మీ జీవితానికి గమ్యం నిర్దేశించుకోండి

 

మీ జీవితానికి గమ్యం ఏమిటో మీరు నిర్దేశించుకుంటే, మీరు ఇక దేనినీ కోల్పోలేరు. అందరిలోనూ కొన్ని ప్రవృత్తులు (ధోరణులు) ఉంటాయి. గత కర్మల వలన వచ్చే ఈ ధోరణులు మీపై ప్రభావం చూపిస్తాయి. అవి మిమ్మల్ని అటూ-ఇటూ మళ్లిస్తూ ఉంటాయి. వాటివల్ల మీలో కలిగే మోహాలు, వాంఛలతో మీరు పోరాడలేరు. అలా మీ మోహంతో, వాంఛలతో పోరాడడానికి ఎన్నడూ ప్రయత్నం కూడా చేయకండి. వాటితో పోరాడడం అంటే మహిషాసురుడనే రాక్షసుడితో పోరాడడం లాంటిది. అతని రక్తపుచుక్క ఒక్కటి క్రిందపడితే చాలు, వేల కొద్దీ మహిషాసురులు పుట్టుకొస్తారు. మీ మోహాలు, వాంఛలు సరిగ్గా అలాంటివే. మీరు ధైర్యంగా వాటితో పోరాడినా, వాటిని నరికేసినా, అవి చిందించే. ప్రతి రక్త బిందువుతో మళ్ళీ వందలు, వేలు పుట్టుకొస్తాయి; వాటితో పోరాడితే ఫలితం లేదు. మీ మోహాలను, వాంఛలను, సరైన దిశలో ప్రవహించేలా తర్ఫీదు ఇవ్వండి,  మీరు చేయగలిగినది అదే.

సర్వోన్నతమైన దానినే మీరు జీవితంలో కోరుకోండి. మీ వ్యామోహాలన్నింటినీ, ఆ అత్యున్నతమైన దాని దిశలోకి మళ్ళించండి.

సర్వోన్నతమైన దానినే మీరు జీవితంలో కోరుకోండి. మీ వ్యామోహాలన్నింటినీ, ఆ అత్యున్నతమైన దాని దిశలోకి మళ్ళించండి. మీ మోహంతో కూడా, ఆ విధంగానే చేయాలి. ప్రస్తుతం మీకున్న శక్తిలోని ప్రతి అణువునూ కోరిక, తపన, భయం, కోపం, ఇంకా అనేక రకాలుగా మీరు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం భావోద్రేకాలు మీ చెప్పుచేతలలో ఉండకపోవచ్చు కాని, వాటిని ఒక దిశలోకి మరలించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మీరు కోపంగా ఉన్న సమయంలో, ప్రేమగా ఉండలేక పోవచ్చు. మీరు ఒక్కసారిగా కోపాన్ని, ప్రేమగా మార్చుకో లేకపోవచ్చు; కానీ ఆ కోపాన్ని మాత్రం కావలసిన దిశ వైపుగా నడపవచ్చు. కోపం ఒక మహత్తర శక్తి, కదూ? దానిని సరైన దిశలోకి మళ్ళించండి, అంతే. మీ శక్తిలోని ప్రతి లేశాన్నీ , ప్రతి మోహమూ, ప్రతి భావమూ, ప్రతి ఆలోచనా, అన్నిటినీ-ఒకే దిశలో కేంద్రీకరించండి; అపుడు ఫలితాలు చాలా చాలా త్వరగా కనిపిస్తాయి, జరగవలసినవన్నీ జరుగుతాయి. ఉన్నతమైది ఒకటి ఉందని తెలిస్తే, మీరు అక్కడకు చేరాలని అనుకుంటే - ఇంక మీకు వేరే ప్రశ్నే ఉండకూడదు.

ఇపుడు మీకు, ఈ ఆధ్యాత్మికత, జ్ఞానము, భగవత్‌ సాక్షాత్కారమూ - ఇదంతా చాలా కష్టం అని పదే పదే అనిపిస్తూ ఉంటుంది. ఒక క్షణం అవన్నీ మీరు చేరుకోగలిగినవే అనిపిస్తుంది, మరుక్షణం అవి మీకు ఎంతో (కొన్ని కాంతి సంవత్సరాల) దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా అనిపించడం వల్ల మీకు కొంత నిస్పృహ కలుగుతుంది. మీకు ‘’పరుగెత్తి పాలు త్రాగటం కంటే, నిలబడి నీళ్ళు త్రాగటం మేలు’’ అని అందరూ చెప్తూనే ఉన్నారు కదా! కాని మీరు అర్థం చేసుకోవలసిందేమిటంటే, అది వేరే మరెక్కడో లేదు; అది ఇక్కడే, ఇప్పుడే ఉంది. ‘మీరే’ ఇక్కడ లేకపోవడం వల్ల, మీకు అది ఎక్కడో ఉన్నదనిపిస్తున్నది. దైవం ఎక్కడో లేడు; ఇప్పుడే, ఇక్కడే ఉన్నాడు, లేనిది మీరే! సమస్య అదొక్కటే. ఆధ్యాత్మికత కఠినం కాదు; కానీ అది ఖచ్చితంగా ‘’సులభం’’ కూడా కాదు. అది చాలా సరళమైన పని . ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో, అక్కడి నుంచి, అనంతం దగ్గరకు చేరటం, చాలా సరళం. ఎందుకంటే అనంతం కూడా ఇక్కడే ఉంది కనుక. ఒకటి మాత్రం తెలుసుకోండి - ‘’సరళమైనది’’   సులభమైనదిగా ఉండాలని లేదు; అది చాలా  సూక్ష్మముమైనది, సున్నితమైనది. మీ ప్రాణశక్తి మొత్తాన్నీ ధారపోస్తే తప్ప, అది మీకు లభ్యం కాదు.

అరకొర మనసుతో ఎంత మొఱపెట్టుకున్నా, భగవంతుడు ఎప్పటికీ రాడు.

అరకొర మనసుతో ఎంత మొఱపెట్టుకున్నా, భగవంతుడు ఎప్పటికీ రాడు. అసంపూర్ణ నివేదనల వల్ల, జ్ఞానం ఎన్నటికీ కలగదు. మిమల్ని మీరు  సంపూర్ణంగా సమర్పించుకోగాలగాలి. అపుడు  మీకు ఆత్మ జ్ఞానం ఒక్క క్షణంలో కలుగుతుంది. అది కలగడానికి ఏ పన్నెండు సంవత్సరాలో పట్టనవసరం లేదు. అందుకు కావల్సిన తీక్షణత పొందడానికి ఓ మూర్ఖుడికి పన్నెండు సంవత్సరాలు పట్టవచ్చునేమో, అది వేరే విషయం.  తగినంత తీక్షణత మీలో ఉంటే, ఆత్మసాక్షాత్కారం జరగడానికి పట్టేది ఒక్క క్షణమే. ఆ తర్వాత, జీవితం ఒక వరంగా మారుతుంది. మీరు తేలికగా జీవించవచ్చు. మీరు ఏ మార్గాన్ని  ఎన్నుకున్నా, మీరు ఏ మార్గాన్ని కోరుకున్నా, మీరు అలవోకగా జీవిస్తారు. కానీ ఆ ఒక్క క్షణాన్ని సృష్టించుకోకుండా, రకరకాల గందరగోళాలలో కొట్టుకుపోతూ ఉంటే, మీకు ఉపయోగమేముంది?

ప్రేమాశిస్సులతో,
సద్గురు