కృష్ణుడి జననం గురించిన సంచిక తరువాత, ఒక పిల్లవాడిగా గోకులంలో కృష్ణుడు చేసిన అల్లరి చేష్టలు, వాటి ద్వారా గ్రామంలో అతను ఎలా ఆనందోత్సాహాలను పంచాడో సద్గురు మనకు వివరిస్తారు.


 కృష్ణుడు చిన్నతనంలో గడిపిన ప్రదేశం, గోకులాన్ని కొద్దిగా రుచి చూడాలంటే మనమంతా కొద్దిగా పిచ్చివారమై ఉండాలి. కృష్ణుడి బాల్యకథల్లోని సారాంశం ఏమిటంటే, మునుపెన్నడూ అక్కడి వారు అనుభూతి చెందని విధంగా, తన సమ్మోహకరమైన ఆకృతి, అనుపమానమైన చిరునవ్వులు, వేణుగానం, నాట్యంలోని హొయలు ద్వారా ఆయన వారిని సమ్మోహితులను చేసాడు. ఆయన ఆ సంఘంలోని వారినందరినీ పిచ్చివారిని చేశాడు, ఎంతో పరమానందంగా వారంతా పిచ్చివారై పోయారు. ఆయన ప్రేమలో వారు పిచ్చివారై పోయారు.

కృష్ణుడు ఈ దేశ సంస్కృతిలో ఇంత ఎక్కువ ప్రభావశాలి ఎందుకు అయ్యాడంటే, తన జీవితంలో ఏమి జరుగుతున్నా ఆయన ఎంతో ఆనందంగా, శక్తివంతంగా జీవించాడు.

కృష్ణుడు “నేను వెన్న దొంగలిచాను. నేను వెన్న దొంగలించకపోతే ఈ ఊరిలో ఉత్సాహం, ఆనందమే ఉండదు” అని ఎంతో ఆనందంగా, గర్వంగా చెప్పేవాడు. కృష్ణుడు, అతని స్నేహితులూ కలసి వేరే వారి ఇంటిమీది పెంకులు తీసి ఇంట్లోకి దూరే వారు. ఆకాలంలో పిల్లలకు అందకుండా కుండలను ఉట్టికి కట్టేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఒకరి భుజాల మీద ఒకరు ఎక్కి వాటిని అందుకునే వాళ్ళు. కుండలు అందనంత ఎత్తులో ఉంటే వాటిని ఒక రాయితో కొట్టే వాళ్ళు. ఆ కుండలో చిన్న రంధ్రం పడి దానిలో ఉన్న పెరుగు, వెన్న కిందకు కారుతుండగా దాన్ని అలానే నోరు తెరిచి తాగేవాళ్ళు. అలాకాక కుండ పగిలి మొత్తంగా క్రింద పడితే, వాళ్ళు నేల మీద నుంచే దాన్ని తీసుకుని తినేవాళ్ళు. స్నేహితులందరూ దాన్ని పంచుకునే వాళ్ళు, ఎప్పుడూ ఎక్కువే మిగిలి ఉండేది, ఎందుకంటే ఇలాంటి పని చేయగలిగిన ధైర్యం కలిగిన అబ్బాయిలు కొందరే ఉండేవాళ్ళు. అప్పుడు వారు కోతులను పిలిచి వాటికి పెట్టే వారు.

ఇదంతా వినటానికి ఎంతో ఆహ్లాదంగా ఉండచ్చు కాని, ఇది మీ పక్క ఇంటి పిల్లలు మీ రిఫ్రిజిరేటర్ మీద దాడి చేసినట్లు ఉంటుంది. అందుకే కొందరు స్త్రీలు కోపంగా, బాధపడుతూ ఉండేవాళ్ళు, కాని ఇప్పటి వాళ్ళలాగా అంత ఎక్కువుగా అల్లాడిపోయేవాళ్ళు కాదు. వాళ్ళకు కోపం వచ్చేది; ఆ వెన్న, పెరుగే వారి జీవనాధారం. అందుకే వాళ్ళు ఎప్పుడూ కృష్ణుడిమీద ఫిర్యాదులు చేస్తూ ఉండేవాళ్ళు. ఏమి చేశాడో చెప్పటానికి కృష్ణుని ఇంటికి వాళ్ళు రాగానే ఆయన చాలా గర్వంగా “ నేను మా అమ్మ చాటున నుంచుని కొంటె చూపులు చూసేవాడిని, అప్పుడు వాళ్ళు కూడా చిరునవ్వులు నవ్వేసే వారు” అని చెప్పేవాడు, కోపంలో కూడా ఈ గోపస్త్రీలు ఎంతో అద్భుతమైన వాళ్ళు.

కృష్ణుడు, అతని స్నేహితుల అల్లరి చేష్టల చుట్టూ అల్లుకుని ఈ సంస్కృతిలో ఎంతో అందమైన సంగీతం, పాటలు, నృత్యం విరిశాయి. అతని జీవితంలో ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి కాని ఇది ఇలా జరగటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన చాలా అందమైన వాడు.
మోహనమైన ఆయన రూపం గురించి ఎంతో వర్ణన, ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. ఒక చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఆయన రూపానికి అందరూ ఆకర్షితులయ్యేవారు. ఉత్తర భారతదేశంలో ప్రజలు సాధారణంగా తెల్లటి చర్మంతో ఉండేవారైనా కృష్ణుడు మాత్రం నల్లని వాడు. ఆయన పిల్లవాడిగా ఎంత ఆకర్షణీయమైన వాడంటే అందరూ ఆయన చేసే అల్లరి చేష్టలను కూడా పట్టించుకునేవారు కాదు.

రోజంతా 24 గంటలూ ఆనందంగా, హాయిగా ఉండటం

నేడు ఇది ఒక దురదృష్టకరమైన వాస్తవం. ప్రజలు వారి జీవితంలో కనీసం 10 నిముషాలు కూడా తమంతట తాముగా ఆనందంగా జీవించని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితంలో ఎవరితో ఒకరితోనైనా ఒక క్షణం కూడా ప్రేమగా కూర్చోనివారు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితం మొత్తం ఒక్క క్షణమైనా ఇవేవి లేకుండా గడిచిపోతుంది. ఇలాంటి వాళ్ళకి గోకులంలోనికి ప్రవేశమే లేదు. గోకులం ఎలాంటి ఊరంటే, అక్కడి వాళ్ళు తమ పనులు చేసుకుంటూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. వాళ్ళు పాటలు పాడుకుంటూ, నాట్యం చేసుకుంటూ, హాయిగా ఉండేవాళ్ళు.

కొద్ది క్షణాలైనా ఆనందం తెలియకపోవటం మానవాళి చేసే నేరం. రోజులో 24 గంటలు ఆనందంగా ఉండటం, హాయిగా ఉండటం మనిషికి అందని విషయాలు కాదు. కృష్ణుడు మన దేశ సంస్కృతిలో ఇంత ఎక్కువ ప్రభావశాలి ఎందుకు అయ్యాడంటే అతను తన జీవితంలో ఏమి జరుగుతున్నా ఎంతో ఆనందంగా, హాయిగా జీవించాడు. తన బాల్యం నుంచీ ఆయన ఎన్నో విపత్కర పరిస్థితులను చూసాడు. పుట్టినప్పటి నుంచీ ఆయన్ని చంపటానికి కొందరు ప్రయత్నించారు. బాల్యంలో కూడా ఎందరో ఆయన్ని హత్య చేయటానికి ప్రయత్నించారు. ఎన్నో అంశాల కారణంగా – ఆయనకున్న మానవాతీత శక్తుల వల్ల ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాని అన్నిటి కంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన తన జీవితాన్ని ఒక నాట్యంలాగా – ఆనందంగా, పరమానందంగా, హాయిగా - గడిపాడు. ఆయన ఎక్కడున్నా, యుద్ధం చేస్తున్నా లేక శత్రు సంహారం చేస్తున్నా, ప్రేమపూరితమైన వాతావరణంలో ఉన్నా లేక భయంకరమైన వాతావరణంలో ఉన్నా, ఆయన ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. అవసరమైనప్పుడు ఆయన కఠినంగా ఉండేవాడు. ఆ అవసరం తీరిన క్షణంనుండి ఎటువంటి గడ్డు పరిస్థితిలో కూడా ఆయన చిరునవ్వుతోనే గడిపివేసేవాడు. దురదృష్టవశాత్తూ ప్రజలు దీన్ని ఒక దైవ గుణంగా భావిస్తారు. కాని నవ్వటం ఒక మానవ గుణమే. అది కోల్పోయిన మనుషులు దాన్ని స్వర్గానికి ఎగుమతి చేస్తున్నారు. ఒక పిల్లవాడుగా కూడా కృష్ణుడు తనవైన ఎన్నో లక్షణాలను కనబరిచాడు. శిశుప్రాయంలోనే, మూడు నెలల వయస్సులో ఒక పౌర్ణమి పండుగ రోజు ఇలా జరిగింది. గోకుల సంస్కృతిలో పౌర్ణమి ఎప్పుడూ ఒక పండుగే. నిజానికి ప్రతీ రోజూ ఒక పండుగే కాని పౌర్ణమి రోజు అదో మంచి వంక మాత్రమే. అందుకే పౌర్ణమి రోజు పండుగలో భాగంగా మధ్యాహ్నమే కుటుంబాలు అన్నీ నది వడ్డుకు చేరేవి, అక్కడే వంటావార్పు చేసుకుని సాయంత్రం భోజనం చేసిన తరువాత నాట్యం చేసేవాళ్ళు. స్త్రీలందరూ వంటపనిలో నిమగ్నమై ఉన్నారు, పిల్లలు అక్కడే ఎవరో ఒకరి దగ్గర వదిలేసేవారు. అక్కడ ఎండ బాగా ఉండటం వల్ల తల్లి యశోద, తన మూడు నెలల బిడ్డ కృష్ణుడిని ఒక ఎద్దుల బండి కింద నీడలో ఉంచింది. అతను కొంత సేపు నిద్ర పోయిన తరువాత పిల్లవాడు లేచాడు. అతనికి ఇంకా లేచి తిరిగే, నాట్యం చేసే కాళ్ళు లేవు కాని ఆయన అక్కడికి వెళ్ళదలచుకున్నాడు. ఎవరూ తనమీద దృష్టి పెట్టక పోవడం గమనించాడు. ఆయన ఆ బండి చక్రంను కాలితో తన్నాడు, బండి మొత్తం విరిగి పడిపోయింది.

మానవాతీత శక్తిని ఆయన కనబరచటం ఇదే మొదటి పర్యాయం, ఇలా అవసరమైనప్పుడు అయన చేసే వాడు, లేనప్పుడు అతను ఒక సాధారణ మనిషిలాగా, జీవితపు ఒడుదుడుకులతో అందరిలాగే పోరాటం చేసేవాడు. కాని కొన్ని సమయాల్లో మనిషికి అతీతమైన లక్షణాలను ఆయన వ్యక్తపరిచాడు.

ఆ ఘటనతో అందరూ భయభ్రాంతులయ్యారు. ఆ బండి కూలిపోయిందని, బిడ్డ దాని కింద నలిగిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కాని ఆ పిల్లవాడికి ఏమీ కాలేదు. ఇది చూసిన కొంతమంది పిల్లలు, “అతను ఆ బండిని తన్నాడు, అందుకే అది కూలిపోయింది” అని చెప్పారు, కాని దాన్ని ఎవ్వరూ నమ్మలేదు, “ఏంటి ఆ వెర్రి మాటలు, మూడు నెలల పిల్లవాడు బండిని ఎలా తంతాడు?” అన్నారు. పెద్దవాళ్లందరూ ఇది పిల్లలవి వెర్రి ఊహాగానాలు అని కొట్టిపడేసారు. కాని ఇలాంటి లక్షణాలు మళ్ళీ మళ్ళీ ఆయన చూపించటం కొనసాగుతూనే ఉంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు