జీవితాన్ని సంపూర్ణంగా జీవించే మార్గం...

 

ఈ వ్యాసంలో సద్గురు ఆత్మజ్ఞానం అంటే ఏంటో, జీవితాన్ని ప్రస్తుతం భయంలో జీవిస్తున్నామని అసలు సంపూర్ణంగా జీవించడం అంటే ఏమిటో వివరిస్తున్నారు..

ప్రశ్న: నాకు,  నా అంతరంగం అంత అందమైన ప్రదేశంగా అనిపించదు.

సద్గురు : మీరసలు మీ అంతరంగాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఇప్పుడు దేనినైతే మీ అంతరంగం అని అనుకుంటున్నారో - అది మీ మనసు. మీ మనసు మీ అంతరంగంలో లేదు. మీ మనసు, ఈ సమాజం యొక్క చెత్త బుట్ట. మీ మనసులో ఉన్న ప్రతిదీ కూడా, మీరు బయటినుంచి ఏరుకున్నదే..! మీరు దేనిని స్వీకరిస్తారూ, దేనిని స్వీకరించరూ అన్నదాని పట్ల మీకు పెద్దగా ఎంపిక లేదు. మీరు దేనిని వాడుకోవాలీ, దేనిని వాడుకోవద్దూ అన్నదాని పట్ల ఎంపిక ఉంది. కానీ, ఈ ఎంపిక కూడా నిజానికి మీకు లేనట్లే..! ఎందుకంటే ఇది కూడా, అంతకుముందర ఏదైతే మీ లోపలికి వెళ్ళిందో(కర్మ), దానివల్ల పని చేస్తోంది కాబట్టి..! అందువల్ల మీకు ఇక్కడ నిజంగా పెద్ద ఎంపిక ఏమీ లేదు. మీ మనసు యొక్క, మీ శరీరం యొక్క పదార్థామంతా కూడా బయటినుంచి మీరు ప్రోగు చేసుకున్నదే..!

ప్రతివారూ కూడా వారికేమి కావాలో దానిని చూస్తారు. అక్కడ నిజంగా ఏమి ఉందో, దానిని చూడరు.

ఆహారం తినడం ద్వారా ఈ శరీరాన్ని మీరు నిదానంగా పోగుచేసుకున్నారు. అలాగే  మీ మనసులో ఏవైతే ఉన్నాయో, అవికూడా మీరు పోగుచేసుకున్నవే..! ఇవి బయటి దేనితో మీరు స్పర్శలోకి వచ్చారో ఆ ముద్రలు మీ మనసులో ఉన్నాయి. ఇవి మీ పంచేంద్రియాల ద్వారా మీలోపలికి వెళ్తున్నాయి. ఈ పంచేంద్రియాలు మీ చుట్టూరా ఉన్న జీవం నుంచి ముద్రలను పోగు చేస్తున్నాయి. వీటి మీద, మనం అసలు ఆధారపడలేము. మనం వీటి మీద ఆధారపడలేమని  నేనన్నపుడు ఒక విషయం ఏమిటంటే, ప్రజలు మీకు చూడడమే నమ్మడం - అని చెప్పారు. చూడడం నమ్మడం కాదు. ఈ విషయం మీకు బాగా తెలిసినదే..! ఎందుకంటే ఎవరికి కావలసినది వాళ్ళు చూస్తారు. అవునా? ప్రతివారూ కూడా వారికేమి కావాలో దానిని చూస్తారు. అక్కడ నిజంగా ఏమి ఉందో, దానిని చూడరు. మనం ఇంకా మౌలికంగా వెళితే, అసలు దృష్టి అన్న దానినే మనం నమ్మలేము. ఇంత మౌలికమైనది ప్రశ్నార్థకంగా ఎందుకు ఉన్నదీ అంటే మన పంచేంద్రియాలు కేవలం మనుగడ కోసమే ఉపకరించేవి.

కానీ,  మీరు మనుగడకు అతీతమైన జ్ఞానోదయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది మనుగడ ప్రక్రియ కాదు. మీరు ఎప్పుడైతే మనుగడకు అతీతమైనదాని గురించి చూస్తున్నారో, అప్పుడు మీకు మీ పంచేంద్రియాలు సరిపోవు. మీరూ, మీ అవగాహన మరొక కోణానికి ఎదగాలి. ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా కూడా, మీ అవగాహనను పెంపొందించుకోవడమే..! దురదృష్టవశాత్తూ నేను ఆధ్యాత్మికత అనగానే, ప్రజలు రామ-రామ అనడమో, గుడికి వెళ్లడమో, చర్చికి వెళ్లడమో, మసీదుకి వెళ్లడమో లేదా ఆహారం తినడం లేక మానేయడమో, బట్టలు వేసుకోకుండా ఉండడమో.. మరేదో.. అని అనుకుంటారు. కానీ నిజానికి ఇది అదంతా కాదు. కేవలం, మీ అవగాహనను పెంపొందించుకోవడం మాత్రమే. మిగతావన్నీ కూడా కేవలం నమ్మకాలు. మీరు ఏం నమ్ముతున్నారూ - అన్నది ఇక్కడ ప్రశ్నే కాదు. ఎందుకంటే మేము కష్టపడి ప్రయత్నిస్తే మీరు ఏదైనా నమ్మగలిగేలాగా చేయవచ్చు. అందుకని మీరు దేనిని నమ్ముతున్నారు అన్నదానికి ఎటువంటి విలువా లేదు. ఏదో కొంత  సామాజికపరమైన విలువ ఉంటే ఉండవచ్చు.

మీరు ఆత్మజ్ఞానం అంటున్నప్పుడు, మీరు సామాజికపరమో లేదా వ్యక్తిగతమైన జీవిత కోణం గురించో మాట్లాడటం లేదు. మీరు, అస్తిత్వానికి సంబంధించిన కోణం గురించి మాట్లాడుతున్నారు. మీరు దానికి సుముఖంగా ఉండాలి అనుకుంటే; మీరు జీవితాన్ని ఆస్తిత్వపరంగా తెలుసుకోవాలి. దీనికి ఉన్న ఒకే ఒక విధానం, మీ అవగాహనను పెంపొందించుకోవడమే. దీనిని గురించి ఆలోచించడంవల్లో, తత్వాల్ని ఏర్పరచడంవల్లో, చర్చలు చెయ్యడం వల్లో లేదా దేన్నైనా నమ్మడం వల్లో ఇది జరగదు. కేవలం మీ అవగాహనను పెంపొందించుకోవడం ద్వారానే మీరు జీవితాన్ని స్వీకరించగలుగుతారు, జీవితాన్ని తెలుసుకోగలుగుతారు. జీవితాన్ని తెలుసుకోవడానికి మరో విధానం లేనే లేదు.

మౌలికంగా ఆత్మసాక్షాత్కారం అనేది ఎలా ఉంటుంది అంటే, మీరిక్కడ కూర్చుంటే మీ శరీరం ఇక్కడ, మీ మనస్సు అక్కడ, మీరు అనేది ఈ రెండిటి నుంచి విడిగా ఉంటుంది.

అందుకని ఆత్మసాక్షాత్కారం అంటే; మీ అవగాహన ఎంతో ఉన్నత స్థాయికి.. పరమోన్నత స్థాయికి చేరుకున్నది అని అర్థం. మీ అవగాహన స్థాయి ఎలా ఉందంటే -  మీరు దేనినైనా స్వీకరించగలిగే స్థితిలో ఉన్నదన్నమాట. మీరు, జీవితాన్ని సంపూర్ణంగా స్వీకరించగలుగుతారు. దానినే మనం ఆత్మసాక్షాత్కారం అంటాం. మీరు దీని అనుభూతి ఎలా ఉంటుంది అని అడిగారు. సరే, అది మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మౌలికంగా ఆత్మసాక్షాత్కారం అనేది ఎలా ఉంటుంది అంటే, మీరిక్కడ కూర్చుంటే మీ శరీరం ఇక్కడ, మీ మనస్సు అక్కడ, మీరు అనేది ఈ రెండిటి నుంచి విడిగా ఉంటుంది. మీరు మీ శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు, మీ మనస్సును ఉపయోగించుకోవచ్చు. కానీ; మీరు అన్నది, ఈ రెండు విషయాల నుంచి దూరంగానే ఉంటుంది.

మీరు మీ జీవిత అనుభూతిని చూస్తే మీకున్న పెద్ద పరిమితి ఏమిటంటే మీ శరీరం, మీ మనస్సు. కానీ; ఈ రెండే మీ జీవితంలో మీకున్న ఆవశ్యకతలు కూడా..! మీకున్న బాధలన్నింటికీ కూడా మూలం - అయితే మీ శరీరం లేదా మీ మనస్సు. ఇవి కాకుండా, మీకు మరో రకమైన బాధలేమైనా తెలుసా..? ఈ సృష్టిలో ఉన్న బాధలన్నీ కూడా మీ మనస్సులో సృష్టించబడుతున్నవే. మిమ్మల్ని మీరు ఈ శరీరం, ఈ మనస్సు నుంచి కొంచెం దూరంలో అట్టి పెట్టుకోగలిగితే, మీకు ఈ బాధల్లో నుంచి విముక్తి పొందిన అనుభూతి కలుగుతుంది.

ఎప్పుడైతే మీకు బాధ గురించిన భయం లేదో అప్పుడు మీరు ఇక్కడ ఎలా జీవిస్తారు..? ప్రస్తుతం మీరు ఏ అడుగు వేసినా సరే..అది సంపూర్ణంగా వెయ్యడం లేదు. ఎందుకంటే; ఏం జరుగుతుందో అన్న భయం ఉంది. నాకేమౌతుందో.. నాకేమౌతుందో.. అని. మీరు గనక జీవితాన్ని శ్రద్ధగా గమనించినట్లైతే; కనీసం 90% ప్రజలు వారి జీవితం వారి సంరక్షణకే కేటాయించారు. వారి జీవితంలో వారు ఎటువంటి అడుగు వేసినా సరే, అది సంతోషాన్నో, ప్రేమనో, స్వేచ్చనో ఆశించి  తీసుకునేది కాదు. కేవలం సంరక్షణ గురించి. అవునా?

మీరు ఎల్లప్పుడూ మీ సంరక్షణ గురించిన చింతలో ఉంటే, మీరు ఏమి చేస్తున్నా సరే, మీరు మరణాన్ని వెతుక్కుంటున్నట్లే..! ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ సురక్షితం అయినది కాదు.. మీరు ఏమి చేసినా సరే, మీరు ఎన్ని బీమాలు తీసుకున్నా సరే, మీకు ఎంత బ్యాంక్ బ్యాలన్సు ఉన్నా సరే, ఎన్ని వేల మంది ప్రజలు మీతో ఉన్న సరే, రేపు పొద్దున మీరు మరణించవచ్చు.  ఇలా జరగాలని, మేము కోరుకోవడం లేదు. కానీ, ఇది జరిగే అవకాశం అయితే ఉంది. ఇది,  ఎంతమందికో జరుగుతూ ఉంది. రేపు పొద్దున మీరు మరణించవచ్చు. అందుకని మీరు ఒక భౌతిక దేహంలో ఉన్నంత కాలం, మీ జీవితం, మీ జీవితానుభూతి అంతా కూడా శారీరిక, మానసిక స్థాయికే పరిమితమై ఉన్నప్పుడు భయంలో బ్రతకడం, ఎల్లప్పుడూ సంరక్షణ కోసం వెతకడం అన్నది మనం ఆపలేము. మీరు, ఈ విధంగా మాత్రమే జీవించగలరు. అందుకని మీ జీవితానుభూతి భౌతిక పరిమితులను దాటినప్పుడు, మీరు వాటిని కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఎప్పటికీ  మీరు వాటితో మమేకం కారు. ఒక్కసారి ఈ స్వేచ్చ మీ జీవితంలో వస్తే, మీరు ఏ విధంగా జీవిస్తారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు జీవితంతో ఎలా కావాలనుకుంటే ఆ విధంగా ఆడుకోవచ్చు. అప్పుడు, జీవితం మీ మీద ఎటువంటి ముద్రలూ వెయ్యదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1