నిన్ను నువ్వు తెలుసుకో...

 

మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి...? ఎవరైనా పరిచయం చెయ్యాలి... అంతే. మీరు, చుట్టూరా ఉన్నవాటికి ఎంతో దృష్టి పెడుతున్నారు..కానీ, మీరు మీ మీద తగినంత దృష్టి పెట్టడం లేదు. కానీ, మీ జీవిత నాణ్యత అన్నది; మీరు మిమల్ని ఎలా అట్టిపెట్టుకున్నారు – అన్నదాన్నిబట్టి ఉంటుంది...ఔనా? మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, మీరు ఎలాంటి కారు బయట పార్కు చేశారు, మీ ఇల్లు ఎలా ఉంటుంది – ఇవన్నీ కూడా మీ జీవిత నాణ్యతని చెప్పవు. ఈ క్షణంలో మీలో మీరు ఎంత ఆనందంగా వున్నారు – అన్నదే మీ జీవిత విధానాన్ని తెలుపుతుంది. మీరు దానిగురించి ఏమీ చేయలేదు.

మీరేమనుకుంటున్నారంటే మీ సంతోషం – దేనికో పర్యవసానంగా జరుగుతుంది అని అనుకుంటున్నారు, మీ సంతోషం కోసం మీరు ఎన్నో కష్టమైన లక్ష్యాలను పెట్టుకుంటున్నారు. నేను ఆనందంగా ఉండాలంటే – మా ఆవిడ ఇలా ఉండాలి, మా ఆయన అలా ఉండాలి, మా పిల్లలిలా ఉండాలి, ఈ ప్రపంచమంతా మరో విధంగా అవ్వాలి – ఇవన్నీ జరగని పనులు. మీ ఆనందానికి, మీ సంతోషానికి ఏవేవైతే జరగాలి అనుకున్నారో – అవి మీకు జరగని పనులు. ఇప్పుడు మీరు సరే, పోనీ, ప్రశాంతంగా వుందామనుకున్నారు. ఎందుకంటే ఎంతోమంది ఇంక పారవశ్యంగానూ, ఆనందంగానూ ఉండలేము కేవలం ప్రశాంతంగా వుంటే చాలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులు కూడా – మీరు సాధించవలసిన అత్యుత్తమ లక్ష్యం “ప్రశాంతతే” – అని చెప్తున్నారు.

ప్రశాంతత అంతిమ లక్ష్యం కాకూడదు

ప్రశాంతత మీ జీవితంలో అత్యుత్తమ లక్ష్యం కాదు. మీరివాళ భోజనం చేయాలనుకోండి, దాన్ని ఆస్వాదించాలంటే మీరు ప్రశాంతంగా వుండాలి. ఔనా..? మీరు కనీసం ప్రశాంతంగానైనా ఉండకపోతే; మీ జీవితంలో ఉన్నది అంటూ ఏదీ లేదు. మీరు ప్రశాంతంగా వుండడం అంటే – మీరు మీ మనసుని కలుషితం చేసుకోడంలేదు అని. మీరు ప్రశాంతంగా వుండడం అంటే, మీ వ్యవస్థ కొంత హాయిగా ఉందని అర్ధం. మీకు, మీ మనస్సును ఎలా అట్టిపెట్టుకోవాలి, మీ భావాలను ఎలా పెట్టుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా అట్టిపెట్టుకోవాలి – అనే విషయం మీకు తెలిసినపుడు మీరు ప్రశాంతంగా వుంటారు. ఇదేమీ పెద్ద రాకెట్ సైన్సు కాదు. ఇది ఎంతో మౌలికమైన విషయం. మీ ఇంట్లో ఒక కుక్క ఉంటే, మీరు దానికి గనక భోజనం పెడితే; అది ప్రశాంతంగా కూర్చుంటుంది...పారవశ్యంలో ఉండకపోవచ్చు. కానీ, ప్రశాంతంగా కూర్చుంటుంది.

ఇంత గొప్ప యంత్రాంగం మీ దగ్గర ఉంది .. మీరు, ఒక కమ్మరిలా ప్రవర్తిస్తూ ఉంటే, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండడం అన్నది ఎంతో కష్టమైన విషయంగా అనిపిస్తుంది.

ఎన్నోసార్లు, అవి పారవశ్యంలోకూడా వుంటాయి... ఔనా? మీ కుక్క ప్రశాంతంగా వుండగలిగితే...మీరేందుకు వుండలేరు..? ఓ ... అది నాలా వ్యాపారాన్ని నడపక్కర్లేదు... అది కాదు ఉద్దేశ్యం. దానిపని దానికి ఉంది. మీరు బయట ఏ పని చేస్తున్నారు - అన్నదానితో ఏమీ సంబంధం లేదు. మీ అంతర్గతంగా ఉన్నవి ఎలా జరుగుతున్నాయి - అన్నదానిపైనే ఆధారపడి  ఉంటుంది. అంటే, మీ శరీరమో, మీ మనస్సో,  మీ రసాయనికతో,  మీ భావాలో, మీ శక్తొ  –  ఏదో ఒకటి...  మీ దగ్గర నించి ఆదేశాలు తీసుకోవడంలేదు అని అర్థం. అవి వాటికి నచ్చినవేవో అవి చేస్తున్నాయి.  ఒకసారి ఇవి మీ నియంత్రణలో లేకపోతే, మీరు ప్రశాంతంగా ఉండడం అన్నది జరగని పని.

మీరు, మీ కారులోకి వెళ్ళి కూర్చోండి, మీరు స్టీరింగు ఒకపక్కకు తిప్పితే, మరో పక్కకు వెళ్తోందనుకోండి..ఆ కారును మీరు ప్రశాంతంగా నడపగలరా..? లేదు.  మీకు సహజంగానే ఆందోళనగా వుంటుంది. ఇప్పుడు మీరు అనే వాహనానికి కూడా ఇదే జరిగింది. ఇది నియంత్రణ తప్పింది. మీరు దానిని తెలుసుకోవడానికి ఏమీ ప్రయత్నం చేయలేదు. కనీసం, దాని స్టీరింగు వీల్ ఎక్కడుందో కూడా తెలుసుకోవాలని అనుకోలేదు. ఇది కారంత సరళమైనది కూడా కాదు... ఇది ఇంకా ఎంతో సంక్లిష్టమైన కంప్యూటర్ లాంటిది. ఏమిటంటే, చాలామంది కనీసం దీని కీ-బోర్డ్ ఎక్కడుందో కనుక్కుందామానుకోవడం లేదు. వాళ్ళు ఎక్కడో ఇలా..ఇలా..ఇలా కొట్టేస్తే ... పనిచేసేస్తుంది అనుకుంటారు.

మీరు ఏదైనా సరే, దేన్నైనా సరే; మీ జీవితంలో సరిగ్గా చేయాలి అనుకుంటే, మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం అన్నది మొదటి పని.

మీకు ఇంత అద్భుతమైన యంత్రాన్నిచ్చినప్పుడు; మీరు దాన్ని సరిగా చూసుకోకపోతే; అది మీకు ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. ఏదో, అదృష్టవశాత్తూ అది పని చేస్తోంది. మీరు, మీ అరచేతులు పై దిశగా ఉంచితే మీ శ్వాస ఒక విధంగా ఉంటుంది.  మీరు మీ చేతులని ఇలా పెడితే, మీ శ్వాస మరో విధంగా వుంటుంది. మీరు బోర్లా పెడితే ఒక విధంగా ఉంటుంది. మీరు వెల్లకిలా పెడితే ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది అంత అధునాతనమైన యంత్రాంగం. ఇది టచ్ స్క్రీన్ కంటే కూడా అధునాతనమైనది. మీరు, ఊరికే అలా కోరుకుంటే చాలు అది జరుగుతుంది. ఇంత గొప్ప యంత్రాంగం మీ దగ్గర ఉంది .. మీరు, ఒక కమ్మరిలా ప్రవర్తిస్తూ ఉంటే, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండడం అన్నది ఎంతో కష్టమైన విషయంగా అనిపిస్తుంది.

ప్రశాంతత మీ జీవితంలో అత్యుత్తమమైన లక్ష్యం కాదు. ఎప్పుడూ, ప్రశాంతత అన్నది మీ అత్యుత్తమ లక్ష్యంగా పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మీరు కేవలం ప్రశాంతంగా మరణిస్తారు....అంతే..!! ప్రశాంతంగా ఉండడం మీ జీవితంలో మొదటి విషయం. మీరు ఏదైనా సరే, దేన్నైనా సరే; మీ జీవితంలో సరిగ్గా చేయాలి అనుకుంటే, మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం అన్నది మొదటి పని. ఎంతో మౌలికమైన ఈ విషయం ఈ రోజున స్వర్గానికి వెళ్లి కూర్చుంది.  చాలామంది మరెక్కడికో వెళ్లినప్పుడు సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారు. ఎందుకంటే, మీరు ఈ మానవ యంత్రాంగాని పట్ల ఎప్పుడూ సరైన దృష్టి పెట్టలేదు. ఇది ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడం లేదు.

మీలో జరుగుతున్న వాటన్నిటికీ మూలం ఏమిటన్నది మీరు చూడలేదు. దీనికి కొద్దిగా దృష్టి పెట్టాలి. అందుకే మా ప్రోగ్రామ్ ని “ఇన్నర్ ఇంజినీరింగ్” అన్నాం. మనం ఈ ప్రపంచాన్నంతా కూడా మనకి కావలసినట్టుగా తయారు చేసుకున్నాం. ఎన్నో సౌకర్యాలు కల్పించుకున్నాం. కానీ, శ్రేయస్సు అన్నది జరగలేదు. శ్రేయస్సు అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే –అంతర్ముఖంగా మీకు కావలసినట్టు మీరు ఉండగలిగినపుడే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు