గురువుని గురించిన సంభాషణ అన్నిచోట్లా జరుగుతూనే ఉంది. ఈ రోజుల్లో రకరకాల గురువులున్నారు : కంప్యూటర్ గురువులున్నారు, మానేజ్మెంట్ గురువులున్నారు. ఈ పదాన్ని ఇంత తేలిగ్గా వాడడం వల్ల, “గురు” శబ్దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈ ప్రపంచానికి అవగతం అవ్వడం లేదు.

“ గు” అంటే అంధకారం “రు” అంటే పారద్రోలేది. అంధకారం అంటే అజ్ఞానం. సరైన గుర్తింపు ఏర్పరుచుకోక పొవడమే మీ అజ్ఞానానికి మూలం. ‘మీరు కానీ’ ఎన్నో విషయాలతో మీరు గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు. దీనిని సాధారణంగా పిచ్చి అంటారు.

ఉదాహరణకు మీరు పిచ్చాసుపత్రికి వెళ్ళారనుకోండి, అక్కడ తోటలో నుంచున్న ఒక మనిషి తానే చెట్టునని నమ్ముతాడు. ప్రతిరోజు సాయంత్రం మీరు అతన్ని లోపలికి మోసుకొని పోవాలి, లేకపోతే రోజంతా ఆ తోటలోనే నిల్చుని ఉంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం, మళ్ళీ మీరు తలుపు తెరవగానే అతను తోటలోకి వెళ్లి, ఓ చెట్టులాగానే నుంచోని ఉంటాడు. దీనినే మనం  పిచ్చి అంటాం, కదూ?

మీరు ఆయన సాన్నిధ్యంలో కూర్చుంటే, మీకు ఏమి ఆలోచించాలో, ఏమి మాట్లాడాలో కూడా తెలియనట్టు ఉంటుంది.

మీరు కానిదేదో మీరుగా భావించడం, నమ్మడం అంటే మీరు పిచ్చిలో ఉన్నట్టే. ప్రస్తుతం, మీ సమస్య కూడా ఇదే. ఈ శరీరాన్ని “మీరు” గా భావిస్తారు. మీ ఆలోచనలు, భావాలు - అవన్నీ కూడా మీరు అనుకుంటారు. మీరు దేనితోనైనా సరే, గుర్తింపు ఏర్పరుచుకుంటారు. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పారద్రోలే వారే గురువు.

మీరు ఆయన సాన్నిధ్యంలో కూర్చుంటే, మీకు ఏమి ఆలోచించాలో, ఏమి మాట్లాడాలో కూడా తెలియనట్టు ఉంటుంది. మీలో పారవశ్యానుభూతి ఉంటుంది. మీకు మీరు, ఏమీ తెలియని మూడ మతిగా అనిపిస్తారు. ఇలా జరగడం మంచిదే - అది పనిచేస్తోందని దీనర్థం. ఆయన సాన్నిధ్యంలో, మీరు ఏర్పరుచుకున్న గుర్తింపులు మీకు మూర్ఖంగా కనిపిస్తాయి. ఏ విషయాల గురించయితే మీరు ఎంతో గొప్పగా గర్వంగా భావిస్తారో, అవన్నీ కూడా మీకు ఎంతో మూర్ఖంగా అర్థంలేనివిగా కనిపిస్తాయి. ఇదంతా మంచిదే.

ఆయన మీకు ఎంతగానో నచ్చితే, అయిన మీ గురువు కాదు. ఎందుకంటే మీకు ఆయన దగ్గర ఎంతో సౌకర్యంగా అనిపిస్తే, మీరు గారాలు పోతారు. ఒకవేళ మీకు అక్కడి నుంచి పారిపోవాలనిపించినప్పటికీ, ఏదో ఆయన వైపుగా మిమ్మల్ని లాగుతూ ఉంటే, అప్పుడు ఆయన మీ గురువు. ఆయన సాన్నిధ్యం మిమ్మల్ని నిలవనీయనట్లు, ఒక బెదిరింపుగా ఉండాలి, కానీ మీకు అక్కడే ఉండాలనిపించాలి - అప్పుడు ఆయనే మీ గురువు.