యోగ శాస్త్రం చెప్పే ఏడు శక్తి చక్రాలూ వేరు వేరు అంగాలుగా, వేటికవిగా ఉండవు అంటున్నారు సద్గురు. వీటిని ఏడుగా విభజించి చెప్పటం సులభంగా అవగాహన చేసుకొనేందుకు మాత్రమే అంటున్నారు. బుద్ధితో విషయాన్ని విశ్లేషించి చేసే వివేచనకూ, అన్ని విశ్లేషణలకూ అతీతమైన జ్ఞానానికీ ఉన్న భేదాన్ని గురించి కూడా ఆయన చర్చిస్తున్నారు.

సద్గురు: యోగ శాస్త్రం చెప్పే ఏడు చక్రాలనూ, వాటి ద్వారా యోగం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో గమనించేటప్పుడు, మనం ఒక సందర్భమూ, నేపథ్యమూ దృష్టిలో ఉంచుకొని చూడాల్సి ఉంటుంది. మేము యోగాని ఎప్పుడూ ఒక శాస్త్ర సాంకేతికతగానే చూస్తూ వచ్చాం ఎందుకంటే మేము ఉనికితో పని చేస్తున్నాం కాబట్టి.

ఈ నాటి ప్రపంచంలో చాలా మంది యోగ శాస్త్రాన్ని, తత్త్వశాస్త్రంగా (philosophy) అర్థం చేసుకొంటుంటారు. తత్త్వ శాస్త్ర సిద్ధాంతాలను, వాస్తవాలతో నిమిత్తం లేకుండా నిర్మించచ్చు. అసలు తత్త్వ శాస్త్ర సిద్ధాంతాలలో చాలా భాగం మనకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి చేసిన చిత్ర విచిత్రమైన, ఊహా జనితమైన ప్రతిపాదనలే. ఎలాగూ ఎవరికీ ఏమీ తెలియని విషయమే. కాబట్టి, ఎవరి తత్త్వ శాస్త్ర సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎలాగూ దానిని గురించి ఎవరికీ ఏమీ తెలియదు గదా! చాలా సమాజాలలో తాత్త్విక బోధలు చిరకాలంగా ఇలాగే జరుగుతూ వస్తున్నాయి.

గ్రహించినవీ, గ్రంధించనివి

యోగ సంప్రదాయంలో అతి విశిష్టమైన విషయం, ఇందులో ఎలాంటి తాత్త్విక సిద్ధాంతాలూ లేక పోవటం! శుష్కమైన సిద్ధాంతాలానూ యోగ శాస్త్రం నిరసిస్తుంది. కొంతమంది ఒక చర్చ లేవదీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ‘దీనికి శాస్త్ర ప్రమాణం, శ్రుతి ప్రమాణం ఉన్నాయా?’ అని. ‘మీకు తెలిసిన దానికి ఏ శాస్రమూ, శ్రుతీ ప్రమాణం చూపుతోంది?’.

చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోని విషయం ఒకటి ఉంది. శాస్త్ర గ్రంథాలలో చెప్పిన విషయాలన్నీ యోగులూ, ఋషుల వంటి మహాపురుషులకు ప్రాప్తించిన విశిష్ట జ్ఞానం ఆధారంగా చెప్పినవి. అంతే కాని, శాస్త్రంలో చెప్పిన మాటలను ఆ యోగులూ ఋషులూ వల్లించలేదు.

ఒకానొక మహాపురుషుడు స్వానుభూతి పూర్వకంగా తెలుసుకొన్న దాన్ని దేన్నో ఏదో ఒక రూపంలో ఇతరులకు బోధించటమో, ప్రకటించటమో, శిష్య పరంపరకు అందజేయటమో చేసినప్పుడు దానిగురించి తెలియని, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని రాసుకొని, దానికి ఒక క్రమబద్ధమైన గ్రంథ రూపం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వాటిలో అక్కడక్కడా కొన్ని అనర్ఘ రత్నాలు కనిపించచ్చు. కానీ మిగిలిందంతా అజ్ఞానమే. పవిత్రంగా భావించబడే అజ్ఞానం!

ఇందుకు మంచి ఉదాహరణ గౌతముడూ, ఆనంద తీర్థుడూ. గౌతముడి గురించి మనకు తెలిసిందంతా ఆనంద తీర్థుడు గ్రంథ రూపంలో రాసిపెట్టి ఉంచిన విషయాల వల్లే. నన్ను గురించి యూ ట్యూబ్ (you-tube)ద్వారా మీరు తెలుసుకొన్నదంతా, విడియోగ్రాఫర్ తన కెమేరా ద్వారా నమోదు చేసిన విషయాలే. నేను వాళ్ళను నమ్ముతాను. ఎందుకంటే, వాళ్ళు కెమేరాలో తమ స్వబుద్ధి ఏదో చొప్పించేసి దృశ్యాలన్నింటినీ వాళ్ళకు కావలసిన విధంగా రాబట్టి రికార్డు చేయలేరు. కానీ రాత పూర్వకంగా విషయాలను భద్రపరుస్తున్నప్పుడు, రాసే వాళ్ళ స్వబుద్ధి కొంతయినా వాడక తప్పదు. వాళ్ళ ఆత్మ విశ్వాసం పెరిగిన కొద్దీ, ఈ స్వబుద్ధి వినియోగం మరీ ఎక్కువైపోతుంటుంది. దీనికి కారణం ఉంది. జ్ఞాని అయిన మహనీయుడు చెప్పే మాటలు చాలా భాగం సామాన్యులకు అర్థం కావు. అందుకని ఆ జ్ఞాని మాటలను ఎవరో కూర్చొని, అందరూ ఇష్టపడేలా గ్రంథస్థం చేస్తారు.

అసలు, ఒక మనిషికి అనుభవమైన విషయాన్ని మరొకరు సంపూర్ణంగా అందుకొని, గ్రహించగలగటమనేది జరిగే పని కాదు – ఆఖరికి అది పున్నమి చంద్రుడిని చూడటం లాంటి సాధారణమైన అనుభవమైనా సరే!

అతి సాధారణమైన అనుభవాలనే గ్రహించటం సాధ్యం కాకపోతుంటే, ఇక మహత్తరమైన లోకోత్తరమైన అనుభూతులను గ్రహించటం మాట వేరే చెప్పాలా? అలా సంపూర్ణంగా గ్రహించటం అసాధ్యం కనకే, ఎవరో కూర్చొని వాటిని సరళంగా, క్రమబద్ధంగా క్రోడీకరించే ప్రయత్నం చేస్తారు. ‘చంద్రుడు అంటే గుండ్రంగా ఉండే ఒక వస్తువు. దాన్ని చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది’ అంటారు. ఇది చదివిన వాళ్ళకు, వాళ్ళ వాళ్ళ స్ఫురణ శక్తి బట్టి, చంద్రుడి రూపమూ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా స్ఫురిస్తాయి. ఫుట్ బాల్ అభిమానులకు చంద్రుడు ఆకాశంలో ఉన్న ఫుట్ బాల్ లాగా అనిపిస్తాడు. ఆకలిగా ఉన్న వాళ్ళకు, పెద్ద వెన్నముద్ద లాగా అనిపిస్తాడు - ఈ భావన మన దేశంలో చెప్పుకొనే పిల్లల కథలలో తరచుగా వినిపిస్తుంది.

వివేచనా, బుద్ధీ (Discernment and Intellect)

ఈ ఏడు పార్శ్వాలు తత్త్వశాస్త్ర పరమైన విశేషాలు కాదు. ఇది కేవలం ఒక వర్గీకరణ. అసలు జీవం (life) అనేది విభజనలకు లొంగేది కాదు. కానీ అవగాహనలో సౌలభ్యంకోసం ఇలాంటి వర్గీకరణలు చేస్తూ ఉంటారు. కనక, ఏడు శక్తి చక్రాలంటే, ఏడు విభిన్నమైన అంగాలూ, భాగాలూ అని అర్థం చేసుకోకూడదు. జీవన ప్రవాహం ఒకే ఒక సమగ్రమైన అవిభాజ్య విషయం. కానీ బుద్ధికెప్పుడూ వర్గీకరణలు కావాలి. వర్గీకరణా, విభజనా లేక పోతే, బుద్ధి ఏ విషయాన్నీ గ్రహించుకోలేదు. బుద్ధికి వివేచన చేయటం సహజ ధర్మం. ఆ వివేచన శక్తి లేకపోతే, మీ బుద్ధి ఒక పనికిరాని, చెడిపోయిన పనిముట్టుతో సమానం.

ఈ ప్రపంచంలో బతికి బట్ట కట్టాలంటే, వివిధ విషయాలను స్పష్టంగా గుర్తించగల వివేచన శక్తి చాలా అవసరం. కానీ ఈ బ్రహ్మాండ భాండాన్నే ఆపోశనం పట్టేయాలంటే.. దాన్నంతా మీలో ఒక భాగంగా జీర్ణింపజేసేసుకోవాలంటే..అదంతా మీలో లీనమైపోవాలంటే…అప్పుడీ వివేచనా, వివక్షా అంతగా ఉపయోగపడవు. బ్రహ్మాండాన్ని అంతా మీలో భాగం చేసుకోగోరినప్పుడు, దాన్ని వివిధ వస్తువులుగా వివేచించి చూసేట్టయితే ఎలా? బ్రహ్మాండంలో ఏ గ్రహాన్ని మింగకుండా వదిలేస్తారు చెప్పండి? వివేచన అంటే, మీకు కావలసిన విషయాలనూ, మీకు అక్కరలేని విషయాలనూ, వేరు వేరు చేసి గుర్తించటం. మీకు ఇష్టమైన వాటినీ, అయిష్టమైన వాటినీ వేరుగా గ్రహించటం. మంచినీ చెడునూ వేరు చేయగలగటం, ఇది ఉత్తమం - ఇది అధమం అని విభజించటం. ఇది దేవుడూ-ఇది దయ్యమూ అని భేదం తెలుసుకోగలగటం.

జ్ఞానోదయం (enlightenment) అంటే, ప్రతి దాని మీదా జ్ఞాన ప్రకాశాన్ని ఎలా ప్రసరిస్తారంటే, అన్నిటినీ ఒకే విధంగా చూడగలుగుతారు. అప్పుడు మీకు ఎలాంటి భిన్నత్వమూ, వర్గీకరణా రుచించవు. వెలుగు నీడలు రెంటినీ మీరు ఒకే విధంగా అనుభూతి చేసుకొంటారు. మీకు భేద భావన అన్నదే ఉండదు. జ్ఞానోదయం అంటే మీరు లోపలి నుండి వెలుగుతున్నారని. అందుచేత, మీకు ఇక ఎక్కడయినా సరే అంధకారం అనేది అనుభవం కానే కాదు! అన్ని వర్ణాలకూ అతీతం

మనం ఆకారమూ లేని (dimensionless) పార్శ్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, బుద్ధికి సులభంగా అందేలా ఉండాలని, దానిని తరగతులుగా విభజిస్తున్నాం. అంతే కానీ, ‘నేను ‘అనాహత’ చక్రం మనిషినీ’, ‘నేను ‘విశుద్ధి’ చక్రం మనిషినీ’ అని మిమ్మల్ని మీరు వర్గీకరించుకోనక్కరలేదు. కొందరు చెప్పుకొంటారులెండి, ‘నేను కాఫీ మనిషిని’, ‘నేను టీ మనిషిని’ అంటూ. అలాగే ఉదయం త్వరగా లేచే వారు, నేను ‘ఉదయం’ మనిషిని అని చెప్పుకొంటుంటారు. అలా ఏదో ఒక వర్గానికి చెందినట్టుగా గుర్తింపు చెప్పుకోనక్కర్లేదు. మీరు ఫలానా, ఫలానా రకాల పనులు చేసుకోవాలంటే, ఫలానా ఫలానా లక్షణాలు పెంపు చేసుకొని ఉపయోగించాల్సివస్తుంది. కానీ మీరు ‘జీవ’ తత్త్వం తెలుసుకోవాలంటే, ‘వైరాగ్యం’ లేక ‘విరాగం’ అనే అంశాన్ని గురించి తెలుసుకోవాలి.

‘వై’ అంటే, అతీతానికి సూచన. రాగం’ అంటే రంగు. అన్ని రంగులకూ ఆవలగా, అతీతంగా ఉన్నది వి-రాగం. రంగు లేనిది. ఇంగ్లీషులో ‘colorless’ అంటే కొంచెం దోషాత్మకంగా, ‘వెలిసి పోయింది’, ‘నిస్తేజమై పోయింది’, స్తబ్ధంగా ఉన్నది’ అన్న అర్థం వస్తుంది. వైరాగ్యం అలాంటి స్థితి కాదు.

అన్ని వర్ణాలకూ అతీతమైన దాన్ని మనం వర్ణ రహితం అంటున్నాం. ఏ రంగూ లేని చోటే పారదర్శకత (transparency) ఉంటుంది. పారదర్శకత గుండా అయితేనే మనం చూడగలం. ఏ రంగూ లేని గాలి మనకు ప్రాణాధారం. ఆ గాలి నీలి రంగుకు మారిందనుకోండి. మీకు ఇక ఏదీ కనిపించదు. నీలం రంగుగా ఉన్న గాలి కొంచెంసేపు మీకు కొత్తగా, చిత్రంగా అనిపించచ్చు. కానీ కొద్ది సేపట్లోనే మళ్ళీ ఈ రంగులన్నీ మాయమైపోవాలనీ, లోకాన్ని మళ్ళీ మామూలుగా చూడాలనీ అనిపిస్తుంది. వై-రాగ్యంతో ఉండటం - లేక, అన్ని వర్ణాలకూ అతీతంగా ఉండటం అంటే, స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటం. మీ దృష్టి ఏ రంగు వల్లా మసకబారకుండా, స్ఫుటంగా ఉంటుందన్న మాట. ఉదాహరణకు, కొన్ని నదులు ఉన్నాయి. నీలి నైలు (Blue Nile) నదీ, పసుపు నదీ (Yellow river), ఎర్ర నదీ (Red river) లాంటివి. నిజానికి వీటి జలాలు నీల వర్ణంలోనో, పచ్చగానో, ఎర్రగానో కనిపించటానికి కారణం, వాటి ప్రవాహాలు మోసుకు వచ్చే మట్టి రంగు.

మీకు సొంతవంటూ ఏ రంగూ, లక్షణాలూ లేకపోతే, మీరు ఎలాంటి చోటయినా ఇమిడి పోగలరు. అప్పుడు మీ వెనక ఉన్న నేపథ్యం బట్టే మీ రంగు కనిపిస్తుంది. నీలి నేపథ్యంలో మీరు నీల వర్ణంలో కనిపిస్తారు. ఎర్రటి నేపథ్యంలో మీరు ఆ రంగులో కనిపిస్తారు. ఏ సందర్భం లోనూ, మీకు ఎక్కడా, మీ పరిసరాలతో, నేపథ్యంతో ఘర్షణా, నిరోధం (resistance) ఉండవు. ఏ క్షణంలోనయినా, ఎలాంటి నేపథ్యంలో నయినా మీరు సంపూర్ణంగా లీనం అయిపోగలరు.

కనక, మనం ప్రస్తావించుకొనే ఈ ఏడు పార్శ్వాలు సప్త వర్ణాల లాంటివి. కాంతిని విశ్లేషించి రకరకాల రంగులను ప్రతిఫలింపజేయటంలో తప్పేమీ లేదు. కానీ మీరు అలా విశ్లేషితమైన (refracted) కాంతిలోనే ఎప్పుడూ ఉండిపోతే, మీరు ఈ జీవ జగత్తులన్నిటినీ వక్ర దృష్టి తోనే చూడటం జరుగుతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు