సద్గురు: అది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నని మరింత స్పష్టంగా అడుగుదాం. మీరిప్పుడున్న స్థితికి ఎవరు బాధ్యులు? మీ జన్యువులా? మీ తండ్రా? మీ తల్లా? మీ భర్తా? మీ భార్యా? మీ గురువులా? మీ పైఅధికారా? మీ అత్తగారా? భగవంతుడా? ప్రభుత్వమా? పైన చెప్పినవన్నీనా? ఈ పరిస్థితి సర్వవ్యాప్తమైనది. అన్నీ చోట్లా ఉన్నదే. ఎవరినైనా అడగండి,"మీరెందుకు ఈ స్థితిలోఉన్నారు?" అని. ఠక్కున సమాధానం వస్తుంది, "ఒకసారి ఏమయిందంటే, నా చిన్నప్పుడు ... నా తల్లిదండ్రులు..." అంటూ. ఇది పాత కథే. అక్కడక్కడ కొన్ని మార్పులూ-చేర్పులూ ఉంటాయంతే.

‘దుఃఖాన్ని సృష్టించుకోవడం ఎలా?’ అన్నదానిపై ఒక పురాతన శాస్త్రం ఉంది. అందులో మనుషులకేవిధమైన సహాయమూ అవసరం లేదు. అందులో నిష్ణాతులు కానివారెవరూ కనిపించరు. మీరు మీ బాధ్యతని పక్కవాడి మీదకి తోసే పనిని ప్రతి రోజూ వంద విధాలుగా చేస్తూంటారు. వైఫల్యాలకి ఒకర్ని నిందించడమనే ఆటలో మీకున్న నైపుణ్యాన్ని సానపెట్టి దాన్నొక కళా స్థాయికి తీసుకువచ్చారు.

మనకి నిత్యం ఎదురయ్యే అనేక సంక్లిష్టమైన సమస్యలకి మనం ఎంత సమర్ధంగా ప్రతిస్పందిస్తాం అన్నదాని మీద, మన జీవిత నాణ్యత ఆధారపడి ఉంటుంది. తెలివితేటలతో, సమర్థతతో, సున్నితంగా ప్రతిస్పందించడానికి బదులు ప్రతిక్రియాత్మకంగానో లేదా నిర్బంధంతో ప్రతిస్పందించేలాగానో రాజీపడితే, ఆ సందర్భానికి మనం బానిసలమైపోతాం. అంటే, మన జీవితానుభవం ఎలా ఉండాలో మనమే స్వయంగా నిర్ణయించుకునే బదులు, పరిస్థితులకే మనం ఆ నిర్ణయాన్ని వదిలేశామన్నమాట.

పూర్తిగా బాధ్యత వహించడమంటే, పూర్తిగా చైతన్యవంతంగా ఉండడం. దేన్నైతే శరీరమని మీరు అనుకుంటున్నారో, దాన్ని ఆహారం ద్వారా సమకూర్చుకున్నారు. దేన్నైతే మనసని అనుకుంటున్నారో, అది మీరు మీ పంచేంద్రియాల ద్వారా సమకూర్చుకున్నారు. అయితే దానికి అతీతమైనదీ, మీరు పోగుచేసుకోనిదీ, ఏదైతే ఉందో అదే - మీరు. జీవించి ఉండటమంటే చైతన్యంగా ఉండడం. ప్రతి వ్యక్తీ ఎంతో కొంత మేరకు చైతన్యవంతంగా ఉంటాడు. కానీ శరీరాన్నీ, మనసునీ దాటిన ప్రమాణాన్ని స్పృశించగలిగినపుడే, ఈ చైతన్యానికి కారణభూతమైన మూలాన్ని స్పృశించినట్టు.

అప్పుడు ఈ సృష్టి అంతా సచేతనమై ఉందని మీరు తెలుసుకుంటారు. మీరు నివసిస్తున్నదొక సజీవమైన బ్రహ్మాండమని గ్రహిస్తారు.

ఈ భౌతిక, మానసిక ప్రమాణాలు, సుఖ దుఃఖాలు, రాగ ద్వేషాలు, స్త్రీ పురుషులు అనేవి ద్వంద్వత్వపు పరిధిలో ఉంటాయి. ఒకటి మీదగ్గరుంటే, రెండవది సహజంగా దాని వెంటే ఉంటుంది. కాని మీరెవరో ఆ మౌలిక ప్రమాణంలోకి కనుక మీరు అడుగు పెట్టగలిగితే, ద్వంద్వాలన్నిటినీ మీరు అధిగమిస్తారు. అపుడు మీరు స్వభావరీత్యా బ్రహ్మానంద స్థితిని చేరగలుగుతారు. మీ భాగ్య విధాతలు మీరే అవుతారు.

‘బాధ్యత’ అన్న ఈ ఒక్క మాటలో ఉన్న అసాధారణమైన పరివర్తనా శక్తిని మనం తిరిగి చేజిక్కించుకోవాల్సిన సమయం వచ్చింది. దీన్ని మీ జీవితానికి అన్వయించి చూడండి, అది ఆవిష్కరించే అద్భుతాన్ని వీక్షించండి!.

ప్రేమాశిస్సులతో,
సద్గురు