మీ తలరాత మీరే రాసుకోండి!

 

ఈ భూమి మీద ఉన్న అన్నీ జీవులు తామున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటాయి, కానీ మనుషులు మాత్రమే పరిస్థితులను వాళ్ళకు అనుగుణంగా మార్చుకోగలరు. కానీ ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు ఉన్న పరిస్థితికి అనుగుణంగా వాళ్ళను మలుచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితికి ఒక ప్రతిచర్యగా బ్రతుకుతున్నారు. మనం ఊహించగలిగినట్లే వాళ్ళ ప్రశ్న ఏమిటంటే ‘ అటువంటి పరిస్థితిలో నన్ను ఎందుకు ఉంచారు? అది నా దురదృష్టమా? అది నా తలరాతా?’.

మీలో మీరు సృష్టించుకుంటున్న ప్రతీ ఆలోచన, భావోద్వేగాలు, మీరు చేసే ప్రతిచర్య మీ విధి యొక్క విధానాన్ని సృష్టిస్తుంది. 

ఎప్పుడైతే పనులు మీకు కావలసినట్టుగా జరగవో, అప్పుడు మీరు దాన్ని ‘విధి’ అని అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమల్ని మీరు ఓదార్చుకోవటానికి, మీరు ఉన్న ప్రస్తుత పరిస్థితితో రాజీ పడటానికి ప్రయత్నిస్తారు. వైఫల్యాన్ని, అనారోగ్యాన్ని లేదా ఇతర దురదృష్టాల్ని మీరు తట్టుకునే మార్గాలలో ఇదొకటి. మనం తార్కికంగా అర్థం  చేసుకోలేని విషయాలను కూడా మనం ‘విధి’ అని అంటాము.

జనాలు నన్ను అడుగుతూ ఉంటారు, ‘సద్గురు, నేను నా తలరాతను ఎంత వరకూ నా నియంత్రణలో ఉంచుకోగలను?’ అని. మీ తలరాత మీ సృష్టే! ఇప్పుడు కూడా మీరే సృష్టించుకుంటున్నారు – అయితే అచేతనంగా! మీలో మీరు సృష్టించుకుంటున్న ప్రతీ ఆలోచన, భావోద్వేగాలు, మీరు చేసే ప్రతిచర్య మీ విధి యొక్క విధానాన్ని సృష్టిస్తుంది. మీలో అంతర్లీనంగా ఉన్న ప్రాణం దేన్నీ పట్టించుకోకుండా ఉండదు; మీరు ఏమి చేసినా దాన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది.

జీవితం నచ్చినవే మాత్రమే రికార్డు చేయదు; అది నిద్రా మెలుకువలలో అన్నిటినీ రికార్డు చేస్తుంది. ప్రతీది రికార్డు అవుతుంది కనుక మీలో గుట్టలుగా ఉన్న ఈ సమాచారం ఎటువంటీ దిశ, అవగాహన లేకుండా మీలో ఈ గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందువల్లనే మనం వివరించలేనటువంటి పరిస్థితులు, పర్యవసానాలు 'విధి' అన్నట్లు చలామణి అవుతున్నాయి.

వందల సంవత్సరాల క్రితం ఏదైతే విధి అని మనం అనుకున్న చాలా వాటిని ఇప్పుడు మీరు మీ చేతుల్లోకి తీసుకున్నారు.  

కనుక మీ ప్రశ్న ‘నాకు అసలు ఏమి జరుగుతుంది?’ అన్నదే అయితే మీరు ఏమి సృష్టించుకుంటే అదే అవుతుంది అనేదే దాని సమాధానం అవుతుంది. కానీ అది అలా జరిగేదాకా మీరు ఎదురు చూడనవసరం లేదు. మీకు ఎలా కావాలో అలా జరిగేలా చూసుకోవచ్చు.

వందల సంవత్సరాల క్రితం ఏదైతే విధి అని మనం అనుకున్న చాలా వాటిని ఇప్పుడు మీరు మీ చేతుల్లోకి తీసుకున్నారు. ఒక శతాబ్దం ముందు ప్రజలు అనుభవించిన ఎన్నో రోగాలు, అంటువ్యాధులు, సంక్రమించే వ్యాధులు, కరువు కాటకాలను ఇప్పుడు మనం నియంత్రణ చేస్తున్నాము. వాటి బారిన పడిన చాలా మంది అది కచ్చితంగా వారి విధి కారణంగానే జరిగిందని అనుకున్నారు. కానీ మనం ఇలాంటి విపత్తులను మన చేతిలోకి తీసుకోలేదా? ఈ రోజు మనం ‘సాంకేతిక పరిజ్ఞానం’ అని పిలేచేది దీన్నే: ప్రకృతి ధర్మాలకు లోబడి, మన చేతిలోకి తీసుకోగలిగిన ప్రతీది మనం తీసుకున్నాము.

నేను ఒకసారి ప్రపంచంలోని పేదరికాన్ని తొలిగించటం గురించి ఒక అంతర్జాతీయ కాన్ఫెరెన్స్ కు వెళ్ళాను. ఎంతో మంది బాధ్యతాయుతమైన వాళ్ళు అందులో పాల్గొన్నారు, అందులో నోబెల్ పురస్కార గ్రహీతలు కూడా కొందరు ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ‘మనం ఈ సమస్యలను పరిష్కరించాలని ఎందుకు చూస్తున్నాము? అది దైవ నిర్ణయం కాదా?’ .

నేను ‘అవును, మరెవరో ఆకలితో ఉంటే, లేక చనిపోతుంటే అది దైవ నిర్ణయమే. కానీ మీ కడుపు కాలుతుంటే, మీ బిడ్డ చనిపోతుంటే అప్పుడు మీకు ఒక సొంత ప్లాన్ ఉంటుంది. అవునా, కాదా?’

 మీ విధి గ్రహాలు, నక్షత్రాల మీద ఆధారపడి ఉంటే మీరు కనీసం ఆత్మహత్య కూడా చేసుకోలేరని అర్ధం!

మన జీవితం గురించి ఎక్కడైతే నిర్ణయాన్ని మన చేతిలోకి తీసుకోవాలో అది మనం చేస్తాం. ఎక్కడైతే అది మన చేతుల్లోకి తీసుకోదలచుకోలేదో అప్పుడు మనం దైవ నిర్ణయం లేదా విధి గురించి మాట్లాడతాం. 'యోగా' మీ జనన మరణాలను మీ చేతిలోకి తీసుకునేలా చేయగల శాస్త్రం. ఇప్పుడు మీరు మీ జీవితంలోని నిర్ణయాలను అచేతనంగా తీసుకుంటున్నారు. అదే కర్మ అంటే! మీరు మీ విధిని పూర్తి గందరగోళంగా, పూర్తి అచేతనంగా సృష్టించుకుంటున్నారు. మీరేది అచేతనంగా చేస్తున్నారో, దాన్ని మీరు చేతనంగా చేయటం మొదలు పెడితే అది ఎంతో మార్పుని తీసుకొస్తుంది. అదే అజ్ఞానానికి మరియు జ్ఞానోదయానికి మధ్య తేడా.

మీ తలరాతను మీ చేతిలోకి తీసుకోవటం అంటే అన్నీ మీకు నచ్చినట్లే జరుగుతాయని కాదు. బాహ్య ప్రపంచం ఎప్పుడూ 100% మీకు అనుగుణంగా జరగదు ఎందుకంటే దానిలో మరెన్నో అంశాలు ఉన్నాయి. బాహ్య ప్రపంచం మీకు ఇష్టం వచ్చినట్లు జరగాలంటే అది ఒక దండయాత్ర, నిరంకుశపాలన, నియంత పాలనే అవుతుంది. మీ తలరాతను రాసుకోవటం అంటే ప్రపంచంలోని ప్రతీ పరిస్థితిని మీ నియంత్రణలోకి తీసుకురావటం కాదు. దానర్ధం కేవలం మిమల్ని మీరు ఎలా మలచుకోవాలంటే మీ చుట్టూ జరిగే పరిస్థితుల స్వభావం ఏదైనాసరె మీరు ఆ పరిస్థితుల వల్ల నలిగిపోకుండా మీకు నచ్చిన విధంగా ఉండగలగడమే!

‘మరి నక్షత్రాలు, గ్రహల సంగతేమిటి? అవి నా విధిని నిర్ణయించవా?’ మీ విధి గ్రహాలు, నక్షత్రాల మీద ఆధారపడి ఉంటే మీరు కనీసం ఆత్మహత్య కూడా చేసుకోలేరని అర్ధం! మీరు మీకు నచ్చినట్లు బ్రతకలేరు లేదా చావలేరు. (ఎవరికీ ఆత్మహత్య చేసుకునే అధికారం లేదన్న మాట నిజమే. అది నైతిక కారణాల వల్ల కాదు, కానీ అది ఎందువల్ల అంటే మీరు పునఃసృష్టించలేనిది నాశనం చేసే హక్కు మీకు లేదు). మీ జీవితంలో ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకోలేరు. ఎందుకంటే మీరు ప్రతీది మీ జాతకచక్రం ద్వారా చూస్తున్నారు, అది అప్పుడిక కచ్చితంగా ఒక హారర్-స్కోప్ మాత్రమే!

ప్రాణం లేని వస్తువులు మనిషి స్వభావాన్ని, గతి విధులను నిర్ణయించాలా లేక వాటిని మనిషి నిర్ణయించాలా? మీలో మీరు స్థిరంగా ఉంటే ఏ గ్రహం ఎటు వెళ్ళినా కానీ మీరు మాత్రం మీరు వెళ్ళదలచుకున్న దిశలోనే వెళ్తారు. జనాలు వేరే గ్రహాల గురించి అంత పట్టించుకోకుండా ఈ భూమాత శ్రేయస్సు గురించి పట్టించుకుంటే కనీసం మనం కొంచం మెరుగ్గా అయినా బ్రతుకుతాం!

ప్రేమతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1