రాధా కృష్ణుడు

కృష్ణుడి భక్తులలో రాధ గురించి అందరికీ బాగా తెలుసు. కృష్ణుడి వెన్న దొంగతనం గురించి చెబుతూ కృష్ణుడు, రాధ ఎలా కలుసుకున్నారు, రాధ భక్తి ఎంత తీవ్రమైనదో సద్గురు మనకు వివరిస్తారు.
 

గోపీ వస్త్రాపహరణం అనంతరం, యమునా నది నుంచి కృష్ణుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే ఆయన చేసిన అల్లరి గురించి యోశోదకు వార్త చేరిపోయింది. వాళ్ళ అమ్మకు ఎవరో వచ్చి చెప్పారన్న విషయం తెలియగానే, ఆయన అసలు నమ్మలేకపోయాడు. “ఈ ఆడవాళ్ళు అసలు ఎందుకు ఇంతగా మాట్లాడతారో? అవమానం వాళ్ళకే అయినా కూడా వాళ్ళు నోరుమూసుకుని ఉండలేరు. వాళ్ళు వెళ్ళి మాట్లాడిల్సిందేనా? అసలు వాళ్ళకు కృతజ్ఞత కూడా లేదు. నా మంచితనం వల్ల కాకపోతే ఈ రోజు వాళ్ళు ఈ ఊర్లో పట్టపగలే నగ్నంగా నడిచి వెళ్ళాల్సి వచ్చేది. నేను వాళ్ళకు బట్టలు ఇచ్చేశాను. అయినా అసలు కృతజ్ఞతే లేదు!” అనుకున్నాడు. అయినా ఆయన పెద్దగా దాని గురించి చింతించలేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇలా కోపించడం కేవలం తాత్కాలికం అని అనుకున్నాడు. కాని యశోదకు నిజంగానే పట్టలేనంత కోపం వచ్చింది. “ఇక జరిగింది చాలు. నాతో రా!” అని ఆయన చెవులు పట్టుకుని బయటకు లాక్కు వెళ్ళింది, ఒక బెత్తం తీసుకుని వీపు మీద “ముగ్గు” వేసింది. వాళ్ళ అమ్మకు ఇంత కోపం వస్తుందని ఆయన అనుకోలేదు. ఎందుకంటే మాములుగా ఆమెకు చాలా విషయాల గురించి కోపం వస్తుంది కాని ఆయన చిరునవ్వులు చిందించినా లేక అమాయకంగా కళ్ళు ఆర్పినా ఆమె మామూలై పోయేది. కాని ఇవాళ ఆమె వదిలిపెట్టేలా కనిపించలేదు.

ఆమెకు చాలా విషయాల గురించి కోపం వస్తుంది కాని ఆయన చిరునవ్వులు చిందించినా లేక అమాయకంగా కళ్ళు ఆర్పినా ఆమె మామూలై పోయేది

ఆ తర్వాత యశోద ఇంట్లో మజ్జిగ చిలుకుతూ ఉన్నప్పుడు కృష్ణుడు ఆమెకు కోపం తగ్గిపోయిందనే అనుకున్నాడు, ఆమెను మచ్చిక చేసుకోవటానికి ఆమె కొంగును లాగాడు. “నీకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళపై నేను ఎంతో దయ చూపాను, వాళ్ళ బట్టలు తిరిగి ఇచ్చేశాను. అయినా కూడా ఇంత కోపమా?” అన్నాడు, కాని యశోద ఆయన్ని ఉరిమి తినేసేలా చూసింది.

కృష్ణుడు కలవర పడ్డాడు, “ అసలేం జరుగుతుంది? బట్టలంటే ఆడవాళ్ళు ఇంత తమాషా ఎందుకు చేస్తున్నారు!” అనుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళాలని మళ్ళీ ప్రయత్నించాడు కాని ఆమె అరచి, కేకలు వేసింది. అప్పుడు కృష్ణుడు ఇది మరీ హద్దు దాటిపోతుందని అనుకున్నాడు. “అసలు నేనేం తప్పు చేశాను? నేను స్త్రీలతో బాగానే ఉన్నాను, వాళ్ళే కృతజ్ఞత లేకుండా వచ్చి చాడీలు చెప్తున్నారు. ఈమె ఎందుకు ఇలా చేస్తోంది,” అనుకున్నాడు. వంటగదిలో వేరే ఏదో పని చేయటానికి ఆమె వెళ్ళగానే కృష్ణుడు ఆ మజ్జిగకుండ లోనుంచి వెన్న తీసుకుని తినటమే కాక దాన్ని పగల కొట్టి, ఆ వెన్న ముద్దలను బయటకు తీసుకుని వెళ్లి కోతులను పిలిచాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద రోటి మీద కూర్చుని వాటికి వెన్న తినిపించాడు. వెన్ననంతా నేల మీద పడేస్తూ అవి ఆనందంగా తిన్నాయి. యశోద వచ్చి, ఈ కుండ పగిలిపోయి ఉండటం చూడగానే ఆమె కోపం కట్టలు తెంచుకుంది. కృష్ణుడు ఊళ్ళో ఏం చేస్తున్నాడో ఆమెకు అర్ధమైపొయింది. ఆమె ఒక తాడు తెచ్చి కృష్ణుడు కూర్చుని ఉన్న రోటికే ఆయన్ని కట్టేసింది. “ఇదే ఒక పాఠం నేర్పిస్తుంది. నువ్వు మరీ హద్దు మీరుతున్నావు. నువ్వెప్పుడు మారతావు?” అనుకుంటూ ఆమె వెళ్ళిపోయింది.

ఏడ్చి యశోద దృష్టి మరల్చాలని కృష్ణుడు అనుకున్నాడు, కాని యశోద పట్టు విడువలేదు. అప్పుడు ఆయనకు కోపం వచ్చింది. ఆయన తన బలాన్నంతా ఉపయోగించి, ఆ బరువైన రోలును లాక్కుంటూ వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే ఇది ఒక ఏడేళ్ళ పిల్లాడికి సాధ్యమైన విషయం కాదు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఊర్లో వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఉన్నారు, అందుకే ఆయనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోయారు. ఆయన దాన్ని లాక్కుంటూ అడివి వైపు వెళ్ళాడు. గోపాలకులు, ఆయన స్నేహితులు, పెద్దవాళ్ళు అందరూ ఆ వేళలో అడివిలోనే ఉంటారు. అంతేకాక, అనవసరంగా కోపంగా ఉన్నందుకు తన తల్లికి ఒక పాఠం నేర్పించాలని ఆయన అనుకున్నాడు.

ఏడు సంవత్సరాల కృష్ణుడిని రాధ చూసిన ఆ క్షణం నుంచీ ఆమె కళ్ళలో నుంచి ఆయన ఎప్పుడూ మరల లేదు. ఆ క్షణం నుంచీ ఆయన భౌతికంగా ఉన్నాలేకపోయినా కృష్ణుడు జీవితాంతం ఆమె కళ్ళలోనే ఉన్నాడు. 

అడివిలో నదివైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన రెండు పెద్ద చెట్లు మధ్యలో నుంచి వెళ్ళాడు. ఆ చెక్కరోలు వాటి మధ్యలో ఇరుక్కుపోయింది. ఆయన ఎంత బలంగా లాగాడంటే ఆ రెండు చెట్లు వేళ్ళతో సహా పైకి వచ్చి కూలిపోయాయి! కాని ఆ తాడు ఒరుచుకుని గాయం అయ్యింది. ఆయన కూడా బాగా అలిసిపోవటం వల్ల ఆగి, విశ్రాంతి తీసుకుంటున్నాడు. హఠాత్తుగా తన వైపుగా రెండు ఆడ గొంతులు రావటం వినిపించాయి. ఇద్దరు ఆడపిల్లలు అటువైపుగా వచ్చారు, వాళ్ళు కృష్ణుడిని చూసారు. వాళ్ళలో చిన్నదైన లలిత కృష్ణుడితో ఆటలాడుకునేదే. వాళ్ళలో పెద్ద అమ్మాయికి 12 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కృష్ణుడికి తెలియదు కాని ఆమె వైపు ఆకర్షితుడైయ్యాడు. ఆమే రాధ.

ఏడు సంవత్సరాల కృష్ణుడిని రాధ చూసిన ఆ క్షణం నుంచీ ఆమె కళ్ళలో నుంచి ఆయన ఎప్పుడూ మరల లేదు. ఆ క్షణం నుంచీ ఆయన భౌతికంగా ఉన్నాలేకపోయినా కృష్ణుడు జీవితాంతం ఆమె కళ్ళలోనే ఉన్నాడు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే “ నేను ఆయనతోనే జీవిస్తున్నాను. ఆయన నాతోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. ఆయన మరింకెక్కడా ఉండలేడు.”

ఆ ఆడపిల్లలిద్దరూ ఆయన దగ్గరికి వచ్చి “ఏం జరిగింది? ఇంత కౄరంగా నిన్నెవరు ఇలా కట్టేసారు?” అని అడిగారు,

రోటికి కట్టి ఉన్న ఆ తాళ్ళు విప్పాలని రాధ ప్రయత్నించింది కాని కృష్ణుడు “ఆ పని చేయకు. మా అమ్మ వచ్చి ఆ తాళ్ళు విప్పాలి. నువ్వు విప్పేస్తే ఆమె కోపం తగ్గదు. ఆమె నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ తాళ్ళు విప్పితే ఆమె కోపం తగ్గుతుంది.” అన్నాడు,
“నీకు ఇంకేదైనా సహాయం చేయాలా?” అని ఆ ఆడపిల్లలు కృష్ణుడిని అడిగారు.
కృష్ణుడు లలితను వాళ్ళిద్దరి మధ్య నుంచి పంపడానికి “నాకు కొంచం మంచి నీళ్ళు కావాలి” అని అడిగాడు. అప్పుడు 12 సంవత్సరాల రాధ, 7 సంవత్సరాల కృష్ణుడు కలిసి కూర్చోవడంతో, ఆ ఇద్దరు జీవులు ఆ ఒక్క కలయికలోనే ఎన్నో విధాలుగా ఒక్కటిగా లయమైపోయారు. ఆ తర్వాత వాళ్ళని ఎవ్వరూ విడదీయలేకపోయారు. అదీ ఎంతవరకంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళను వేర్వేరు వ్యక్తులుగా మనం చూడలేకపోతున్నాము.

రాధ వృష్ణబాణుడి కూతురు. ఆమె బర్సనా అనే ఊరిలో ఒక సాధారణమైన ఆవుల కాపరి ఇంట్లో పుట్టింది. 6 సంవత్సరాల వయస్సులో ఆమె తల్లి చనిపోయింది, ఆమెను అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. ఆమె తల్లి బ్రతికి ఉన్నప్పుడు గోకులంలో ఉన్న మహాదేవ గుడి దర్శనం చేసుకుంది. ఇక్కడ గోపాలకులు, గోపికలు శివుడ్ని పూజిస్తారు. ఆ గుడికి మళ్ళీవస్తానని ఆమె మొక్కుకుంది. ఆమె చనిపోకముందు ఆ మొక్కు తీర్చుకోలేకపోయింది. ఈ మొక్కు తీర్చటానికే రాధ తన అమ్మమ్మతో గోకులానికి వచ్చింది.

“నేను బృందావనానికి వస్తాను”, అని కృష్ణుడు రాధకు చెప్పాడు. మామూలుగా అన్న ఈ మాటను రాధ ఒక వాగ్దానంగా అనుకుని కొన్ని నెలల పాటు ఎదురు చూసింది. 

కొన్ని రోజులు కృష్ణుడు, రాధ కలిసి ఆడుకున్నారు, ఆ తర్వాత ఆమె తిరిగి వెళ్ళాల్సిన సమయం రానే వచ్చింది. ఆమె కుటుంబంతో పాటు ఒక ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కృష్ణుడు ఆ బండి వెనుక పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బాయి ఎంతో ముద్దుగా ఉన్నాడు కాబట్టి ఊరి బయటవరకు వాళ్లతో బండిలో ఎక్కించుకున్నారు. ఊరి పొలిమేరలో కృష్ణుడు బండి దిగిపోయాడు. మొత్తం బర్సానా గ్రామమంతా యమునా నది తీరంలో ఖాళీగా ఉన్న బృందావనానికి వలస వెళ్తుందనే విషయం కృష్ణుడికి తెలిసింది.

“నేను బృందావనానికి వస్తాను”, అని కృష్ణుడు రాధకు చెప్పాడు. మామూలుగా అన్న ఈ మాటను రాధ ఒక వాగ్దానంగా అనుకుని కొన్ని నెలల పాటు ఎదురు చూసింది. దాదాపు 13 నెలల తర్వాత గోకులంలో కొన్ని ఇబ్బందుల వల్ల, ముఖ్యంగా కౄర జంతువులు ఆవుల మీద దాడి చేయటం వల్ల, గోకులంలో ప్రజలు బృందావనానికి వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నదికి దగ్గరగా, గడ్డి ఎక్కువగా దొరికే అడవి అది. ఊరు ఊరంతా – మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, వాళ్ళకున్న పశువులు, ఎడ్ల బండ్లు, మిగతా సామాన్లు – అన్నీ సర్దుకుని బృందావనానికి వెళ్ళిపోయారు.

ఒక వ్యక్తి ఎరుక పరిమితులను దాటినప్పుడు ఆయన ప్రతి ఆలోచన కూడా దేవుడి శాసనంగా మారుతుంది. ఆయన తలపు విధిని, ప్రపంచ తీరును నిర్ణయించగలదు

చలాకీగా ఉండే కొందరు కుర్రాళ్ళు ఈ తండా ముందు నడుస్తున్నారు, ఈ బృందానికి కృష్ణుడే నాయకుడు. గోకులం బృందావనానికి వస్తుందనే వార్త రాధకు తెలిసింది. ఆయన తన మాట నిలబెట్టుకుంటున్నాడని అనుకుందామె. ‘‘ఆయన వస్తానన్నాడు కనుక వస్తున్నాడు.” ఒక వ్యక్తి ఎరుక పరిమితులను దాటినప్పుడు ఆయన ప్రతి ఆలోచన కూడా దేవుడి శాసనంగా మారుతుంది. ఆయన తలపు విధిని, ప్రపంచ తీరును నిర్ణయించగలదు, కేవలం ఒక ఆలోచన వల్ల ఇలా జరుగుతుంది. గోకులమంతా బృందావనానికి తరలి వెళ్ళింది, అక్కడ ఒక సరికొత్త జీవితం మొదలయ్యింది.

రాధాకృష్ణులు చిన్నతనంలో ఇలా కలవటం ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గం ఆరంభమయ్యింది. రాధేపంతులు, విష్ణుపంతులని రెండు సాంప్రదాయాలవారు కృష్ణుడిని పూజించరు, వాళ్ళు రాధనే పూజిస్తారు. అవి ఎంతో మంది అనుసరించే చాలా పెద్ద సాంప్రదాయాలు. మీరు ఉత్తర భారత దేశానికి వెళ్తే అక్కడ మీకు రాధ స్టికర్లు, పోస్టర్లు కనిపిస్తాయి, కృష్ణుడు కనిపించడు. ఆమె ప్రేమలో, లయంచేసుకునే తత్వంతో ఆయన్ని ఆమెలోనే భాగంగా కలిపేసుకుంది. “రాధ లేకుండా కృష్ణుడు లేడు” అంటారు వాళ్ళు. కృష్ణుడు లేకుండా రాధ లేకపోవటం కాదు. రాధ లేకుండా కృష్ణుడు మాత్రం లేడు. రాధ లేనిదే కృష్ణుడు లేడు. “రాధే” అనే పదానికి అర్ధం ఏమిటంటే ‘రా’ అంటే రసం, అంటే ప్రేమ లేదా జీవిత రసం అని అర్ధం. “ధే” అంటే ఇచ్చేవారు అని అర్ధం.

మీరు కృష్ణుడిని ఆస్వాదించాలంటే మీరు ఒక స్త్రీగా మారాలి. ఇది శారీరికంగా పురుషుడా, స్త్రీ నా అన్న విషయం గురించి కాదు. మగవారిలో కూడా ఆడవారిలో ఉన్నంత సజీవంగా స్త్రీత్వం ఉండవచ్చు ఎందుకంటే స్త్రీత్వం అనేది ఒక లక్షణం. మీరు కృష్ణుడ్ని అర్ధం చేసుకోవాలని అనుకుంటే మీరు ఒక సంపూర్ణ స్త్రీగా మారాలి. ఇది ఉత్కృష్టతకు మార్గమే, అది బ్రహ్మాండమైన ప్రేమ, ఆత్మీయతా మార్గం. ఇది దేన్నీ విడవని మార్గం. ఈ మార్గ స్వభావం ఎలాంటిదంటే ఒక వ్యక్తి ఆమార్గంలో అడుగుపెట్టగానే మిగతావన్నీ మాయమైపోతాయి. రాధకు ఇక వేరే ప్రపంచం లేదు. కృష్ణుడు మాత్రమే ఉన్నాడు. సామాజికంగా ఆమెను ఒక మంచి జీవిగా గుర్తించలేదు కాని, ఆమె ఓ అద్భుతమైన జీవి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు