోరోజు కేవలం కాయగూరలు తిని చూడండి. ఎలా ఉందో చూడండి. ఓరోజు పదార్ధాలని వండి తినండి.

మరోరోజు పచ్చివిగానే తినండి. మీకు ఏది బాగా నప్పుతుందో అదే ఆహారం తినండి. మీ డాక్టర్లకూ, పోషకాహార నిపుణులకూ మీ భోజనం గురించి ఏమీ తెలీదు. మీ యోగా గురువులకు కూడా తెలీదు మీ ఆహారానికి సంబంధించి మాత్రం మీ శరీరాన్ని అడిగి, అది చెప్పే మాట వినడం నేర్చుకోవాలి. మీ శరీరానికి ఏదికావాలో, ఏం తింటే మీ శరీరానికి  హాయో అదే మీరు తినవలసింది. అందుకని మనం మొదట నేర్చుకోవాల్సిన విషయం మన శరీరం చెప్పింది వినటం. ఆహారం అనేది శరీరానికి సంబంధించిన విషయం. కానీ ప్రస్తుతం మనం బుద్ధిపుట్టినట్టు తింటున్నాం. మీ మనసుకి ఆహారంతో ఎటువంటి పని లేదు. అవునా..? ఆహారం శరీరానికి. కాబట్టీ శరీరం మాట వినడం నేర్చుకోండి. అప్పుడు మీరే చూస్తారు, మీరు సహజంగానే సరైన విధంగా తింటారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1