శివుడి గురించిన అత్యంత విశిష్ట విషయం ఆయన మూడో కన్ను తెరవటం. ఆయన ఇంకా ఎన్నో ఇతర పనులు చేశాడు - తాండవం చేశాడు, ధ్యానం చేశాడు, రెండు సార్లు పెళ్లి కూడా చేసుకొన్నాడు. అదంతా సరే, కానీ మనం ఈనాటికీ ఆయనను స్మరించుకొనేందుకు ముఖ్యమైన కారణం ఆయన తన మూడవ కన్ను తెరవటం. ఎన్నో వేల సంవత్సరాల తరవాత కూడా ఆయనకు మనం శిరసు వంచి నమస్కరించటానికి కారణం, జ్ఞానానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవటమే. జ్ఞానం పొందటమంటే, అన్నింటి నుంచి విముక్తి పొందటమే. మరి జ్ఞానం అన్నది మనకు ప్రస్తుతం ఉన్న గ్రహణ శక్తి పరిమితులన్నీ అధిగమిస్తే తప్ప కలుగదు.

చాలామంది మానవులు గ్రహించలేని విషయాలు గ్రహించగలగటం శివుడి విశిష్టత. మానవజాతిలో చాలా మందికి అదృశ్యంగా ఉండిపోయే విషయాలన్నీ, ఆయనకు మామూలుగా కనిపించే సాధారణ దృశ్యాలు. మూడో కన్ను అంటే అదే. శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు అందులోంచి అగ్ని పుట్టుకొచ్చింది అంటారు. ఆయన తనలో ఉన్న, తనదైన సర్వస్వాన్నీ, తనకు ఎంతో ముఖ్యం అనుకొన్న విషయాలనన్నిటినీ, దహనం చేశేశాడు అని ఆ అగ్ని సూచిస్తుంది. ఆయన తన అంతర్గతంగా ఒక బట్టీగా మారి దహించటానికి వీలైనదంతా దహించి వేశాడు. అలా చేసినప్పుడు ఆయన శరీరంలోని అన్ని రోమకూపాలలో నుంచి స్వేదమూ, రక్తమూ స్రవించటానికి బదులు భస్మం బయటికి వచ్చింది. ఆయన అజ్ఞానపు అణువణువునూ – ఒకరు నిజమని భావిస్తూ వచ్చిన సర్వస్వాన్నీ- దగ్ధం చేశాడనటానికి అది సూచన. అజ్ఞానాన్ని దహించిన తరవాత, ఇక మూడో కన్ను తెరవడమనే అవకాశం నిరాకరించబడదు ఆయనకు.

రెండు మార్గాలు

మూడో కన్ను తెరిచేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి, లోపల అంతా ఒక శూన్యం ఏర్పడి, ఆ శూన్యం ద్వారాన్ని కూడా లోపలికి పీల్చేయడంతో ఇక సహజంగానే తెరుచుకోక తప్పదు. లోపలి శూన్యం వల్ల ద్వారం బలహీనమై లోపలికి పడిపోతుంది. శివుడు దహనం చేసింది తన ఆలోచనలనూ, భావోద్రేకాలనూ, ధారణలనూ, అనుబంధాలనూ మాత్రమే కాదు, తన ఉనికినే దహించేసుకొన్నాడు. అందుకే సంపూర్ణమైన శూన్యత్వం ఏర్పడింది. దానితో నేత్ర ద్వారం లోపలికి పడిపోయి, మూడో కన్ను తెరుచుకొన్నది.

మూడోకన్ను తెరుచుకొనేందుకు మరో మార్గం, మీరు మీ భావనలూ, భావోద్రేకాలూ ఇలాంటి వాటన్నిటినీ ఎంతమాత్రం బయటికి ప్రకటించకుండా లోపలే అణచి ఉంచుకొంటారు. అన్నిటినీ మీలోనే దాచుకొంటారు. బయటికి ఒక్క మాట కూడా పలకలేరు. మీరు చూసే ఉంటారేమో, మీరు నాలుగు రోజులు నిశ్శబ్దంగా ఉండిపోతే, అయిదో రోజుకు మీకు ఒక్క సారిగా ఏదో పాట పాడేయాలనిపిస్తుంది. మీకు పాట పాడటం చేతకాకపోతే కనీసం పెద్దగా కేకలు పెట్టాలనిపిస్తుంది. అణచి ఉంచిన దాన్ని విడుదల చేయాలని ఆతురత కలుగుతుంది. అలా లోపల విపరీతంగా పెరుగుతూ పోతున్న ఒత్తిడిని విడుదల చేయకపోతే, ఆ పీడనానికి ఫలితంగా కూడా తలుపులు బద్దలై బయటికి పడిపోయి ద్వారం తెరుచుకొంటుంది. ఇది రెండో మార్గం.

మధ్యేమార్గం

ఈ రెండు మార్గాలూ కాకుండా మీరేదో లౌక్యం ప్రదర్శించి, మధ్య మార్గం ఒకటి పట్టుకోవాలని చూస్తేమాత్రం, మీరెక్కడికీ వెళ్ళదలచుకోలేదని అర్థం. అసలు జీవితంలో ఇలా మధ్యే మార్గాలు వెతుకుతూ ఉందామనుకొనేవారు, జీవితంలో ఏ గమ్యస్థానమూ చేరకుండా గడిపేయాలనే దృఢమైన నిర్ణయం చేసుకొన్నవాళ్ళే. ఈ మధ్యే మార్గం అటూ ఇటూ కాకుండా ఉంటుంది. అందుకే అది మీకు సౌకర్యంగా అనిపిస్తుంటుంది. దానికి ఒక్కటే అర్థం. అబద్ధాలలో ఆత్మవంచనలో సమయమంతా గడిపేయటమే మీ కోరిక అని. నేను ఎక్కడికి చేరినా,చేరకపోయినా ఫరవాలేదు గానీ,నాకు తోచింది మాత్రమే చేసుకొంటూ వెళతానూ అంటే అదే మధ్య మార్గం. మధ్యే మార్గమంటే, ఏ గమ్యానికీ చేరకుండా ఉండిపోవటం, కొన్నాళ్ళ తరవాత దీని గురుంచి ఆలోచించినా కూడా ఎక్కడికీ తీసుకెళ్లదు.

మధ్యే మార్గమంటే, ఏ గమ్యానికీ చేరకుండా ఉండిపోవటం, కొన్నాళ్ళ తరవాత దీని గురుంచి ఆలోచించినా కూడా ఎక్కడికీ తీసుకెళ్లదు.

మీరు ఒక వీథిలో నడిచి వెళ్తున్నారనుకోండి. మార్గ మధ్యంలో ఒక పెద్ద బండరాయి ఎదురయిందనుకోండి. దాన్ని తప్పించుకు వెళ్ళటానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒక వైపుగా పోదామంటే, ఒక పెద్దపులి గాండ్రిస్తూ నిలబడి ఉంది. రెండో వైపు పోదామంటే, అగ్ని జ్వాలలు భగభగమంటున్నాయి. కనక మధ్యే మార్గం పట్టుకొంటానని మీరు ముందుకెళ్లారనుకోండి. ప్రయోజనమేముంది? కొంచెం సేపు శరీరానికి కసరత్తే తప్ప మీరు ఏ గమ్యమూ చేరలేరు.

కనుక మీరు పూర్తిగా శూన్యత్వాన్నన్నా పొందగలగితే, అప్పుడు ఆ శూన్యత్వపు పీడనమే మీ కన్ను తెరుస్తుంది. లేదంటే, మీ లోపలే అంతర్గతంగా ఒత్తిడి బాగా పెరిగిపోనివ్వాలి. అప్పుడు తలుపులు బద్దలై తెరుచుకొంటుంది. - ఈ రెండే మార్గాలు. వీటిలో మొదటి మార్గం రెండో దానికంటే మెరుగు. ఎందుకంటే ఒత్తిడి పెంచేసి తలుపు బయటికి నెట్టే పద్ధతిలో, ఆ తలుపు ఈ రోజు తెరుచుకొని మళ్ళీ రేపు మూతపడచ్చు. లేదా, ఒత్తిడి బాగా పెరగకముందే, మీకు మరేదో వెర్రి ఆలోచన వచ్చి మీరు దాని వెంబడి పరుగెత్తచ్చు. అంతేకాదు, ఒక్క భావనను కానీ, భావోద్రేకాన్ని కానీ బయటికి ప్రకటించకుండా, ఒక్క మాట కూడా పలకకుండా, మనసులో కలిగే ఒక్క అభిప్రాయాన్ని గానీ, కొత్త ఆలోచనను గానీ బయటకు చెప్పకుండా ఉండటం నరక యాతన. అది మిమ్మల్ని బద్దలు చేసేస్తుంది. కానీ అన్నింటినీ చెక్కుచెదరకుండా ఉంచుకోగలిగితే, మూడో కన్ను తెరుచుకొంటుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు