ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మానసిక ఒత్తిడికి గురికావడం సర్వ సాధారణమైపోయింది. ఇందుకు కారణం మీరు శారీరకంగా శ్రమించక పోవడమే!

ప్రపంచం అంతా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రత్యేక తరహా మానసిక వత్తిడికి లోనవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక మానవుడు శారీరక శ్రమ చేయకపోవడమే. ఆధునిక సదుపాయాలు రాక ముందు మనుషులకు శారీరక శ్రమ అధికంగా ఉండేది. వారి శక్తి పెద్ద ఎత్తున ఖర్చయ్యేది. ఈ కారణంగా వారికి చాలావరకు మానసిక వత్తిడి దూరమయ్యేది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా యువకులు నాకు చాలా మంది తెలుసు. వారు ఈత కొట్టడం లేదా ఇతర క్రీడలు ఆడడం ప్రారంభించిన కొన్ని రోజులకే మళ్ళీ మామూలుగా మారిపోయారు. ఎందుకంటే శారీరక శ్రమ వీరి ఒత్తిడిని తొలగించింది.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో మానసిక వత్తిడికి గురవడం సర్వసాధారణం అయిపోతోంది.

మునుపెన్నడూ లేనంతగా మనిషి శారీరక శ్రమకు దూరమవుతున్నాడు. గతంలో ఇలా శారీరక శ్రమకు దూరంగా ఉండడం సాధ్యం అయ్యేది కాదు. కేవలం బ్రతకడానికే మనిషి శారీరకంగా ఎంతో శ్రమించవలసి వచ్చేది. ఇంతకు ముందు కూడా మానసిక వ్యాధితో బాధపడేవారు కొందరు  ఉండేవారు. కాని ఇంతమంది కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో మానసిక వత్తిడికి గురవడం సర్వసాధారణం అయిపోతోంది. ఇందుకు కారణం శరీరంలోని శక్తిని వాడకపోవడమే, శక్తి అంతా బంధింపబడిపోతోంది. మీరు మీ మానసిక సమస్యలను దూరం చేసుకోవడం లేదు సరి కదా, కనీసం వాటిని తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే దీనికి చికిత్స కూడా లేదు. మీరు బయటికి వెళ్ళి రోజంతా కట్టెలు కొడితే, మీలోని శక్తి చాలా వరకు ఖర్చవుతుంది. మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. అయితే ఈ రోజుల్లో ఇలా జరగడం లేదు. మీరు మీ శరీరాన్ని ఇంతకు ముందులాగా పనిచేయించడం లేదు. ఈ కారణంగా ఇంతకు ముందెన్నడూ లేనంతగా రకరకాల జబ్బులు వస్తున్నాయి.

ఇలా మీ శరీరంలో ఎంతో కాలంగా పెరిగిపోతున్న శక్తిని ఖర్చు చేసేందుకు, అలాగే మానసిక ఒత్తిడిని పోగొట్టేందుకు మీకు ఏదో ఒక మార్గం కావాలి. అందుకే ఈ బార్లు, క్లబ్బులు, డిస్కోలు పుట్టుకొచ్చాయి. ఏదో విధంగా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రజలు అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఈ డిస్కోలను చూస్తే అవి పిచ్చికి పరాకాష్టలా ఉంటాయి. అక్కడ మీరు సరిగా గాలి కూడా పీల్చలేరు. అక్కడ అంతా పొగ, చెమటలతో నిండి ఉంటుంది. అక్కడ సరిగ్గా డాన్స్ కూడా చెయ్యలేరు, ఒకళ్ళపై మరొకళ్ళు పడిపోతూ ఉంటారు. అయినా ఫరవాలేదు. అక్కడికి వెళ్ళాల్సిందే, వెఱ్ఱివేషాలు వేయవలసిందే! లేకపోతే వారు పిచ్చి తగ్గించుకోలేక నిజంగా పిచ్చివారవుతారు.  వారం గడిచిపోగానే, మళ్ళీ శనివారం కోసం ఎదురు చూస్తుంటారు.

మోహంలో తీవ్రమైన కోరిక ఉంటుంది. కాని ప్రేమలో అది ఉండదు.

ఈ వెర్రిని తగ్గించుకుని, ముందుకు సాగడానికి మరోమార్గం ఉంది. దానిని పూర్తిగా వదిలేసి ముందుకు పోయే మార్గం. మీకు  ఇక ఆ వెర్రితో సంబంధం ఉండదు. ధ్యానమంటే అదే. మీరు ధ్యానపరులైనపుడు, మీరు డాన్స్ చేస్తే డాన్స్ లోని ఆనందం కోసం డాన్స్ చేస్తారు. అంతేకాని నిర్భంధం వల్ల కాదు.. మీ పిచ్చితనం పోగొట్టు కోవడానికి డాన్స్ చేస్తే అది ఒక చికిత్సగా పనిచేస్తుండవచ్చు. అది మంచి చికిత్సే కావచ్చు, కాని దానిలో కొంత అసహ్యత ఉంది. అదే మోహం, మీరు ప్రేమతో కాకుండా మోహంతో నాట్యం చేస్తారు.

మీకు ప్రేమకూ, మోహానికీ తేడా తెలుసా? మోహంలో తీవ్రమైన కోరిక ఉంటుంది. కాని ప్రేమలో అది ఉండదు. నిజమైన ప్రేమకు ఏమీ అక్కరలేదు. జీవితాంతం ఇక్కడే ఇలాగే కూర్చుని కూడా కాలం గడిపేయగలదు. కాని మోహంలో మనుషులు కుదుటపడలేరు. మోహంలో ఏదో ఒక పిచ్చిపని చేయడమో లేదా పూర్తిగా పిచ్చివాడుగా మారడమో జరుగుతుంది. మీలో ఒక రకమైన మానసిక వత్తిడి, లేదా పిచ్చితనం ఉంటే మోహమే కలుగుతుంది. ఈ వ్యామోహం తిండి, శృంగారం, లేదా ఏదో ఒక వ్యాపకం గురించి కావచ్చు. ఇలా ఏదో ఒక దానిపై మోహపడతారు. ఈ వ్యామోహం లేకుండా మీరు బ్రతకలేరు. పనితో కూడా ఈ వ్యామోహాన్ని నియంత్రించవచ్చు. అదే ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. మనుషులు పని చేసుకుంటూ పోతున్నారు. తాము చేస్తున్నది ఏదో అద్భుతమైనదని కాదు, అలా పిచ్చిపిచ్చిగా పనిచేయకపోతే తామే పిచ్చివారమైపోతామని వారికి తెలుసు.

ఈ పిచ్చిని మీరు జాగ్రత్తగా నియంత్రించాలి. ఇతరులకు మీ పిచ్చి గురించి తెలియదు, మీరు కూడా అది మరచిపోవాలనుకుంటారు, మరచిపోవడానికి చేయవలసినదంతా చేస్తున్నారు. ప్రపంచంలోని వేడుకలూ, వినోదాలన్నీ ఈ పిచ్చిని కప్పిపుచ్చుకోవడానికే. మీరు నిబ్బరంగా ఉంటే అసలు ఈ వినోదాలు అక్కరలేదు. మీ పిచ్చి కప్పిపుచ్చుకోడానికే ఈ వినోదాలన్నీ, ఇవి లేకపోతే మీకు పిచ్చి పడుతుంది. స్థిరచిత్తం, నిశ్చలతత్త్వం గల వ్యక్తికి ఈ వినోదాలేవీ అక్కరలేదు. ఊరికే కూర్చుని ఒక వెదురు కొమ్మ పెరగటం గమనిస్తూ ఉండిపోగలడు. అతనికి ఏ వినోదమూ అక్కరలేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు