మనది సత్యాన్వేషకుల భూమి..!!

మానవుడు తన ప్రస్తుత పరిమితులకు లోనై ఉండవలసిన అవసరం లేదు అన్న ఆవశ్యకతను ఆదియోగి మన ముందుంచారు.
 

మానవుడు తన ప్రస్తుత పరిమితులకు లోనై ఉండవలసిన అవసరం లేదు అన్న ఆవశ్యకతను ఆదియోగి మన ముందుంచారు. మనం ఈ భౌతికతలోనే ఉంటూ కూడా దానికి చెందకుండా ఉండే  విధానం ఒకటుంది. ఈ దేహంలోని నివసిస్తూ కూడా, దేహంగా మారకుండా ఉండే అవకాశం ఉంది. మనం ఈ మనసుని ఎంతో ఉన్నతమైన విధానంలో ఉపయోగిస్తూ కూడా మనసు పెట్టే బాధలు తెలియకుండా గడపగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దాన్ని అధిగమించి మీరు మరోవిధంగా జీవించే అవకాశం ఉంది. మీరు మీ ప్రస్తుత అవరోధాల మీద కృషి చేయగలిగితే మీరు పరిణామం చెందగలిగే అవకాశం ఉందని “ఆదియోగి” మనకు చెప్పారు. ఆయన పరిణామం చెందడానికి మనకి విధానాలను కూడా ఇచ్చారు. ఇది ఆదియోగి విశిష్టత.

నా కాలం అయిపోయేలోగా, నేను ఆదియోగి మానవాళికి అందించిన ఈ అపూర్వ కానుక, విశ్వం అంతా గుర్తించేలాగా చేయాలని అనుకుంటున్నాను. మేమిది ఎన్నోవిధాలుగా చేద్దామని  అనుకుంటున్నాము. ఒకటేమిటంటే ‘ఆదియోగి ఆలయాలను’ నిర్మించాలని అనుకుంటున్నాము. ఇందులో ‘21 అడుగులు ఆదియోగి ముఖంతో పాటుగా, ఒక లింగాన్ని’ ప్రతిష్టించాలని అనుకుంటున్నాము. ఇది ఎంతో శక్తివంతమైన స్థలంగా మారుతుంది. మొట్టమొదటిది ‘అమెరికాలో టెన్నెసీ లో ఉన్న మా ఆశ్రమంలో నెలకొల్పాం’. ఈ భూమి  మీద ప్రతి వారికి కూడా యోగా ప్రపంచానికి ఈయన అందించినదే అన్న విషయం తెలియాలి. గత 5-6 సంవత్సరాలలో యూరప్ లో నాలుగు పెద్ద, పెద్ద పుస్తకాలు అచ్చయినాయి. అవేం చెబుతున్నాయంటే  ‘యోగా’ భారత దేశం నుంచి వచ్చింది కాదు, యూరోప్ లో ఉన్న వ్యాయామ వ్యవస్థ పరిణామమే ‘యోగ’ అని చెబుతున్నాయి.

గౌతముడు 2500 వందల సంవత్సరాల క్రితంవారే. కానీ ఆదియోగి 15000 సంవత్సరాల క్రితం వారు.

ఇలా మరో పది, పదిహేను పుస్తకాలు రాశారంటే అదే సత్యం అని  నమ్ముతారు. మీరు పాఠ్య పుస్తకాలలో చరిత్రగా దేన్నైతే చదువుతారో అదే నిజం అని నమ్ముతారు. నిజానికి అది నిజం కాదు. నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కొంతమంది స్వప్రయోజనం కోసం రాసుకున్నవి. ఇలా మరో పాతిక, యాభై పుస్తకాలు వచ్చే పది, పదిహేను సంవత్సరాలలో అచ్చయినాయి అనుకోండి, ఆ తరువాత కొంతమంది యోగ అమెరికా నుంచో, లేదా క్యాలిఫోర్నియా నుంచి వచ్చిందనో లేదా మడోన్నా యోగాను కనిపెట్టరానో చెప్తారు. ఇది నేను పరిహాసానికో, నవ్వులాటకో చెప్పడం లేదు. ఇలా తేలిగ్గా చేయచ్చు. కొంతమంది ఏదైనా రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ‘డాన్ బ్రౌన్’ అన్న ఆయన ఆయన ‘ఏంజెల్స్ & డెమన్స్’ అన్న పుస్తకంలో యోగా బౌద్ధమతానికి చెందిన ఒక కళ అని చెప్తున్నారు. గౌతముడు 2500 వందల సంవత్సరాల క్రితం వారే. కానీ ఆదియోగి 15000 సంవత్సరాల క్రితం వారు. ఇవాళ మీరు గౌతముడు అంటారు, రేపొద్దున్న మడోనా అంటారు. ఇలా కొన్ని పుస్తకాలు రాస్తే అదే నిజం అయిపోతుంది.

అందుకని నా కాలం తీరేలోగా ప్రతివారికీ యోగా అన్నది ఆయన(ఆదియోగి) నుంచి వచ్చిందే అని తెలియపరచాలనుకుంటున్నాను. ఇది మనకు చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే భారత సంస్కృతి సత్యాన్వేషకులతో ఏర్పడింది. మనం నమ్మకాల మీద ఆధారపడేవాళ్ళం కాదు. మనం ముక్తి కోసం శోధన చేస్తాం. అదే మనందరినీ ఒక్కటిగా పట్టి ఉంచుతోంది. మనం ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసామంటే అక్కడ మనుషులు వేరే విధంగా ఉంటారు, వేరే బాష మాట్లాడుతారు, విభిన్నంగా వస్త్ర ధారణ  ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి. ప్రతిదీ మారిపోతుంది. అయినా కానీ రాజ్యాంగ పరంగా మనందరం ఒక్కటిగానే ఉన్నాం. ఎందుకంటే మనం 200 ముక్కలును ఒక్కటిగా, ఒక హిందుస్తాన్ ను భారతదేశంగా ఉంచడం కొంచెం విచిత్రంగానే ఉంటుంది. మనందరినీ ఒక్కటిగా ఉంచేది, మనం సత్యాన్వేషకులం అన్న విషయమే.

ఒక సత్యాన్వేషకుడు అంటే అతనికి ఏమీ తెలీదు అన్న విషయం తెలుసుకున్నవాడు.

మనం నమ్మకాల మీద ఆధారపడం. రాముడు ఏవన్నా సరే, కృష్ణుడు ఏవన్నా సరే, వేదాలు ఏం చెప్పినా సరే, ఉపనిషత్తులు ఏం చెప్పినా సరే అవన్నీ ఏం చెప్పినప్పటికీ మీరు ఈ గడ్డ మీద ఒక మనిషిగా పుడితే, మీరు సత్యాన్వేషణ చేయవలసిందే. మీ ముక్తిని మీరు శోధించవల్సిందే. ఎందుకంటే ఇది అన్వేషకుల భూమి. అంతేకానీ దండయాత్రలు అన్నవి తెలీదు. మానవాళి సత్యాన్వేషకులుగా లేకుండా నమ్మకాల మీద ఆధారపడ్డప్పుడు దండయాత్రలు అన్నవి జరుగుతాయి. హింసకి మూల కారణం ఇదే. మనం ఈ కారణాన్ని తీసేశామంటే హింస ఎంతగానో తగ్గిపోతుంది. ప్రజలు చిన్న విషయాల కోసం పోట్లాడుకోవచ్చు. కానీ పోరాటం అన్నది ఇంతటితో ఆగిపోతుంది. నేను ఒక విషయాన్ని నమ్ముతాను. మీరు మరో విషయాన్నీ నమ్ముతారు. ఇక పోరాటం మొదలవుతుంది. అది అంతు లేకుండా సాగుతుంది.

ఇవాళ ఈ సృష్టి యొక్క  స్వభావాన్ని చూసిన తరువాత శాస్త్రవేత్తలు కూడా ఇది  ఒప్పుకుంటున్నారు - అదేవిటంటే వారికి ఈ సృష్టి యొక్క స్వభావం తెలీదు అని. “అహా లేదు నా దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు, మీ దేవుడు కాదు” అని మీరు ఎవరితో పోరాటానికి వెళ్తారు? అదే కదా సమస్య. ఒక సత్యాన్వేషకుడు అంటే అతనికి ఏమీ తెలీదు అన్న విషయం తెలుసుకున్నవాడు. ఈ ఒక్క విషయం జరిగిందంటే మానవాళిలో 90శాతం హింస అన్నది ఉండకుండా పోతుంది. అందుకని మేము దీన్ని తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో “ఆదియోగి” కంటే ప్రభావితం చేసేవారు మరొకరు ఉండరు. ఆయన్ని ఎన్నో విధాలుగా సాక్షాత్కరింప చేయాలని అనుకుంటున్నాం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు