వెన్న దొంగతనం చేస్తున్నా కూడా గోకులంలో కృష్ణుడిని అందరూ ఎంతగా ప్రేమిస్తున్నారో మనకు సద్గురు వివరిస్తారు!


  కృష్ణుడు కొద్దిగా పెద్దవాడైనప్పుడు, అంటే అయిదారేళ్ళ వయస్సులో అతని వెన్న దొంగతనాలు మరెంతో పధకం ప్రకారం జరగడం మొదలయ్యాయి. వెన్న నష్టపోతున్న వాళ్ళు మరింతగా విసిగిపోతున్నారు. వారు వచ్చి “దయచేసి మీ అబ్బాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి!” అని,అతని తల్లికి ఎప్పుడూ మొరపెట్టుకుంటూనే ఉన్నారు, ఇవి విన్న తల్లి యశోద అతన్ని కోప్పడేది కాని అతను ఆమెను మాయ చేసేవాడు. ఆమె తిట్టగానే వెంటనే ఎలా ఏడవాలో అతనికి తెలుసు. అతను నేలచూపులు చూస్తూ ఆమె వచ్చే వరకూ ఏడ్చేవాడు. “నాకు కూడా కోపం వచ్చేది కానీ వేరే వారిలా మాత్రం కాదు. వేరే వాళ్ళకు కోపం వచ్చినప్పుడు, ఉదాహరణకు నా అన్నయ్య బలరాముడికి కోపం వస్తే అరిచి, కాళ్ళు నేల మీద కొట్టి, అటూ ఇటూ నడుస్తూ ఉండే వాడు. అతను ఎంతో శక్తిని వృద్ధా చేస్తున్నాడని నాకు అర్ధం అయ్యింది. మా అమ్మకు కూడా కోపం వచ్చేది. ఆమెకు కోపం వచ్చినప్పుడు ఆమె కనుబొమ్మలు, ముక్కు చిట్లించి అందరి మీద విరుచుకు పడేది. నేను అలా కోపం తెచ్చుకోలేదు. నాకు అవసరమైనంత వరకే నేను కోపం తెచ్చుకున్నాను” అనేవాడు.
అతను ఇలా వేషాలు వేస్తూనే ఉన్నాడు కాని ఒకరోజు అతనికి నిజంగా తిట్లు పడ్డాయి. అప్పుడు తన మీద ఎప్పుడూ చాడీలు చెప్పేవారికి ఒక గుణపాఠం చెప్పాలని అతను నిర్ణయించుకున్నాడు. ఏమి చేయాలా అని అతను ప్రణాళిక వేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం నది ఒడ్డున అతను నడుస్తున్నప్పుడు. అక్కడ నదిలో గోపికలు స్నానం చేయటం గమనించాడు. వారిలో యువతులు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళని ఏడిపించటానికి ఇదే మంచి సమయం అని అనుకుని కృష్ణుడు వెళ్లి పొదల చాటున దాక్కున్నాడు. స్నానానికి వెళ్ళే ముందు ఆ గోపికలు తమ బట్టలను నది ఒడ్డున పెట్టి వెళ్ళడం గమనించాడు.

ఆ రోజుల్లో స్త్రీలు, పురుషులు స్నానం చేయటానికి వేరు వేరు సమయాలు కేటాయించ బడ్డాయి. స్త్రీలు స్నానానికి వెళ్ళే వేళ అక్కడికి ఇంక వేరెవరు రాకపోవటం వల్ల వాళ్ళకు నదిలో పూర్తి స్వేచ్ఛ ఉండేది. కృష్ణుడు వాళ్ళ బట్టలన్నీ మూట కట్టుకుని ఒక చెట్టు ఎక్కి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నీటిలో ఆడుకుంటూ, స్నానం చేయటంలో మునిగిపోయిన ఆ స్త్రీలు అదేమీ గమనించలేదు. వాళ్ళు బయటకి వచ్చి చూసేటప్పటికి వాళ్ళ బట్టలు కనిపించకపోవటంతో భయపడిపోయారు. వాళ్ళు అరిచి గోల చేశారు, ఎందుకంటే వేసుకోవటానికి వాళ్ళకి ఇప్పుడు బట్టలు లేవు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికని వెళ్తారు? వాళ్ళు అలా అరిచి గోల చేస్తుంటే అతను మాత్రం తీయగా వేణుగానం చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు వాళ్ళు కేకలేస్తూ, అతడ్ని “మూర్ఖుడా!..కిందకి దిగిరా!” అని తిట్లు తిట్టటం మొదలు పెట్టారు. వాళ్ళు ఏమంటున్నా కృష్ణుడు పట్టించుకోకుండా వేణువు ఊదుతూనే ఉన్నాడు. అప్పుడు ఇక చివాట్ల నుంచి వాళ్ళు బ్రతిమిలాడటంలోకి వచ్చారు. చాలా సేపు వేడుకున్న తరువాత అతను “మీకు మీ బట్టలు కావాలంటే మనం ఒక ఒప్పందం కుడుర్చుకుందాం. మీరు మళ్ళీ మళ్ళీ వెళ్లి మా అమ్మకు చాడీలు చెప్పకూడదు. అర్ధం అయ్యిందా?” అన్నాడు. అప్పుడు వాళ్ళు దేనికైనా ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నగ్నంగా ఉన్నారు, బట్టలు లేవు.

 

కృష్ణుడు వాళ్ళ బట్టలు వాళ్లకి ఇచ్చేశాడు. వాళ్ళందరూ బట్టలు వేసుకున్న తరువాత, అతను కిందికి దిగి వేణువు ఊదుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ స్త్రీలు తమలో తాము, “ఓఁ, ఎంత చెడ్డవాడోనని! ఎంత మంచి వాడోనని! అతని వయస్సు పదిహేడు కాకుండా, ఏడు సంవత్సరాలే కావడం ఎంతో అదృష్టం.” అని అనుకున్నారు

ఈ దేశ సంస్కృతిలో కృష్ణుడు ఎంతో ప్రభావం కలిగినవాడు ఎందుకంటే అతని జీవితంలో ఏమి జరిగినా అతను ఉత్సాహంగా జీవించాడు. కృష్ణుడు వెన్న దొంగలించినా, అల్లరి చేష్టలు చేసినా కూడా అందరూ అతన్ని ప్రేమించేవారు ఎందుకంటే అతను వాళ్లతో మమేకమైపోయాడు. తన చుట్టూ ఉన్న జీవితంతో అతను లయమై ఉండేవాడు. మీరు వేరేవారితో లయమైనప్పుడు మాత్రమే మీరు ఆహ్లాదంగా ఉండగలుగుతారు. మీరు వేరే వారితో శ్రుతిలో లేకపోతే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా, వాళ్ళని చూస్తేనే మీరు భరించలేరు. మీరు శృతిలో ఉన్నప్పుడు, ప్రేమగా, ఆనందంగా ఉండటం, ఒక విరబూసిన పువ్వులా ఉండటం మీకు సహజంగానే వస్తుంది ఎందుకంటే సృష్టి అలానే సృష్టించబడింది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు