లింగ సమానత్వం సాధ్యమా? సమానత అంటే ఒకే విధంగా ఉండటమేనా..? కాదు, కానీ ఈ రోజుల్లో, దురదృష్టవశాత్తు స్త్రీని పురుష ప్రపంచంలో ఇమడ్చడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఈ ఆర్టికల్ లో సద్గురు వివరిస్తున్నారు..

ప్రశ్న: సద్గురు, లింగ సమానత్వం సాధించగలమా? స్వభావ సిద్ధంగా భేదాలున్నప్పుడు స్త్రీ పురుషులు సమానులెట్లా అవుతారు?

 సద్గురు:  నేటి సందర్భంలో ‘సమానం’ అన్నమాటను అపార్థం చేసుకుంటున్నారని నా అభిప్రాయం. సమానం అంటే నూటికి నూరుశాతం ఒకే లాగ ఉండడం అని అర్థం కాదు. సమానత్వం అంటే సమానమైన అవకాశం, సమానమైన మర్యాద, సమానమైన గౌరవం, అంతే. ఒకే పని, చర్య అని అర్థం కాదు. ఒకే విధమైన పని అన్నప్పుడు మీరు బాహ్య జీవితంలో స్త్రీకి అనేక ప్రతికూలతలు కల్పిస్తున్నారు. మరికొన్ని ఇతర జీవితరంగాలలో పురుషుడికీ ప్రతికూలతలు ఏర్పడతాయి. ఇంకా ముఖ్యంగా దీనివల్ల పని సమర్థవంతంగా జరగక పోవడం కూడా సంభవిస్తుంది - మగవాళ్లు సమర్థంగా చేయగలిగిన పనులు మహిళలు చేయ బూనుకోవడం, అట్లాగే మహిళలు సమర్థంగా చేయగలిగిన పనులు పురుషులు చేసే ప్రయత్నం చేయడం చేస్తే  పనులు చెడగొట్టడమే అవుతుంది. శిక్షణతో ఎవరైనా ఏ పనైనా చేయగలరు. కాని సహజమైన ఆసక్తుల్ని ఉపయోగించుకోవాలి. అట్లా చేయకపోతే పనులు చేయడంలో సగటు నేర్పరితనమే ఉంటుంది. సహజ ఆసక్తులను ఉపయోగించుకోవడమే మంచిది. ఎవరు ఏం చేయాలని నిర్ణయించేదెవరు? ఇది పురుషుడు చేసే పని, ఇది స్త్రీ చేసే పని అని ముందే నిర్ణయించడమెందుకు? ఆ వ్యక్తినే నిర్ణయించుకోనివ్వండి.

మారుతున్న పరిస్థితులు

ఇవ్వాళ వ్యవహార రంగాలు మారిపోయాయి. ఎన్నో పనులు అటు పురుషులకూ, ఇటు స్త్రీలకూ సమానమయ్యాయి. గతంలో ఇది ఇలా ఉండేది కాదు. వేయేళ్ల కిందట జనం గ్రామాల్లో ఉండేవారు, చుట్టూ అడవి ఉండేది. అప్పుడు పులులు పెంపుడు పిల్లలులా ఉండేవి కాదు, వాటి రక్షణకు మనం కంకణం కట్టుకోవలసిన అవసరం ఉండేది కాదు. అవి భయంకరంగా ఉండేవి, జనాన్ని భయభీతుల్ని చేసేవి. ప్రతిరోజూ మీరు వేటాడడమో, ఆహారం ఏరుకొని రావడమో చేయాలి. బయటికి వెళ్లి ఈ ఆహార సేకరణ చేయడంలో పురుషుడు మెరుగ్గా ఉండేవాడు. పైగా స్త్రీలకు మరో జీవశాస్త్ర విధి ఉంది - పిల్లల్ని కనాలి. చిన్న పాపను ఎత్తుకొని ఆమె అడవికి వెళితే వట్టి చేతులతో తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. పిల్లలు కూడా ఉన్నందున మహిళలను కాపాడుకోవలసి వచ్చింది. అందుకే ఆహారం సేకరించడానికి పురుషుడు బయటకు వెళ్లాడు. పని పంపకంలో ఇది మంచి పద్ధతి కదా.

ఇది మానవమేధ వికాసం కాని, స్త్రీ విముక్తికాని, పురుషుడి ఔదార్యం కాని కాదు. ఇది కేవలం సాంకేతికత అభివృద్ధి.

కాని ఇప్పుడు సాంకేతికత కార్యరంగం దీన్ని సమానం చేసింది. ఆహారం తేవడమంటే దుకాణానికి పోవడం. ఈ పని పురుషుడికంటే ఒక స్త్రీ చక్కగా చేయగలదు.  బ్రతుకు తెరువు అంటే ఈటె విసరడం కాదు. కీబోర్డు మీద టైపు చేయడం. ఆ పని కూడా ఆమే మెరుగ్గా చేయగలదు, ఎందుకంటే పురుషుల్లాగా సిగరెట్లు కాల్చడానికో, పచార్లు చేయడానికో ఆమె పనిమాని బయటకు రాదు. పనిచేయడానికి కూర్చుంటే, అలా కూర్చుని పనిచేస్తూనే ఉంటుంది. ఇటువంటి పనులు పురుషులకంటే మెరుగ్గా స్త్రీలే చేస్తున్నారు. ఇది మానవమేధ వికాసం కాని, స్త్రీ విముక్తికాని, పురుషుడి ఔదార్యం కాని కాదు. ఇది కేవలం సాంకేతికత అభివృద్ధి. కార్యక్షేత్రం తగినంత తుల్యస్థాయికి వచ్చింది.

సమానపాత్రలు

అందువల్ల సమానత్వం అన్నది సమస్యే కాదు. కాని ఒకే విధంగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఒక స్త్రీని పురుష ప్రపంచంలో ఇమడ్చడం కోసం ప్రయత్నించడంకంటే మనం సమాజాన్నీ, ప్రపంచాన్నీ స్త్రీ పురుషులకు సమానపాత్ర ఉండేట్లుగా మార్చుకోవాలి. మనం సమాజాన్ని ఎంత పురుష ప్రపంచంగా తయారుచేశామంటే స్త్రీ సంగతి వదిలిపెట్టండి, అది పురుషుడికి కూడా మంచిది కాదు. ఇప్పుడు అది చాలా ఎక్కువగా స్త్రీకి వ్యతిరేకంగా మొగ్గి ఉంది, ఆమె పురుషుడి ప్రపంచంలో ఇమడడానికి చాలా శ్రమ పడుతూ ఉంది. దురదృష్టవశాత్తు అది ఆమె మీద చాలా దుష్ప్రభావం చూపుతూ ఉంది, సాధారణ జీవనం కూడా దీనివల్ల అస్తవ్యస్తమవుతుంది

ప్రకృతిలోని స్త్రీ, పురుష తత్త్వాలకు సమాన పాత్ర కల్పించడానికి మనం ఈ సమాజంలో ఎన్నో విషయాలను పునర్నిర్మించవలసి ఉంటుంది. పురుషుడిగా ఒక స్థాయిలో పనులు చేయడంలో కొంత దురుసుతనం అవసరం. కాని కళాత్మకత, సంగీతం, విషయాలపట్ల భావోద్వేగం కూడా అంతే సమానంగా ముఖ్యం కావాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు