నిరాశ ఒక మానసిక ప్రక్రియ మాత్రమే...

నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలు ఒకదానితో ఒకటి సంబంధమున్న ప్రక్రియలు. మనం నిరాశ చెందితే, నిరుత్సాహ పడతాం. నిరుత్సాహా పడితే, నిస్పృహ చెందుతాం. అయితే మనం ఎందుకు నిరాశ పడుతున్నాం? దీనిలో అర్థం ఏమైనా ఉందా? నిరాశ నుండి బయటపడేదేలా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ఆర్టికల్ తప్పక చదవండి!
 

నేను ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడినవ్వాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఇప్పటికే రెండుసార్లు విఫలమయ్యాను. నేను చాలా నిరాశ చెందాను. దీని నుండి బయటకి రాలేక పోతున్నాను. దీనిని నుండి బయటపడటానికి నేనేమి చేయాలి?


నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలు ఒకదానితో ఒకటి సంబంధమున్న ప్రక్రియలు. మీరు నిరాశ చెందితే, నిరుత్సాహ పడతారు. నిరుత్సాహా పడితే, నిస్పృహ చెందుతారు. నేను మీకు ఒక కథ చెబుతాను. సైతాను తన వ్యాపారం మాని వెళ్లాలనుకున్నాడు. అందుకని తన వ్యాపార పరికరాలను అమ్మకానికి పెట్టాడు. కోపం, కామం, దురాశ, అసూయ, ధనాపేక్ష, అహం – అన్నిటినీ అమ్మకానికి పెట్టాడు, అందరూ అన్నిటినీ కొనుక్కున్నారు. కానీ ఎవరో అతని సంచీలో ఇంకా ఏదో ఉందని గమనించారు. “ఇంకా నీ దగ్గర ఏమి ఉంది?” అని అడిగారు. అప్పుడు సైతాను అన్నాడు, “ఇవి నా అత్యంత సమర్ధవంతమైన పరికరాలు.

నేను నా మనసు మార్చుకుని మళ్ళీ వ్యాపారం చేయాలనుకుంటే, ఇవి కావాల్సి ఉంటుంది. అదీ కాక, ఇవి చాలా ఖరీదయినవి. జీవితాలను నాశనం చేయగల అత్యుత్తమ పరికరాలు.” “అవి ఏమిటో మాకు చెప్పండి!” అని అందరూ అడిగారు. “నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ” అని చెప్పాడు సైతాను. మీరు ఉత్సాహం కాకుండా, నిస్పృహతో నిండిపోయి ఉంటే, మీకు జీవితంలో ఎలాంటి అవకాశం కనపడదు. “నేను దీనితో నిరాశ చెందాను ” అని అన్నప్పుడు మీరు నిరుత్సాహం, నిస్పృహల నుండి ఎంతో దూరంలో లేరు – ఎందుకంటే నిరాశ వాటికి మొదటి మెట్టు.

కాబట్టి మీరు నిరాశని ఎలా ఆపుతారు? ముందు దానిని కొనడం మానేయండి! మీరు దానిని వదిలి వేయనవసరం లేదు ఎందుకంటే మన జీవితం, నిజానికి ప్రతి జీవితం కూడా ఉత్సాహమే! ఒక చీమ ప్రయాణించే విధానాన్ని చూడండి. మీరు దానిని ఆపటానికి ప్రయత్నిస్తే, అది నిరాశ చెందుతుందా? నిరుత్సాహ పడుతుందా? అది పడిపోయేదాకా ప్రయత్నిస్తూనే ఉంటుంది. జీవ శక్తికి నిరాశ తెలియదు. ఒక పరిమితమైన మనసుకి మాత్రమే నిరాశ తెలుస్తుంది ఎందుకంటే, పరిమితమైన మనసు తప్పుడు అంచనాలతో పని చేస్తుంది. మీ అంచనాలు మీ జీవితంతో అనుసంధానమై ఉండకపోతే, అవి ఫలించవు. అవి ఫలించనప్పుడు, మీ మనసుకు మీ జీవితం ముగిసిపోయినట్లు అనిపిస్తుంది.


నిరాశ చెందటం పూర్తిగా ఒక మానసిక ప్రక్రియ, అది ఒక జీవ ప్రక్రియ కాదు. 

నిరాశ చెందటం పూర్తిగా ఒక మానసిక ప్రక్రియ, అది ఒక జీవ ప్రక్రియ కాదు. మీరు మీ జీవితానికి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ కూడా అజ్ఞానం, మూర్ఖత్వాలతో కూడుకున్నదే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు, మీ జీవితానికే వ్యతిరేకంగా పని చేసే మానసిక స్థితిలో ఉన్నారు. నిజానికి మీరు పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలనే దానికి ఎటువంటి అర్ధమూ లేదు. మీరు ఉత్తీర్ణులవ్వాలని ఎందుకు అనుకుంటున్నారంటే అది ఒక సామాజిక అవసరం కాబట్టి, అది వేరే విషయం. కానీ మనుషులు ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు? మీరు పూజించే వారు- రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఏసు క్రీస్తు – వారు ఏ పరీక్షా కూడా ఉత్తీర్ణులవలేదే. కాని మీరు వారిని పూజిస్తున్నారు? ఎందుకు? మీరు పరీక్షలో ఉత్తీర్ణులవటానికి, ఎన్నడూ పరీక్షలో ఉత్తీర్ణులవని వారిని పిలుస్తున్నారు. దీనికి అర్ధం లేదు. ఇది మీరు నిజంగా అర్థం చేసుకుంటే, నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలు మీ దరిచేరవు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1