Sadhguruమీ తర్కాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించూడదో తెలిస్తేనే, మీ జీవితం సంతోషంగా ఉంటుంది! మనుషులలో ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ వారి జీవితాల్లో సంతోషం తగ్గిపోతోంది. కానీ, అది అలా జరగకూడదు కదా..! మీ మనస్సు అనేది ఈ సమాజం వాడే ఓ చెత్తబుట్టలా మారిపోయింది. మీ వైపుగా వెళ్తున్నవారు ఎవరైనా సరే , ఏదో ఒకటి మీ తలలో పడేసి పోతున్నారు. మీ పరిధిలోకి వచ్చే ప్రతీ దృశ్యం, శబ్దం, స్పర్శ, రుచి, వాసన - ఇలా మీ పంచేంద్రియాలు సృశించినవన్నీ మీ మనసులో నిలిచిపోతున్నాయి. మీకు వాటిని ఆపే స్వేచ్ఛ లేదు, ఆ విషయంలో మీరు ఏమీ చేయలేక పోతున్నారు. అంటే మీరు మనసు అంటున్న దానిలో నిక్షిప్తమయ్యే విషయాలన్నీ కూడా మీరున్న సామాజిక, ధార్మిక, సంస్కృతిక అంశాల మీద ఆధారపడి ఉంటాయి.

మీరు జీవితాన్ని అర్థం చేసుకునే పద్ధతి, మీ ఆలోచనాసరళి, స్పందించే తీరు - ఇలాంటివి అన్నీ మీరు అంతకముందు మీ బుర్రలో పోగుచేసుకున్న చెత్తను బట్టి ఆధారపడి ఉంటాయి.

మనం మనసుని మూడు భాగాలుగా విభజించవచ్చు. ఇందులో మొదటిది విచక్షణ  - దీనిని మనం బుద్ధి అంటాం. రెండవది, సమాచారం సేకరించి భద్రపరుస్తుంది. ఇక మూడోది ఎరుక - దీనినే మనం ప్రజ్ఞ అంటాం. మీరు జీవితాన్ని అర్థం చేసుకునే పద్ధతి, మీ ఆలోచనా సరళి, స్పందించే తీరు - ఇలాంటివి అన్నీ మీరు అంతకముందు మీ బుర్రలో పోగుచేసుకున్న చెత్తను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇది సామాజికమైనది కావచ్చు, ధార్మికమైనది కావచ్చు, లేదా  ఆధ్యాత్మికమైనా కావచ్చు - ఇలా  విషయం ఏదైనప్పటికీ కూడా ఇదంతా బయటినుంచి వచ్చిందే. ఇదంతా మనుగడ కోసమే పనికి వస్తుంది. మనిషి చేతనత్వానికి సంబంధించి, వీటికి ఎలాంటి ప్రాముఖ్యతా లేదు. ఈ విషయాలను మీ అవసరాల మేరకు, తగిన విధంగా మనుగడకు వాడుకనే సామర్థ్యమే వివేకం. ఇలా ఒక విషయానికి, మరో విషయానికి మధ్య విచక్షణ చూపగల సమర్థత ఉంది కనుకనే, ఈ భూగోళంపై మీ మనుగడ సాధ్యం అవుతోంది.

తెలివిగా మీ తెలివిని ఉపయోగించండి

అయితే మీలో తెలివితేటలు పెరిగే కొద్దీ మీ చుట్టూ ఉండే ప్రతి దానినీ విడమరచి చూడడం అలవాటు అవుతుంది; ఆ తరువాత అసలు ఈ విభజనను ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. ఈ లక్షణం మిమ్మల్ని దేనితోనూ సంపూర్ణంగా ఏకీభవించకుండా చేస్తుంది. ఈ భూమి మీద బ్రతికేందుకు తెలివి ఒక మంచి సాధనం; కాని అదే సమయంలో జీవితంలోని ఏకత్వాన్ని అనుభూతి చెందడంలో, ఈ తెలివితేటలే భయంకరమైన అడ్డుగోడలుగా వ్యవహరిస్తాయి. అందుకే, తెలివితో వచ్చే మీ తర్కం ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించూడదు అని తెలిస్తేనే, మీ జీవితం అందంగా ఉంటుంది.

ఇంద్రియాల ద్వారా సత్యాన్ని తెలుసుకోలేము

మీ మనసులో చేరిన అనుభూతులన్నీ మీ పంచేంద్రియాల ద్వారానే మనసులోకి ప్రవేశించాయి. అయితే ఈ ఇంద్రియాలు ఏ అనుభూతినయినా మరోదానితో పోల్చడం ద్వారా మాత్రమే గుర్తించగలవు. ఉదాహరణకు మీ జీవితంలో మీరెప్పుడూ అసలు చీకటినే చూడలేదనుకోండి, అప్పుడు వెలుగు అంటే ఏమిటో అనుభూతి చెందలేరు.

మీరు మీ ఎఱుకతో ఈ భ్రమలన్నింటినీ తుడిచి వేసినపుడే, ఏది సత్యమో, ఏది అసత్యమో మీ వివేకం గ్రహిస్తుంది.

ఇంద్రియాలు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించలేవు; ఎందుకంటే ఇంద్రియాలు ప్రతిదానినీ, మరొకదానితో పోల్చడం ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాయి. ఎక్కడ పోలిక ఉంటుందో, అక్కడ ద్వంద్వత్వం ఉంటుంది. మీ అవగాహన అసంపూర్ణంగా మాత్రమే ఉంటుంది. ఈ విధంగా అసంపూర్ణంగా, ముక్కలు ముక్కలుగా గ్రహించడం ద్వారా మీరు సర్వాన్నీ(అనంతాన్ని) తెలుసుకోలేరు.

మీరు మీ ఎఱుకతో ఈ భ్రమలన్నింటినీ తుడిచి వేసినపుడే, ఏది సత్యమో, ఏది అసత్యమో మీ వివేకం గ్రహిస్తుంది. మీ వివేకం పదునైన కత్తిలాగా ఉంటే, దానికి ఏమీ అంటుకోదు. అది దేనితోనూ ముడిపడదు, దేనితోనూ మమేకం కాదు; ఉన్నది ఉన్నట్లు చూడగలిగేలా మిమ్మల్ని తయారుచేస్తుంది. అప్పుడు మీ మనసు పోగుచేసిన విషయాలు, మీ గుర్తింపులు, మనోభావనలు ఇలా ఏవీ మీ వివేకాన్ని ప్రభావితం చేయలేవు. యోగ ప్రక్రియలు, ధ్యాన ఉద్దేశం కూడా ఇదే. ఒకసారి మీకు, మీ మనసుకి మధ్య, ఒక స్పష్టమైన దూరం ఏర్పడితే,  మీరు జీవితంలో  వినూత్న పార్శ్వాన్ని చూస్తారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు