మరింత స్థిరంగా ఎలా ఉండాలి?

 

ఇలా ఈ పర్వతాల పాద ప్రాంతాలకు మళ్ళీ రావటం ఒక అద్భుతమైన అనుభవం. నా జీవితంలో మొదటి సగం ఈ ప్రాంతాలను వెతకటంలోనే గడిచింది. నా మీద ఉన్న ఒక పెద్ద బరువు దించుకొనేందుకు (ఈ ప్రస్తావన వెల్లియంగిరి కొండలలో సద్గురు, తన గురువుల ఆదేశం ప్రకారం, ధ్యాన లింగ ప్రతిష్ఠ చేసిన సందర్భానికి సంబంధించింది - సంపాదకులు) సరయిన స్థలం కోసం ఈ ప్రాంతాలన్నీనేను కలయదిరగటం జరిగింది. కానీ ఇప్పుడైతే ఇక్కడికి రావటానికే కుదరటం లేదు.

ఒక విధంగా చూస్తే ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే కూడా ఈ కొండలాగా మారి పోవటమే నిశ్చలంగా, నిశ్శబ్దంగా...! పునాది నిశ్చలంగా సుస్థిరంగా ఉంటే, మనిషి చాలా విషయాలు సాధించగలుగుతాడు. పూర్తి సుస్థిరత ఉంటేనే, జీవితంలో ఒక ఆనందాతిశయాన్ని అనుభవించటం సాధ్యమౌతుంది. స్థిరత్వం లేకపోతే అది ఉన్మాదానికి దారి తీస్తుంది, అందుకే కొంత సృజనాత్మకత, చురుకుతనం, ఉత్సాహం ఉన్నవాళ్ళు ముందు కొంత వెర్రి తనంగా వ్యవహరించటం, చివరికి దాదాపు పిచ్చి వాళ్ళుగా మారిపోవటం జరుగుతుంది. స్థిరమైన పునాది లేకపోతే, మీరొక తాండవ నృత్యం చేయలేరు.

అందుకే శివుడంటే ఒక వైపు సుస్థిరత్వం, నిశ్చలత్వం, మరొక వైపు శివుడంటే, ఒక అద్భుతమైన తాండవం.. ఆయన ఏ కదలికా లేని నిశ్చల సమాధిలో కూర్చొని అయినా ఉంటాడు, లేకపోతే, విస్ఫోటం లాంటి తాండవ కేళిలో విజృంభిస్తాడు. విధ్వంసం కలిగించని విస్ఫోటం స్థిరత్వం ఉన్నప్పుడే సాధ్యమౌతుంది.

మనుషులు స్థిరత్వం సాధించుకొనేందుకు, తమ జీవితాలను కొంచెం నియంత్రించటం, కుదించుకోవటం చేస్తూ ఉంటారు. మీ అమ్మమ్మ గారు మీకు అలానే గదా బోధించింది? 'కాస్త జోరు తగ్గించి, నియంత్రణలో ఉండగలిగితే, కుదురుగా ఉంటావు' అని. అసలు జీవమే లేకపోతే స్థిరంగాఉండచ్చు, కళేబరాల లాగా. ఇది నిజం, ఈ భరోసా మాత్రం మీకు నేనూ ఇస్తాను. ఈ నియంత్రణల చేతనే మనుషుల జీవితాలు మలబద్ధకంతో బాధ పడుతున్నట్టు గడుస్తాయి. అదేమిటో మీకు తెలుసు గదా? జరిగేదేదో కొంచెం కొంచెంగా, అప్పుడు కాస్త, అప్పుడు కాస్త జరుగుతుంది. వాళ్ళ ఆనందాతిశయం, వాళ్ళ ప్రేమా, వాళ్ళ పారవశ్యం అన్నీ అంతంత మాత్రంగా చిన్న చిన్న మోతాదులలోనే ఉండిపోతాయి. కాబట్టి జీవితాన్ని బాగా, కత్తిరించి, కుదించేసుకొని, నియంత్రించుకోవటం వల్ల కలిగే స్థిరత్వం స్థిరత్వం కాదు. అది నిష్ప్రయోజనం! అన్నింటినీ, సరిగ్గా, అతి స్పష్టంగా 'దర్శించ' గలిగితే అది స్థిరత్వం.

ఆదియోగిని గురించి చెప్పుకొంటున్నామంటే, మనం ఏక కాలంలో అటు నిశ్చల సమాధి గురించి, ఇటు తాండవ విజృంభణ గురించీ చెప్పుకొంటున్నామన్న మాట. అది ఆయనకు ఎలా సాధ్యమంటే ఆయనకు అందరిలా రెండు కళ్ళు కాకుండా, అంతకంటే ఎక్కువ కళ్ళు ఉన్నాయి గనక. అంటే మూడు కళ్లని కూడా కాదు, అంతకంటే కూడా ఎక్కువ. అందువల్ల ఆయన దృష్టి సామాన్యుల దృష్టి కంటే నిశితమైంది, వాళ్ళు చూడలేనివెన్నో ఆయన చూడగలడు. చాలా చాలా ఎక్కువ చూడగలడు. కనకే, ఆయన అంతటి స్థిరత్వాన్నీ నిశ్చలతనూ ప్రదర్శించ గలడు. మీది కేవలం పాక్షిక దృష్టి మాత్రమే అయితే, స్థిరంగా నిలబడటం చాలా కష్టం కనక మనం కూడా సవ్యమైన, చురుకైన దృష్టి కోసం ప్రయత్నించాలి. చూడటాన్ని మనం 'దర్శనం' అంటాం అని మీకు తెలుసు కదా. మన సంప్రదాయం అంతా ఈ దర్శనాన్ని గురించి ఎప్పుడూ చర్చిస్తూనే వస్తున్నది. మీరు దేవాలయానికి వెళ్ళేది అభ్యర్థన పత్రాలు ఇచ్చి రావటానికి కాదు! 'దర్శనం' కోసం వెళతారు! సరిగ్గా చూడగలగటం కోసం. మనుషులు తమ ఎదురుగా ఉన్న జీవితాన్ని సరియైన దృష్టితో చూడలేకపోవటానికి కారణం, వాళ్ళు తమను తాము ఎన్నో విషయాలతో గుర్తింపు ఏర్పరచుకున్నారు.

మొట్టమొదట 'ఈ శరీరం నాది' అన్న దానితో మొదలుపెట్టి మరెన్నో విషయాలతో గుర్తింపు ఏర్పరచుకుని, ఏవేవో గుర్తింపులు తగిలించుకోవటం. మీరు అలాంటి గుర్తింపు ఏదయినా ఏర్పరుచుకోగానే, మీ బుద్ధి ఇక దాన్ని పరిరక్షించే ప్రయత్నంలో పడిపోతుంది. మరి, 'నేను ఫలానా దేశస్థుడినీ, ఫలానా మతానికి చెందిన వాడినీ, ఫలానా జాతికి చెందిన వాడినీ, ఈ ఉన్న గుర్తింపులన్నీ వదిలించుకోవటం ఎలా?' అని మీరు ఈ విధంగా వెళ్లవలసిన పనే లేదు. 'ఈ శరీరం నాది' అన్న ఒక్క గుర్తింపును వదిలించుకొంటే చాలు. మిగిలినవన్నీ పోయినట్టే, ఎందుకంటే అన్నీ ఆ ఒక్క గుర్తింపు పునాది మీదే నిలుస్తున్నాయి. మీకు తగిలే గుర్తింపులన్నీ మీరు 'ఈ శరీరం నేను!' అనే పరిమితికి లొంగిపోవటంవల్ల కలుగుతున్నవే!

అలా 'ఈ శరీరమే నేను!' అన్న గుర్తింపు ఏర్పడిందంటే, మిగతా గుర్తింపులన్నీ దాన్ని మరిన్ని రెట్లు పెంచుకొంటూ పోయేవే. మీరు చేస్తున్న పనుల్లో మీకు మరింత సాఫల్యత లభిస్తున్న కొద్దీ, మీరు వీటిని మరింత పెంచుకుంటూ వెళ్తారు. అవి పెరిగిపోయిన కొద్దీ, మీకు, ఉన్న విషయాలను ఉన్నట్టుగా చూడలేరు. మీ మనసు మీచేత ఆడించే ఈ నాటకం - పతాక స్థాయికి చేరితే, మీకు అసలేమీ కనిపించదు. మీ ఆలోచనలూ, మీ భావోద్రేకాలలో మీరు మునిగిపోతారు. దురదృష్ట వశాత్తూ లోకం కూడా బుర్రల్లో జరిగే ఆలోచనలన్నీఏవో అత్యంత ప్రధానమైనవి అన్నట్టుగా మీ మీద సాంఘికపరమైన ఒత్తిడి పెడుతుంది. నేనయితే మాత్రం, 'బుర్రకు వచ్చే ఆలోచనలన్నీ పనికిమాలిన చెత్తే!' అని ఈ ప్రపంచానికి నచ్చచెప్పాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను.

'లేదు సద్గురూ! నా ఆలోచనలన్నీ భగవంతుడి గురించి!” అంటారు. అవీ పనికి రానివే! ఎందుకంటే, మీ బుర్రలోకి దేవుడూ రాడు, దెయ్యమూ రాదు, దేవతలూ రారు, వచ్చేవి ఆలోచనలు మాత్రమే.

ఒక రకమైన ఆలోచన ఏదో పవిత్రమనీ, మరొకటి కాదనీ భావించేవాడు మూర్ఖుడు. ఆలోచన అంటే 'వర్తమానంలో యథార్థం కాని విషయం'. మీ బుర్రలలో ఉన్న పాత అనుభవాల చెత్తకుప్పను కదిలిస్తే పుట్టుకొచ్చేది. అదనీ, ఇదనీ, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే తప్ప మీరు బతకలేరు. నిజానికి ఏదయినా కొత్త విషయం తెలుసుకోవటానికయితే మీరు ఆలోచించాల్సిన పనే లేదు. జ్ఞానోదయం కలగాలంటే ఆలోచనలు అవసరం లేదు. మీరు ఆలోచిస్తే మాత్రం ఏం ఆలోచిస్తారు? మీ బుర్రలో పేరుకుపోయిన పాత విషయాలంతా తిరగబోస్తారు. మహా అయితే ఒకే విషయం పది రకాలుగా తిరగేసి మరగేసి చూస్తారు, అంతే! ఈ పాత చెత్త ఎన్ని రకాలుగా భావ వ్యక్తీకరణ ప్రకటించినా అది మీ జీవితానికి ఎటువంటి విలువ లేదు. సాంఘికంగా కొంచెం పనికొస్తుందేమో, అంతే! నేను విదేశాలలో తిరిగేటప్పుడు కొన్ని చోట్ల కొందరు అంటుంటారు, ' సద్గురు మన ఆలోచనలకు దిశానిర్దేశం చేయగల మేధావి' అని. 'అయ్యో….నా బుర్రలో అసలు ఆలోచన అనేది ఉండదు’.

స్పష్టంగా చూడగలగాలి, అన్నింటినీ చూడగలగాలి, మీ దృష్టికి మీరే ఆటంకంగా పరిణమించకుండా చూడగలగాలి. ఇదొక్కటీ చేస్తే, మీకు స్థిరత్వమూ, నిశ్చలత అనేవి వస్తాయి. ఆనందాతిశయం మాటంటారా, దాన్ని గురించి మీరు బెంగ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే, అది జీవితానికి ఉండే సహజ లక్షణమే, సర్వం ఆనందాతిశయ మయమే. మీరు నిశ్చలత్వం అలవరచుకొంటే, మీకు ఆనందాతిశయం దానంతటదే వస్తుంది. ఆ స్థిరత్వం లేనప్పుడు, ఆనందాతిశయం మీకు అసౌకర్యంగా అనిపించి నిలకడ లేకుండా చేస్తున్నదని దాన్ని మీరే కుదించేయాలని చూస్తారు. మీరు కొంత వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు, మీకు సమతౌల్యం లేకపోతే, మీరు ఒరిగిపడిపోయి ఇబ్బందిపడతారు. మీరు సైకిల్ తొక్కుతున్నా సరే, లేక ఈ బ్రహ్మాండాన్నే అధిష్ఠించి ఉన్నా సరే, సమతౌల్యం లేకుండా వేగం పెంచుకొంటూ పోతే, మిమ్మల్ని మీరు ఘోరంగా గాయపరచుకుంటారు. సమతౌల్యం చాలా ముఖ్యం, కుదించటంవల్ల వచ్చే సమతౌల్యం, సమతౌల్యం కాదు. ఓ రకంగా దానిని అందంగా ముస్తాబయిన మృత్యువు అనొచ్చు. చూసేందుకు చక్కగా, గౌరవనీయంగా కనిపిస్తుంది, మరణించిన వాళ్ళు ఎప్పుడూ గౌరవనీయంగానే కనిపిస్తారు కదా! వాళ్ళు చిల్లర చేష్టలేమీ చేయలేరు.

అన్నిటికీ మూలం విస్పష్టతగల సమ దృష్టే. 'నేను' అనే దానికీ, 'నా శరీరం' అనే దానికీ మధ్య తగినంత దూరం ఉంచితే గాని, మన దృష్టిలో ఈ స్పష్టత రాదు. ఈ దూరం లేకపోతే, మిమ్మల్ని మీరు వివిధ రకాలైన వాటితో గుర్తింపు ఏర్పరచుకోవటం అనివార్యం అవుతుంది.

రొజూ మీరు ఈ పర్వతాల మీద జాగ్రత్తగా దృష్టి కేంద్రీకరిస్తే మీకు పిచ్చ్చెక్కి పోతుంది. దాదాపు నా జీవితమంతా నేను వాటిని నా మనోఫలకంలో ఉంచుకొనే ఉన్నాను. అయినా వాటిని చూస్తే ఇప్పటికీ నాకు పిచ్చెక్కి పోతుంది. మీరు వాటిని చూడలేక పోతున్నారో లేక చూసినా సరైన దృష్టి కేంద్రీకరింప లేకపోతున్నారో.

ఒక సారి శంకరన్ పిళ్ళై ఈశ యోగ కేంద్రానికి వచ్చాడు. అందమైన ప్రకృతి దృశ్యం చూడటానికి అనువుగా ఉండే గది కావాలన్నాడు. సరే, కొంచెం ఆలోచించి, రిసెప్షన్ వాళ్ళు ఆయనకి చిత్రా బ్లాక్ లో ఒక మంచి గదిని కేటాయించారు. మర్నాడు పొద్దున లేచి, అతగాడు 'మంచి ప్రకృతి దృశ్యం చూడటానికి వీలయ్యే గదిని కేటాయించమంటే మీరు నాకు ఇలాంటి గది ఇచ్చారేమిటి?' అని పిర్యాదు చేసాడు. 'మా దగ్గర చక్కటి ప్రకృతి దృశ్యం కనిపించే గది ఇదే' అన్నారు రిసెప్షన్ వాళ్ళు. 'అసలిక్కడ దృశ్యమే కనిపించి ఏడవటంలేదు. అన్నిటికీ ఆ పర్వతం ఒకటి అడ్డంగా వస్తున్నది గదా?' అన్నాడు శంకరన్.

మీ చూపుకు పర్వతం ఎప్పుడూ అడ్డు రాదు, కానీ మీరు మాత్రమె మీకు అడ్డు, అది దాటి చూడగాలిగితే అంతా చూడచ్చు...

ప్రేమాశీస్సులతో,

సద్గురు

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1