మానసిక అస్వస్థతకు కారణాలేంటి?? - రెండవ భాగం

 

క్రిందటి వ్యాసంలో మానసిక అస్వస్థతకు కారణాలను తెలుసుకున్నాము. ఈ వ్యాసంలో సద్గురు మనిషి అభివృద్ధి చెందడానికి ఒక నిర్దిష్ట స్థాయి మానసిక, భావోద్వేగ, భౌతిక స్థలమూ, అనుకూలమైన వాతావరణమూ అవసరమని, మన సమాజాల్లో, విద్యావ్యవస్థల్లో ఇటువంటి మార్పులు రావాలని చెబుతున్నారు.

జీవించడమంటే నిరంతరం సవాళ్లు ఎదుర్కోవడం, పోటీ పడడంగా మనం సమాజాలను నిర్మించుకున్నాం. ప్రతి మనిషిలోనూ ‘పోరాడు లేదా పారిపో’ అనే స్పందన ఒకటి ఉంటుంది. దాని వల్ల అడ్రినాలిన్(Adrenaline) అనే రసాయనం మీలో విడుదల అవుతుంది.  ప్రజలు కూడా బాధ్యతా రహితంగా “నాకు అడ్రినాలిన్  కావాలి” వంటి మాటలు వాడుతున్నారు. అడ్రినాలిన్ ఏమిటో మీకు అర్థం కావడం లేదు. వ్యవస్థలో అదొక అత్యవసర పరిస్థితిలో వాడే సాధనం. మీ మీదకు ఒక పులివస్తే అప్పుడు మీ రక్తప్రసార వేగం పెరుగుతుంది. మీరు తప్పించుకోవడానికి అది సాధనమవుతుంది. కాని ఉత్ప్రేరకం తీసికొని మీరు వీథుల్లో వాకింగ్ మాత్రమే చేస్తే , మీరు విస్ఫోటం చెందుతారు. మీరాస్థితిలో ఉండిపోకూడదు. మీరు దీనివల్ల చనిపోకపోయినా తప్పకుండా భగ్నమవుతారు.

ఆ వ్యక్తికి ఏమవుతుందో మనకవసరం లేదు. మనం నిర్మించిన నకిలీ భారీ యంత్రానికి భాగాలు కావాలి మనకు అంతే.

మన విద్యా వ్యవస్థలు మననుండి ఘోరంగా ఆశిస్తున్నాయి. అందరూ దానికి సన్నద్ధంగా లేరు. కొందరికది నల్లేరుపై బండి నడక కావచ్చు. మరి కొందరు ఒక వాక్యాన్ని 25 సార్లు చదివినా గుర్తు పెట్టుకోలేకపోవచ్చు, కాని వారిలో మరో సామర్థ్యం ఉండవచ్చు. కాని వ్యవస్థ ఎలా తయారయ్యిందంటే “వాళ్లు మరోపని చేయడానికి వీల్లేదు, ముందిదే చేయాలి.” ఇవి మనిషి సంక్షేమానికి, స్వస్థతకు పనికి వచ్చేవి కావు. మనం నిర్మించిన ఒక భారీ యంత్రానికి ముడిసరకు తయారుచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ యంత్రం సజీవంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ వ్యక్తికి ఏమవుతుందో మనకవసరం లేదు. మనం నిర్మించిన నకిలీ భారీ యంత్రానికి భాగాలు కావాలి మనకు అంతే. ఇలా అయితే  అదెప్పుడైనా కూలిపోవచ్చు. ఆ పెద్ద యంత్రానికి సరిపడే  పదార్థం మీరు కానట్లయితే, అనేక విధాల భగ్నమవుతారు.

మనిషి అభివృద్ధి చెందడానికి ఒక నిర్దిష్ట స్థాయి మానసిక, భావోద్వేగ, భౌతిక స్థలమూ, అనుకూలమైన వాతావరణమూ అవసరం. ఈ రోజుల్లో పుట్టినప్పటి నుంచే అటువంటి వాతావరణం లేదు. పసిబిడ్డకు కూడా అది లభించడం లేదు. ఒకప్పుడు తల్లి బిడ్డకు పాలిస్తూ సమయాన్ని పట్టించుకునేది కాదు. ఇప్పుడు గడియారం చూసుకుంటూ ఉంది. “తొందరగా తాగవచ్చు కదా! నేను వెళ్లాలి” కాన్పు అయిన వారానికే ఆమె మళ్లీ పనికి వెళ్లాలి. మహిళలు పనిచేయకూడదని నేననను. మనుషులు చక్కగా జీవించాలని నేను కోరుకుంటాను. మనుషులు చక్కగా జీవించాలంటే, దానికి కొన్ని అంతర్గత వాస్తవాలున్నాయి. తనకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే భయం లేకుండా శిశువు జీవించాలి. కాని బడికి వెళ్లిన తొలినాటి నుండి పొరుగు పిల్లవాడి కంటే రెండు మార్కులు తక్కువ వస్తాయేమోనని బాధ. ఇదంతా చెత్త. ఇది మనుషుల్ని సర్వనాశనం చేస్తుంది; దీన్ని మనం మెరుగైన ప్రదర్శన అంటున్నాం. సంక్షేమం అనీ, సామర్థ్యమనీ అంటున్నాం. మనం మనిషిని భగ్నం చేస్తూ ఉంటే, మనం నిర్మించిన ఈ అర్థరహిత యంత్రానికి ప్రయోజనమేమిటి?

కొందరిలో సహజంగా రోగ పరిస్థితులుంటాయి, కాని వారి సంఖ్య చాలా తక్కువ. తక్కినవారు భగ్నం కావడానికి కారణం మనం. కాని ఇప్పటికే భగ్నమైన వారి సంగతేమిటి? వాళ్లొక స్థాయి దాటితే ఔషధాలు తప్పవు. కొంత కాల వ్యవధిలో సమాంతరంగా మనం సాధన ప్రారంభించవచ్చు, అది మెరుగ్గా పనిచేయవచ్చు, రసాయనిక ఔషధాల మోతాదు, ఆవశ్యకత తగ్గించవచ్చు.

అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరికీ ఒకేలాంటి శరీరం ఉండదు, మనసు విషయంలో ఇది ఇంకా నిజం. వీటి నివారణకి ఒక ప్రత్యేక పద్ధతేదీ లేదు; అది కష్టం. ఇటువంటి వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరొక ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించదలచుకుంటే, చాలా భారీస్థాయి మౌలిక సౌకర్యాలు అవసరం – వస్తు పరంగానూ, మానవ వనరుల పరంగానూ కూడా. దురదృష్టవశాత్తూ అంత ధనాన్నీ, మానవ వనరుల్నీ దీనికి ఉపయోగించడానికి ఇష్టపడే వాళ్లెవరూ కనిపించడం లేదు. వాళ్లను ఆ మానసిక అస్వస్థత నుండి బయట పడవేయడానికి, చాలా నైపుణ్యం, సానుభూతి, నిబద్ధత కావలసి ఉంటుంది. అయినా కూడా మీరు వాళ్లను పూర్తిగా బయట తీసుకురాలేక పోవచ్చు. వాళ్లకున్న పరిమితుల్లోనే వాళ్లు బాధ పడకుండా సదుపాయంగా ఉండేటట్లు మీరు చూడవచ్చు. కాని దానికి ఎంతో అంకిత భావం, ఒకస్థాయి నేర్పు, సానుభూతి అవసరం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు