ఒక మంచి కథ ఉంది. విష్ణువు భార్యలు ఇద్దరు, లక్ష్మి - భాగ్యదేవత, అలక్ష్మి - దురదృష్టదేవత - తమకు తామే అత్యంత సౌందర్యవతులమని అనుకున్నారు. ఒకరోజు వాళ్లు విష్ణువు దగ్గరకు వచ్చి, ‘‘మా ఇద్దరిలో ఎవరు అత్యంత సౌందర్యవతి?’’ అని అడిగారు. విష్ణువు లక్ష్మితో, ‘‘నీవు వస్తున్నప్పుడు అత్యంత సౌందర్యవతివి’’ అన్నాడు. అలక్ష్మితో, ‘‘నీవు వెళుతున్నప్పుడు అత్యంత సౌందర్యవతివి’ అన్నాడు. అదృష్టం రావడం, దురదృష్టం పోవడం - ఎంత అందంగా ఉంటుంది? ఇది చాలా తెలివైన సమాధానం. కాని సరైన సమాధానం ఏమిటి? ఎవరు నిజంగా గొప్ప సౌందర్యవతి? ఇది ఒక స్త్రీ సౌందర్యం గురించే కాదు, సృష్టిలో ఉన్న దేనికైనా సరైన సమాధానం అంటూ ఏమీ లేదు. సముచితమైన సమాధానం మాత్రమే ఉంటుంది. ఇదొక సముచితమైన సమాధానం.

జీవితమంటే కరెక్ట్ గా ఉండాలని కాదు, అది సముచితంగా ఉండాలి. అయితే చేయవలసిన సరైన పని ఏమిటి? అటువంటిదేమీ లేదు. సముచితమైనదేది అన్నదే ప్రశ్న. అప్పుడే మీరు జీవితాన్ని స్వీకరించగలుగుతారు. మీరన్నీ సరైన పనులే చేస్తే మిమ్మల్ని మీరు మూర్ఖులుగా మార్చుకున్నట్టే. జీవితంలో ఏది ఒప్పు అనేదాని గురించే మీరు చూస్తూ ఉంటే మీ జీవితం ఖాళీగా, మరుభూమిగా తయారవుతుంది. జీవితం ప్రధానంగా ఔచిత్యానికి సంబంధించింది. మీరు ఒప్పులకోసమే చూస్తే మీరు మంచి మనిషి కావచ్చు.

జీవితమంటే కరెక్ట్ గా ఉండాలని కాదు, అది సముచితంగా ఉండాలి.
తాము మంచి వాళ్లమనుకునే వారికి నీతులు, విలువలు, నీతిసూత్రాలు ఉంటాయి. అందువల్ల వాళ్లు ఇది ఒప్పు, ఇది తప్పు అన్నవి చూస్తారు. ఈ నైతికత, విలువల వ్యవస్థల మీద ఆధారపడతారు. ఎందుకంటే ఇవి వారికొక ఆధిక్య భావనను కల్పిస్తాయి. తాము మంచి వాళ్లమని విశ్వసించేవాళ్లు ఎల్లప్పుడూ తక్కిన ప్రపంచాన్ని తక్కువగా చూస్తారు.

అతి సౌందర్యవతి అయిన స్త్రీ కూడా మీరు పైనుండి చూసినప్పుడు అంత సౌందర్యంగా కనిపించదు. ఎందుకంటే మీరు నిరంతరం కిందికి చూస్తూ ఉంటే ప్రతిదీ వికారంగా, నల్లగా కన్పిస్తుంది - అది నున్నగా మెరుస్తూ ఉంటే తప్ప. మంచి మనుషులు అనిచోట్లా ఉన్నారు. వాళ్ల విలువలు వాళ్లకున్నాయి, వాళ్ల సిద్ధాంతాలు వాళ్లకున్నాయి, వాళ్లు చాలా నీతిమంతులు, కాని వాళ్లిక్కడ - ఇక్కడేం జరుగుతున్నదన్న దానితో ఎటువంటి సంబంధమూ లేకుండా - సంవత్సరాల తరబడి జీవించవచ్చు. మీరేమైనా చేయండి, వాళ్ల మంచితనం కారణంగా వాళ్లనది కదిలించలేదు. మంచివాళ్లు స్వర్గానికి వెళతారన్న నమ్మకంతో వాళ్లు జీవిస్తారు. మీ నైతిక విలువలతో మీరు ఏం చేస్తున్నారంటే - ఏది మొదలో, ఏది చివరో తెలియని ఈ జీవితాన్ని సరళీకరించి ఒక నియమబద్ధతను ఏర్పరచాలి అనుకుంటున్నారు. జీవన ప్రక్రియ చాలా అరాచకంగానూ, భరించలేనిదిగానూ మీకు కనిపిస్తుంది. మీ సొంత సూత్రాలనూ, మీ నైతికతనూ, నీతిసూత్రాలనూ స్థాపించడం ద్వారా ఒక నియమబద్ధతను తేవడానికి మీరు ప్రయత్నిస్తారు. మీరు మీ పనికిమాలిన జీవన నియమబద్ధతను స్థాపించే ప్రయత్నంలో మీరు అద్భుతమైన సృష్టి నియమాలను పూర్తిగా గమనించలేకపోతున్నారు. నియమబద్ధంగా ఉండనవసరం లేదు. సృష్టి అద్భుతమైన క్రమబద్ధతతో ఉంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు