కృష్ణుడి తత్త్వం ఎటువంటిది..?

 

ప్రతి ఒక్కరికి కృష్ణుని కథలలో మరీ ఇష్టమైన వి కొన్ని ఉంటాయి. ప్రాచుర్యం చెందిన కథలతో పాటు అందరికీ బాగా తెలియని కొన్నిటిని సద్గురు ఇక్కడ మనకు చెబుతారు. ఈ కథలు చెప్పే ముందు కృష్ణుని వైవిధ్య గుణాలను, అలాగే ఉల్లాసంగా ఉండే ఆయన జీవన విధానం అర్ధం చేసుకోవడానికి మనం ఏ విధమైన మానసిక స్థితిలో ఉండాలో వివరిస్తారు.


మనం కృష్ణుడు అన్నప్పుడు, అసలు ఆయన తత్వం ఏమిటి? అంటే, ఆయన ఒక అదుపులేని పిల్లవాడు, ఘోరమైన అల్లరి చేష్టలవాడు, మనోహరంగా వేణుగానం చేసేవాడు, అద్భుతంగా నాట్యం చేసేవాడు, మనం కాదనలేని ఒక ప్రేమికుడు, నిజమైన పరాక్రమశాలి, యోధుడు, నిర్దయగా శత్రుసంహారం చేయగలిగిన వాడు, ప్రతి ఇంట్లోనూ హృదయాల్న్ని దోచే వాడు, ఒక కార్యదక్షత కలిగిన రాజనీతిజ్ఞుడు, రాజులను తయారు చేసినవాడు, పరిపూర్ణమైన పెద్ద మనిషి, అత్యున్నత స్థాయి యోగి, అన్ని అవతారాలలోనూ వైవిధ్యమున్న అవతారం.

కృష్ణుడిని అనేకులు అనేక విధాలుగా చూశారు, అనేక విధాలుగా అర్ధం చేసుకున్నారు, అనుభూతి చెందారు. ఉదాహరణకు, దుర్యోధనుడి మాటల్లో చెప్పాలంటే, కృష్ణుడంటే “అందరితో నవ్వుతూ తిరిగే అసలు సిసలైన మోసగాడు. ఆయన తినగలడు, తాగగలడు, పాడగలడు, నాట్యం చేయగలడు. ఆయన ప్రేమించగలడు, యుద్ధం చేయగలడు, ముసలమ్మలతో కూడా కబుర్లు చెప్పగలడు, చిన్నపిల్లలతో ఆటలాడగలడు. ఆయన్ని అసలు దేవుడని ఎవరన్నారు?” ఇది దుర్యోధనుడు అవగాహన. కృష్ణుడి చిన్ననాటి ప్రేయసి రాధ. ఆమె ఎంత ప్రాముఖ్యత పొందిందంటే రాధ గురించి మాట్లాడకుండా కృష్ణుడి గురించి మనమేదీ చెప్పలేము – మనం “కృష్ణా రాధ” అనం, “రాధాకృష్ణ” అనే కదా అంటాం. “కృష్ణుడు నాలోనే ఉన్నాడు. నేనెక్కడ ఉంటే ఆయన నాతో అక్కడే ఉన్నాడు. ఆయన ఎవరితో ఉన్నాసరే నాతోనే ఉన్నాడు” అని అందామె. ఇది ఆమె అనుభూతి.

శిఖండి తనలోని కొన్ని పరిస్థితుల వల్ల చిన్నతనం నుంచి పూర్తిగా నరకాన్ని అనుభవించిన జీవి. అతను “కృష్ణుడు నాకు ఎప్పుడూ ఏ ఆశను కలిగించలేదు. కాని ఆయన ఉన్నప్పుడు ఈ ఆశాకెరటం అందరినీ తప్పక తాకుతుంది” అన్నాడు. మనం జీవితంలోని అత్యంత ప్రగాఢమైన, గంభీరమైన అంశాలను పరిశీలిద్దాము, అదీ ఒక ఆటలానే. ఇలా మీకు నేను ఎన్నెన్నో చెప్పగలను. రకరకాల వ్యక్తులు ఆయనలోని విభిన్న కోణాలను చూశారు. కొందరికి ఆయన ఒక దేవుడు. కొందరికి ఆయన ఒక కపటి. కొందరికి ఆయన ఒక ప్రేమికుడు. కొందరికి ఆయన ఒక యోధుడు. ఆయనలో ఇలాంటివి ఎన్నో విభిన్న కోణాలు ఉన్నాయి. మనం కృష్ణుడు అని అన్నప్పుడు ఆ సారాన్ని మనం రుచి చూడాలంటే మనకు ఆ లీల అవసరం. లీల అంటే సరదాగా సాగే ఒక మార్గం - మనం జీవితంలోని అత్యంత ప్రగాఢమైన, గంభీరమైన అంశాలను పరిశీలిద్దాము, కాని అది కూడా ఒక ఆటలాగానే. లేకపోతే అందులో కృష్ణుడు లేనట్లే. ప్రపంచంలో చాలా మంది అత్యంత అద్భుతమైన పార్శ్వాన్ని అందుకోలేక పోవటానికి కారణం వాళ్ళు ఉల్లాసంగా ఉండలేకపోవటం వల్లనే...

ఈ మార్గాన్ని ఉల్లాసంగా, సరదాగా మనం అన్వేషిచాలంటే మీకు ఒక ప్రేమపూరిత హృదయం, ఉల్లాసమైన మనస్సు, చురుకైన శరీరం ఉండాలి. అప్పుడు మాత్రమే లీల ఉంటుంది. ఆటలా జీవితంలోని లోతైన పార్శాలను తెలుసుకోవాలంటే మీరు మీ చేతనతో, మీ ఊహతో, మీ జ్ఞాపకాలతో, జీవితంతో, మరణంతో కూడా ఆట ఆడటానికి సుముఖంగా ఉండాలి. మీరు దేనితోనైనా ఆట ఆడగలిగినప్పుడు మాత్రమే లీల ఉంటుంది. లీల అంటే ఎవరితోనో నాట్యం చేయటం మాత్రమే కాదు. మీరు మీ జీవితంతో నాట్యం చేయటానికి సుముఖంగా ఉన్నారని అర్ధం. మీరు మీ శతృవుతో కూడా నాట్యం చేయగలరని, మీరు మీకు ప్రియమైన వారితో కూడా నాట్యం చేయగలరని, మీ చివరి క్షణంలో కూడా నాట్యం చేయటానికి ఇష్టపడుతున్నారని. అప్పుడు మాత్రమే లీల ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

LordKrishna@flickr_abhisharma