Sadhguruఎదగాలనే కాంక్ష మీలో బలంగా ఉంటే, అదే మీ లక్ష్యం అయితే, ముందుగా మీరు చేయవలసిన పని... అనుభవపూర్వకంగా మీకు ఏమి తెలుసో, ఏది తెలియదో అనే విషయంలో స్పష్టత తెచ్చుకోవడం. ఇది ఎంతో అవసరం. మీకు అనుభవపరంగా ఏది తెలుసో, ఏది తెలియదో తెలుసుకోండి. మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నదేదో మీకు తెలుసు. ఇక మీ అనుభవంలో లేని విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘అసలు అది లేనే లేదు!’ అని అనడం తగదు. ‘నాకు తెలియదు!’ అనండి చాలు. మీరు ఈ స్థితికి చేరుకున్నారంటే, మీలో పురోగతి దానంతట అదేే వస్తుంది. మీకు తెలియని దానిని, ‘తెలియదు’ అని మీరు అంగీకరించినప్పుడు మాత్రమే, అభివృద్ధి సాధ్యం అవుతుంది. కాని సామాన్యంగా మీకు తెలియని ప్రతి దానినీ మీరు నమ్మడం మొదలుపెడతారు. ‘నాకంతా తెలుసు!’ అని అనుకుంటారు.

మీరు ఆధ్యాత్మికంగా ముందడుగు వేయాలంటే, ప్రస్తుతం మీ అనుభవంలో ఉన్న వాటిని ముందుగా గమనించాలి. ప్రస్తుతం మీ అనుభవంలో ఏముంది? అనుభవపూర్వకంగా మీ శరీరం గురించి కొంత వరకూ తెలుసుకున్నారు; అలాగే మీ మనసును కూడా కొంత వరకు అర్థం చేసుకున్నారు; ఈ ప్రపంచాన్ని కూడా అనుభవం ద్వారా కొంత వరకూ తెలుసుకున్నారు. దీనితో పాటుగా కనీసం కొన్ని క్షణాల పాటయినా ఈ శరీరాన్ని, బుద్ధిని నడిపించే శక్తిని అనుభూతి చెందారు. ఇంతకు మించి, ఇంక దేనినీ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. ఇక మిగిలినదంతా కేవలం ఊహే. మీ చుట్టూ ఉండే సమాజం ఏ పద్ధతిలో మీకు నేర్పిందో, అదే పద్ధతిలో మీ ఊహ ఉంటుంది. మీ అనుభవంలో లేని వాటిని ‘’నాకు తెలియదు!’’ అని అంగీకరించండి. ఇది చాలా, చాలా ముఖ్యం; లేకపోతే జీవితమంతా నాటకాలతోనే గడిచిపోతుంది.

మీకు తెలియనివి ఏవైనా, వాటిపై ఒక నిర్ధారణకు రాకుండా ‘’నాకు తెలియదు!’’ అని అంగీకరిస్తే, అప్పుడు అంతర్గతంగా శోధన మొదలవుతుంది.

మీకు తెలియనివి ఏవైనా, వాటిపై ఒక నిర్ధారణకు రాకుండా ‘’నాకు తెలియదు!’’ అని అంగీకరిస్తే, అప్పుడు అంతర్గతంగా శోధన మొదలవుతుంది. దైవమైనా, సత్యమైనా, మీరు  శోధించాలంటే ఎక్కడ శోధించాలి? మీరు మీ ఆంతర్యంలోనే శోధించాలి, అవునా? అలా మీ ఆంతర్యంలో శోధించాలంటే అందుకు తగిన సాధనం మీకు కావాలి. అవునా? ఉదాహరణకు మీకు సముద్రపు లోతు తెలుసుకోవాలని ఉందనుకోండి. ఒక స్కేల్ తో సముద్రపు లోతును కొలవడం సాధ్యమా? స్కేల్ తో సముద్రపు లోతు కొలవలేక ‘అసలు సముద్రానికి చివరే లేదు’ అనే నిర్ణయంతో తిరిగి వచ్చేస్తారు. కానీ అది నిజం కాదు కదా! అలాగే మీరు ఆంతర్యంలోకి వెళ్ళాలన్నా, మీకొక తగిన పరికరం కావాలి. ఆంతర్యంలోకి వెళ్ళడానికి, ప్రస్తుతం మీ దగ్గర ఏముంది? ఏ పరికరం ఉంది? పంచేంద్రియాలు తప్పించి మీ దగ్గర ఇంకేమీ లేవు. ఈ పంచేంద్రియాలు ప్రాపంచిక విషయాలను మాత్రమే తెలుసుకోగలవు. ఈ పరిమితమైన పరికరాలతో, ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్నదానిని, అనుభూతి చెందే అవకాశమే లేదు.

పంచేంద్రియాలతో పాటుగా మీకొక శరీరం కూడా ఉంది. ప్రస్తుతం మీకిది చాలా ముఖ్యం కదా. దీనికి మీరు ఆహారం ఇవ్వాలి, దుస్తులు వేయాలి, బాగా అలంకరించాలి, ఇంకా ఎన్నెన్నో పనులు చేయాలి. అయితే మీ శరీరం లోపల అమూల్యమైనది ఏదో ఉంది. కాని దానిని మీరు ఇప్పటి వరకూ అనుభూతి చెందనే లేదు. అలా మీలోపల ఉన్న ఆ అమూల్యమైనది రేపు వెళ్ళిపోయిందనుకోండి. ఇక అప్పుడు ఈ శరీరం ఎవ్వరికీ అక్కర్లేదు. ఆఖరికి, మీ ఊరి మునిసిపాలిటీ వారు కూడా మీ శరీరాన్ని ఉంచాలనుకోరు.

ప్రాణం అనే ఫలం లోపల ఉంది కనుకనే, ఈ శరీరానికీ, దానిని కప్పి ఉంచే చర్మానికీ ఇంత విలువ ఉంది.

ప్రాణం అనే ఫలం లోపల ఉంది కనుకనే, ఈ శరీరానికీ, దానిని కప్పి ఉంచే చర్మానికీ ఇంత విలువ ఉంది. లోపల ఉన్న ఫలం పోయిందనుకోండి, ఇక ఈ శరీరానికి విలువ లేదు; కానీ దురదృష్టవశాత్తూ మీకు ప్రాణమనే ఫలం గురించి అసలు చింతేలేదు. ఎంతసేపూ తొక్కనే పట్టుకుని వ్రేలాడుతున్నారు. మీ జీవితాంతం తొక్కనే తింటూ కూర్చుంటే, జీవితం ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది, అవునా? కానీ ఈ తొక్కతో వచ్చిన సమస్య ఏమిటంటే, అది పండునే అంటిపెట్టుకొని ఉండడం వల్ల అక్కడక్కడ దానికి కొంత తీయదనం అంటుకొని ఉంటుంది. తొక్కలోని ఆ కొద్దిపాటి తియ్యదనాన్ని రుచి చూసి, మీ జీవితమంతా ఆ తీయదనం కోసం ఆ తొక్కలోనే వెతుకుతుంటారు. ఇలా అష్టకష్టాలు పడి అక్కడక్కడ కొంత తీపిని కనుక్కుంటారు, అంతే. అలా కాకుండా లోపల దాగున్న ఫలాన్ని మీరు గుర్తించగలిగితే, మీరు ఎప్పుడూ మాధుర్యంలోనే నిలిచిపోవచ్చు. మీ జీవితమంతా ఆ తీపిని నింపుకోవచ్చు. అది సాధ్యమే.

ఒకవేళ, ఈ తొక్క మొత్తం చేదుగానే ఉండి ఉంటే, మీరంతా ఈ పాటికి మహాజ్ఞానులుగా మారిపోయేవాళ్లు. కాని ఇక్కడ వచ్చిన చిక్కల్లా తొక్క అంతా చేదుగా ఉండదు. తొక్కలో అక్కడక్కడ కొంత తియ్యదనం ఉంటుంది. దీంతో మీరు దాని మాయలో పడి దానివెంటనే పరుగులు తీస్తున్నారు. అసలు సారాన్నే (పండు) మరచిపోతున్నారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు