మనోభావాలు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమా?

ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలుంటాయి. ఆ మాటకొస్తే భావోద్వేగమే లేని జీవిని మనం అసలు మనిషిగానే గుర్తించలేం. కాని కొందరు భావోద్వేగాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఆటంకమవుతాయని అంటారు. మరి ఈ విషయం గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి!
 

ప్రతి మనిషిలోనూ మనోభావాలుంటాయి. ఆ మాటకొస్తే మనోభావమే లేని జీవిని మనం అసలు మనిషిగానే గుర్తించలేం. మీ మనోభావాలు మీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమని అనేవారు మనస్సు కూడా ఆటంకమే అంటారు. అటు తరువాత మీ శరీరం కూడా దానికి ఆటంకమంటారు. అవును, ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే. మీ శారీరం, మనసు, మనోభావ శక్తులు మీ జీవితంలో ఆటంకాలుగా, మీ ఎదుగుదలను నిరోధించేవిగా ఉండొచ్చు లేదా అవే మీ ఎదుగుదలకు సోపానాలు కూడా కావచ్చు. అదంతా మీరు వాటిని మీ జీవితంలో ఎలా మలుచుకున్నారు అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది.

 ఈ శరీరాన్ని, మనోభావాలనూ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా చేసుకుంటున్నారా లేదా మీ అభ్యున్నతికి వాటినే నిచ్చెన మెట్లుగా మలుచుకుంటున్నారా అనేదే ప్రశ్న

కాబట్టి ఈ శరీరాన్ని, మనోభావాలనూ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా చేసుకుంటున్నారా లేదా మీ అభ్యున్నతికి వాటినే నిచ్చెన మెట్లుగా మలుచుకుంటున్నారా అనేదే ప్రశ్న. ఈ మూడు మీ జీవితంలో అవరోధాలనుకుంటే ఎలా? ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఈ మూడే కదా ఆధారం. ఇవి తప్ప జీవితం కొనసాగించడానికి మరే ఇతర సాధనం లేదు కదా. మీ మనోభావాలు మీ ఆలోచనలకు విరుద్ధమైనవి కావు. మీ ఆలోచనా సరళిని బట్టే మీ అనుభూతి కూడా వుంటుంది. కాదంటారా? ఆలోచన రసరహితమైనది ఐతే, మరి అనుభూతి రసవంతమైనది. కాబట్టి మనోభావాలు ఆలోచనకి రసభరిత పార్స్వాలనవచ్చు. మీ ఆలోచనకు విరుద్ధంగా మీ మనోభావాలు వుండవు, గమనించి చూడండి. “ఈయన భరించలేని వ్యక్తి” అని తలచాక అతడి పట్ల మీలో కోమల మనోభావాలు కలిగే అవకాశముంటుందా? కలిగే అవకాశమే లేదు. మీరే విధంగా ఆలోచిస్తారో అలానే మీ మనోభావాలు కూడా  సాగుతాయి.

మీరే విధంగా ఆలోచిస్తారో అలానే మీ మనోభావాలు కూడా  సాగుతాయి

అందుకే మనోభావాలని ఆటంకమనుకుంటే మనం మన ఆలోచనల్ని కూడా స్తంభింప చేయవలసి వుంటుంది. కొన్ని లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత మన బుద్ధి ఈ స్థాయికి చేరింది. మరి ఇప్పుడు ఈ బుద్ధిని సమస్యగా భావించగలమా? బుద్ధి సమస్య కాదు. బుద్ధిని సరిగా వినియోగించలేక పోవడమే అసలు సమస్య. మీకు చాలా వేగంగా నడిచే ఓ వాహనం ఇచ్చామనుకోండి. కానీ దాన్నెలా నడపాలో మీకు తెలీదు అనుకోండి. అప్పుడు మీరు దాన్ని నడపడం మీకు, మీ చుట్టూ వున్న వాళ్ళకి కూడా సమస్యే. ఎందుకంటే మీరు వాహనం నడిపే పద్ధతి నేర్చుకోలేదు కాబట్టి. అంతే తప్ప, లోపం ఆ యంత్రంలో లేదు.

మానవ శరీరం ఓ అద్భుతమైన సాధనం. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైనది. ఈ సాధనంలో ఏ లోపం లేదు

మానవ శరీరం ఓ అద్భుతమైన సాధనం. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైనది. ఈ సాధనంలో ఏ లోపం లేదు. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే మీకు సమస్యగా మారింది. ఎందుకంటే మీరు దాన్ని తెలుసుకోవడానికి గానీ, నియంత్రించడానికి గానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కనకనే మనస్సుని నియంత్రించలేని మూర్ఖులంతా దాన్నో సమస్యగా భావిస్తున్నారు. నిజమే. వారి మనస్సు వారికొక సమస్యే. నేనూ అంగీకరిస్తాను. అటువంటి వారి ఆలోచనా సరళి అందరికీ సమస్యే. అంతేగానీ మనస్సు దానికై అది ఒక సమస్య అని అర్ధం కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1